ఊహించని రాత్రి

 సినీ సంచారం 

                ఊహించని రాత్రి 

                         -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



   జీవితంలో ఊహించని మలుపులు ఎదురవుతూనే ఉంటాయి. వాటిల్లో కొన్ని మన జీవితానికి సంబంధించినవి అయితే ఇంకొన్ని అపరిచితుల వల్ల మన జీవితంలో సంభవించే ప్రతికూల పరిస్థితులు ఇంకొన్ని. అలాంటి ఊహించని ఆ రాత్రి ఆ భార్యాభర్తల జీవితంలో వారిని మరణం అంచుల వరకు తీసుకువెళ్ళింది. ఈ అంశాన్ని ఓ   హారర్  థ్రిల్లర్ గా  మలిచి  హంగేరియన్ దర్శకులు నిమ్రోడ్ అంటాల్ 2007 లో  తీసిన సినిమానే 'వేకెన్సీ .' ఇద్దరే ప్రధాన పాత్రధారులుగా , మొత్తం ఏడు -ఎనిమిది పాత్రలతో ,సినిమా మొత్తం ఒకే లొకేషన్ కి  పరిమితమయ్యి సినిమా తీయడం  అంటే పెద్ద రిస్క్ . దానికి కారణం ఆ సినిమా మొత్తం ఊహించని ఉత్కంఠ ఉంటే తప్ప, సినిమాను ప్రేక్షకులు ఆదరించడం కష్టమవుతుంది. కానీ ఈ సినిమా ఆ సస్పెన్స్ ,హారర్ రెండు అంశాలను మొదటి అరగంట నుండే కలిగించడంతో సినిమా అయ్యేవరకు ఎక్కడా కూడా బోర్ కొట్టదు. 

ఆ రోజు రాత్రి డేవిడ్ , ఎమి అనే దంపతులు ఓ పాత్రి ముగించుకుని కార్లో వెళ్తుండగా దారి తప్పిపోతారు. అదే సమయంలో కారు కూడా ట్రబుల్ ఇస్తుంది. ఎలాగో దగ్గరి గ్యాస్ స్టేషన్ వరకు వెళ్ళగలుగుతారు అందులోనే. అక్కడ ఓ మెకానిక్ వారి కారు సమస్యను పరిష్కరిస్తాడు. దారి కూడా చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ కొంత దూరం వెళ్ళాక  ఆ కారు ఆగిపోవడంతో మళ్ళీ ఆ గ్యాస్ స్టేషన్ దగ్గరకు ఆ మెకానిక్ కోసం నడిచి వెళ్తారు. రాత్రవ్వడంతో ఆ గ్యాస్ స్టేషన్ మూసేసి ఉంటుంది. ఇక వేరే దారి లేక పక్కనే ఉన్న హోటల్ లో ఆ రాత్రి గడపడానికి నిర్ణయించుకుంటారు ఆ దంపతులు.ఆ మేనేజర్ తో  మాట్లాడి  ఓ  గది తీసుకుంటారు.    

ఆ  రాత్రి  వారికి అజ్ఞాతమైన ఫోన్ కాల్స్ ,డోర్ గట్టిగా బాదుతున్న శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మేనేజర్ కు వెళ్ళి చెప్పినాసరే ఆ రోజు ఎవరు హోటల్ లో   లేరని చెప్తాడు. తిరిగి రూమ్ కు వెళ్తాడు డేవిడ్. డేవిడ్ ఆ రూమ్ లో టీవి చూస్తూ ఆ టీవి పైన పెట్టిన డీవీడీ లు  చూసి వాటిని పెడతాడు. అందులో దారుణంగా అమ్మాయిలను మానభంగం చేస్తున్న దృశ్యాలు, చివరకు  హత్యలు చేస్తున్న దృశ్యాలు కనబడతాయి. బాగా గమనించిన డేవిడ్ కు ఆ  దృశ్యాల్లో ఉన్న గది తమ గది లానే ఉండటంతో అనుమానం వస్తుంది. దానితో డేవిడ్ కు తాము రాగానే మేనేజర్ ఏవో అరుపులు వినిపించడం  గుర్తుకు రావడంతో గదులన్నీ కెమెరాలు పెట్టి వారు షూట్ చేసి ,తర్వాత జరిగింది వినోదానికి చూస్తూ ఉంటారని ,ఇప్పుడు కూడా కెమెరాల్లో తమను చూస్తూ ఉన్నారని అర్ధమవుతుంది. ఆ తర్వాత ఎలాగో అక్కడ ఉన్న ఫోన్ బూత్ నుండి 911 కు కాల్ చేసినా సరే ఆ మేనేజర్ ఫోన్ ఎత్తడంతో తప్పించుకోవాలన్న ఆ ప్రయత్నం వృధా అవ్వడంతో పాటు ,మాస్కూలు ధరించిన ఇద్దరు వ్యక్తులు చంపడానికి కార్లో వెంబడించడంతో తిరిగి రూమ్ కు వస్తాడు డేవిడ్ .

