ప్రకృతి వేసిన శిక్ష

 సినీ సంచారం 

ప్రకృతి   వేసిన శిక్ష 

                                      -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



  ట్విలైట్ సిరీస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న  క్రిస్టెన్ స్టీవర్ట్, 'గేమ్ ఆఫ్ త్రోన్స్ ' లో నటించిన జెస్సికా హెన్విక్  2020 లో కలిసి నటించిన సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమానే 'Under Water.' సినిమా విజయాన్ని సాధించలేదు కానీ ఓ ప్రయోగాత్మక సినిమా అనే చెప్పవచ్చు. మూడు నాలుగు వర్గాలు సినిమాల్లో వైవిధ్యత కోసం కలపడం వల్ల సినిమా ప్రేక్షకులను కన్ఫ్యూజన్ లో పడేయడం వల్ల శ్రమకోర్చి తీసిన సినిమా అని  చూస్తుంటే తెలుస్తున్నప్పటికీ సినిమా బావుందని మాత్రం చెప్పలేము. సైన్స్ ఫిక్షన్ -హారర్ తో పాటు క్రీచర్ -ఫీచర్ కూడా కలగలపటంతో సినిమాలో వైవిధ్యం కాస్త కన్ఫ్యూజన్ గా మారింది. 

మనం  అత్యాశతో  ప్రకృతిని దోచుకుంటే అదే స్థాయిలో శిక్షను  అనుభవించాలి  అనే సందేశం  తో సినిమా రూపొందించినప్పటికీ ఆ భావనను బలంగా దర్శకుడు ప్రేక్షకుల మనసులో నిలపలేకపోయాడు. 'లవ్ ', 'సిగ్నల్ ' తర్వాత మూడో సినిమాగా ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విలియం యూబంక్  సైన్స్ ఫిక్షన్ తో ప్రయోగాలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకో బలమైన కనక్షన్  మిస్ అవుతున్న భావన కలగక మానదు. ఈ సినిమాకు క్రిస్టెన్ స్టీవర్ట్ నటన అంతో ఇంతో పర్లేదు అనిపించేలా చేసినా సినిమా మధ్యలో బోర్ కొట్టక మానదు. కానీ  సముద్రంలో సినిమాలు నిర్మించేటప్పుడు నటులు ,దర్శకులు పడే తపన ,వైవిధ్యం కోసం చేసే ప్రయోగాలు మాత్రం ఈ సినిమాలో  కనిపిస్తాయి. 

దక్షిణ పసిఫిక్ సముద్రంలో మెరినా ట్రెంచ్ లో తీయాన్  ఇండస్ట్రీస్  కెప్లర్ 822 పేరుతో ప్రయోగశాలను  నడుపుతూ ఉంటుంది. దీని ద్వారా పసిఫిక్ సముద్రంలో ఉన్న ఆయిల్ ను తవ్వడమే వారి లక్ష్యం. ఆ సముద్రంలో  భూకంపం పుట్టడంతో ఆ కెప్లర్ లో పని చేసే వారి పరిస్థితి ఎలా మారింది అని తెలిపే కథాంశమే ఇది. 

నోరా(క్రిస్టెన్ స్టీవర్ట్ ) ,రోడ్రిగో ,పాల్ ముగ్గురు భూకంపం వచ్చిందని తెలియగానే అక్కడి నుండి తప్పించుకోవడానికి ఎస్కేప్ పాడ్స్ దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నించినా అవి అప్పటికే విఫలమయ్యాయని తెలుసుకుంటారు. ఆ తర్వాత వారు కెప్టెన్ లూసిన్ ,ఎమిలీ ,స్మిత్ లను కూడా కలుసుకుంటారు. కెప్టెన్ లూసిన్ ఎలాగైనా వారు దగ్గరలో ఉన్న రోబక్ 641 స్టేషన్ దగ్గరకు చేరుకోగలిగితే అక్కడి నుండి క్షేమంగా బయట పడవచ్చని సూచిస్తాడు. రోడ్రిగో హెల్మెట్ సరిగ్గా లేకపోవడం మధ్యలోనే అతను ప్రమాదంతో మరణిస్తాడు. ఇలా వారు బయటపడే ప్రయత్నంలో ఉన్నప్పుడూ సముద్రంలో ఉండే ప్రిడేటర్ జంతువులైన తులుహ్ అనే జీవుల బారి నుండి రక్షించుకోవాల్సి వస్తుంది. ఈ మొత్తం పోరాటంలో లుసేన్, పాల్  మరణిస్తారు. ఎమిలీ(జెస్సికా హెన్విక్ ) ,స్మిత్ లను ఎస్కేప్ పాడ్స్ లోకి పంపి వారిని రక్షించాక నోరా తనకు మరణం తధ్యం అని అర్ధం చేసుకుని  ఆ సముద్రపు జంతువులను ధ్వంసం చేసే ప్రక్రియలో భాగంగా న్యూక్లియర్ కోర్ ను ఆపరేట్ చేస్తుంది, అక్కడే మిగిలిపోయిన నోరా మరణిస్తుంది. 

ఆ తర్వాత ఎమిలీ ,స్మిత్ ప్రాణాలతో బయటపడినా మిగిలినవారి మరణాల గురించి సమాజం ప్రశ్నించినా తీయాన్ ఇండస్ట్రీస్ పెద్దగా లెక్కచేయదు. తర్వాత యధావిధిగా అక్కడ తవ్వకాలు కొనసాగుతాయి అని చెప్పడంతో సినిమా ముగుస్తుంది. 

ఈ సినిమాలో సముద్రపు జంతువులతో పోరాటం అనుకున్నంత ఆసక్తిని కలిగించదు, ప్రతి నాయకులు భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యం ,దానితో పాటు ప్రాణం ఉన్న సముద్ర జీవులు ,ఈ రెండింటి  మధ్య సమన్వయం సరిగ్గా కుదరకపోవడం వల్ల సినిమా ఎక్కువ బోర్ కొట్టిస్తుంది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఆసక్తి -ప్రయోగాత్మక అంశాలు కుతూహలం ప్రేక్షకుల్లో రేకెత్తిస్తేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. అలా కాకుండా కన్ఫ్యూజన్ గా ,అసంపూర్ణంగా అనిపిస్తే అది ఆడియన్స్ తో కనక్ట్ అవ్వదు. ఏదీ ఏమైనప్పటికీ సైన్స్ ఫిక్షన్ లో ప్రయోగాలు అభినందనీయమే. 

       *    *   *

Comments

Post a Comment

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!