చిన్న పిల్లా ? ప్రౌఢ వనితా ?

 సినీ సంచారం 

చిన్న పిల్లా ? ప్రౌఢ వనితా ? 

                      -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



సైకలాజికల్  హారర్ సినిమాల్లో సస్పెన్స్ -హారర్ రెండు సమాన సమన్వయంలో లేకపోతే సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకర్షించలేదు. అందులోనూ పిల్లలను కూడా ప్రధాన పాత్రలుగా మలిచేటప్పుడు సినిమా ఎక్కడ బోర్ కొట్టించకుండా తర్వాత ఏమవుతుందో అన్న ఉత్కంఠ ను కలిగిస్తూ, చివరకు ప్రేక్షకులు ఊహించని మలుపులు ఇస్తేనే ఆ సినిమాను ఆద్యంతం చూడగలము. అటువంటి కోవకు చెందిన సినిమానే 2009 లో వచ్చిన 'Orphan.'

కేట్ ,జాన్  భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలు. మాక్స్ అనే పాప. ఆ పాపకు మాటలు రావు, కొంచెం వినగలదు ,లిప్ రీడింగ్ ను బట్టి ఎదుటి వారు చెప్పేది అర్ధం చేసుకోగలదు. అబ్బాయి డేనియల్.పాప కన్నా పెద్దవాడు.  తర్వాత కడుపులో ఉన్నప్పుడే మూడో బిడ్డ మరణిస్తుంది. ఆ బిడ్డ మరణం కేట్ పై ఎంతో ప్రభావం చూపిస్తుంది. కడుపులో దాదాపు చనిపోయిన బిడ్డను 16 రోజులు మోస్తుంది ఆమె .ఆ తర్వాత చనిపోయిన బిడ్డ అస్థికలు ఇంటి ముందు పాడులో వేసి దాని పైన తెల్ల గులాబీ మొక్కను పెంచుకుంటుంది. అది పూలతో ఉన్నంతవరకు ఆ బిడ్డ తనతో ఉన్నట్టే అనుకుంటుంది. ఆ బిడ్డ పుడితే జెస్సికా అనే పేరు పెడదాం అనుకుంటుంది. ఆల్కహాల్ కూడా అంతకు ముందు అలవాటు ఉంటుంది కేట్ కు. తర్వాత డాక్టర్ బ్రౌనింగ్ కౌన్సిలింగ్ పైన మానేస్తుంది. ఆ సమయంలో ఆ దంపతులు ఇంకో బిడ్డను దత్తత చేసుకుందాం అనుకుంటారు. 

ఆడపిల్లల అనాథాశ్రమంలోకి వెళ్లినప్పుడు పెయింటింగ్స్ వేస్తున్న ఎస్తర్ అనే తొమ్మిదేళ్ల పాప వారిని ఆకర్షిస్తుంది. ఆమె డ్రెస్సింగ్ కూడా మెడకు ,మోచేతులకు అప్పటి రాజ్య వంశస్థులు పెట్టుకున్నట్టు ఎప్పుడు రిబ్బన్స్ పెట్టుకుంటుంది. ఎంతో తెలివిగా ,తన వయసుకు మించిన పరిణతితో ఉన్న ఆ పాపను చూసి ముచ్చట పడి ఆ జంట ఆమెను దత్తత తీసుకుంటారు. ఆమె రష్యా నుండి వచ్చిందని, అమెరికాకు వచ్చాక ఆమె కుటుంబం ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిందని సిస్టర్ చెప్తుంది. 

ఇంటికి వచ్చాక మాక్స్ ఆమెకు మంచి స్నేహితురాలు అయిపోతుంది. కానీ డేనియల్ కు ఆమె నచ్చదు. తన డ్రెస్సింగ్ ను హేళన చేసిందని క్లాస్ మెట్ బ్రెండా ను ఆడుకునే సమయంలో ఎవరు లేకుండా చూసి తోసేస్తుంది. అది మాక్స్ చూసినా ఎవరికి చెప్పదు. అలాగే ఓ సందర్భంలో డేనియల్ అనుకోకుండా ఆ పక్షిని పెయింటింగ్ బాల్ తో దానికి ఏమి అవదులే అనుకుని షూట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి మాక్స్ తో వచ్చిన ఎస్తర్ దానిని రాయితో చంపేసి దానిని ఆ బాధ నుండి   తప్పించానంటుంది. తనకు పియానో వాయించడం రాదని చెప్పిన ఎస్తర్ కేట్ దగ్గర నేర్చుకుంటూ ఉంటుంది. కానీ ఆమెకు వయొలిన్ వాయించడం వచ్చని ఆమెకు తెలుస్తుంది. దానితో పాటు బ్రెండా సంఘటన ఇవన్నీ కూడా ఆమె ప్రవర్తన పట్ల అనుమానాన్ని రేకెత్తిస్తాయి. 

