జీవితంలో జరిగింది మార్చగలిగితే ?

 జీవితంలో జరిగింది మార్చగలిగితే ? 

        -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)



  జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో తమకు జీవితంలో అదే సమయం వెనక్కి వస్తే తప్పకుండా ప్రస్తుతం కంటే తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుని ఇంతకన్నా మెరుగైన జీవితం గడుపుతాము అనే భావన కచ్చితంగా కలిగే ఉంటుంది. అలా జీవితంలో వెనక్కి వెళ్ళి తీసుకున్న నిర్ణయాన్ని మార్చగలిగే అవకాశం ఓ వ్యక్తికి వస్తే అతను ఆ అవకాశం వల్ల జీవితంలో సంతోషంగా ఉన్నాడా? లేదా ? అనే అంశంతో తీసిన రష్యన్ సినిమానే మిలియనీర్. 

    కిరిల్ మకారోవ్, అతని  క్లాస్ మేట్ విక్టోరియా  ప్రేమించుకుంటారు. విక్టోరియా   గొప్ప వ్యాపారవేత్త  కూతురు. కిరిల్ మంచి ఆర్కిటెక్ట్. విక్టోరియా తండ్రి కంపెనీకు ఇంటర్ వ్యూకి వెళ్తాడు కిరిల్. కిరిల్ ఆ ఉద్యోగానికి వెళ్లబోయే ముందు విక్టోరియాను రికమెండ్ చెయ్యవద్దని చెప్తాడు. ఇంటర్వ్యూకి కిరిల్ వెళ్ళాక అతని ప్రాజెక్ట్ ను ఇంటర్వ్యూ ప్యానల్ తిరస్కరిస్తుంది. విక్టోరియా కిరిల్ వద్దన్నప్పటికీ రికమెండ్ చెయ్యడంతో రిజెక్ట్ చేసిన ప్యానల్ కూడా అతన్ని మళ్ళీ  సెలక్ట్ చేస్తుంది. జరిగిన విషయం కిరిల్ కు కూడా అర్ధమవుతుంది. 

ఆ రోజు సాయంత్రం విక్టోరియా ఇంటికి పార్టీకి వెళ్తాడు కిరిల్. అక్కడ వెయిట్రెస్ గా ఉన్న లీనా అనుకోకుండా గ్లాసు అందిస్తూ పడబోతుంటే ఆమెను కిరిల్ పట్టుకుని  ఆపే క్రమంలో అతని సూట్ పాడవుతుంది. విక్టోరియా లీనాను తిడుతుంది. దానితో లీనా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కిరిల్ సిగరెట్ కాలుద్దామని బయటకు వెళ్తే అక్కడ లీనా కనిపిస్తుంది. అతని సూట్ ఉతికి ఇస్తానని తన ఫోన్ నంబర్ ఇస్తుంది.అలా వారిద్దరికి పరిచయం ఏర్పడుతుంది. 

పార్టీకి తిరిగి వచ్చిన కిరిల్ విక్టోరియాకు బ్రేకప్ చెప్తాడు. కిరిల్ లీనాను ,లీనా స్నేహితురాలు లారా, కిరిల్ స్నేహితుడు ఒలెగ్ వివాహం చేసుకుంటారు. పదేళ్ళ తర్వాత కిరిల్ ఏ  ఉద్యోగం చేయకుండా లీనా మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాడు. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ తో ఎక్కడికి తన మోడల్స్ కూడా పంపడు. లారా ఓ రచయితగా స్థిరపడతానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కిరిల్ ఓ సారి కాలేజ్ రీ యూనియన్ ఫంక్షన్ కు వెళ్తాడు. అక్కడ విక్టోరియా కనిపిస్తుంది. 

కిరిల్ ఆ పార్టీ నుండి బయటకు వస్తుంటే ఓ టాక్సీ ఆగి అతనికి లిఫ్ట్ ఇస్తుంది. ఆ టాక్సీ డ్రైవర్ ఓ స్త్రీ. ఆమెతో మాట్లాడుతూ జీవితంలో ఇంకో అవకాశం ఉంటే పదేళ్ళ క్రితం విక్టోరియాను వదులుకునేవాడిని కాదని చెప్తాడు. అలాగే అదే జరుగుతుందని ఆ డ్రైవర్ అంటుంది. అతను నిద్రపోతాడు. లేచేసరికి కారు డ్రైవర్ సీటులో ఎవరూ ఉండరు. యాక్సిడెంట్ అవుతుంది. 

కళ్ళు తెరిచేసరికి విక్టోరియా ఇంట్లో ఉంటాడు. అతనికి ఆమెతో పదేళ్ళ క్రిందటే వివాహం అతను ఆ కంపెనీకి సియిఓ అయ్యాడని అతనికి గుర్తు  చేస్తుంది విక్టోరియా. ఆ రోజు అతని బర్త్ డే పార్టీ ఉందని కూడా గుర్తు చేస్తుంది. మిలియనీర్ గా అతనికి ఆ జీవితం నచ్చుతుంది. కానీ భార్య ద్వారా కెరియర్ కోసం అతను పిల్లలు వద్దనుకున్నాడని తెలుసుకుంటాడు. అతని ప్రాణ స్నేహితుడైన ఒలెగ్ ను కూడా అతను మిలియనియర్ అయ్యాక పట్టించుకోలేదని తెలుసుకుంటాడు. 

అదే క్రమంలో లారా పెద్ద రచయిత్రి అయ్యిందని , ఆ రోజు యాక్సిడెంట్ లో ఆమె కాళ్ళు పోయాయని, ఆమె ఫ్రెండ్ లీనా మరణించిందని తెలుస్తుంది.అతనికి అప్పటి వరకు నచ్చిన ఆ జీవితం ఈ  విషయాలు అన్నీ తెలిసేసరికి నచ్చదు. అదే రోజు కాలేజ్ రీయూనియన్ ఉందని తెలియడంతో అదే సమయంలో కారు తీసుకుని వెళ్తాడు,యాక్సిడెంట్ అవుతుంది. 

కళ్ళు తెరిచేసరికి హాస్పటల్ లో ఉంటాడు. భార్యా లీనా, కొడుకు ,ఒలెగ్ ,లారాలను చూసి సంతోషపడతాడు. తన మోడల్ పంపాలని నిర్ణయించుకుంటాడు. 

జీవితంలో తీసుకున్న నిర్ణయాలను మార్చే శక్తి ఎవరికి లేదు. కానీ ఏ నిర్ణయం తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక దాని వల్ల వచ్చే లాభనష్టాలు అనుభవించాల్సిందే. ఒక్కసారి తీసుకున్న నిర్ణయాన్ని మనకు సంతృప్తి, సంతోషం ఇచ్చేలా ఎలా మలుచుకున్నాము అనేదే ముఖ్యం అని  తెలిపే సినిమా ఇది. 

     *    *   * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!