అద్భుతం జరిగితే ?

 చదువరి

అద్భుతం జరిగితే ?

-రచనశ్రీదత్త(శృంగవరపు రచన)



ప్రఖ్యాత బాల సాహితీవేత్త అయిన బ్రిటిష్ నవలా రచయిత రోల్డ్ డాల్ రచనల్లో ఒకటైనా తెలియని పాఠకులు ఉండరు. రాసే శైలిలో ఉత్కంఠ, సాహసం, పిల్లల మనసుల్లోని చెప్పలేని ప్రతి భావోద్వేగాన్ని  ఓ కొత్త కోణంలో పరిచయం చేస్తూ వారు పడే కష్టాలు, వారికి అకస్మాత్తుగా అందే సాయం, వారి ఊహల్లో ఉండే వింతలకు రూపం రోల్డ్ డాల్ రచనలు. ఆయన రచనల్లో ప్రసిద్ధి పొందిన ఒకానొక రచనే ‘James And The Giant Peach.’

            జేమ్స్ హెన్రీ ట్రోటర్  నాలుగేళ్ళ వయసు ఉన్న బాలుడు. సముద్రం ఒడ్డున తల్లిదండ్రులతో ఉంటూ, తన ఈడు పిల్లలతో ఆడుకుంటూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఓ సారి అతని తల్లిదండ్రులు లండన్ కు షాపింగ్ కు వెళ్ళినప్పుడు, లండన్ జూ నుండి తప్పించుకున్న  ఆకలిగొన్న రైనో కు బలైపోతారు. దానితో జేమ్స్ అనాథ అవుతాడు.

            జేమ్స్ ఉన్న ఇంటిని అమ్మేయాల్సి వస్తుంది. అతని ఇద్దరు ఆంటిలైనా స్పాంజీ, స్పైకర్ లతో అతని కొత్త జీవితం ఓ కొండ పైన ఉన్న ఇంటిలో మొదలవుతుంది. వారిద్దరు  జేమ్స్ పట్ల ఎంతో క్రూరంగా వ్యవహరిస్తూ ఉండేవారు. అతను ఉండే గది కూడా జైలులా ఉండేది. అతని చేత ఎంతో పని చేయించేవారు. ఇలా రోజులు గడిచిపోతున్న సమయంలో మూడేళ్ళ తర్వాత తోటలో జేమ్స్ పని చేస్తున్న సమయంలో పొద వెనుక నుండి ఓ ముసలి వ్యక్తి ఓ మంత్రం జపించి ఓ తెల్ల మూట ఇచ్చి అందులో ఉన్న పచ్చటి రాళ్ళ వంటి వాటిని ఓ జగ్ నీటిలో ఉంచి,వాటిలో ఒక్కొక్కటిగా అతని తల వెంట్రుకలను వేసి,ఓ రెండు నిముషాల తర్వాత తాగితే అతని కడుపులో మండినట్టు ఉన్న అతని జీవితంలో ఉన్న బాధ ముగిసి సంతోషం మొదలవుతుందని చెప్పి అతను మాయమైపోయే ముందు, జాగ్రత్తగా చేయమని లేకపోతే అవి ఎక్కడైనా పడితే ఓ క్రిమి కీటకాదుల కైనా సరే ఆ అద్భుతాలు వాటికి జరగవచ్చని హెచ్చరిస్తాడు.

            ఆ వ్యక్తి చెప్పింది చేద్దామని ఆ ఇద్దరు ఆంటీలకు కనబడకుండా వంటింటికి వెళ్ళే ప్రయత్నం జేమ్స్ చేస్తుండగా ఆ తెల్లటి మూట కింద పడుతుంది. జేమ్స్ చూస్తుండగానే  ఆ మూట లోని పచ్చటి రాల్లవంటివి పీచ్ చెట్టు కింద  భూమిలోపలికి వెళ్ళినట్టే వెళ్ళి మాయమైపోతాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన స్పాంజీ, స్పైకర్ లు ఎప్పుడు ఒక్క పీచ్ పండు కూడా ఆ చెట్టుకు కాయకపోవడం తెలిసినప్పటికీ అప్పుడు ఆ చెట్టుకు ఓ పండిన పీచ్ పండు కనిపించడంతో ఆశ్చర్యపోతారు.