  తర్వాత  ఆమె ప్రవర్తన గురించి దత్తత తీసుకున్న అనాథాశ్రమం సిస్టర్ కు కాల్ చేస్తుంది. ఆ తర్వాత ఆ విషయం గురించి చెప్పడానికి ఆ సిస్టర్ ఇంటికి వస్తుంది. అంతకు ముందు కూడా ఓ అబ్బాయి,అమ్మాయి  విషయంలో ఇంతే వైలెంట్ గా ప్రవర్తించిందని సిస్టర్ చెప్తుంది. అది చెప్పి ఆమె తిరుగు ప్రయాణం అవుతుంది. తన గురించి చెప్పిన ఆమెను వెళ్ళేటప్పుడు దారి అడ్డగించి మాక్స్ కు ఇష్టం లేకపోయినా ఆమె సాయంతో సుత్తితో తల మీద మోది ఆమెను హత్య చేసి మంచులోకి ఆ శవాన్ని తోసేస్తుంది. ఆ తర్వాత ఆ సిస్టర్ కోన ఊపిరితో ఉంటే ఇంకొన్ని సార్లు మోది మరి చంపేస్తుంది. ఇదంతా చూసిన మాక్స్ కు ఆమె అంటే భయం వేస్తుంది.కేట్ కుటుంబానికి ఉన్న ట్రీ హౌస్ లో రక్తం తో ఉన్న తన బట్టలు ,సుత్తి దాస్తుంది మాక్స్ సాయంతో ఆమెను భయపెట్టి  మళ్ళీ ఎస్తర్. వారు ట్రీ హౌస్ నుండి తిరిగి వస్తున్నప్పుడు గమనించిన డేనియల్ ను రాత్రి ఆ విషయం ఎవరికైనా చెప్తే అతన్ని హత్య చేస్తానని బెదిరిస్తుంది. దానితో డేనియల్ కూడా ఆమె అంటే భయపడతాడు. 

ఆ తర్వాత కేట్ కు ఆమెకు మధ్య మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. జాన్ దగ్గర మాత్రం మంచి అమ్మాయిలా నటిస్తూ ఉంటుంది ఎస్తర్.అదే రోజు కేట్ తో మంచిగా ఉండమని ,ఆమెను సంతోషపెట్టే పని ఏదైనా చేయమని చెప్తాడు జాన్. ఆమె ప్రేమగా పెంచుకుంటుందని తెలిసి కూడా ఆ చెట్టు విరిచి ఆ పూలు ఇస్తుంది. దానితో కోపం వచ్చిన కేట్ కోపంతో ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని అరుస్తుంది. ఆ రాత్రి అందరూ పడుకున్నాక ఆ చేతిలోని బోన్ ను తానే విరిచేసుకుని జాన్ కు తన చెయ్యి నొప్పిగా ఉందని చెప్పడంతో డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తారు. అలా జాన్ మనసులో తన మీద ప్రేమను ,సానుభూతిని సాధిస్తుంది ఎస్తర్ .అదే రాత్రి జాన్ దగ్గర పడుకుంటానని  అనడంతో కేట్  జరిగిన వాటికి బాధపడి వైన్ బాటిల్స్ తెచ్చుకుంటుంది.  తర్వాత రోజు ముగ్గురు పిల్లలను కారులో స్కూలుకు తీసుకువెళ్తుంది కేట్. డేనియల్ దిగిన తర్వాత అతని పుస్తకాలు పడిపోవడంతో కేట్ ఇస్తున్న సమయంలో ఎస్తర్ ఆ కారు ను ఎవరు గమనించకుండా గేర్ వేసి స్కూల్లోకి వెళ్ళిపోతుంది. దానితో ఆ కారు వెళ్లిపోతూ ఉంటుంది. చివరకు మంచు దగ్గర ఆగడంతో మాక్స్ సురక్షితంగా ఉంటుంది. తన కూతుర్ని  చంపడానికి ఎస్తర్ అలా చేసిందని గట్టిగా నమ్ముతుంది కేట్. డాక్టర్ బ్రౌనింగ్ దగ్గరకు కూడా ఎస్తర్ ,భర్తతో వెళ్ళినా అంతకు ముందు రోజు ఆమె తాగిన వైన్ బాటిల్స్ ఎస్తర్ ఇచ్చిందని ఆ తాగిన మత్తులో ఆమె అలా చేసి ఎస్తర్ మీద నిందారోపణ చేస్తుందని డాక్టర్ ,జాన్ భావిస్తారు. 

