మళ్ళీ ఎప్పుడో ! ఎక్కడో !
చదువరి
కొమ్మూరి సాంబశివరావు గారి సాహితీ సమీక్షావళి
మళ్ళీ ఎప్పుడో ! ఎక్కడో !
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
కొమ్మూరి సాంబశివరావు గారి రచనల్లో 'మళ్ళీ ఎప్పుడో!ఎక్కడో!' ఓ పాతికేళ్ళ అమ్మాయి కథ. తన విలువలను పాటిస్తూ నైతికంగా ఉన్నప్పటికీ పెళ్ళి కాకపోయేసరికి ఆమె తన నైతికతను పక్కన పెట్టి మోసపోయినా ,మళ్ళీ ఆమె జీవితంలో వసంతం చిగురించే పరిస్థితులు వచ్చినప్పటికీ ఆమె జీవితం ఎలా అంతమయ్యిందో తెలిపే నవలే ఇది.
మీనాక్షి పాతికేళ్ళ అమ్మాయి. బి.ఏ చదివి ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ఉంటుంది. ఆమె తల్లి బాల్యంలోనే మరణించింది. రూపం బాగానే ఉన్నప్పటికీ ఆమెకు సరైన పెళ్ళి సంబంధాలు రాక అవివాహితగానే ఉండిపోతుంది. డిగ్రీ చదువుతున్న సమయంలో జోసెఫ్ ను ప్రేమించినా, క్రిస్టియన్ అని అతన్ని నిరాకరిస్తుంది.
డిగ్రీ చదివే సమయంలో ఆమెకు రూపమతి అనే స్నేహితురాలు ఉండేది. అబ్బాయిలను తామే వెతుక్కుని, ఆకర్షించి హద్దులు దాటకుండా పెళ్ళి చేసుకునే వరకు తీసుకురావాలని ఆమె నమ్మకం. మీనాక్షి మొదటి నుండి మగవాళ్ళకు దూరంగా ఉండేది. పాతికేళ్లు వచ్చినా పెళ్ళి కాకపోయేసరికి రూపమతి సలహాపై ఆఫీసులో ఉన్న నాగరాజుతో చనువుగా ఉంటుంది. అతన్ని పెళ్ళి గురించి అడిగినప్పుడు తనకి అప్పటికే పెళ్లైపోయిందని చెప్తాడు. దానితో ఆ ఉద్యోగం నుండి వేరే దానికి మారిపోతుంది. ఆమె తండ్రి కూడా మరణిస్తాడు అనారోగ్యంతో.
30 ఏళ్ళు మీనాక్షికి. ఓ సారి జోసఫ్ వస్తాడు. అతనికి దగ్గరవ్వాలని ఆమె ప్రయత్నించినప్పటికీ, తనకి పెళ్ళి కుదిరిందని చెప్పి వెళ్ళిపోతాడు. ఓ సారి నాగరాజు వస్తే వాంచకు లొంగి ఆమె గర్భవతి అవుతుంది. అబార్షన్ చేయించుకోవడానికి ప్రయత్నించినా డాక్టర్ నిరాకరిస్తుంది. తర్వాత ఆ చోటు నుండి మారిపోతుంది.
ఆమెకు నాలుగు నెలల గర్భం. ఆ ఇల్లు పక్కవాటాలో ఉండే వసంత్ అనే రచయిత పరిచయం అవుతాడు. మీనాక్షి కన్నా మూడేళ్ళు చిన్నవాడైనప్పటికీ పెళ్ళి చేసుకుంటానంటాడు. మొదట అతనికి అభ్యంతరం చెప్పినా గర్భవిచ్చిత్తి చేసుకుని తర్వాత అతన్ని వివాహం చేసుకుందామనుకుంటుంది మీనాక్షి. దాని కోసం నాటు మందు తీసుకుంటుంది. ఆ రాత్రి నొప్పి భరించలేకపోతే వసంత్ డాక్టర్ ను తీసుకువచ్చి, ఇంజెక్షన్ ఇప్పిస్తాడు. అబార్షన్ అవ్వదు. తనని మోసం చేసిందన్న భావనతో వసంత్ ఆమె ఖర్చులకు డబ్బులు, ఉత్తరం పెట్టి వెళ్ళిపోతాడు.
అప్పటి నుండి జీవితం మీద నిరాశక్తి పెంచుకున్న మీనాక్షి తనకు కాన్పు సమయంలో మరణం రావాలని ప్రార్థిస్తూ గడుపుతూ ఉంటుంది. నెల రోజుల తర్వాత వసంత్ తిరిగి వస్తాడు. ఆమె తన మీద ప్రేమతోనే అలా చేసిందని అర్ధం చేసుకుని వివాహం చేసుకుంటాడు. ఒకవేళ తాను కాన్పులో మరణించినా మరో రూపంలో ఎప్పుడో, ఎక్కడో కలుసుకుంటానని అంటుంది అతనితో మీనాక్షి. ఆమెను పాపాయిలా చూసుకుంటాడు. మీనాక్షి భయపడినట్టే తల్లి,బిడ్డ ఇద్దరు కాన్పులో మరణిస్తారు.
మనిషి విలువలు ఏవైనప్పటికీ అవి పరిస్థితుల తాకిడికి తాళలేవనే అంతర్లీన భావన కొమ్మూరి సాంబశివరావుగారి రచనల్లో ప్రస్పుటంగా దర్శనమిస్తుంది. మనిషి కన్నా కూడా పరిస్థితులే బహు చెడ్డవనే తలంపు కూడా ఆయన నవలలు చదువుతుంటే అనిపించక మానదు. ముఖ్యంగా స్త్రీల జీవితంలో పరిస్థితుల ప్రభావమే వారి జీవితాలను ఊహించని మలుపులు తిప్పి కష్టాల పాలు చేస్తుందనే భావన కూడా ఈ రచనలో కనిపిస్తుంది.
* * *

Comments
Post a Comment