దోషి ఎవరు?

 చదువరి 

 దోషి ఎవరు?

-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)



మైకేల్  క్రిక్ టన్  నవలల్లో ‘A Case Of Need’ మిస్టరీ- విశ్లేషణ-వైద్య పరిజ్ఞానం పరంగా పాఠకులకు సంతృప్తిని ఇచ్చే నవల. క్రిక్ టన్ తాను హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో రెండో సంవత్సరం మెడిసన్ చదువుతున్నప్పుడూ ఈ  నవల తనకు సెలవులు దొరికినప్పుడు రాసానని ఈ నవల ముందుమాటలో పేర్కొన్నాడు. ఇరవైల్లో ఉన్నప్పుడూ మెడిసన్ చదవడానికి అయ్యే ఖర్చులు భరించడం కోసం తనకిష్టమైన ప్రవృత్తి అయిన రచనా వ్యాసాంగాన్ని చేపట్టినప్పటికీ   విద్యార్థి దశలోనే నాలుగవ నవల అయిన ‘A Case Of Need’ తో ఎడ్గార్ మిస్టరీ పురస్కారాన్ని పొంది జెఫ్రీ హడ్సన్ పేరుతో అజ్ఞాతంగా ఉండమనుకున్నప్పటికీ ఈ పురస్కారంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు క్రిక్ టన్. ఈ నవల 1972 లో ‘The Carey Treatment’ పేరుతో సినిమాగా కూడా వచ్చింది.

   ఈ నవల 1960లో అమెరికా వైద్య పరిస్థితులను, వైద్యుల మనస్తత్వాలను, ఆ రోజుల్లో అమెరికాలో ఇంకా అబార్షన్ చట్టబద్ధం కాకపోవడం వల్ల ఓ డాక్టర్ ఎలా ఓ అబార్షన్ కేసులో ఇరుక్కున్నాడో  అన్న అంశాన్ని కథాంశంగా అల్లి, నవల పూర్తయ్యేసరికి వైద్యుల్లో ఉండే రకాలు, ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఉండే మోటివ్ ల గురించి, చివరివరకు అసలు దోషి ఎవరు అన్నది పాఠకుడు ఊహించలేని స్థాయిలో మిస్టరీగా ఉంచడం, ఇవన్నీ ఈ నవలను చదివింపజేస్తాయి.

     డాక్టర్ బెర్రీ ఓ ప్యాతాలజిస్ట్. అతను ఈ కథను మనకు ఉదంతాల క్రమంలో అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 17 వరకు జరిగే కథగా చెప్తాడు. కరేన్ రాండల్ అనే అమ్మాయి అబార్షన్ తో మరణించిందని, ఆ అబార్షన్ చేసింది డాక్టర్ ఆర్ట్ లీ అని అతన్ని అరెస్ట్ చేస్తారు. అతను నిర్దోషి అని నమ్మిన అతని స్నేహితుడు బెర్రీ ఎలా ఈ అది సాధించాడో తెలిపే ఇన్వెస్టిగేషన్ క్రమమే ఈ నవల.

     1960 ల్లో అబార్షన్ అమెరికాలో ఇంకా చట్టబద్ధం కాలేదు. కానీ ఎంతో మంది డాక్టర్లు అబార్షన్లు చేసేవారు. రాండల్ కుటుంబం వైద్య కుటుంబం, ఎంతో ప్రసిద్ధి పొందింది. చనిపోయే రోజు రాత్రి రక్తసిక్తంగా కారులో వచ్చిన కరేన్ రాండల్ ను ఆమె సవతి తల్లి  హాస్పటల్ కు తీసుకువెళ్తుంది. ఆ కారులో ఆమె డాక్టర్ లీ పేరు చెప్పిందని చెప్తుంది. అప్పటికే పరిస్తితి  చేజారిపోవడంతో ఆమె మరణిస్తుంది. తన కూతురి చావుకు ఆర్ట్ లీ కారణం అని నమ్మిన ఆమె తండ్రి  అతనికి శిక్ష  పడేలా చేయాలనుకుంటాడు.

