పేరెంట్ ట్రిగ్గర్ ఎక్కడా ?

 సినీ సంచారం 

        పేరెంట్  ట్రిగ్గర్ ఎక్కడా ? 

               -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



 విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. విద్యను బోధించడం మాత్రమే వాటి లక్ష్యం కాదు, నేర్చుకోవడంలో వైవిధ్యత చూపించే పిల్లల మనస్తత్వాన్ని బట్టి అందరికీ న్యాయం చేయగలిగే లక్ష్యాన్ని విద్యాలయాలు ఎంతమేరకు సాధిస్తున్నాయి అనేది నేటికీ ప్రశ్నార్ధకమే. ఈ పరిస్థితుల్లో అమెరికాలో 2010 లో కాలిఫోర్నియా లెజిస్లేచర్  మొదటి సారిగా పేరెంట్ ట్రిగ్గర్ చట్టాన్ని తీసుకువచ్చింది. దీని పకారం ఏదైనా స్కూలు విద్యా లక్ష్యాలను సాధించడంలో వైఫల్యం పొందితే దానిని పేరెంట్స్ ,టీచర్స్ సాయంతో స్వంతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థగా, విద్యా లక్ష్యాలు సాధించే సంస్థగా  నడపవచ్చు. అలా మార్చడానికి ఇద్దరు తల్లులు ఏం చేశారో తెలిపే సినిమానే 'Won't Back Down.'

జేమి, నోరా ఆల్బర్ట్స్ ఈ కథలోని ముఖ్య పాత్రలు. జేమి ఓ కార్ సేల్స్ కంపెనీలో పని చేస్తూ ఉంటుంది. ఆమె భర్త నుండి విడిపోయింది. ఆమె కూతురు మాలియా. నోరా ఆల్బర్ట్స్ అక్కడ ఆడమ్స్ స్కూల్ లో ఓ టీచర్. ఆమె భర్తతో  విడిపోయినప్పటికీ కొడుకు విషయంలో అతను కూడా బాధ్యతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆమె కొడుకు కోడీ. మాలియా, కోడీ ఇద్దరు డైసలెక్సియా ఉన్న పిల్లలు. జేమి వైట్ జాతికి చెందిన వ్యక్తి. నోరా బ్లాక్ జాతికి చెందిన స్త్రీ. 

మాలియాను ఆడమ్స్ స్కూల్ లో చేర్పిస్తుంది జేమి. కానీ అక్కడి టీచర్లు ఆ పాప పట్ల శ్రద్ధగా వ్యవహరించకపోవడం, ఆ పాపకు పనిష్మెంట్లు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. అదే స్కూల్ లో టీచర్స్ గా ఉన్న మైకేల్,నోరా ఎంత బాగా బోధిస్తున్నారో కూడా జేమి చూస్తుంది. నోరా క్లాసుకు మాలియాను మార్చుదామని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. 

    తర్వాత తమ పిల్లలకు మంచి విద్యా ఎలా అందివ్వాలి అని జేమి, నోరా ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. కోడీని అతని తండ్రి ఓ స్కూల్ లో చేర్పించినా నల్ల జాతికి చెందిన వాడవ్వడం వల్ల అవమానాలు ,డైస్ లెక్సియా వల్ల చదవడంలో ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటాడు. అదే సమయంలో పేరెంట్ ట్రిగ్గర్ చట్టం గురించి తెలుసుకున్న  జేమి ఎలా అయినా సరే తను ఆడమ్స్ స్కూలును నడపాలని  ధృఢంగా నిర్ణయించుకుంటుంది. దీనికి నోరా సాయం అడుగుతుంది. తమకు తమ పిల్లలు నేర్చుకోవడంలో పడే ఇబ్బందులు తెలుసు కనుక తాము ఇప్పటి విద్యా కన్నా మెరుగ్గా పిల్లలకు అందివ్వగలమని ,అందులోనూ నోరా టీచర్ అవ్వడం వల్ల ఆమె సహకారం ఉంటే సాధ్యమవుతుంది అని ఆమెను ఒప్పిస్తుంది  జేమి. 

అలా వారిద్దరు ఆ పని కోసం తపన పడుతూ ఉంటారు. ఈ  విషయం అందరికీ తెలిసిపోతుంది. నోరా ఆడమ్స్ స్కూల్ లో టీచర్ గా రాజీనామా చేస్తుంది. ఎలాగో జేమి కష్టపడి టీచర్లను ,తల్లిదండ్రులను ఒప్పించి బోర్డు వరకు వారి పిటిషన్లు తీసుకువెళ్లగలుగుతుంది. అదే సమయంలో వారు ఎక్కడ గెలుస్తారో ఆడమ్స్ స్కూల్ తమ చేతి నుండి ఎక్కడ జారిపోతుందో అని నోరా క్యారెక్టర్ ఎసాసినేట్ చేయడం  ప్రారంభిస్తుంది ఆడమ్స్ యాజమాన్యం. ఆమె గతంలో ఒకసారి తాగి చేసిన యాక్సిడెంట్ ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని ఆమెను కించపరిచే ప్రయత్నం చేస్తుంటారు. పేరెంట్స్ తో మీటింగ్స్ , వారిలో అవగాహన కల్పించడం వంటివి ఎన్నో చేసి ,చివరకు బోర్డు దగ్గర కూడా ఒక్క వోటు జూరీలో ఎక్కువ పడటంతో జేమి ,నోరా విజయం సాధిస్తారు. అలా ఆడమ్స్ స్కూల్ లో మార్పులు తీసుకువస్తారు.  ఈ సినిమా లో నోరా పాత్ర పోషించిన వయోలా డేవిస్ కు  ఆమె నటనకు పురస్కారాలు దక్కాయి. 

నిజానికి  ఈ పేరెంట్ ట్రిగ్గర్ చట్టం చాలా కష్టతరమైనది అమలు చేయడానికి . ఏళ్ల తరబడి జాప్యం చేయడం వల్ల ఎవరు వాస్తవానికి నిజంగా ఈ విషయంలో విజయం సాధించడం అరుదే. ఇటువంటి వినుత్నా విద్యాంశంతో  సినిమాను మలిచిన దర్శకులు డేనియల్ బార్న్  ప్రయోగం చేసినప్పటికీ ,ఇది బాక్సాఫీసు దగ్గర బోల్తా పడింది. కానీ సమాజంలో రావాల్సిన మార్పులు గురించి వచ్చే సందేశాత్మక సినిమాలకు హిట్ ,ఫ్లాప్ లతో సంబంధం లేదు. అవి నిజంగా సందేశాన్ని అందించే సినిమాలే . 

    *   *   * 

               

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!