ఆధునిక సాహిత్యంలో విలక్షణత-విశృంఖలత్వం

 

ఆధునిక సాహిత్యంలో విలక్షణత-విశృంఖలత్వం

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)

(నవ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడిన విశ్వజనీన విపంచి వెబినార్ లో ప్రసంగించిన అంశం)



            సాహిత్యంలో  ఏదైనా ఒక కొత్త ప్రక్రియ లేదా లక్షణం రచనలో ప్రవేశపెట్టబడింది అంటే దానికి మూలం ఆ రచయిత వ్యక్తిగత,సాహిత్య,విషయ పరిజ్ఞాన,విజ్ఞాన  స్పృహల సమన్వయం వల్లే. నాయకుడు లేదా నాయిక ఆరాధనతో సాగే సాహిత్యం నుండి ఎంతో మందీ సాహితీవేత్తలు వాస్తవికతను తమ రచనల్లో ప్రతిబింబించాలనే ఉద్దేశ్యంతో ఊహలకు పక్కకు జరిగారు. ఆధునిక సాహిత్యంలో అసలైన విలక్షణతకు బీజం ఇదే.

             సాహిత్యంలో ముఖ్యంగా కథల్లో, నవలికల్లో, నవలల్లో  ఓ ప్రక్రియ లేదా లక్షణం అంతర్లీనంగా పాఠకులకు దర్శనమిస్తుందంటే ఖచ్చితంగా వాటి ప్రేరణ మానసిక భావోద్వేగాలలో దాగి ఉంటుంది.ఆ ప్రేరణను ఇచ్చే భావోద్వేగాలు ప్రేమ,లక్ష్యం,విజయ సిద్ధి, సేవ వంటి మానసిక చేతనతో సాగుతూ విజ్ఞాన-విషయ పరిజ్ఞానంతో మిళితమైతే అది విలక్షణ ప్రక్రియకు చెందుతుంది. ఇవే భావనలు సాధారణ సాహిత్యంలో కూడా ఉండవచ్చు, కానీ వ్యక్తపరిచే శైలిలో మాత్రం వాస్తవికత, పాఠకులు వీక్షించని కోణాలు పరిచయం చేయగలిగినప్పుడే ఏ రచనలోనైనా విలక్షణత సజీవంగా ఉంటుంది.

            అంతర్జాతీయ సాహిత్యాన్ని గమనిస్తే మానవ సంబంధాలకు మాత్రమే పరిమితం కాకుండా ఎక్కువగా ఇన్వెస్టిగేటివ్ నవలలు,ఆ దేశ రాజకీయ స్థితిగతులను తెలిపే నవలలు విరివిగా వస్తున్నాయి. కానీ ప్రాంతీయ సాహిత్యంలో ఆ ఇన్వెస్టిగేటివ్ ప్రక్రియకు ఎక్కువ ఆస్కారం ఉండకపోవటం వల్ల, అలా చేసే వారికి అనుకున్నంత ప్రోత్సాహం కూడా లభించకపోవడం వల్ల ప్రాంతీయ సాహిత్యంలో ఈ విలక్షణత కొరవడిందనే చెప్పాలి. అందుకే మన సాహిత్యంలో విలక్షణత అధిక శాతం మానవ సంబంధాలు-భావోద్వేగాల చుట్టూనే పరిభ్రమిస్తుంది. అంటే దేశ పరిస్థితులను కొంతమేరకు ప్రతిబింబించగలిగిన తెలుగు రచయితలు ఎందరో ఉన్నారు. కొడవటిగంటి కుటుంబరావుగారు తన అనుభవం, అరుణోదయం వంటి రచనల్లో కొంతమేరకు దేశ స్థితిగతుల ప్రభావం పౌరుల జీవితంపై ఎలా ప్రభావం చూపిందో రాశారు. ఇప్పటికీ ఎంతోమంది రాస్తూనే ఉన్నారు. కానీ అది ప్రశంసించేంత స్థాయికి మాత్రం ఎదగలేదు.

            ఇక విశృంఖలత్వం విషయానికి వస్తే  అదే ప్రేరణ పగ, కక్ష, ఆలోచనారాహిత్యం, భవిష్యత్తును గురించి పట్టించుకొని నిర్లక్ష్యం వంటి భావనల ప్రేరణతో సాగితే మాత్రం ఆ రచనలో తప్పకుండా ఏదో ఒక కోణంలో ఓ పాత్ర విశృంఖలత్వ ప్రవృత్తి  ఆవిష్కరించబడుతుంది.

