కిడ్నాపర్ ఎవరు ?

 సినీ సంచారం 

                కిడ్నాపర్ ఎవరు ? 

                  -రచనశ్రీదత్త (శృంగవరపు  రచన) 



   కిస్ ద గర్ల్స్ సినిమాకు సీక్వెల్ గా 2001 లో వచ్చిన సినిమానే  'Along Came A Spider.' జేమ్స్ పాటర్సన్ నవలలు సినిమాలుగా వచ్చినవి ఎక్కువ శాతం నియో నాయర్ సైకలాజికల్  థ్రిల్లర్ కోవకు చెందినవే. ఈ సినిమాకు  లీ తమాహోరీ దర్శకత్వం వహించారు. 'Kiss The Girls ' కన్నా కూడా ఈ సినిమా దర్శకత్వం, కథా పరంగా మెరుగ్గా అనిపిస్తాయి.

దాదాపు ఎలెక్స్ సిరీస్ లో ఉన్న సినిమాలు కానీ ,సీరియల్స్ కానీ కిడ్నాపింగ్ డ్రామాకు సంబంధించినవే. కిడ్నాప్ చేయడానికి కిడ్నాపర్స్ కు ఉండే మొటివ్స్ విచిత్రంగా ఉంటాయి. వాటిలో బలమైనది వారి తెలివితేటలను నిరూపించుకోవడానికే. ఎలెక్స్ ఓ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో భాగంగా ఫెయిల్ అయ్యి తన పార్టనర్  మరణానికి అనుకోకుండా కారణమవడంతో  అతను ఆ పశ్చాత్తాపంతో ఆ వృత్తికి దూరంగా ఉంటాడు. 

అమెరికా సెనేటర్ కూతురు మెగాన్ రోజ్ స్కూల్ లోని కంప్యూటర్ టీచర్ అయిన సోనేజి చే  కిడ్నాపుకు గురవుతుంది. కిడ్నాప్ చేసిన సోనేజి ఎలెక్స్ కు ఫోన్ చేయడంతో అతను ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. ఆ కిడ్నాప్ సమయంలో సెక్యూరిటీ సరిగ్గా మెయింటెయిన్ చేసి ఆ కిడ్నాప్ జరగకుండా ఆపలేకపోయినందుకు తన తప్పు ఉందని భావించిన ఏజెంట్  జెజ్జి కూడా  ఎలెక్స్ కు ఇన్వెస్టిగేషన్ లో సాయం చేయాలని నిర్ణయించుకుంటుంది. 

సోనేజి ఇంటికి వెళ్ళిన ఎలెక్స్ కు అతను పుస్తకాలను గమనించాక అతను  1932 లో జరిగిన లిండ్ బర్గ్ కిడ్నాపులా దీనిని కూడా మలచాలనుకుంటున్నాడని అర్ధమవుతుంది. 1932 లో అమెరికాలో  మిలిటరీ ఆఫీసర్ ,రచయిత ,సోషల్ యాక్టివిస్ట్ అయిన చార్లెస్ లిండ్ బర్గ్ కొడుయాకైనా 20 నెలల పసివాడు  జూనియర్ లిండ్ బర్గు కిడ్నాపుకు గురవుతాడు. మే నెలలో ఆ బాబు శవాన్ని ఓ ట్రాక్ డ్రైవర్ రోడ్ దగ్గర కనుక్కుంటాడు. 1934 రిచర్డ్ హప్త్మాన్ ను నేరస్థుడిగా గుర్తించి ఉరి శిక్ష వేస్తారు.  ఈ ఉదంతం అమెరికన్ చరిత్రలో ముఖ్య ఘట్టంగా నిలిచిపోయింది. దీని వలనే 'ఫెడరల్ కిడ్నాపింగ్ యాక్ట్ 'లేదా 'లిటిల్ లిండ్ బర్గ్ లా ' అమల్లోకి వచ్చింది. 

రష్యన్  ప్రెసిడెంట్  కొడుకు  డిమిట్రి కూడా మెగన్ స్కూల్ లో ఆమెతో పాటే  చదువుకునేవాడు. వారిద్దరి మీద కోడింగ్ తో మెసేజిలు నడిచేవి. ఆ విషయం సోనేజి మెగన్ కంప్యూటర్ హ్యాక్ చేయడం ద్వారా తెలుసుకుంటాడు. ఆ బాలుణ్ణి కిడ్నాప్ చేయడానికి మెగన్ లా మెసేజిలు పంపుతూ  తనకు ఫోన్ చేయడానికి ఓ బూత్ దగ్గరకి రమ్మని మెసేజ్ చేస్తాడు. అదే సమయంలో ఎలెక్స్ ,జజ్జి ఉండటం వల్ల ఆ బాలుడు రక్షించబడతాడు. 

