నిరుద్యోగి నిజాయితీ

 చదువరి 

నిరుద్యోగి నిజాయితీ 

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 


     వాసిరెడ్డి సీతాదేవి గారి రచనల్లో సమాజంలో, కుటుంబాల్లో లేక వ్యక్తిగతంగా ఉండే కనికనిపించని సూక్ష్మ సమస్యలు మొదలుకుని అందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్న అంశాల వరకు ఏదో ఒకటి స్పృశించబడుతుంది. అటువంటి రచనే వెన్నెల మండుతోంది. ఈ నవలలో  ఓ నిరుద్యోగి, మధ్యతరగతి వాడైన చంద్రం జీవితాన్ని  వాస్తవంలోనూ, ఊహల్లోనూ చిత్రీకరిస్తూ  ఓ నిజాయితీపరుడు  నేటి భారతంలో  ఎలాగా కూడా బ్రతకలేడని తేలుస్తూ, చివరకు అతను కామ్రేడ్ అవడంతో కథను ముగించారు. 1976 లో వచ్చిన నవల ఇది.

     చంద్రం తండ్రి గుర్నాథం గుమాస్తాగా చేస్తూ చంద్రం మెట్రిక్యులేషన్  పూర్తయిన సమయానికి రిటైర్ అవుతాడు. చంద్రం తల్లి శాంతమ్మ, చెల్లెలు లక్ష్మి. చంద్రం ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటాడు. ఇంజనీరింగ్ చదవాలనుకుంటాడు. కానీ కుటుంబ పరిస్థితులను, వాస్తవల్ని  గుర్తించి డిగ్రీ  చదవాలనుకుంటాడు. మూడు నెలల పెన్షన్  తీసుకున్నాక అనారోగ్యంతో మరణిస్తాడు  గుర్నాథం.

     చంద్రం ఇంటి మీద అప్పు తెచ్చి డిగ్రీ పూర్తి చేస్తాడు. ఎంప్లాయిమెంట్  ఎక్స్ ఛేంజీలో  నమోదు  చేసుకుని, 8 నెలలు తిరిగినా ఇంటర్ వ్యూకి పిలుపు రాదు. తర్వాత అసలు విషయం తెలుసుకుని తల్లి మాంగల్యం అమ్మి రెండు వందలు లంచం ఇస్తే ఇంటర్ వ్యూ పిలుపు వస్తుంది. రికమండేషన్లతో వచ్చే వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వడం వల్ల చంద్రానికి ఉద్యోగం రాదు. అతని చెల్లెలు లక్ష్మి పక్కింటి లక్షాధికారుల పిల్ల అయిన వనజతో  స్నేహంగా ఉంటుంది. ఆమె అన్న కృష్ణ లక్ష్మిని లోబర్చుకుంటాడు.

     ఉద్యోగాలు దొరకని  చంద్రం మిత్రులైన  అనంతం దొంగతనాలు చేస్తూ భూషణం పుస్తకాలు అమ్ముకుంటూ, తిరుమలై చిలుక జోస్యం చెప్పుకుంటూ, ఆచారి లాటరీ టికెట్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండటం చూస్తాడు చంద్రం. ఎలాగో తను కూడా కుటుంబాన్ని పోషించాలని లారీ డ్రైవర్ సహాయకుడిగా వెళ్ళినా, అది స్మగ్లింగ్ బండి అని తెలిసి లారిలో నుంచి దూకేస్తాడు.

     అప్పుడు ఊహాలోకి జారుకుంటాడు. ఓ వైపు మహారాజపురంబోర్డు కనిపిస్తే దాన్ని అనుసరిస్తాడు. ఆ రాజ్యం రాజు మరణిస్తాడు. తన భద్రగజం  ఎవరి మెడలో హారాన్ని వేస్తే  అతన్నే  తన తర్వాత రాజు చేయాలని ఆ రాజు కోరిక. ఆ గజం చంద్రం మెడలో హారం వేస్తుంది. రాజైన  చంద్రం ఆ రాజ్యంలోని అవినీతిని నిర్మూలించి, సమాన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు. నిరుద్యోగం లేకుండా చేస్తాడు. సోమరిపోతులు లేకుండా చేస్తాడు. చివరకు ఖజానాలో ధనం పూర్తైపోతుందని చెప్తే, అందరి వేతనాలు  దాదాపు సమానంగా ఉండాలని పెద్ద జీతగాడికి  మిగిలినవారి  జీతానికి మధ్య 200 మించి ఉండకూడదని శాసనం జారీ చేస్తాడు. దానితో కోపోద్రిక్తులైన  మంత్రివర్గం కత్తితో పొడుస్తారు. ఊహ నుంచి మేలుకుంటాడు చంద్రం.