            కోలపల్లి ఈశ్వర్ గారి అనగనగా ఒక దుర్గనవలలో దుర్గా అనే అమ్మాయి బాల్యం నుండి నడివయసు దాకా ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు, అవి ఆమెపై చూపిన ప్రభావాలను స్పష్టం చేస్తుంది. ప్రతి మనిషి మనసులోనూ  చెడ్డ పనులు చేయకపోయినా నిందారోపణ ఎదురైనప్పుడు కొన్నిసార్లు ఆ నిందను నిజం చేయాలనే కసి ఉంటుంది. దుర్గ బాల్యంలో చదువు మీద ఆసక్తి లేకపోవడం వల్ల ఇంట్లో తల్లికి అనారోగ్యం ఉండటం వల్ల ఆమెకు సాయంగా ఉండిపోతుంది. ఆమె అక్క శశి,తమ్ముడు హరి మాత్రం విద్యను కొనసాగిస్తారు.

            దుర్గ స్నేహితురాలు సల్మాను లహర్ ప్రేమిస్తాడు. కానీ ఆమెకు ప్రేమ లేఖ  ఇవ్వడానికి దుర్గను ప్రశంసించడం వల్ల తనను లహర్ ప్రేమిస్తున్నాడనే అనుకుంటుంది దుర్గ. కానీ ఎప్పుడైతే సల్మాకు ప్రేమలేఖ ఇవ్వమని దుర్గకు ఇస్తాడో అతని మీద కక్ష పెంచుకుంటుంది దుర్గ. అప్పటికే శ్రీను మీద ఆసక్తి ఉన్న దుర్గ అతనికి తన మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి ఆ ప్రేమ లేఖలో ఇంక్ రిమూవర్ వాడి సల్మా పేరు ఉన్న చోట తన పేరు రాస్తుంది. ఆ లేఖను శ్రీనుకు ఇస్తుంది. శ్రీను లహర్ తో గొడవపడతాడు. లహర్ కుటుంబం దుర్గ ఇంటికి రావడంతో అసలు విషయం బయటపడుతుంది. దానితో అందరూ దుర్గను మదపిచ్చిపట్టిన స్త్రీగా పరిగణిస్తారు.దుర్గను ఆమె అమ్మమ్మ ఇంటికి పంపేస్తారు.

            శ్రీను కోసం చదువు మీద ఆసక్తి లేకపోయినా అతను పాఠాలు చెప్పడానికి వస్తాడని చదువుకుంటూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అతను తనని కాకుండా తన అక్క శశిని ప్రేమించాడని తెలుసుతుందో అప్పుడు అతని మీద కక్ష,కోపంతో పుస్తకాలను తగలబెట్టి చదవడం మానేస్తుంది. అదే సమయంలో పక్కింట్లో ఉండే నాగరాజు ఆమెను ప్రేమిస్తున్నానని వెంటబడటంతో అతన్ని ఏడిపించటానికి అతనికి ఇంగ్లీష్ రాదని ఇంగ్లీష్ లో ప్రేమ లేఖ ఇవ్వమని అడగటంతో,అతను ఓ టీచర్ తో రాయించడం ఆ విషయం ఊరంతా పొక్కడంతో అక్కడి నుండి ఇంటికి తీసుకువెళ్ళిపోతారు.

            శశికి ఆస్తి ఉన్న బావతో వివాహం జరిగాక ఆమెను ఏడిపించటానికి బావతో చనువుగా ఉన్నట్టు నటించడాన్ని ఆ బావ అవకాశంగా తీసుకోబోతే అతన్ని గాయపరుస్తుంది. అతను ఆమె తన మీద కోరికతో వచ్చిందని చెప్పిందే నమ్ముతారు. ఇదంతా జరగడంతో మనసులో తెలియని కోపం,కక్షలతో నాగరాజుతో సంబంధం పెట్టుకుని గర్భవతి అయ్యాక రెండో పెళ్లి వాడు అయిన  శేషగిరిరావును వివాహం చేసుకుని అతనికి అసలు విషయం చెప్తుంది. అతను తన విల్లులో ఆ కొడుక్కి కాకుండా తనకు పుట్టిన కూతురికి ఆస్తి రాయడంతో అతను మరణించాక కొడుక్కి రాయలేదనే కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ కూతుర్ని వాళ్ళు తీసుకువెళ్లనివ్వరు. అమ్మమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటుంది. అప్పటికే ఆమె మరణిస్తుంది. నాగరాజుకు మరదలుతో వివాహమవుతుంది. కానీ పిల్లలు లేకపోవడంతో కోట్ల ఆస్తి ఏం చేయాలో తెలియక దుర్గ కొడుకు మనసు విరిచేసి ఆమె నుండి దూరం చేస్తారు.  చివరకు కొడుకును సర్వస్వాన్ని కోల్పోయిన ఆమె  ఆత్మహత్యే శరణ్యం అనుకున్నప్పుడూ ఆమెకు అనాథ అయిన కృష్ణ కనిపించడంతో ఆమె జీవితానికో కొత్త మార్గాన్ని ఎంచుకుని ఓ అనాధాశ్రమాన్ని స్థాపించి ఎందరి జీవితాల్లోనో వెలుగు నింపుతుంది. చివరికి తల్లి బాధ్యతను కూడా స్వీకరిస్తుంది. శ్రీనును వివాహం చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