            ఆ పీచ్ పండును తిందామని జేమ్స్ ను చెట్టు ఎక్కి ఆ పండు కోయమంటారు. ఏం జరుగుతుందో జేమ్స్ కు అర్ధం కాకపోయినా ఇదంతా ఆ పచ్చటి రాళ్ళ వల్లే అని గ్రహిస్తాడు జేమ్స్. అలా చూస్తుండగానే ఆ పీచ్ పండు పరిమాణం పెరిగిపోతు ఉంటుంది. చివరకు ఓ చిన్న కాటు సైజుకు పెరిగి భూమి మీద స్థిరపడి అప్పుడు పెరగడం ఆగుతుంది. అది చూసి అంతే ఆశ్చర్యపోయిన స్పాంజీ ,స్పైకర్ లు ఇద్దరు దీని నుండి డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తారు. కారు సైజు పీచ్ పండు గురించి వార్త అందరికీ తెలిసిపోవడంతో, అందరూ దానిని చూడటానికి వస్తుంటారు. అది చూడటానికి వచ్చేవారికి టికెట్ షో పెట్టి డబ్బులు సంపాదిస్తారు. ఆ రోజు అంతా జేమ్స్ ను మాత్రం అతని గదిలో బంధిస్తారు.

            ఆ రాత్రి ఆ పండు దగ్గరికి వెళ్ళిన జేమ్స్ దానికి ఓ చిన్న కన్నం ఉండటం గమనించి దాని లోపలి నుండి మధ్యలోకి ప్రవేశిస్తాడు. అక్కడ మధ్యలో పీచ్ గింజ గోడల ఉన్న దగ్గర ఓ సెంటీపీడ్ ,లేడి బగ్, మిడత, సిల్క్ వార్మ్, స్పైడర్ ,గ్లో వార్మ్, గుడ్డి వాన పాము ఉంటాయి. వాటి ఆకారం జేమ్స్ ఆకారంతో సమానంగా ఉంటుంది. తరువాతి ఉదయం అక్కడ నుండి బయలుదేరి అక్కడ నుండి బయటపడాలనుకుంటారు అందరూ.

            ఆ తర్వాతి ఉదయం ఆ పీచ్ పండు ముందుకు కదులుతుంది. అడ్డు వచ్చిన స్పాంజీ, స్పైకర్ ల మీద వెళ్ళడంతో వారిద్దరూ మరణిస్తారు. అలా వెళ్తూ వెళ్తూ ఆ పీచ్ సముద్రం మధ్యలో తేలుతూ ఉంటుంది. ఇప్పుడు దానిని ఒడ్డుకు ఎలా చేర్చి వారు భూమిని ఎలా చేరుకోవాలి అన్నదే ప్రశ్న. పీచ్ పండులో కొంత తింటూ వారంతా ఆకలి తీర్చుకుంటారు.

            ఆ తర్వాత ఆ పీచ్ పండును వందల షార్కులు చుట్టుముడతాయి. వాటి నుండి తప్పించుకోవాలంటే ఉన్న ఒకే ఒక్క మార్గం ఆ పీచ్ పండును ఎత్తి ఒడ్డు వైపుకు కదల్చడమే అని చెప్తాడు జేమ్స్. అప్పటికే పైన సీ గల్స్ అనే పక్షులు ఉన్నాయి. వాటికి తమ దగ్గర ఉన్న వానపామును ఎరగా వేసి సిల్క్ వార్మ్ అల్లే తాడుతో వాటి కాళ్ళను పీచ్ పండు కిందకు కడితే అలా వందల పక్షులవి కట్టగలిగితే అవే కదులుతూ చేరుస్తాయని జేమ్స్ చెప్తాడు. ఆ పథకాన్ని అమలు పరుస్తారు.

