సమురాయ్ విధేయత

 సినీ సంచారం 

                                      సమురాయ్  విధేయత

                                                        -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


జపాన్ చారిత్రక  గాధల్లో 18 వ శతాబ్దంలో  అమరంగా నిలిచిపోయిన ఓ సంఘటనే తమ రాజును ఆత్మహత్య చేసుకునేలా చేసిన ఇంకో ప్రావిన్స్ రాజును తమ దగ్గర సరిపడినంత సైన్యం, ఆయుధాలు లేకపోయినప్పటికీ తమ రాజు ఆత్మ శాంతి కోసం ఆ విరోధి రాజును చంపిన 47 మంది సమురాయిల కథే సినిమాగా '47 రోనిన్ ' పేరుతో 2013 లో కార్ల్ రిన్స్ ను హాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయం చేసింది. ఈ సినిమా 2013 లో బాక్సాఫీసు వసూళ్లు చేసింది. ఇదే కథ అంతకు పూర్వమే 1928,1941,1956,1958,1961,1962,1965,1978 లలో సినిమాగా రూపొందినప్పటికీ కూడా ఈ సినిమా మళ్ళీ ఘన విజయం సాధించడం  ఆ కథ తీసిన శైలి ,కాల్పనికత సముపాళ్ళల్లో ఉండటం వల్లే అని చెప్పవచ్చు. 

1867 వరకు జపాన్ లో ఫ్యూడలిజం ఉంది. ఆ సమయంలో చక్రవర్తి నామమాత్రపు అధికారాలతో ఉండేవాడు. కమాండర్ ఇన్ చీఫ్ గా వ్యవహరించే  షోగన్ నిజానికి అన్ని అధికారాలు కలిగి ఉండేవాడు. కై సంకర జాతీయుడు. ఓ ఇంగ్లిష్ నావికుడికి ,జపనీస్ స్త్రీకి జన్మించిన వ్యక్తి. అతను ఎలా పుట్టి పెరిగాడో ఎవరికి తెలియదు. జపాన్ లో ఓ రాజ్యమైన అకో రాజైన అసానో ఓ సారి అతను గాయపడ్డప్పుడు అతను సమురాయ్ కాకపోయిన ఆదరిస్తాడు. కై జీవితం ఆ రాజ్యంలోనే గడిచిపోతూ ఉంది. అసానో రాజు కూతురైన మికా,కై ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 

లార్డ్ కిరా అనే రాజు అకో రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. అతని దగ్గర ఓ మంత్రగత్తే కూడా ఉండేది. షోగన్ అకో రాజ్యాన్ని సందర్శిస్తున్న సమయంలో పొరుగు రాజ్యమైన కిరా కూడా అక్కడికి షోగన్ తో పాటు వస్తాడు. రెండు రాజ్యాల మధ్య ఒక్కో యోధుడిని ఎన్నుకుని వారి మధ్య యుద్ధం ఏర్పాటు చేస్తారు. అసానో రాజ్యం నుంచి యుద్ధం చేయాల్సిన యోధుడి మీద మంత్రగత్తే మంత్రాన్ని ప్రయోగించడం వల్ల అతను యుద్ధం చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఆ రాజ్యాన్ని కాపాడటానికి సమురాయ్ కాకపోయినప్పటికి కై యుద్ధం చేయడానికి వెళ్తాడు. ముందు రోజే ఆ మంత్రగత్తే ను ఆ రాజ్యంలో గుర్తుపట్టి కై చెప్పినప్పటికి వారు అతని మాట లెక్కచేయరు. ఆ యుద్ధం లో కై మొహం చివరికి కనబడటం వల్ల అతనికి షోగన్ మరణ శిక్ష విధించినప్పటికీ మికా వద్దని వేడుకోవడంతో కొట్టి వదిలేయమని చెప్తాడు షోగన్. 

అదే మంత్రగత్తే సాయంతో మికా అపాయంలో ఉన్నట్టు ,కిరా ఆమెను బలాత్కరించబోతున్నట్టు భ్రమ కలిగిస్తాడు లార్డ్ కిరా. దానితో ఆ మాయలో ఉన్న అసానో అతన్ని చంపబోతాడు. నిరాయుధుడైన అతిధిని చంపబోయినందుకు మరణ శిక్ష విధిస్తాడు. కానీ ఆ రాజు  రాజ్యానికి ఎంత మంచి రాజో తెలిసిన షోగన్ ఆత్మహత్య (సెపుకో)చేసుకోమని ఆజ్ఞ ఇవ్వడంతో అలాగే మరణిస్తాడు అసానో. 