            ఈ కథ మొత్తం దుర్గ తనకు ఎదురైన ప్రతి పరిస్థితి పట్ల కక్షను పెంచుకుని ప్రతి దశలో తన వ్యక్తిత్వాన్ని తానే నాశనం చేసుకుంటూ చివరకు ఓ మజిలీ దగ్గర ఆ కక్ష  ప్రేమగా పరిణతి చెందాక ఆమె  ఎందరికో ఆదర్శమైన వ్యక్తిగా మారింది.

`          ఇక్కడ ఆలోచించాల్సిన ప్రశ్న ఇంకొకటి ఉంది. విశృంఖలత్వం అన్నది కేవలం స్త్రీలకు మాత్రమే వర్తించే అంశామా? సాహిత్యపరంగా ఈ ప్రశ్నకు సమాధానం  పూర్తిగా రచయిత స్వేచ్చకు సంబంధించినది.పై నవలలో చూస్తే లహర్, బావ ,నాగరాజు ఈ ముగ్గురు విషయంలో ఆ ముగ్గురు మగవాళ్ళ తప్పును సహజంగా పరిగణించిన సమాజం, ఒక్క దుర్గ విషయంలో మాత్రం దోషిని చేసింది. ఇది సమాజ స్వరూపాన్ని అనుసరించి ఆచరణకు దగ్గరగా ఉన్నదే రచయిత ఎప్పుడు స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తాడు.

            మానవ జీవితంలో ఎక్కడో,ఎప్పుడో భౌతిక,మానసిక స్థాయిలను అనుసరించి జరిగే సంఘటనలే కొంత ఊహాతో సాహిత్యరచనకు మూలాలు అవుతాయి. అలాగే ఈ  పగ, కక్ష, ఆలోచనారాహిత్యం, భవిష్యత్తును గురించి పట్టించుకొని నిర్లక్ష్యం వంటి భావనల ప్రేరణతో  వచ్చే విశృంఖలత్వం  సమాజ నిర్భందాల నుండి కూడా జన్మించవచ్చు. దానికి నిదర్శనమే 1905 లో కురియేదతు తాట్రీ  ట్రయల్. ఇది  కేరళ బ్రాహ్మణ వ్యవస్థను కుదిపేసింది. 19 వ శతాబ్దపు చివరి దశలో మరియు 20 వ శతాబ్దాపు తొలి దశలో కేరళలో నాయిర్ ,క్షత్రియ జాతికి చెందిన స్త్రీలు ఒకరి కంటే ఎక్కువ మంది మగవారితో సంబంధాలు పెట్టుకోవచ్చు. అలా ఉన్న మగవారికి జీత,భత్యాలు ఉండేవి. నంబుద్రి బ్రాహ్మణ పురుషులతోనే సంబంధం పెట్టుకునేవారు. వీరి దగ్గరికే మగవారు రావాలి తప్ప, వీరు పురుషుల ఇంటికి వెళ్లరు. ఈ సంప్రదాయాన్ని ‘సంబంధం’ అంటారు. ఇది చట్టబద్ధమైనదే. అలాగే పురుషులు ఒక్క పరాయి నంబుద్రి స్త్రీలతో తప్ప ఎవరితో సంబంధం పెట్టుకున్నా సరే అది తప్పు కాదు.

            కేరళలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. నంబుద్రి బ్రాహ్మణ స్త్రీలను అంతర్జానం అంటారు. అంటే ఇంటి లోపల ఉండేవారు అని. అంటే వారికి బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. నంబుద్రి బ్రాహ్మణ పురుషుడు ఎన్ని వివాహాలు చేసుకున్నా తప్పు లేదు. కానీ స్త్రీ మాత్రం ఆ పురుషుడిని తప్ప ఇంకెవరిని కన్నెత్తి కూడా చూడకూడదు. అలా భర్త ప్రేమ కోసం సవతుల మధ్య ఉండే పోరు, కొందరు వయసులో ఉన్నప్పుడూ ముసలి వారికిచ్చి వివాహం చేయడం వల్ల వైధవ్యం అనుభవించాల్సి రావడం, పెళ్ళిళ్ళు కాకపోతే అలాగే ఉండిపోవడం ఇవన్నీ నంబుద్రి బ్రాహ్మణ స్త్రీ జీవితంలో భాగాలు. కానీ నంబుద్రి బ్రాహ్మణ స్త్రీ ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటే వారిద్దరిని భ్రష్టులుగా ప్రకటించి, ఆ స్త్రీని ,పురుషుడిని వెలి వేస్తారు. ఆ చోటు వదిలి వెళ్లిపోవాలి. ఇంకే బ్రాహ్మణ కార్యక్రమాల్లో ఆ పురుషుడు పాల్గొనకూడదు. స్త్రీ కూడా ఆ ప్రదేశం దాటి వెళ్ళిపోవాలి. ఇది కేవలం నంబుద్రి స్త్రీ సంబంధం పెట్టుకుంటే మాత్రమే