            ఆ తర్వాత అలా వెళ్తూ ఉంటే మధ్యలో క్లౌడ్ మెన్ కనబడతారు. వడగళ్ళు విసురుతూ ఉంటారు. వారిని తుంటరితనం కొద్ది సెంటిపెడ్ తిడుతుంది. వారిని ఎలాగో తప్పించుకుని ముందుకు వెళ్ళాక ఇంకొందరు క్లౌడ్ మెన్ ఇంద్రధనుస్సు కోసం పెయింటింగ్ చేస్తూ ఉంటారు. వారి నుండి తప్పించుకుని మొత్తానికి ఎలాగో ఆ పక్షుల సాయంతో న్యూ యార్క్ స్కై స్క్రాపర్స్ కు చేరుకుంటారు.

            అంత పెద్ద పీచ్ పండు, అంత పెద్ద పరిమాణంలో ఉన్న ఆ కీటకాలను చూసి వారు మొదట అనుమానించినా, తర్వాత వారిని గౌరవించి ఒక్కొక్కరికి ఒక్కో వృత్తిని కూడా ఇస్తారు. బూట్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా సెంటిపెడ్ కు, అమ్మాయిల ఫేస్ క్రీమ్స్ తయారు చేసే కంపెనీలో కమర్షియల్స్ టెలివిజన్ లో మాట్లాడటానికి వాన పామును, సిల్క్ వార్మ్-స్పైడర్ లను తాడుల కంపెనీలోను, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ లోపల వెలుగు నింపడానికి గ్లో వార్మ్ ను నియమిస్తారు. మొదటి నుండి వయొలిన్ వాయించడం పట్ల ఆసక్తి ఉన్న మిడత ఓ సింఫనీ లో సభ్యత్వం పొందింది. లేడి బగ్ ఫైర్ డిపార్ట్మెంట్ హెడ్ ను వివాహం చేసుకుంది. తర్వాత జేమ్స్ ఆ పీచ్ గింజ నే ఇల్లుగా చేసుకుని దానిలో నివసించసాగాడు. అదే ఓ మానుమెంట్ లా మారింది. ఎవరు లేరని ఒంటరితనంతో బాధ పడిన జేమ్స్ ను కలవడానికి ఎందరో పిల్లలు, పెద్దలు వచ్చేవారు. ఇదంతా అయ్యాక ఈ కథ చెప్పింది జేమ్స్ అని చెప్పడంతో ఈ నవల ముగుస్తుంది.

            బాలలకు బాల్యంలో ఏదైనా బాధ కలిగినప్పుడు వారి మనసులో ఉన్న ప్రతి విషయాన్ని వారు ఎవరికీ చెప్పుకోలేరు. ఆ బాధ తెలుసుకుని తీర్చే అద్భుతం జరగాలని వారు కోరుకుంటారు. ఇది బాలల్లోనే కాదు ఎంతోమంది మనసుల్లో ఉండే భావనే. ఆ భావనను తీర్చే ఊహ జనితలోకాల్లోనే అంతర్జాతీయ బాల సాహిత్య రచనలకు పునాదులు పడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న జేమ్స్ జీవితంలో అద్భుతం జరిగినప్పటికీ కూడా అతని సమయస్పూర్తి, కష్టపడే తత్వాన్ని రచనలో పాఠకులకు అర్ధమయ్యేలా డాల్ కథ ద్వారా తెలిసేలా చెయ్యడం ద్వారా ఇది ఆకస్మితంగా జరిగిన సంఘటనలా కాకుండా తెలివికి,కష్టానికి గుర్తింపులా  అనిపిస్తుంది. ఈ రచన గొప్పతనం అందులోనే ఉంది.

                                 *      *      *

 

 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!