 కేట్ ఎస్తర్  గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందులోనూ ఎస్తర్ తన డైరీ చదవడం కూడా ఆమె  గురించి ఏదో తెలియని విషయాలు ఉన్నాయని కేట్ అనుమానానికి బలమవుతాయి. డేనియల్ కు కూడా మాక్స్ విషయంలో ఎస్తర్ మీద అనుమానంతో ఉంటాడు.          మాక్స్  నుండి జరిగింది   తెలుసుకున్న  డేనియల్ సిస్టర్   హత్యలో  ఆధారాలు  చూపిస్తే  అందరూ   నమ్ముతారని మర్నాడు  అక్కడికి  వెళ్తాడు .అప్పటికే జరిగింది చాటుగా విన్న ఎస్తర్    ట్రీ   హౌస్  కు మంటపెట్టి  అతన్ని  చంపే  ప్రయత్నం  చేస్తుంది . కేట్   చివర్లో    గమనించడంతో   హాస్పటల్  కు తీసుకువెళ్తారు. అప్పటికే  ఎస్తర్  గదిలో ఉన్న బైబిల్  సార్న్  ఇన్స్టిట్యూట్ అన్న పేరు చూస్తుంది  కేట్ .అక్కడ సంప్రదిస్తే అది మెంటల్ హాస్పటల్ అని తెలుస్తుంది .

ఆ  తర్వాత డేనియల్  స్పృహ లోకి వస్తే  జరిగింది బయట పడుతుందని మళ్ళీ అతన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తుంది ఎస్తర్. అది చేసింది ఎస్తర్ అని కేట్ ఆమెను కొట్టబోవడంతో ఆమెకు  ఇంజెక్షన్స్ ఇచ్చి హాస్పటల్ లో ఉంచుతారు. ఎస్తర్ ,మాక్స్ లను తీసుకుని జాన్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక ఎస్తర్ కేట్ బట్టలను కత్తిరించి తన సైజులో వేసుకుని ,మేకప్ వేసుకుని జాన్ ను  రెచ్చగొట్టడానికి  ప్రయత్నిస్తుంది .ఆమెకు బుద్ధి చెప్పాలని ప్రయత్నిస్తాడు జాన్. 

హాస్పటల్ లో ఉన్న కేట్ కు సార్న్  నుండి ఓ డాక్టర్ కాల్ చేస్తాడు. ఆమె పేరు ఎస్తర్ కాదని ,లీనా అని ఆమె వయసు 33 ఏళ్ళు అని ,హైపో పిట్యుటరీజమ్ వల్ల ఆమె పెరగలేదని ,ఆమె హాస్పటల్ లో కూడా హింసాత్మకంగా ప్రవర్తించిందని ,ఏడుగురిని హత్య చేసిందని ,ఆ క్రమంలో ఆమె మెడ ,మోచేతుల మీద మచ్చలు ఉంటాయని ,అంతకు ముందు దత్తత తీసుకున్న కుటుంబంలో తండ్రిని ఆకట్టుకోవాలనే ప్రయత్నం విఫలం అవ్వడంతో  ఆ కుటుంబాన్ని అగ్ని ప్రమాదానికి గురి చేసిందని చెప్తాడు. ఎందుకు ఎస్తర్ రిబ్బన్లు మెడకు ,మోచేతులకు కట్టుకుంటుందో అప్పుడు అర్ధమవుతుంది కేట్ కు.

భర్తను ,కూతుర్ని కాపాడుకోవడానికి ఇంటికి బయల్దేరిన కేట్ ఇంటికి చేరుకునేలోపే జాన్ ను ఎస్తర్ హత్య చేస్తుంది. తర్వాత మాక్స్ ను మాత్రం కేట్ కాపాడుకోగలుగుతుంది. ఆ ప్రయత్నంలో ఎస్తర్ ను హత్య చేస్తుంది కేట్ .సినిమా ఇలా ముగుస్తుంది. 

దీనికి ప్రిక్వెల్ గా ఎస్తర్ సినిమా తీసే ప్రయత్నంలో ఇప్పుడు దర్శక శాఖ ఉన్నట్టు ప్రకటించారు. సినిమా చూస్తుంటే చివరి వరకు కూడా కేవలం ఆమె తన మీద మాత్రమే ప్రేమ ఉండాలనో లేక తాను ఆ ఇంట్లో ఉండిపోవాలనో లేక ఆమెలో ఏదైనా అనుభవాల వల్ల క్రూరమైన మనస్తత్వం వచ్చిందేమో అన్న స్పృహ తప్ప ఆమె 33 ఏళ్ల స్త్రీ  అన్నది మాత్రం ప్రేక్షకులు ఊహించని మలుపే .అదే ఈ సినిమాకు ప్రాణం పోసిన ట్విస్టు. 

సినిమాలో ఎస్తర్ క్యారెక్టర్  బిల్డ్ చేసిన విధానం కూడా చాలా బావుంటుంది. బోర్ కొట్టనివ్వని సినిమా ఇది. మీరు  వైవిధ్యాన్ని ఇష్టపడే ప్రేక్షకులైతే ఈ సినిమా  చూడాల్సిందే. 

     *   *   * 

 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!