ఎలుక స్వేచ్చ

 చదువరి

ఎలుక స్వేచ్చ

  -రచనశ్రీదత్త(శృంగవరపు రచన)



బాల సాహిత్యంలో ఉన్న ఓ కొత్త కోణం ఏమిటంటే మనకు హాని కలిగించకుండా జీవించే జంతువుల లోకాన్ని బాలల లోకంలో కలిపి, ఆ బాలల-జంతువుల మధ్య ఉండే భావోద్వేగ బంధాన్ని పాఠకులకు పరిచయం చేయడం. అలాంటి జంతువుల్లో ఎక్కువ శాతం ఎలుకలు, పిల్లులు, కుక్కలని రచయితలు ఎక్కువగా తీసుకోవడం జరిగింది. అటువంటి ఓ ఎలుక కథే అమెరికన్ బాల మరియు యువ సాహిత్య రచయిత్రి  బెవర్లీ క్లియరీ రాసిన ‘Run Away Ralph.’

రాల్ఫ్ ఓ చిన్న ఎలుక. మౌంటెయిన్ వ్యూ ఇన్ అనే హోటల్ లో నివసిస్తూ ఉంటుంది. ఆ హోటల్ లో ఉన్న కేత్ అనే అబ్బాయి రాల్ఫ్ కు ఎలుక పరిమాణంలో ఓ ఎర్ర మోటార్ సైకిల్ ను బహుమతిగా ఇస్తాడు. ఆ హోటల్ దగ్గర్లో బాల బాలికల కోసం క్యాంప్ ఉండటం వల్ల ఆ క్యాంప్ కు వెళ్లడానికి వచ్చిన వారంతా ఆ హోటల్ లోనే దిగేవారు. రాల్ఫ్ రాత్రుళ్లు అందరూ నిద్ర పోయాక ఆ మోటార్ సైకిల్ మీద హెల్మెట్ కూడా పెట్టుకుని ఆ హోటల్ లాబీలో రైడ్ చేసేవాడు. ఆ హోటల్ కు గార్ఫ్ అనే బాలుడు తల్లిదండ్రులతో వస్తాడు. అతను ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టడతాడు.

            ఆ రోజు రాత్రి రాల్ఫ్ అందరూ నిద్రపోయాక మోటార్ సైకిల్ మీద చక్కర్లు కొడుతున్న సమయంలో రాల్ఫ్ అంకుల్ లెస్టర్, తల్లి ,అన్నదమ్ములు,కజిన్స్ అందరూ వస్తారు. అంకుల్ లెస్టర్ మరియు రాల్ఫ్ తల్లి రాల్ఫ్ అలా ఓ హోటల్ లో ఉండటం ఏం బాలేదని, తమతో కలిసి ఉండమని, ఆ మోటార్ సైకిల్ మీద రాల్ఫ్ మిగిలిన వారిని కూడా ఎక్కించుకుని తిప్పాలని, స్వార్ధంగా ఉండకూడదని లెక్చర్లు ఇస్తారు. ఆ రాత్రి లెస్టర్ బాధ పడలేక వారందరినీ ఆ మోటార్ సైకిల్ మీద ఎక్కి తిప్పుతాడు రాల్ఫ్. ఉదయం అయ్యేసరికి వారు వెళ్ళిపోతారు. రాల్ఫ్ వాళ్ళ హితబోధనలకు చిరాకు పడి తన జీవితం వాళ్ళ లాగా సాధారణంగా ఉండకూడదని  రిస్క్ ,ఎక్సైట్మెంట్ తో ఉండాలని కోరుకుని అక్కడి నుండి వెళ్ళిపోవాలని జీవితాన్ని ఆస్వాదించాలని నిర్ణయం తీసుకుంటాడు.