          ఇటువంటి పరిస్థితుల్లో ఓ వివాహమైన నంబుద్రి మహిళా తమ పట్ల సమాజంలో జరుగుతున్న అన్యాయం మీద కక్ష సాధించడం కోసం 64 మంది ఎవరితే గొప్ప వారు ఉన్నారో వారితో సంబంధం పెట్టుకుంది. ఫలితంగా వారందరూ ఆమెతో సహా బహిష్కరించబడ్డారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె కురియేదతు తాట్రీ. ఈ సంఘటన ఆధారంగా మలయాళీ రచయిత  మతంపు  కున్హుకుట్టన్  ‘భ్రష్ట్ ‘నవల రాశారు. దీనిని ఆంగ్లంలోకి ‘OUTCASTE’      గా వాసంతి శంకరనారాయణన్ అనువదించారు. ఈ నవలలో మలయాళ సమాజం 19 వ శతాబ్దపు మలి దశలో ,20 వ శతాబ్దపు తొలి దశలో ఎలా ఉండేదో ,నంబుద్రి స్త్రీలు,ఇతర స్త్రీలు ,నంబుద్రి బ్రాహ్మణులు, మిగిలిన వారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన నియమాలు  ఉన్నప్పటికి అవి ఒక్క నంబుద్రి బ్రాహ్మణ స్త్రీలకు మాత్రం ఎంత క్రూరంగా ఉండేవో మన కళ్ళకు కట్టినట్టు రాశారు రచయిత.ఓ సమాజ ఆచారంలో వివక్షత, కొందరికి ఆ విశృంఖల స్వేచ్చ ఉంది కొందరిని నిర్బంధిస్తే కూడా ఆ నిర్బంధనే విశృంఖలత్వానికి మూలం అవుతుందని ఈ ట్రయల్ నిరూపిస్తుంది.

            ఇలా చెప్పుకుంటూ పోతే ఆధునిక సాహిత్యంలో ఎన్నో రచనలు విలక్షణత- విశృంఖలత్వం మధ్య నిలబడిన సన్న గీత మీద పయనం చేస్తూ ఉన్నాయి. నేటి తెలుగు రచనల్లో మాత్రం స్త్రీ కేంద్ర సమస్యల నుండి ఉద్భవించే విశృంఖలత్వం మాత్రం అధికంగా ఉంది. దీనికి కారణం కొన్ని పరిస్థితుల్లో స్త్రీల సాధికారత గురించి ఎంతో ఉన్నత భావాలను ప్రదర్శించే వారు కూడా తమ వ్యక్తిగత జీవితాల్లో ఆ ఆదర్శాలను పాటించకపోవడం వల్ల.

            ఇక రచయిత వ్యక్తిగత స్పృహ,సాహిత్య స్పృహ కూడా వారి రచనాచిత్రణలో ప్రధాన భూమికను పోషిస్తుంది. ఓ రచయితకు వినూత్నమైన ఆలోచన వచ్చినా, దాని పట్ల ఆ రచయితకు ఉండే సానుకూల లేదా ప్రతికూల దృక్కోణాలు ఆ రచయిత రచనలో ఆ అంశం పట్ల ఓ స్పృహగా మారతాయి. దీనిని వ్యక్తిగత స్పృహ అనవచ్చు. దీనితో పాటు ఆ రచనకు పాఠకులు  ఎలా స్పందిస్తారో  అనే భావన మనసులో ఎక్కడో అంతర్లీనంగా సాహిత్య స్పృహకు దోహదం చేస్తుంది. అంతే కాకుండా ఆ రచనల్లో భావాలనే తమ జీవితంలో యధార్ధంగా పాఠకులు భావిస్తారనే స్పృహ అధికమవ్వడం వల్ల కూడా వినూత్న ఆలోచనలు ఉన్న రచయితలు కూడా సంశయానికి గురవుతారు. 

            రచన ఇలా ఉంటేనే బావుంటుంది అని ఎవరు నిర్దేశించకపోవడమే విలక్షణతకు మార్గం చూపుతుంది. కానీ ఓ రచనను మలిచేటప్పుడు రచయిత ఓ న్యూట్రల్ గ్రౌండ్ తీసుకుంటేనే రచనల్లోని విలక్షణత అయినా, విశృంఖలత్వమైనా సరే పాఠకులను ఆలోచింపజేస్తుంది.

                       *     *     *

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

అనుభూతుల మజిలీ