సంగీత కుటుంబం

 సినీ సంచారం

సంగీత కుటుంబం 

                                       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 


      తెలుగులో మన పాత సినిమాలను ఆణిముత్యాలుగా పరిగణిస్తాము. కాలంతో  పాటు సినిమా నడత,శైలులు కూడా మారాయి. ఆ మార్పులకు కారణం  జనరేషన్ లలో వచ్చే మార్పులు, నాగరికత కొత్త పుంతలు తొక్కడం కావచ్చు. అలానే హాలీవుడ్ ఆణిముత్యాల్లో ఒకటైన సినిమానే 'The Sound Of Music' సినిమా. నేటి హాలీవుడ్ సినిమాలలో మనకు పాటలు ఎక్కడా కనిపించవు. కానీ పాత సినిమాల్లో ఆ సంస్కృతి ఉంది. ఈ సినిమా మరియా వన్ ట్రాప్ అనే స్త్రీ రాసిన తమ కుటుంబ జీవిత ఉదంతాల ఆధారంగా నిర్మించబడింది. వన్ ట్రాప్ సింగర్స్ అనే ట్రూప్ కుటుంబంలోని కొన్ని సంఘటనలకు దృశ్యరూపమే  ఈ సినిమా. ఈ సినిమాలోని పాటలు నిజంగా ఆణిముత్యాలే. పాటల నడతకు ఓ కొత్త శైలిని అద్దిన సినిమా ఇది. 

ఆస్ట్రియా లోని సాల్జ్బర్గ్ లో మరియా నన్స్ దగ్గర పెరుగుతుంది. ఆమె శైలి ప్రకృతితో మమేకమవ్వడం. జలపాతంలాంటి వేగం, ప్రకృతి లోని సంతోషం ఆమె సొంతం. ప్రకృతి ఆమె సంగీతానికి ప్రేరణ. ఆమె నన్ గా మారాలని నిర్ణయించుకుంటుంది. కానీ మరియా లో ఉన్న అల్లరి, చురుకుదనం వల్ల ఎంతోమందికి అది ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది . అందుకే సంస్థ  ప్రధాన నన్ మాత్రం ఆమె జీవిత గమ్యం కోసం వెతుక్కోమని సలహా ఇస్తుంది. అదే సమయంలో మరియాను ఆమె రిటైర్ అయిన నేవీ కెప్టెన్ జార్జ్ వన్ ట్రాప్ ఏడుగురు పిల్లలకు గవర్నెస్ గా వ్యవహరించమని పంపిస్తుంది. 

భార్య మరణించినప్పటి నుండి ఇంట్లో నవ్వులు, వినోద కార్యక్రమాలు కెప్టెన్ లేకుండా చేస్తాడు. దానికి కారణం భార్య జ్ఞాపకాలు ఉండకుండా ఉండటానికి. అందుకే అతి క్రమశిక్షణతో పిల్లలను పెంచుతాడు. మరియా కంటే ముందే ఎంతో మంది గవర్నెస్లు మారారు. పిల్లలు మొదట మరియాను అంగీకరించకపోయినా ఆమె లో ఉన్న ప్రేమ, ఆహ్లాదం వారిని క్రమక్రమంగా ఆకర్షిస్తుంది. వారికి పాటలు పాడటం నేర్పిస్తుంది. వారిలో ఒకరిగా కలిసిపోతుంది. 

ఇదే సమయంలో కెప్టెన్ ఎల్సా ను  పెళ్ళి చేసుకోవడానికి అప్పటికే నిర్ణయించుకుని ఉన్నాడు. కానీ మరియాను చూశాక అతని మనసు ఆమె వైపు ఆకర్షించబడుతుంది. కానీ ఆ విషయం పైకి చెప్పడు. మరియా కూడా అతన్ని ప్రేమిస్తూ ఉన్నా ఆమె కూడా ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోలేదు. అదే సమయంలో కెప్టెన్ పెళ్ళి చేసుకోవాలనుకున్న ఎల్సాను  తీసుకువస్తాడు. ఓ పార్టీ జరుగుతుంది. అందులో కెప్టెన్ మరియాతో కలిసి డ్యాన్సు చేయడం చూసిన ఎల్సా వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అని అర్ధం చేసుకుంటుంది. అదే విషయం మరియాను అడుగుతుంది. కానీ నన్ గా మారాలనుకున్న మరియా ఇది ఎక్కడికి దారి తీస్తుందేనని ఎవరికి చెప్పకుండా ఉత్తరం రాశి తిరిగి తన ప్రాంతానికి వెళ్ళి పోతుంది. 

