హత్య చేసిన నిర్దోషి

 సినీ సంచారం 

              హత్య చేసిన నిర్దోషి 

                           -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



         హత్య చేస్తే నేరస్తులుగా భావించడం సహజం. కానీ చేయని హత్యానేరానికి శిక్షను అనుభవిస్తే, మళ్ళీ అదే వ్యక్తిని హత్య చేసినా అది నేరం కాదు. ఈ అంశాన్నే న్యాయ శాస్త్ర ప్రకారం 'Double Jeopardy' అంటారు. ఈ అంశాన్ని మూలంగా తీసుకుని ఓ క్రైమ్ థ్రిల్లర్ గా ఆస్ట్రేలియన్  దర్శకులు బ్రూస్ బెర్స్ ఫోర్డ్ 1999 లో  'యాష్లి జడ్ 'ను ప్రధానపాత్రధారిగా తీసిన సినిమానే ఈ ' 'Double Jeopardy.' కొన్ని సార్లు పుస్తకాలు మన ప్రపంచ పరిధిని విస్తీర్ణం చేస్తే ఇంకొన్ని సార్లు అదే పని సినిమాలు చేస్తాయి. అటువంటి కోవకు చెందిన సినిమానే ఇది. 

కథ పరంగా చూస్తే లిబ్బి,నిక్ భార్యాభర్తలు. ధనవంతులు. వారికి ఓ నాలుగేళ్ళ కొడుకు. భార్యను సర్ప్రైజ్ చేయడానికి ఓ షిప్ లో వీకెండ్ ఏర్పాటు చేస్తాడు నిక్. అర్ధ రాత్రి ఆమె లేచేసరికి నిక్ ఆమె పక్కన ఉండడు. బయటికి వచ్చి చూస్తే షిప్ పైన ఓ కత్తి ,రక్తం మరకలు ఉంటాయి. ఆమె నిక్ కు ఏమైందో అని ఆదుర్దా పడుతూ ఆ కత్తిని పట్టుకుంటుంది. అదే సమయంలో కోస్టల్ గార్డ్ పోలీసులు అక్కడికి వస్తారు. ఆ తర్వాత ఆమెను భర్తను హత్య చేసిన నేరం మీద శిక్ష విధిస్తారు. 

ఆమె హత్య చేయకపోయినా అక్కడ దొరికిన ఆధారాలు, కోస్టల్ పోలీస్ అధికారులకు నిక్ తనను ఎవరో పొడిచారని చెప్పడం, వారు వచ్చేలోపు లిబ్బి చేతిలో కత్తి ఉండటం ఆమె హత్య చేసింది అనడానికి ఆధారాలుగా నిలుస్తాయి. వీటితో పాటు ఆమె భర్త ఆమె పేరిట రెండు మిలియన్ డాలర్లకు ఇన్సూరెన్స్ చేయించడంతో ఇవన్నీ ఆమెను నేరస్థురాలిని చేస్తాయి. ఆమె తన కొడుకును తనకు పరచయమున్న ఓ టీచర్ మరియు భర్తకు కూడా సాన్నిహిత్యమున్న యాంజెలా గ్రీన్ ను దత్తత తీసుకోమని, ఆమెకు వచ్చే రెండు మిలియన్ డాలర్లతో బాబును పెంచమని చెప్తుంది. 

ఆ తర్వాత ఆమె పత్తా లేకుండా పోతుంది. ఎలాగో ఆమె అడ్రస్ కనుక్కుని ఫోన్ చేస్తుంది లిబ్బి. తాను ఆమె కొడుకును తర్వాత వారం తీసుకువస్తానని చెప్తుంది యాంజెలా. ఈ లోపు బాబును మాట్లాడించమంటే మాట్లాడిస్తుంది. బాబు మాట్లాడుతున్న సమయంలో నిక్ రావడంతో డాడీ అని పిలుస్తాడు. దానితో నిక్ బ్రతికే ఉన్నాడని ఆమెకు అర్ధమవుతుంది. ఆమెతో పాటు జైలులో ఉన్న ఇంకో ఖైదీ అయిన స్త్రీ 'Double Jeopardy' గురించి చెప్తుంది. విడుదలయ్యాక అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకుంటుంది  లిబ్బి. 

