రాజు -టీచర్

 సినీ సంచారం 

రాజు -టీచర్

                                       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 


            ఎన్నో హాలీవుడ్ సినిమాలు నిజ జీవిత సంఘటనల ఆధారంగా తియ్యబడి ఆస్కార్లు గెలుచుకున్నాయి. అటువంటి కోవకు చెందిన సినిమానే 1956 లో వచ్చిన ‘The King And I.’ తొమ్మిది ఆస్కార్లకు నామినేట్ చేయబడిన ఈ సినిమా ఐదు ఆస్కార్లు గెలుచుకుంది. అన్నా లూయిన్స్ రాసుకున్న  జ్ఞాపకాల ఆధారంగా మార్గరెట్ లండన్ 1944లో ‘Anna and the King of Siam’ అనే నవల రాసింది. అది అంతర్జాతీయ ప్రసిద్ధి పొందింది. ఈ నవల దాదాపు 20 భాషల్లోకి అనువదించబడింది. ఆ నవలనే వాల్టర్ లాంగన్  ‘The King And I’ సినిమాగా రూపొందించాడు.

            అన్నా లూయిన్స్ ఓ ట్రావెల్ రచయిత్రి ,టీచర్ మరియు సోషల్ యాక్టివిస్ట్ కూడా. సియామ్ రాజు (థైలాండ్ రాజు )మాంకట్ తన కొడుకులకు  నాగరిక విద్యను బోధించాలనే ఆహ్వానం మేరకు ఆమె తన కొడుకుతో అక్కడికి బయల్దేరడంతో సినిమా మొదలవుతుంది. రాజు ఆమెకు వేరే ఇల్లు ఇస్తానని ముందు చెప్పినా ఆమెను రాజభవనంలోనే ఉండమంటాడు. తనకు ఇష్టం లేకపోయినా ఉంటుంది అన్నా.

            మొదట కేవలం కొడుకులకు మాత్రమే అనుకున్నా, తన భార్యలకు కూడా విద్య బోధించమనడంతో వారికి కూడా అన్నా బోధిస్తూ ఉంటుంది. రాజు 39 భార్యలకు, 82 మంది పిల్లలకు ఆమె విద్యను బోధిస్తుంది. మాంకట్ తన రాజ్యం నాగరికంగా ఉండాలని, శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలనే ఆదర్శాలు కలవాడు.

            ఈ సినిమాలో మాంకట్ కు బర్మా నుండి కానుకగా ఆ యువరాణిని పంపిస్తారు. ఆమె తన రాజ్యంలో వ్యక్తిని ప్రేమిస్తుంది. చివరకు ఆమె అతనితో తప్పించుకోబోయినా ఆమెను పట్టుకుంటారు. అతను నదిలో పడి మరణిస్తాడు. రాజుల భార్యలుగా బ్రతకడం అంటే అది మనసును చంపుకుని బ్రతికే జీవితమే అని ఈ ఉదంతంతో అర్ధమవుతుంది.

            ఈ సినిమాలో మాత్రం కేవలం ఆమె బోధించడం, ఆ తర్వాత ఓ సారి బ్రిటిష్ నుండి వచ్చిన అధికారులతో ఎలా వ్యవహరించాలో రాజుకు నేర్పించడం ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే  బర్మా రాణి అలా చేసిందో ఆమెను కొట్టబోయిన రాజును మీరు అనాగరికులు అని అన్నా  అనడం,దానికి రాజు బాధ పడటం , ఆ తర్వాత రాజు అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది.

            అన్నాకు అక్కడ నచ్చక తిరిగి వెళ్లిపోదామని బయల్దేరాబోతుంటే రాజు పిలిపించడం,అన్నా అక్కడ ఉండటానికి ఒప్పుకోవడం, అదే సమయంలో తన తర్వాత యువరాజును రాజుగా ప్రకటించడం, ఆ రాజు మరణించడంతో సినిమా ముగుస్తుంది.

            కానీ నిజానికి ఆరేళ్లు అక్కడ అన్నా ఉన్న తర్వాత అనారోగ్యం కారణంగా తిరిగి బ్రిటన్ కు వచ్చేశాక, ఆమె మళ్ళీ రాజు దగ్గర రావడానికి ఒప్పందం చేసుకునే క్రమంలో ఉన్నప్పుడూ రాజు మరణిస్తాడు. ఆ తర్వాత రాజైన యువరాజు ఆమెతో ఉత్తరాల ద్వారా మంచి ఆత్మీయతను కొనసాగించినా ఆమెను రమ్మని మాత్రం ఆహ్వానించలేదు. రాజు తన విల్లులో అన్నా గురించి, ఆమె కొడుకు గురించి రాసినా సరే వారికి వారసత్వం మాత్రం రాలేదు.

            ఈ సినిమాలో పాటలు, సంఘటనల క్రమం, కథాంశం చిన్నదే అయినా సరే, రాజులకు ఉండే ఇగో గురించి, అక్కడి రాణుల జీవితాల గురించి ,హాస్యం -సంగీతం సమ్మేళనంతో చూపించిన సినిమా ఇది. సినిమా తీసిన స్థాయి కూడా ప్రశంసలు పొందింది. ఈ సినిమాతో ఆస్కార్ సాధించిన మాంకట్ పాత్రధారి యుల్  బ్రిన్నర్ ఇదే పాత్రను 4,625 సార్లు ప్రదర్శించి అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు.

            ఫీల్ గుడ్ మూవీస్ వర్గంలో ఎప్పటికీ నిలిచిపే సినిమా ఇది. రాజ్యం -రాజులు అనగానే ఓ గంభీరత ఉంటుంది. కానీ అటువంటి శైలిని ఎంతో ఆసక్తికరంగా ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ సినిమా నిర్మాణం ఉండటంతో అంతర్జాతీయ ప్రసిద్ధి పొందింది.

   *     *     *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