తర్వాత  బాత్ రూమ్ లో ఎమి కార్లో వదిలేసిన యాపిల్ ఉంటుంది. అది అక్కడికి ఎలా వచ్చిందో ఆ దంపతులకు అర్ధం కాదు. ఆ  వచ్చి అది అక్కడ పెట్టిన వ్యక్తి కచ్చితంగా డోర్ దగ్గర నుండి రాలేదు కనుక ఇంకో దారేదో ఉందని గ్రహించిన డేవిడ్ ఆ దారి కోసం వెతుకుతూ ఉండగా, బాత్ రూమ్ కింద నుండి ఓ సొరంగం  ఉండటం గమనించి దాని ద్వారా అక్కడి నుండి తప్పించుకుందామనుకుని ఆ సొరంగం ద్వారా వెళ్ళినా చివరకు అది మేనేజర్ గదికి దారి తీస్తుంది. అక్కడ నుండి 911 కు కాల్ చేస్తారు. ఈ లోపు ఎవరో వస్తున్న శబ్దం రావడంతో సొరంగం  వారి గదిలోకి వెళ్ళిపోతారు. ఆ గదిలోకి వారు వచ్చిన విషయం తెలుసుకున్న మేనేజర్ వారిని చంపడానికి మాస్కుల వ్యక్తుల్ని పంపిస్తాడు. ఈ లోపు 911 ద్వారా ఓ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అతన్ని కూడా ఆ మాస్కుల వ్యక్తులు హత్య చేస్తారు. డేవిడ్ దంపతులు రూమ్ లోకి పరిగెడతారు. 

డేవిడ్ ఎమిని గది పైన రూఫ్ మీదకు ఎక్కించి ఏం జరిగినా సరే అక్కడి నుండి దిగవద్దని ,ఆమె తప్పించుకుందని అనుకోవడానికి కిటికీ పగలగొట్టి అక్కడ ఓ క్లాత్ పెడతాడు . తర్వాత అక్కడికి మాస్కుల వ్యక్తులు మేనేజర్ తలుపు పగలగొట్టి  వచ్చి అతన్ని పొడుస్తారు. ఆమె పారిపోయిందనుకుని ఆమె కోసం వెతకడానికి వెళ్తారు. అప్పటికి ఉదయం అయిపోతుంది. మేనేజర్ కారు లో నుంచి తప్పించుకుందామనుకున్న ఎమి ఎదురుగా మాస్కుల వ్యక్తులు రావడంతో వారిని గుద్దడంతో వారు అక్కడికక్కడే మరణిస్తారు. వారిలో ఒక వ్యక్తి తమకు సాయం చేసిన మెకానిక్ అని గుర్తిస్తుంది ఎమి. తర్వాత అక్కడి నుండి మళ్ళీ కాల్ చేసే ప్రయత్నంలో మేనేజర్ ఆమెను అడ్డగించి హత్య చేయబోతుంటే తనను తాను కాపాడుకోవటం కోసం అతన్ని హత్య చేస్తుంది. తర్వాత 911 కు కాల్ చేస్తుంది. డేవిడ్ బ్రతికే ఉండటం గుర్తించిన ఎమి ఆఫీసర్ల రాక కోసం ఎదురు చూస్తూ డేవిడ్ దగ్గర ఉండటంతో సినిమా ముగుస్తుంది. 

సినిమా మొదటి అరగంట నుండే హారర్ -సస్పెన్స్ తో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కలుగుతూ ,చివరివరకు చూసేలా చేస్తుంది. ఈ తరహా సినిమాలు వచ్చినప్పటికీ ,సస్పెన్స్ -హారర్ లో కోణాలు వేరుగా ఉంటాయి కనుక ప్రతి సినిమా కూడా ప్రత్యేకమైనదే. మీరు సస్పెన్స్ థ్రిల్లర్ అభిమానులైతే ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే. 

                      *   *   * 

      

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!