     బెర్రీ జైలులో ఉన్న ఆర్ట్ లీ ను కలుస్తాడు. అతని మాటల ద్వారా అబార్షన్ కోసం కరేన్ వచ్చిన మాట నిజమే కానీ, అప్పటికే నాలుగో నెల అని చెప్పడంతో తాను చేయడానికి నిరాకరించానని  చెప్తాడు అతను. అతను చెప్పింది నిజమే అని బలంగా నమ్ముతాడు బెర్రీ.

      ఆ క్రమంలో  రాండల్ స్నేహితులను, కుటుంబాన్ని అందరినీ కలుసుకున్నాక ఆమె గురించి అతనికి అనేక విషయాలు తెలుస్తాయి. ఆమె 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడూ తల్లి మరణించడంతో అది ఆమెపై ఎంతో ప్రభావం చూపిందని, అదే సమయంలో తండ్రికి ఎందరో యవ్వనంలో ఉన్న స్త్రీలతో సంబంధాలు ఉన్నాయని తెలుసుకోవడం, ఇంకో యవ్వనంలో ఉన్న స్త్రీను 60 ఏళ్ళ వయసులో భార్యగా తెచ్చుకోవడం వంటి విషయాలతో తండ్రి పట్ల పూర్తి విరక్తిని ఆమె పెంచుకుంది. తాను చాలా ధైర్యవంతురాలినని, ఏ పనైనా అది మంచిదైనా-చెడ్డదైనా చేయడానికి వెనుకాడని వ్యక్తినని నిరూపించుకోవడం కోసం ఆమె ఎప్పుడూ తపిస్తూ ఉండేదని అతనికి ఆ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది.

     ఇదే క్రమంలో ఆమె బాబాయి అయిన పీటర్ రాండల్ ఆమె పర్సనల్ డాక్టర్ అని, అంతకు పూర్వం ఆమెకు మూడుసార్లు గర్భస్రావం చేశాడని కూడా తెలుస్తుంది. కరేన్ కు అబార్షన్ చేయించుకోవడం అంటే ఇష్టమని, దానిని ఆమె సాహసంగా,పాప ప్రాయశ్చిత్తంగా కూడా భావించేదని పీటర్ చెప్తాడు. ఆమె పోస్ట్ మార్టం దగ్గర ఉన్న బెర్రీ, ఆమె రక్తం శ్యాంపిల్ కూడా తీసుకుని అసలు ఆమెకు గర్భం రాలేదనే విషయం తెలుసుకుంటాడు.

     కరేన్ అప్పటికే డ్రగ్ ఎడిక్ట్ అని కూడా తెలుస్తుంది. ఎంతో మంది మగ స్నేహితులు ఉన్నారని, బబుల్ ,ఏంజెల్ అనే ఇద్దరు స్నేహితురాళ్లతో ఆమె చనిపోయే ముందు వరకు మసలిందని తెలుసుకుంటాడు బెర్రీ. ఆమె చనిపోయే ముందు పీటర్ కారులో వెళ్ళడం వల్ల, ఆ కారులో రక్తం ఉండటం వల్ల ఎందుకైనా మంచిదని ఆ కారును కాల్చేస్తారు ర్యాండల్ కుటుంబ సభ్యులు. అది గమనించిన   ఆర్ట్ లీ లాయర్ అయిన విల్సన్ దాన్ని ఫోటోలు తీసి వారిని ఇరికిద్దామని అనుకున్నా  బెర్రీ దానికి ఒప్పుకోడు.

     ఆ తర్వాత క్రమంలో ర్యాండల్ రెండో భార్యతో పీటర్ కు సంబంధం ఉన్నట్టు, ఆమెకు అబార్షన్ ఆర్ట్ లీ గతంలో చేసినట్టు, ఆ రాత్రి కారులో హాస్పటల్ కు కరేన్ ను తీసుకువెళ్తున్న సమయంలో ఆమె ఎవరి పేరు చెప్పకపోవడం వల్ల ఒకవేళ గతంలో చేసినట్టే పీటర్ అబార్షన్ చేశాడని అనుకున్న ఆమె అతన్ని రక్షించడం కోసం తనకు తెలిసిన అబార్షన్లు చేసే డాక్టర్ అయిన డాక్టర్ ఆర్ట్ లీ పేరు చెప్పిందని తెలుస్తుంది.