కానీ తర్వాత కిడ్నాపర్ నుండి డబ్బుల కోసం ఫోన్ వస్తుంది. అదే సమయంలో మెగన్ రెండు సార్లు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి రెండో సారి సోనేజి నుండి తప్పించుకుంటుంది.ఎలెక్స్ ద్వారా కిడ్నాపర్ డిమాండ్ చేసిన మిలియన్ల డాలర్ల విలువ చేసే డైమండ్స్  కిడ్నాపర్ కు అందుతాయి. కానీ పాప మాత్రం తిరిగి రాదు. అదే సమయంలో సోనేజి ఎలెక్స్ ను కలవడానికి వస్తాడు. అతనితో మాటల బట్టి డైమండ్స్ డిమాండ్ చేసింది అతను కాదని ఎలెక్స్ కు అర్ధమవుతుంది. అదే సమయంలో జజ్జీని కాపాడే ప్రయత్నంలో సోనేజీను చంపుతాడు ఎలెక్స్. 

   అసలు మెగన్ ను సోనేజి నుండి కిడ్నాప్ చేసిన జజ్జీ తనతో సెక్యూరిటీ లో పని చేసిన వ్యక్తితో ఈ పని చేయగలుగుతుంది. అతని దగ్గర నుండి డైమండ్స్ తీసుకోవడానికి వచ్చిన జజ్జీ ఆ పాపను కూడా చంపేస్తే ఆ నేరం సోనేజి మీదకు వెళ్తుందని చెప్పినా అతను పాపను చంపలేనంటాడు. అతని దగ్గర డైమండ్స్ తీసుకుని అతన్ని హత్య చేస్తుంది జజ్జీ. అప్పటికే జజ్జీను అనుమానించిన ఎలెక్స్ ఆమె పర్సనల్ కంప్యూటర్ ద్వారా సోనేజి ప్లాన్ ను ముందే ఊహించిన జజ్జీ తర్వాత దానికి డబ్బు కోసం వినియోగించుకోవడానికి ప్లాన్ చేసిందని అర్ధం చేసుకుంటాడు. మెగన్ ను ఆమె బారి నుండి  కాపాడతాడు ,ఆ ప్రయత్నంలో ఆమెను చంపాల్సి వస్తుంది. ఇక్కడితో సినిమా ముగుస్తుంది. 

  కానీ     నవలకు ,సినిమాకు   మధ్య   ఎన్నో    మార్పులు  కనిపిస్తాయి. సోనేజి  మనస్తత్వం   గురించి  నవలలో    పాటర్సన్    అతనికి   ఉన్న    మల్టీపుల్   పర్సనాలిటీ  డిజార్డర్  గురించి    బాలుడిగా    ఉన్నప్పుడూ  గురైన ఎబ్యుజ్  గురించి   ప్రస్తావిస్తాడు. అలాగే  నవలలో    మెగన్    తో    పాటు  డిమిట్రి   ని  కూడా     ఒకేసారి  కిడ్నాప్  చేయడం   జరుగుతుంది . క్రాస్  కు ,జజ్జీ   కు   మధ్య   ఉన్న  ప్రేమ  కూడా    ఈ  సినిమాలో  కనిపించదు. ఆ  తర్వాత  సోనేజి   ను  చంపినట్టు  కాకుండా  మెంటల్  ఇన్స్టిట్యూషన్  కు  పంపినట్టు  నవలలో   ఉంటుంది . అలాగే  జజ్జీను  కూడా  శిక్ష   ద్వారా  చంపుతారు  తప్ప  ఎలెక్స్   కాదు .   ఎలెక్స్  హీరోయిజం   కోసం  ఈ మార్పులు  చేసిన  సోనేజి  పాత్ర   మాత్రం  నవల ప్రకారం  చేసినటైతే  సంపూర్ణంగా    ఉండేదన్న   భావన కలుగుతుంది. 

 ఏది ఏమైనప్పటికీ నవలను  సినిమాగా మార్చేటప్పుడు  మార్పులు  తప్పని సరి. కానీ సైకలాజికల్  థ్రిల్లర్స్ లో ముఖ్యమైన అంశమే  నేరస్థుడి  సైకాలజీ  గురించి స్పష్టంగా ప్రేక్షకులకు  తెలియజేయడం. అది మారిస్తే సినిమా ఆయువుపట్టు పోయినట్టే .కానీ కథ పరంగా ఉన్న ఆసక్తి కొంతమేరకు ఆ లోపాన్ని ఈ సినిమాలో  రక్షించిందనే  చెప్పవచ్చు. 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!