అతను మరణించేముందు  ఓయిషిని పిలిచి తన తర్వాత రాజ్యాన్ని చూసుకోమని చెప్తాడు అసానో. అసానో మరణం తర్వాత కిరా తన తండ్రి మరణించాడు కనుక తనకు వివాహం అయ్యేవరకు రాజ్యం బాధ్యతలు తాను స్వీకరిస్తానని షోగన్ ను అడుగుతుంది. అప్పటికే లార్డ్ కిరా ఆమెను వివాహం చేసుకోబోతున్నాడని ఇక రాజ్యం అతని అధీనంలో ఉంటుందని షోగన్ చెప్తాడు. అదే విధంగా ఆ రాజ్యంలో మిగిలిన వారెవరూ కూడా ఈ విషయంలో రాజు మరణం పట్ల ప్రతీకారం తీసుకోకూడని షోగన్ ఆజ్ఞ జారీ చేస్తాడు. 

షోగన్ వెళ్లిపోయాక లార్డ్ కిరా కై ను  డచ్ బానిసగా అమ్మేస్తాడు. ఒహిషోను ఓ నిర్బంధంలో సంవత్సరం వరకు ఉంచి తర్వాత వదిలేస్తారు. దానితో పాటు ఆ రాజ్యంలోని భూములు, ఆస్తులు సొంతం చేసుకుంటాడు లార్డ్ కిరా. అలాగే మికా తో వివాహానికి సిద్ధమవుతుంటాడు. 

సంవత్సరం తర్వాత వచ్చిన ఒహిషో తన రాజును మరణించేలా చేసిన లార్డ్ కిరా పట్ల ప్రతీకారం తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. మొదట కై ను బానిసల నుండి విడిపించి, తమ రాజ్యం లోని మిగిలిన రోనిన్ (మాస్టర్ లేని సమురాయ్ లు ,అసానో మరణించాడు కనుక )లతో కలిసి లార్డ్ కిరాను చంపి అతని  మీద ప్రతీకారం తీర్చుకుంటారు. అలా ఉన్న సమురాయిలు 47 మంది. కానీ షోగన్ ఆజ్ఞను ధిక్కరించినందుకు వారందరికి మరణ శిక్ష విధిస్తాడు షోగన్ . వారిలో ఒహిషో కొడుకైన చికారాను మాత్రం చివరిలో ఆ శిక్ష నుండి తప్పించి ఆ రాజ్యాన్ని పాలించమని చెప్తాడు. అలా మిగిలిన 46 మంది సెపుకో చేసుకుని మరణించడంతో కథ ముగుస్తుంది. 

ఈ సినిమాలో చూపించినట్టు మంత్రగత్తే  విషయం ఎంత వరకు నిజమో స్పష్టత చారిత్రకంగా లేదు. సమురాయ్ లకు ఉండే విధేయత ,తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నమ్మిన రాజు కోసం నిలబడే తత్వం ఈ చారిత్రక కథతో స్పష్టం అవుతుంది. అంతే కాదు ఎంత గొప్ప సమురాయిలు ఉన్నప్పటికీ వారికి మాస్టర్ లేదా రాజు లేకపోతే వారు ఎందుకు కొరగానివారే, వారి శక్తియుక్తులు దేనికి పనికి రావు అని కూడా ఈ కథ స్పష్టం చేస్తుంది. 

ఒక్కో దేశ రాజనీతి ఒక్కోలా ఉంటుంది. జపాన్ సంస్కృతి, వారి యోధుల పటిమ, రాజుల మధ్య ఉండే వైరుధ్యాలు ఇలా ఎన్నో కథలో ఇమిడి ఉన్నాయి. జపాన్ లోని ఓ  పాలన-పాలకుల కోణాన్ని ఈ కథ స్పష్టం చేస్తుంది. యోధులు గా ఉన్నప్పుడూ యుద్ధ ధర్మాన్ని పాటించక తప్పదు. ఆ స్పూర్తి యోధులను ఎప్పటికీ వీడిపోదు. అందుకే వారు రాజు మరణం తర్వాత తమ ధర్మాన్ని పాటించారు, ఆ రాజుకు సమురాయిలుగా. సామాజిక న్యాయం, రాజ్య న్యాయాలలో యోధుడు ఎప్పుడు రాజ్యం వైపే మగ్గు చూపుతాడు అనడానికి నిదర్శనమే ఈ ఉదంతం. 

           *     *     * 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