పెర్ఫ్యూమ్ -నేరస్థుడిచిరునామా

 సినీ సంచారం 

పెర్ఫ్యూమ్ -నేరస్థుడిచిరునామా

                                     -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


        మనిషికి పుట్టుకతో వచ్చే సామర్ధ్యాలు కొన్ని అయితే ,పెరిగే క్రమంలో తనను తాను వృద్ధి పరచుకుంటూ మెరుగుపరుచుకునే ప్రతిభాలు ఇంకొన్ని. ప్రతిభ ,సామర్ధ్యాల గమ్యం ఏమిటి అన్న దానికి సమాధానికి ఆ వ్యక్తి  వ్యక్తిత్వ ,నైతిక  నిర్మాణం మీద ఆధారపడి ఉంటుంది. అలా అతనికి పుట్టుకతో ఏ వాసనైనా పసిగట్టగల అత్యద్భుత సామర్ధ్యం లభించింది. కానీ అది అతన్ని చివరకు హంతకుడిని చేసి ,ఆత్మహత్య చేసుకునేలా చేసింది . ఈ కథాంశం మీద  జర్మన్ రచయిత పాట్రిక్ సుస్కిండ్ రాసినదే  'Perfume -The Story Of Murderer'  నవల. ఈ నవలను 2006 లో జర్మన్ దర్శకులు టామ్ టైక్వార్ సినిమాగా మలిచారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా  బెన్ విషా  నటించాడు. 

సినిమా  గ్రనుయెల్ అనే  హత్యలు చేసిన నేరస్థుడికి మరణ శిక్ష విధించడంతో మొదలవుతుంది. అప్పటి నుండి అతనికి శిక్ష పడే వరకు అతని జీవితాన్ని చూపించడంతో అతను ప్రేక్షకులకు పరిచయం అవుతాడు. ఫ్రెంచ్ ఫిష్ మార్కెట్ చేపలు అమ్ముకునే ఓ స్త్రీ అతన్ని  కంటుంది. కానీ ఏ కారణాల వల్లో కానీ అతన్ని చంపే ప్రయత్నం చేయడంతో ఆమెను అక్కడిక్కడే ఊరి తీసి చంపేస్తారు. ఆ తర్వాత గ్రనుయెల్ అనాధశ్రమంలో పెరుగుతాడు. అక్కడే అతను తనకున్న  ఎటువంటి వాసనైనా ఆఖరికి రాయి ,ఇనుము వంటి వాటి వాసన కూడా పసిగట్టే శక్తిని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఆ ఆశ్రమాన్ని నడిపే స్త్రీ  డబ్బు కోసం అతన్ని అమ్మేస్తుంది. తర్వాత ఆమె హత్యకు గురవుతుంది. అక్కడ అతను జంతువుల చర్మాలను శుద్ధి చేసే పని చేస్తుంటాడు. 

తర్వాత ఓ డెలివరీ  ఇవ్వడం కోసం పారిస్ వెళ్తాడు. అక్కడ ఎన్నో వాసనలు అతనికి అనుభూతిలోకి వస్తాయి. అక్కడ ఓ పళ్ళు అమ్ముకునే అమ్మాయి వంటి నుండి వచ్చే వాసన అతన్ని ఆకర్షిస్తుంది. ఆమెను వెంబడిస్తాడు. ఆమె నుండి ఆ  సువాసనను ఎలా తీసుకోవాలో అతనికి తెలియదు. ఆమెను అనుకోకుండా హత్య చేస్తాడు. కానీ అతని మనసులో ఓ వాసనను ఎలా ఓ మనిషి నుండి తీయాలి అనేది ఓ ప్రశ్నగానే మిగిలిపోతుంది. 

పారిస్ లో బాల్డిని అనే పెర్ఫ్యూములు తయారు చేసే పెర్ఫ్యూమ్ షాప్ యజమానిని ఓ డెలివరీ ఇవ్వడానికి వెళ్లినప్పుడు గ్రనుయెల్ కలుస్తాడు. తన వాసన పరిజ్ఞానంతో అతన్ని మెప్పించగలుగుతాడు. తర్వాత బాల్డిని గ్రనుయెల్ యజమాని నుండి కొనుక్కుంటాడు. అతన్ని అమ్మేసిన తర్వాత ఆ వ్యక్తి ఓ యాక్సిడెంట్లో మరణిస్తాడు. బాల్డిని పెర్ఫ్యూములని 12  వ్యక్తిగత సువాసనల మిశ్రమంగా చేశాక ,13 వది కూడా కలిస్తేనే అద్భుతమైన పెర్ఫ్యూమ్ పుడుతుంది అని ఆ ప్రక్రియ నేర్పిస్తాడు. కానీ ఆ ప్రక్రియ ద్వారా అన్నీ వాసనలు తీయలేమని తెలుసుకుంటాడు గ్రనుయెల్ఆ.  తర్వాత బాల్డిని కు ఎన్నో పెర్ఫ్యూమ్ ఫార్ములాలు ఇస్తాడు గ్రనుయెల్. దానికి ప్రతిఫలంగా తనకు మనుషుల నుండి వాసనలను తీయడం రాకపోయినా ,ఆ విద్యను గ్రాసే లో నేర్పిస్తారని చెప్తాడు. దాని కోసం అక్కడికి బయల్దేరతాడు గ్రనుయెల్ .అతను అక్కడి నుండి బయల్దేరగానే  బాల్డిని కూడా మరణిస్తాడు. 