కెప్టెన్ తాను ఎల్సాను పెళ్ళి చేసుకోబోతున్నానని ప్రకటిస్తాడు. పిల్లలు మరియా కోసం వెళ్ళినా ఆమె మాట్లాడటానికి నిరాకరిస్తుంది. తర్వాత ప్రధాన నన్ నచ్చచెప్పిన తర్వాత తిరిగి వెళ్తుంది.అప్పటికే పెళ్ళి నిశ్చయించబడినప్పటికీ కూడా మరియాను ప్రేమిస్తున్నానని గ్రహించిన కెప్టెన్ ఎల్సా కు అదే విషయం చెప్పి ఆ పెళ్ళి రద్దు చేయించి మరియా అంగీకారంతో ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. 

ఆ సమయంలో ఆస్ట్రియా ను జర్మనీ నియంతృత్వం నడుస్తూ ఉంది. కానీ కెప్టెన్ ఆస్ట్రియా జాతీయ పతాకాన్ని ఇంట్లో పెట్టుకోవడం చూసిన కొందరు ఆ విషయం జర్మనీ అధికారులకు తెలియజేయడంతో ఆ పతాకం తీసేసి జర్మనీ ది పెట్టమని  చెప్పడమే కాకుండా కెప్టెన్ ను జర్మనీ న్యావిలో పని చేయాలని ఆజ్ఞాపిస్తారు. అది కెప్టెన్ కు నచ్చదు. కుటుంబంతో సహా తప్పించుకోవాలని ప్రయత్నించినా జర్మనీ ఆధికారులు పట్టుకోవడం తో తమ కుటుంబం పబ్లిక్ లో పాడటం కెప్టెన్ కు ఇష్టం లేకపోయినా పాడటానికి వెళ్తున్నామని చెప్తాడు. ఏదో ఉత్సవం లో అలా పాడి మొత్తానికి వారి కన్ను గప్పి అక్కడి నుండి తప్పించుకుని స్విట్జర్ లాండ్ కు పయనం అవ్వడంతో సినిమా ముగుస్తుంది. 

  ఇక పాటల  విషయానికి వస్తే మొదట మరియా ప్రకృతి ప్రేమను ప్రదర్శించే పాట, మరియా ఎటువంటి అమ్మయో చెప్పడానికి నన్స్ పాడే పాట ,పిల్లలకు సంగీతం నేర్పించడానికి మరియా పాడిన పాట ,ఇలా సందర్భాలకు తగ్గట్టు మొత్తం 16 పాటలు ఉన్నాయి. మొత్తం మూడు గంటల సినిమా అయినప్పటికీ కూడా ఎక్కడ బోర్ కొట్టని సినిమా ఇది. ఓ మాస్టర్ క్లాసిక్ సినిమా ఇది. ఐదు ఏకాడమీ అవార్డులు ఇంకేన్నో అవార్డులు అందుకున్న ఈ సినిమా జూలీ ఆండ్రూస్ నటనకు చరిత్రలో స్థానం కల్పించింది. 

మరియా వన్ ట్రాప్ రాసిన 'The Story Of Trapp Family Singers' అనే పుస్తకం 1949 లో ప్రచురించబడి బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. దీని ఆధారంగా 1956,1958 లలో 'The Trapp Family','The Trapp Family Singers' అనే  జర్మన్ సినిమాలు వచ్చాయి. తర్వాత 1959 లో 'The Sound Of Music' రాబర్ట్ వైస్ దర్శకత్వంలో వచ్చింది. 

సినిమాలు చూసినప్పుడు కొన్ని సినిమాలు మంచి అనుభూతిని ఇస్తూ ,మనల్ని సేదతీరుస్తాయి. అటువంటి సినిమానే ఇది. సినిమాలో ఉన్న మంద్ర సంగీత స్వరం,లాలిత్య సలీలి ,పిల్లలతో మరియా ప్రవర్తనా ,కెప్టెన్ లో మార్పు రావడం ఇవన్నీ కూడా సినిమాను మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తాయి. అందుకనే ఈ సినిమా ఆల్ టైమ్ హాలీవుడ్ హిట్స్ లో ఒకటిగా మిగిలింది. 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