పాపం పిలిచింది
చదువరి
కొమ్మూరి సాంబశివరావు గారి సాహితీ సమీక్షావళి
పాపం పిలిచింది
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
ప్రముఖ డిటెక్టివ్ నవలా రచయితగా, తెలుగులో తొలి హారర్ రచయితగా ప్రసిద్ధి పొందిన కొమ్మూరి సాంబశివరావు గారి రచనల్లోని ఇంకో కోణం స్త్రీల స్వేచ్చ,వారి ప్రవర్తన,వారి జీవితాలపై వారి ఆలోచనల ప్రభావం. ఈ రచనల కోవకు చెందిన నవలే 'పాపం పిలిచింది'.
లలిత, ఉమా స్నేహితులు. లలిత ఇద్దరిలో అందగత్తె. ఉమ అనాకారి. మధ్యతరగతి కుటుంబం లలితదైతే ,కాస్త ధనికుల కుటుంబం ఉమది. లలిత వెంట శ్యామ్ అనే అతను పడేవాడు. లలిత బి.ఏ చదువుతూ ఉండేది. శ్యామ్ తో కొంతకాలం లలిత ప్రేమాయణం నడుపుతుంది. ఈ విషయాన్ని లలిత ఇంటికి మూడిళ్ళ అవతల ఉండే ఓ ముసలాయన చూస్తాడు. లలిత తనకు లొంగకపోయేసరికి ఆ విషయం లలిత తండ్రికి చెప్తాడు. లలిత శ్యామ్ ను పెళ్ళి చేసుకుంటానని తండ్రితో చెప్తుంది. ఆయన శ్యామ్ ను ఇంటికి తీసుకురమ్మంటాడు. శ్యామ్ ఈ విషయం తెలిసి అక్కడి నుండి పలాయనం చిత్తగిస్తాడు.
తర్వాత లలిత ఇదంతా చేసింది తన ఇంటికి దగ్గరలో ఉన్న ముసలాయనే అని భావించి, ఆయన మీద కక్ష తీర్చుకోవడం కోసం అతన్ని రెచ్చగొట్టి అందరిముందు తనపై అత్యాచారం చేయబోయాడని కేసు పెట్టి నాలుగేళ్ళు శిక్ష పడేలా చేస్తుంది. తర్వాత ఆమెకు ఏదో పెళ్ళి సంబంధం చూస్తారు. ఈ లోపు ఓ సారి ఆమె బయటకు వెళ్ళినప్పుడు రాజేశ్వర్ అనే వ్యక్తి ఆమెను కలుస్తాడు. శ్యామ్ తన దగ్గర పని చేసేవాడని, కేవలం వాంఛతో ఆమెతో ఉండి, పెళ్ళి మాట ఎత్తగానే బొంబాయి వెళ్ళిపోయాడని చెప్తాడు.
ఓ సారి బెంగుళూరు వెళ్తున్నప్పుడూ ఆమెను శ్యామ్ చూపించాడని, అప్పటి నుండే ఆమె మీద ప్రేమ కలిగిందని రాజేశ్వర్ చెప్తాడు. తనకు పెళ్లైయిందని, కానీ ఆమె కోసం ఓ ఇల్లు సగం రాయగలనని, బాగా చూసుకుంటానని, ఒకరి మీద ఒకరికి హక్కు ఉండకపోయినా,ఆమె తనతో ఉన్నంతకాలం ఇంకొకరితో సంబంధం పెట్టుకోకూడదని , అలా అయితే ఆ ఇల్లు తిరిగి ఇచ్చేయాలని చెప్తాడు. తనకు ఎలాగూ మంచి సంబంధం రాదని నిశ్చయించుకున్న లలిత అతనితో వెళ్ళిపోతుంది.
అక్కడ బాగానే ఉన్నా, యవ్వనంలో ఉన్న పనివాడితో ఆమె సంబంధం పెట్టుకుంటుంది. అది తెలిసిన రాజేశ్వర్ ఆమె నుండి ఇల్లు తీసేసుకుంటాడు. తనకు ఇంకో డబ్బున్న ఆసామిని పరిచయం చేయమని అడుగుతుంది లలిత రాజేశ్వర్ ని. గురవప్పను పరిచయం చేస్తాడు అతను. గురవప్ప నచ్చక అతన్ని వదిలించుకుంటుంది. ఆ పనివాడు ఆమె ఇంకొకరితో సన్నిహితంగా ఉండటం చూసి ఆత్మహత్య చేసుకుంటాడు. దానితో నిర్వీర్యంగా మారిన ఆమె డబ్బు కోసం వేశ్యలా మారిపోతుంది. రాజేశ్వర్ భార్య మరణిస్తుంది. తన వల్లే లలిత అలా అయిందన్న పశ్చాత్తాపంతో లలితను రాజేశ్వర్ వివాహం చేసుకోవడంతో నవల ముగుస్తుంది.
లలిత పాత్ర చిత్రణలో వాస్తవికత ఎంతమేరకు అనే విషయాన్ని విశ్లేషిస్తే మనిషిలోని విశృంఖలత్వం ,కక్ష సాధించాలన్న ఆలోచనలు ఆ వ్యక్తి మోసపోయినప్పుడే మొదలవుతాయి. శ్యామ్ మోసం చేయగానే అంతకు పూర్వం అదే ముసలాయన కోరిక నిరాకరించిన లలిత అతని మీద కక్ష సాధించడం దగ్గర మొదలుపెట్టిన ఆమె పయనం ఎక్కడ ఆమెను స్థిరంగా ఉండనివ్వలేదు. చివరకు వివాహంతో కథ సుఖాంతం అయినా మనిషి మనసులో నాటుకున్న జీవన శైలి మనిషిని అంతర్ముఖంగా వెంటాడుతూనే ఉంటుంది.
కొమ్మూరి సాంబశివరావుగారి రచనల్లో ముఖ్య లక్షణం వర్ణనలు, సాగతీతలు లేకుండా కథ చాలా వేగంగా పరిగెడుతూ ఉండడం. అందుకే ఎక్కడ బోర్ కొట్టదు. కానీ ఓ రకమైన గంభీర పఠనానికి అలవాటు పడ్డవారికి మాత్రం అంతగా నచ్చకపోవచ్చు. కానీ పాత్ర చిత్రణలో విశ్లేషణలు లేకుండా కేవలం త్వరితగతిన సంఘటనల క్రమంతో కొమ్మూరి సాంబశివరావు గారు పాత్ర వ్యక్తిత్వాన్ని నిర్మిస్తారు. ఏ రకమైన మూడ్ ఉన్నప్పటికీ కూడా తేలికగా చదివించే రచనలు ఆయనవి.
* * *

Comments
Post a Comment