గ్రాసేకు వెళ్ళిన తర్వాత ఎన్ఫ్లురేజ్ అనే ప్రక్రియ ద్వారా పువ్వుల నుండి వాసన తీయడం నేర్చుకుంటాడు గ్రనుయెల్. ఎన్ఫ్లురేజ్ ప్రక్రియలో హాట్ ఎన్ఫ్లురేజ్ ,కోల్డ్ ఎన్ఫ్లురేజ్ అనే రెండు ప్రక్రియలు ఉంటాయి. ఓ అమ్మాయిని చంపి హాట్ ఎన్ఫ్లురేజ్ ప్రక్రియ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాక అతను ఓ వేశ్య ను చంపి కోల్డ్ ఎన్ఫ్లురేజ్ ప్రక్రియ చేసి ఆమె వాసనను భద్రపరచగలుగుతాడు. అలా 13 మందిని చంపి వాసనలు సంగ్రహించి ,ఓ పెర్ఫ్యూమ్ తయారు చేస్తాడు.ఆ హత్యలకు అతనికి మరణ శిక్ష పడుతుంది. ఇక్కడితో గతం ముగుస్తుంది. 

మరణ శిక్ష రోజు ఆ పెర్ఫ్యూమ్ ను అతను అందరూ పీల్చేలా చేయడంతో అతన్ని ఎవరైతే నేరస్థుడు అన్నారో వారంతా అతన్ని దేవుడిగా భావించి వదిలేస్తారు. ఆ  తర్వాత అతను తను పుట్టిన ప్రాంతానికే వస్తాడు. అక్కడ తన పెర్ఫ్యూమ్ ను తన మీద చల్లుకుంటాడు. దానితో అక్కడి ప్రజలు అంతా ఆ వాసన మహత్యానికి అతన్ని తినేస్తారు. దీనితో సినిమా ముగుస్తుంది. 

గ్రనుయెల్ పాత్ర చిత్రణ ,ఆఖరికి అతను తన చావును కూడా పెర్ఫ్యూమ్ లోనే కలిపేసుకోవడం ,గ్రనుయెల్ వెళ్లిపోగానే అతని తల్లి ,తర్వాత అనాధశ్రమంలోని స్త్రీ ,కొనుక్కున్న వ్యక్తి ,బాల్డిని వీరంతా మరణించడం, అతను ఎవరితో ఉంటే వారు మరణిస్తారు అనే భావాన్ని అంతర్లీనంగా చెప్పడం కావచ్చు. ప్రపంచంలోని అత్యద్భుతమైన పెర్ఫ్యూమ్ తయారు చేయాలనుకున్న అతని కల అమ్మాయిల శరీరంనుండి వెలువడే సువాసనలను సంగ్రహించి తయారు చేయడంతో నెరవేరింది ,అతని చావు కూడా ఆ పెర్ఫ్యూమ్ లోనే కలిసిపోయింది. అతని వరకు అతను వ్యక్తిగతంగా తన గమ్యాన్ని చేరుకున్నట్టే అయినా ,మనిషిలోని శక్తి అతన్ని ఎంత కిరాతకంగా మారుస్తుంది అన్నది ఈ సినిమా స్పష్టం చేస్తుంది. 

గ్రనుయెల్ కు ఉన్న లోకం ఒక్క వాసనలు మాత్రమే. అతనికి గులాబీ పువ్వుల వాసన అయినా లేక అమ్మాయిల శరీరం నుండి వెలువడే వాసన అయినా సరే వాటిని తియ్యడంలో అతనికి ఏది తప్పనిపించలేదు. ఆ విలువలు తెలుసుకునే వాతావరణంలో కూడా అతను పెరగలేదు. అతను జీవితంలో తన స్వార్ధం కోసం మనిషి ఎలా ప్రవర్తిస్తాడు అనే అంశాన్ని బలపరిచే మనుషులతోనే ఉన్నాడు. అందుకే అతనికి మనుషుల పట్ల ,మానవత్వం పట్ల నమ్మకం ఏర్పడి ఉండకపోవచ్చు ,బహుశా అదే అతనిలోని పైశాచిక ప్రతిభకు ఊతం ఇచ్చి ఉండవచ్చు. 

సినిమాల్లో ప్రయోగాలు నూతన కథాంశాలు ఎప్పుడు ప్రేక్షకుల మన్ననను పొందుతూనే ఉంటాయి. ఈ సినిమాకు ఎన్నో పురస్కారాలు కూడా దక్కాయి.మరీ అద్భుతమైన అనుభూతిని కలిగించే సినిమా కాకపోయినా ,మనిషిలోని కనిపించని ఎన్నో కోణాలు చూపించే సినిమా అని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. 

            *    *   * 

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

అనుభూతుల మజిలీ