     మరో రోడ్డు వైపు చూస్తే ఉక్కుపురి అని కనిపిస్తే  అక్కడికి వెళ్తాడు చంద్రం. అక్కడ మిల్లుకు యాజమాని  రామనాథంలో  తన తండ్రి పోలికలు కనిపిస్తే  నాన్నా అంటాడు. ఆయన బాబాయి అని తెలుస్తుంది. వారసులు లేని, భార్య చనిపోయిన  రామనాథం చంద్రాన్ని వారసుడిగా ప్రకటిస్తాడు. అక్కడ కార్మికుల పక్షాన సూర్యం నిలబడినందుకు  యాజమాన్య వర్గం అతన్ని హత్య చేయబోతారు.

                 ఊహాలో నుండి బయటపడి  మూడో దిక్కు బోర్డు మీద “ఢిల్లీ  చూస్తాడు. ఐ.ఏ.ఎస్ అధికారైన చంద్రం ఆఫీసర్ గా వెళ్తాడు. అతను మంచి ఆఫీసర్ అని, లక్ష్మిని కట్నం లేకుండా పెళ్ళి చేసుకోవడానికి ముందుకొస్తారు. కానీ చంద్రం నిజాయితీ వల్ల ఛైర్మన్ తో విభేధం రావడం వల్ల లక్ష్మి  పెళ్ళి రోజే సస్పెండ్ అవ్వడంతో పెళ్ళి ఆగిపోతుంది.

     చివరకు వాస్తవ లోకం లోకి వచ్చిన చంద్రం హైదారాబాద్ బోర్డు చూసి తన ఇంటికి వెళ్తాడు. చిన్ననాటి నుండి తన భార్య అవుతుందనుకున్న సరస్వతి పెళ్ళి  వేరే అతనితో  చంద్రం కళ్ళ ముందే జరిగిపోతుంది. అతనికి తల్లి, చెల్లి కనబడరు. మావయ్య పేరయ్యను అడిగితే లక్ష్మి గురించి ఏమేమో అనుకుంటున్నారని, ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని, తర్వాత అతని తల్లి కూడా వెళ్ళిపోయిందని చెప్తాడు. వారిని వెతుక్కుంటూ చంద్రం బయల్దేరతాడు. ప్రాస్టిట్యూషన్ లో పట్టుకున్న వారిలో చెల్లెలు ఉందని  భ్రమ పడి  కోర్టుకు వెళ్ళి, అక్కడ స్త్రీలకు జరుగుతున్న  అవమానాన్ని కళ్ళారా  చూస్తాడు. రోడ్డు మీద ఓ ముసలావిడ సవదహనం చేయడం కోసం  అడుక్కుంటున్న వారిని చూస్తే తల్లి గుర్తుకు వస్తుంది.

     ఆకలి మంట కూడా గుర్తొస్తుంది. అప్పుడే అతని ఆకలి తీర్చిన కామ్రేడుతో కలిసి అప్పటిదాకా  వెన్నెలలా ఉన్న చంద్రం మండుతూ కామ్రేడ్ సూర్యంలా మారతాడు. నిజాయితీ కన్నా కూడా సమాజంలో బ్రతకడానికి కావాల్సింది సందర్భానికి తగ్గట్టు తన సౌఖ్యానికి తగ్గట్టు మారే స్వభావం అని ఈ రచనలో ఉన్న  అంతర్లీన సందేశం పాఠకులకు ఒక్కోలా అర్ధమైనా, సమాజ ప్రవృత్తికి నిత్య నిదర్శనమే ఈ నవల.

                          *     *     *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!