ఎవరు ఎవరికి సొంతం ?

 సినీ సంచారం 

                                    ఎవరు ఎవరికి సొంతం ? 

                                          -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


స్త్రీ ,పురుషుల మధ్య  సంబంధాలు చాలా క్లిష్టమైనవి. ముఖ్యంగా ప్రేమ -పెళ్ళి-సెక్స్  కేంద్రంగా ఉండే ఈ సంబంధాలు ఆధిపత్యాన్ని ,ఇగోలను ,అహంకారాలను ,మనిషిలోని పైశాచిక మనస్తత్వాన్ని కూడా కొన్నిసార్లు వెలుగులోకి వచ్చేలా చేస్తాయి. ఈ సంబంధాల్లో నిరాకరించబడటం అనే అంశాన్ని అతి తేలిగ్గా తీసుకునే  ధోరణి తక్కువగానే కనబడుతుంది. వ్యక్తిగతంగా డిప్రెషన్ లో మునిగిపోవడమో లేకపోతే ప్రేమించినా దక్కని వారికి హాని తలపెట్టడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది నిత్యం. అలా పెళ్ళి కుదిరిన  ఓ అమ్మాయి అనుకోకుండా ఓ వ్యక్తితో ఓ రాత్రి సంబంధాన్ని ఏర్పరచుకున్నందుకు అది ఆమె జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పిందో తెలిపే సైకాలజికల్ థ్రిల్లర్ సినిమానే 'బ్రోకెన్ వోస్ .' 

తారాకు మైఖేల్ తో పెళ్ళి కుదురుతుంది. బ్యాచిలర్ పార్టీ  స్నేహితురాళ్ళకు ఇస్తున్న సందర్భంలో బార్ లో పాట్రిక్ పరిచయమవుతాడు. అతని పట్ల ఆకర్షించబడ్డ ఆమె ఆ రాత్రి అతనితో గడుపుతుంది. ఉదయం లేచేసరికి పాట్రిక్ తన చేతి మీద తార అనే పచ్చబొట్టు వేయించుకుంటాడు. తార తనను ప్రేమిస్తుంది అని అనుకుంటాడు.తార తను ఇంటికి వెళ్ళిపోవాలి అని పాట్రిక్ కు ఇష్టం లేకపోయినా సరే వెళ్లిపోతుంది.  ఆ  హడావుడిలో తన ఫోన్ పాట్రిక్ దగ్గరే మర్చిపోతుంది. 

తిరిగి పెళ్ళి పనుల్లో బిజీ అయిపోతుంది. మైఖేల్ తో తిరిగి కలిసిపోతుంది. ఆమె ఫోన్ ద్వారా ఆమె చిరునామా కనుక్కున్న పాట్రిక్ ఓ రోజు సరాసరి  ఆమె ఇంటికే వచ్చేస్తాడు. అతని నుండి తప్పించుకోవడం కోసం తర్వాతి రోజు పదింటికి అతన్ని కాఫీ షాప్ లో కలుస్తానని చెప్తుంది తార. ఆమె స్నేహితురాలు డెబ్రా తర్వాత రోజు స్పాకు వెళ్ళడానికి తార దగ్గరికి వస్తుంది. కానీ తనకు వేరే అపాయింట్మెంట్ ఉందని తార చెప్పడంతో అదేమిటి అని ప్రశ్నించడంతో పాట్రిక్ ముందు రోజు వచ్చిన విషయం చెప్తుంది. బ్యాచిలర్ పార్టీలో ఉండటం వల్ల డెబ్రికి జరిగింది తెలియడం వల్ల అతన్ని కలవద్దని ,తనకు ఎక్స్ కాప్ మ్యాన్ అయిన ఓ స్నేహితుడు ఉన్నాడని, అతని ద్వారా ఎవరికి తెలియకుండా పాట్రిక్ సమస్యను వదిలించుకోవచ్చని చెప్తుంది. 

ఆమె కోసం కాఫీ షాప్ లో ఎదురు చూస్తూ ఉంటాడు  పాట్రిక్. తారాకు తన ఫోన్లో అన్ని పనులు ప్లాన్స్ రాసుకునే అలవాటు ఉంటుంది. దాని ప్రకారం ఆమె పెళ్ళికి చేయాల్సిన పనులన్నింటిని గురించి రాసుకుంటుంది. అవి ఆమె ఫోన్లో చూసిన మైఖేల్ పెళ్ళి హాల్ కు ,మిగిలిన వారికి ఫోన్ చేసి తను ఆమె ఫియాన్సీ అని పెళ్ళి రద్దు అయిందని అందుకే అన్ని క్యాన్సిల్ చేయమని చెప్తాడు. తర్వాత ఆ విషయం తెలుసుకున్న తార మళ్ళీ వారికి ఫోన్ చేసి క్యాన్సిల్ చెయ్యవద్దని ,ఫోన్ చేసింది తన ఫియాన్సీ కాదని చెప్తుంది. అలా ఆమె పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తాడు పాట్రిక్ . 