     కరేన్ స్నేహితురాలు అయిన ఏంజెల్ ఓ హాస్పటల్ లో నర్సుగా పని చేస్తుండేది. ఆమె హాస్పటల్ లో స్వల్ప మోతాదులో డ్రగ్స్  దొంగతనం చేసేది. ఆమెకు, కరేన్ కు సమిష్టి స్నేహితుడైన  రోమన్ ఆ హాస్పటల్ లో ఉన్న డ్రగ్స్ అన్నీ దొంగతనం చేయడంతో ఎక్కడ అనుమానం వస్తుందో అని ఏంజెల్ దొంగతనం చేయడం మానేస్తుంది. కానీ డ్రగ్స్ కు బానిసైన ఆమె అవి లేకుండా ఉండలేకపోవడంతో  రోమన్ దగ్గర నుండి తీసుకోవడానికి 300 డాలర్లు అవసరపడతాయి.

     అప్పటికే ఫాల్స్ ప్రెగ్నెన్సీ ఉన్న  కరేన్ బరువు పెరగడం, మెన్సెస్ రాకపోవడంతో నిజంగానే గర్భం వచ్చిందనుకుని అబార్షన్ చేయించుకునే ప్రయత్నంలో ఉంది. డాక్టర్ ఆర్ట్ లీ నిరాకరించడంతో  ఏంజెలా ఆ డ్రగ్స్ కోసం 300 డాలర్ల కోసం చేయడానికి ఒప్పుకుంటుంది. ఆ సమయంలో అది సరిగ్గా చేయకపోవడంతో,రోమన్ నిర్లక్ష్యం ,మొరటు పద్ధతుల వల్ల  ఆమె అలా మరణిస్తుంది.

     రోమన్ ను అనుమానించిన బెర్రీ అతన్ని గమనించడంతో అది తెలుసుకున్న రోమన్ అతని మీద హత్యా ప్రయత్నం చేసి, అతను రోడ్ మీద పడిపోగానే మిగిలిన సాక్షి అయిన ఏంజెల్ ను చంపడానికి రోమన్ బయల్దేరతాడు. ఆ క్రమంలో అతన్ని కిటికీ తలుపు నుండి కిందకు పడి మరణిస్తాడు. ఈ నిజాలు అన్నీ ఏంజెలా  ఒప్పుకుంటుంది చివరకి. అలా ఆర్ట్ లీ బయట పడి అసలు దోషి అయిన ఏంజెలా బయటపడటం, ఆర్ట్ లీ అక్కడి నుండి వేరే పార్దేశానికి వెళ్ళిపోవాలన్న నిర్ణయం తీసుకోవడంతో ఈ నవల ముగుస్తుంది.

     రచనా శైలిలో క్రిక్ టన్ శైలి వైద్య రచనలా కన్నా కూడా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ గా మలచడంతో ఒక్కసారి మొదలుపెట్టాక ఈ నవలను పూర్తి చేసేవరకు పాఠకులు వదలలేరు అన్నది కచ్చితంగా ఒప్పుకోవాల్సిన నిజం. నాకు మటుకు దాదాపు 400 పేజీలు ఉన్న ఈ పుస్తకం చదవడానికి ఓ రోజు పట్టింది, కానీ చదువుతున్న క్రమంలో తెలియకుండానే మనసులో ఓ విశ్లేషణ కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఆసక్తి కలిగించేలా పెద్ద పెద్ద వైద్య అంశాలను కూడా సరళం చేసేలా రాసే క్రిక్ టన్ మామూలు పాఠకులు కూడా చదవాల్సిన రచయిత.

                           *     *    *

    


Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!