ఆరు సంవత్సరాల తర్వాత ఆమెను పరోల్ హౌస్ కు సత్ప్రవర్తన మీద తరలిస్తారు. అక్కడ నుండి యాంజెలా చిరునామా కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది లిబ్బి. దాని కోసం ఆమె అక్కడి నుండి తప్పించుకుంటుంది. యాంజెలా గాస్ స్టవ్ పేలి మరణించిందని ఆమె తెలుసుకుంటుంది. ఆమెను కూడా నిక్ హత్య చేసి ఉంటాడని గ్రహిస్తుంది. అప్పుల్లో మునిగి ఉన్న నిక్ వాటి నుండి తప్పించుకోవడానికి అలా చేశాడని ,తనను ఇరికించాడని కూడా అప్పటికే ఆమెకు అర్ధమయ్యింది. 

తర్వాత సైమన్ గా ,ఆ తర్వాత జొనాథన్ గా పేర్లు మార్చుకుని వ్యాపారాలు చేస్తూ ఉంటాడు నిక్. జొనాథన్ గా ఉన్న అతన్ని లిబ్బి కలుస్తుంది. తన కొడుకును తనకు అప్పగించమని లేకపోతే జరిగింది బయటపెడతానని  హెచ్చరిస్తుంది. కొడుకును ఇస్తానని నమ్మించి ఆమెను హత్య చేసే ప్రయత్నం చేస్తే తప్పించుకుంటుంది లిబ్బి. ఆ తర్వాత పరోల్ ఆఫీసర్ సాయంతో నిక్ తనను హత్య చేసినట్టు నమ్మించి తనను చేసినట్టే చేద్దామని అనుకున్నప్పటికి ,నిక్ పరోల్ ఆఫీసర్ ను హత్య చేయబోతుంటే అతన్ని చంపేస్తుంది లిబ్బి. ఆ తర్వాత ఆమె తన కొడుకు గురించి చనిపోయే ముందు నిక్ నుండి తెలుసుకున్నదాని ప్రకారం స్కూల్ కు వెళ్ళి కలుసుకోవడంతో సినిమా ముగుస్తుంది. 

పరోల్ ఆఫీసర్ గా టామి లీ జోన్స్ , లిబ్బి గా యాష్లి జడ్ నటన సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మార్చింది. పరోల్ ఆఫీసర్ గా ఉన్న టామి లీ జోన్స్ ఓ షిప్ లో పార్టీకు వెళ్తూ ఆమెను కారులో ఉంచి ఆమె కు సంకెళ్ళు వేయడం ,అక్కడి నుండి తప్పించుకునే క్రమంలో నీళ్ళల్లో పడిపోవడం ఈ దృశ్యం సినిమాకు గొప్ప హైలెట్. సినిమా లోని ప్రతి సంఘటన క్రమం సినిమా లీడ్ కు దారితీసేలా ఉండటం కూడా ఈ సినిమా బాక్సాఫీసు విజయానికి కారణమైంది. 

లీగల్ సినిమాలు ఎంతో  కొంత ప్రేక్షకుల్లో సస్పెన్సును ఉంచుతూ, చట్టాల పట్ల కొంత అవగాహనను కలిగిస్తాయి. ఇటువంటి సినిమాలు చూడటంతో  ఆ దశాబ్ద కాలాలలో సినిమా అంశాలను ఎలా ఎంపిక చేసుకునేవారో కూడా ఓ అవగాహన వస్తుంది. నటనా వైవిధ్యం లో ఉన్న కోణాలు కూడా ఆవిష్కృతమవుతాయి. 

               *   *   * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!