ఆ తర్వాత ఆ ఎక్స్ కాప్ ద్వారా అతను సైకో అని , జైలులో ,రిహాబిలిటేషన్ సెంటర్లలో గడిపాడని ,బాల్యంలో బేబీ సిట్టర్ పట్ల కూడా ప్రేమ పెంచుకుని ఆమె ఇంకొకరితో ఉండే సరికి తనను తాను అంతం చేసుకునే ప్రయత్నం చేస్తే కాపడిందని ,తర్వాత ఓ నర్స్ తనను ప్రేమించలేదని ఆమె కార్లో బాంబ్ పెట్టి హత్య చేశాడని తెలుసుకుంటుంది తార .అతని విషయం తాను చూసుకుంటానని ఆ ఎక్స్ కాప్ మాట ఇస్తాడు. 

తార ఫోన్ ద్వారా ఆమె చెల్లి గుర్రాలు నడుపుతుంది అని ఫోటోల ద్వారా తెలుసుకున్న పాట్రిక్ ఆమెను కూడా కలుసుకుంటాడు. తార పెళ్ళి సమయంలో మైఖేల్ కు చెప్పి పెళ్ళి ఆపే ప్రయత్నం చేసినా అతను పట్టించుకోడు. ఎక్స్ కాప్ ద్వారా తాత్కాలికంగా తప్పుకున్నా ,తనను అతనికి పట్టించిన డెబాను హత్య చేస్తాడు పాట్రిక్ .తన ప్రేమను తెలుపుతూ రాసిన ఉత్తరాలను తార తగలబెట్టడం చూసిన పాట్రిక్ ఆమెను వెంబడిస్తూ ఉంటాడు. హనీ మూన్ కు వెళ్ళినపుడు మైఖేల్ ను హత్య చేసే ప్రయత్నం చేస్తాడు పాట్రిక్. మైఖేల్  ను  కాపాడే ప్రయత్నంలో తార పాట్రిక్ ను హత్య చేస్తుంది. తర్వాత హాస్పటల్ లో ఉన్నప్పుడూ ఆమె గర్భవతి అని డాక్టర్ చెప్పడంతో తన కడుపులో ఉంది పాట్రిక్ బిడ్డ అని తెలిసి తార షాక్ అవ్వడంతో సినిమా ముగుస్తుంది. 

ప్రేమ అంటే పట్టి బంధించేది కాదని ఎన్ని శాస్త్రాలు చెప్పినా ,ప్రేమించిన వ్యక్తి తనను ప్రేమించినా -ప్రేమించకపోయినా సరే ఆ రిజెక్షన్ ను తట్టుకోలేక ఎందరో సైకోలుగా మారిన ఉదంతాలు ఉన్నాయి. ఆ ప్రోత్సాహం ఎదుటి వారి నుండి మొదట్లో లభించి తర్వాత వారిని పట్టించుకోకుండా తమ జీవితం తాము గడిపినా సరే నేటికీ కూడా మనుషుల మనసుల్లో ప్రేమ -పెళ్ళి-సెక్స్ ల వల్ల పక్క వ్యక్తి తనకు సొంతం అనే ఆలోచన కలిగిస్తూనే ఉంటుంది. అది వాస్తవానికి దూరంగా ఉన్నప్పుడూ దానిని ఎలా అయినా పొందాలి లేకపోతే దానిని లేకుండా చేయాలి అనే విపరీత మనస్తత్వాలు నేటి ప్రేమకు పరాకాష్టగా నిలుస్తున్నాయి. దేశం ఏది అయినా సరే ఈ సూత్రం మాత్రం సర్వసాధారణమైపోయింది. ఫ్రీ లైఫ్ స్టైల్ ఉన్న  పాశ్చాత్య దేశాల్లో కూడా దానిని అంత తేలికగా తీసుకొని పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా ఒకరికి ఒకరు సొంతం అనే  భావన ప్రాక్టికల్ జీవితంలో బహుదూరమే. 

                              *       *      * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!