లైంగికత -నిరంకుశత్వం
సినీ సంచారం
లైంగికత -నిరంకుశత్వం
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
ఎయిడ్స్ ,హోమోసెక్సువాలిటీ లను అంగీకరించే సమాజం ఇప్పటికీ పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉందని చెప్పలేని పరిస్థితుల్లో ఉంది మన నాగరిక నడత. 21 వ శతాబ్దంలో ఈ పరిస్థితి ఇలా ఉంటే 20 వ శతాబ్దం అంటే 1980ల సమయంలో వీటి మీద ప్రజల అభిప్రాయాలు ఎంత వ్యతిరేకంగా ఉండి ఉంటాయో ఊహించవచ్చు. అటువంటి పరిస్థితుల నేపథ్యంతో ''సైలెన్స్ ఆఫ్ ద లాంబ్స్ '' వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన జోనాథన్ డెమ్మి దర్శకత్వంలో1993 లో వచ్చిన సినిమానే ఫిలడెల్ఫియా.
యాండ్రు బెకెట్ ఫిలడెల్ఫియా లో ఉన్న అతి పెద్ద లా ఫర్మ్ లో సీనియర్ అసోసియేట్ గా పని చేస్తూ ఉండేవాడు. వ్యక్తిగతంగా అతను హోమోసెక్సువల్ (గే ),ఆ విషయం ఆ కంపెనీలో ఎవరికి తెలియదు. అతనికి ఎయిడ్స్ వస్తుంది. లాయర్ గా అతను చాలా సమర్ధవంతుడు. ఓ రోజు కంపెనీలో ఓ పార్టనర్ యాండ్రు నుదుటి మీద ఓ దద్దురు ఏదైతే ఎయిడ్స్ రోగుల్లో ఓ లక్షణంగా ఉంటుందో అది గమనించి అడిగితే రాకెట్ బాల్ తగిలిందని చెప్తాడు. అతనికి ఎయిడ్స్ ఉందని తెలుసుకున్న ఆ ఫర్మ్ అతన్ని తొలగించడానికి ఆ కేసు విషయంలో ఫైల్ మిస్సయినందుకు అతను సమర్ధవంతుడు కాదని భావించి తొలగిస్తున్నామని చెప్పి అతన్ని ఉద్యోగంలో నుండి తీసేస్తారు. కానీ నిజమైన కారణం తనకు ఎయిడ్స్ ఉండటం వలన ,తను హోమోసెక్సువల్ అవ్వడం వల్ల అని అర్ధం చేసుకుంటాడు యాండ్రు.
అలా వివక్షత ప్రదర్శించడం లా ప్రకారం నేరం అవ్వడం వల్ల తన కేసు వాదించమని 9 మంది లాయర్లను సంప్రదించినా వారు నిరాకరిస్తారు. ఆఖరికి పర్సనల్ ఇంజూరీ లాయర్ అయిన జో మిల్లర్ దగ్గరికి వెళ్తాడు ,అతను కూడా నిరాకరిస్తాడు. ఈ సంఘటన తర్వాత జో తనకు ఎయిడ్స్ వస్తుందేమోనని కనుక్కోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ ఎయిడ్స్ అలా సంక్రమించదని చెప్తాడు.
తన కేసు ఎవరు తీసుకోకపోవడంతో తనే తన కేసు వాదించుకోవడానికి నిర్ణయించుకుని లైబ్రరీకి రిఫరెన్స్ కోసం వెళ్తాడు. అదే లైబ్రరీకి జో కూడా వస్తాడు. హెచ్ ఐ వి వివక్షత గురించి యాండ్రు అడిగిన పుస్తకం లైబ్రెరియన్ ఇస్తాడు. కానీ అక్కడ ఉన్నవారంతా యాండ్రు వైపు ఇబ్బందిగా చూస్తూ ఉండటంతో అతన్ని ప్రైవేట్ రీసెర్చ్ రూమ్ కు వెళ్ళమని సలహా ఇస్తాడు లైబ్రెరియన్. కానీ యాండ్రు దానికి ఒప్పుకోడు.ఇదంతా గమనించిన జో తనను జాతి (నల్ల జాతీయుడు ) రీత్యా ఎలా వివక్షకు గురి చేశారో గుర్తుకు వచ్చి, యాండ్రు పరిస్థితి అర్ధం చేసుకుని అతని కేసు వాదించడానికి ఒప్పుకుంటాడు.