            ఆ రోజంతా ఉండి, తర్వాతి రోజు ఆ మోటార్ సైకిల్ తో ఆ హోటల్ నుండి బయట పడతాడు. ఎప్పటి నుండో క్యాంప్ కు వెళ్ళాలని కోరుకున్న రాల్ఫ్ అక్కడికి వెళ్తాడు. అక్కడ శ్యామ్ అనే కుక్క కాపలా కాస్తు ఉంటుంది. రాల్ఫ్ ను లోపలకు వెళ్లడానికి అనుమతించదు. అక్కడ ఉన్న క్యాట్సి అనే పిల్లి రాల్ఫ్ ను తినే ప్రయత్నం చేస్తుండగా గార్ఫ్ కాపాడి ఓ కేజ్ లో రాల్ఫ్ ను ఉంచుతాడు.

             తర్వాత ఇంకో అమ్మాయి రోడెంట్ జాతికి చెందిన చమ్ ను కూడా కేజ్ లో ఉంచి పెంచు ఉంటుంది. రాల్ఫ్ కు కేజ్ లో ఉండటం నచ్చదు. తన మోటార్ సైకిల్ తీసుకుని మళ్ళీ తన పాత హోటల్ కు వెళ్లిపోదామనుకుంటాడు.మధ్యమధ్యలో క్యాట్సి  రాల్ఫ్ ను తినే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడూ శ్యామ్ కాపాడుతూ ఉంటుంది.

            ఓ రోజు కరేన్ అనే అమ్మాయి ఏదో పని చేసుకుంటూ తన వాచ్ ను రాల్ఫ్ కేజ్ పైన పెడుతుంది. తర్వాత ఆమె వాచ్ మర్చిపోతుంది. అదే సమయంలో రాల్ఫ్ ను తినడానికి స్క్రీన్ గుండా లోపలికి వచ్చిన క్యాట్సి ఆ గడియారాన్ని జంతువుగా భ్రమించి దాన్ని తీసుకువెళ్తుంది. అదే సమయంలో ఎవరో రావడంతో ఎక్కడైతే రాల్ఫ్ మోటార్ సైకిల్ బ్యాంబు ఆకుల మధ్య ఉందో అక్కడ ఆ వాచ్ ను జారవిడుస్తుంది. కరేన్ తర్వాత వచ్చి చూసినప్పుడు  ఆ వాచ్ కనిపించకపోవడంతో రోజు రాల్ఫ్ కు భోజనం పెట్టడానికి వచ్చే గార్ఫ్ ను అందరూ అనుమానిస్తారు.

            రాల్ఫ్ తన మోటార్ సైకిల్ ను గార్ఫ్ తీసుకుని తన దగ్గర ఉంచుకోవడం చూస్తాడు. వాచ్ విషయంలో జరిగింది గార్ఫ్ కు రాల్ఫ్ చెప్పి, తన మోటార్ సైకిల్ తనకు ఇచ్చి, తనను విడిపిస్తే ఆ వాచ్ ను కరేన్ దగ్గరకు చేర్చి గార్ఫ్ మీద ఉన్న అనుమానం పోయేలా చేస్తానని మాట ఇస్తాడు రాల్ఫ్. దానికి గార్ఫ్ అలా చేస్తే రాల్ఫ్ కు మోటార్ సైకిల్ ఇవ్వడంతో పాటు ఆ హోటల్ లో వదిలేస్తానని చెప్తాడు. చెప్పిన మాట ప్రకారం రాల్ఫ్ ఆ వాచ్ ను కరేన్ బ్యాగ్ లోకి చేరుస్తాడు. దానితో గార్ఫ్ మీద ఉన్న అనుమానం పోతుంది. గార్ఫ్ కూడా తాను ఇచ్చిన మాట నెరవేర్చడంతో కథ ముగుస్తుంది.

            జంతువుల మనసుల్లోపలి కోణాలు పరిచయం చేయడం అంత తేలికైన పని కాదు. ఎందుకంటే వాటి కోణాల్ని పాఠకులు చదువుతున్నప్పుడు మరి ముఖ్యంగా కథలో మనుషులు కూడా ఉంటే ఆ మనుషుల -జంతువుల మధ్య భావోద్వేగాల వ్యత్యాసం కూడా కనిపించాలి. అందుకే అంతర్జాతీయ బాల సాహిత్య పఠనం వయసుతో నిమిత్తం లేకుండా పాఠకుల సృజనాత్మక శక్తిని పెంచుతుంది.

                           *      *      *

 

 

 


Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!