ఈ కేసు ట్రయల్ కు వస్తుంది. చివరకు అతనికి భారీ మొత్తంలో నష్టపరిహారం వచ్చేలా జో వాదిస్తాడు. ఆ తర్వాత యాండ్రు మరణిస్తాడు. కానీ ఈ కేసు ట్రయల్ లో ఉన్నప్పుడూ ప్రజల స్పందనలు, ఈ మొత్తం ప్రక్రియలో మనుషుల మనసుల్లో ఎయిడ్స్ అంటే ఎంత భయమో ,హోమోసెక్సువల్స్ అంటే అంతే అసహ్యం ఉండటం ఇవన్నీ కూడా నాటి పరిస్థితులకు దర్పణంగా నిలుస్తాయి. అప్పటికే యాండ్రు మిగెల్ అనే అతనితో సంబంధం కొనసాగిస్తున్నాడు. ట్రయల్ లో ఉన్నప్పుడూ ప్రత్యర్ధి లాయర్ అతన్ని గే పోర్నగ్రాఫిక్ సినిమాలకు వెళ్ళారా ? అక్కడ ఆ హాల్ లో సెక్స్ చేశారా ? వంటివి ప్రశ్నించడం ,యాండ్రు నిజాయితీగా అవునని సమాధానం చెప్పినా అతని పట్ల అందరూ చూసే అసహ్యకరమైన చూపులు ,ప్రజల్లో హోమో సెక్సువల్స్ పట్ల వ్యతిరేకత ఉండటం ఇవన్నీ నాటి సమాజంలో మనుషుల లైంగిక అభిప్రాయాల నిరంకుశత్వం గురించి ప్రశ్నించాల్సిన అంశాలు . ఈ కేసు వాదించిన జోను కూడా హోమో సెక్సువల్ గా భావించడం వంటి ప్రభావాలు కూడా నాడు మనుషుల్లో లైంగిక అంతరానితనం ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
హోమోఫోబియా అంటే హోమోసెక్సువల్స్ పట్ల వ్యతిరేకత కలిగి ఉండటం. ఈ సినిమా హోమోఫోబియా ,ఎయిడ్స్ వంటి వాటి పట్ల నాటి సమాజం ఎంత నిరంకుశంగా వ్యవహరించేదో తెలుపుతుంది. ఈ సినిమాలో ఉన్న సంఘటనలు దాదాపు 54 సీన్ల వరకు జెఫ్రీ బోయర్స్ జీవితంలో జరిగినవే అని ఆ కుటుంబం ఆరోపించింది. జెఫ్రీ బోయర్స్ అనే లాయర్ ని ఎయిడ్స్ కారణం గా ఉద్యోగంలో నుండి తీసేస్తే ,అతను ఆ లా ఫర్మ్ మీద కేసు పెట్టి గెలిచాడు. అతని మరణం తర్వాత అతని కుటుంబాన్ని ,లాయర్లను స్కాట్ రూడిన్ అనే నిర్మాత ఇంటర్వ్యూ చేశాడని , ఆ సినిమాలో చాలా సంఘటనలు వాటి ఆధారంగానే వచ్చాయని బోయర్స్ కుటుంబం ఆరోపించింది .కానీ రూడిన్ ఆ ప్రాజెక్టును వదిలేశాడని ,అతను ఏ సమాచారం ఇవ్వలేదని చెప్పినప్పటికీ కూడా ఆ సినిమా మాత్రం బోయర్స్ జీవితం ఆధారంగానే నిర్మించబడింది అనే భావన మాత్రం ఉంది.
ఈ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. హాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఎయిడ్స్ ,హోమోసెక్సువాలిటీ గురించి వచ్చిన వచ్చిన సినిమాల్లో ఇది కూడా మొదటి సినిమాల్లో ఒకటి. ఈ సినిమాలో యాండ్రు గా నటించిన టామ్ హ్యాంక్స్ కు ,ఈ సినిమాలో '' స్ట్రీట్స్ ఆఫ్ ఫిలడెల్ఫియా" పాట రాసిన బ్రూయిస్ స్ప్రింగ్ స్టీన్ కు ఏకాడమీ అవార్డులు ,గోల్డెన్ గ్లోబ్ అవార్డులతో పాటు ఇంకెన్నో పురస్కారాలు కూడా వచ్చాయి.
లైంగికత పట్ల గోప్యత, లైంగకతలో వైవిధ్యం ఆహ్వానించలేకపోవడం వంటివి నేటికీ ఉండిపోయిన అంశాలే. అది వ్యక్తిగత అభిప్రాయాలకు సంబంధించింది అయినప్పటికీ కూడా సమాజం దానిని సమిష్టి నిర్ణయంగా మారిస్తే మాత్రం అది నిరంకుశత్వమే.
* * *

Comments
Post a Comment