నేరస్తుడు ఎఫ్ బి ఐ ఉద్యోగి అయితే ?

 సినీ సంచారం 

                           నేరస్తుడు ఎఫ్ బి ఐ ఉద్యోగి అయితే ?  

                                                    -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 


     స్టీవెన్ స్పీల్ బర్గ్ సినిమాలంటేనే ప్రేక్షకుల్లో ఎంతో కుతూహలం. టైటానిక్ హీరో ,బయోగ్రఫీ సినిమాల్లోనూ వైవిధ్యభరితపాత్రల్లోనూ ప్రేక్షకులను మెప్పించిన లియానార్డో డి కాప్రి,'ఫిలదేల్ఫియా ' వంటి సినిమాలతో తన నటనను నిరూపించుకున్న టామ్ హ్యాంక్స్  కాంబినేషన్ లో వచ్చిన ఓ బయోగ్రఫీ సినిమానే 2002 లో వచ్చిన 'Catch Me If You Can.' మనిషికి ఉన్న ఒకే ఆయుధం ఆలోచన, దాని నుండి ఉద్భవించే కార్యాలు. తన తెలివితేటలతో 19 సంవత్సరాల వయసులోనే మిలియన్ల డాలర్ల ఫ్రాడ్ చేసి, ఓ పైలట్ గా ,ఓ డాక్టర్ గా , ఓ లాయర్ గా నమ్మించిన ఫ్రాంక్ అబగ్నేల్ జూనియర్ జీవితం ఆధారంగా తీసిన సినిమానే  'Catch Me If You Can.' 

    1963 లో జరిగిన కథ ఇది. ఈ సినిమా 1980 లోనే తీద్దామనుకున్నప్పటికీ కూడా 1997 వరకు ముందడుగు పడలేదు. ఫ్రాంక్ అబగ్నేల్ జూనియర్ తండ్రికి ఐఆర్ ఎస్ తో సమస్య ఉండటంతో పెద్ద ఇంటి నుండి చిన్న అపార్ట్మెంటుకు మారతారు. అదే సమయంలో అతని తల్లి తండ్రి స్నేహితుడితో సంబంధం పెట్టుకుంటుంటుంది. అబగ్నేల్ స్కూల్ కూడా మారాల్సి వస్తుంది. స్కూలులో సబ్స్టిట్యూట్ టీచర్ గా నటిస్తాడు అబిగ్నేల్. తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేక విడాకులు తీసుకోవడంతో అతను ఇంటి నుండి పారిపోతాడు. 

అలా పారిపోయిన అబిగ్నేల్  పాన్ అమెరికన్ పైలెట్ గా నటిస్తూ చెక్కులు ఫోర్జరీ చేస్తూ కొన్ని మిలియన్ డాలర్లు సంపాదిస్తాడు. ఆ తర్వాత ఓ డాక్టర్ గా ,ఆ తర్వాత ఓ లాయర్ గా కూడా నటిస్తాడు. ఆ క్రమంలోనే ఓ నర్సును ప్రేమిస్తాడు. అబిగ్నేల్ ను ఎఫ్ బి ఐ ఏజెంట్ కార్ల్ హ్యాన్ రాటీ చివరకు పట్టుకుంటాడు. అలా అరెస్ట్ అయ్యి జైలులో కొంతకాలం గడిపిన తర్వాత అతని తెలివితేటలు గమనించిన ఎఫ్ బి ఐ లో చెక్ ఫోర్జరీ ఫ్రాడ్ కేసుల్లో పని చేయడానికి తీసుకుంటారు. అతని వ్యక్తిగత జీవితానికి వస్తే అతని తండ్రి  ట్రెయిన్ ఎక్కుతున్నప్పుడు కాలు జారీ పడి మరణిస్తాడు. తల్లి ఇంకొకరిని వివాహం చేసుకుని ఇంకో పాపకు తల్లి అవుతుంది. అతను ఎఫ్ బి ఐ తో పని చేయడంతో సినిమా ముగుస్తుంది. టామ్ కాప్రి   నటన సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి.  అబిగ్నేల్ , కార్ల్   మధ్య సంబంధాన్ని   కూడా సినిమాలో చాలా చక్కగా చూపించారు.

నేరాలు జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. హత్యలు, మానభంగాలు ఆవేశం -కక్ష వంటి వాటి నుండి ఉద్భవిస్తే స్కాములు మాత్రం చాలా వరకు తెలివైన మెదడు నుండే ఉద్భవిస్తాయి. అటువంటి తెలివితేటలకు గుర్తింపు ఉన్న చోట వ్యక్తి తెలివితేటలు దేశ ప్రగతికి నిస్సందేహంగా తోడ్పడతాయి అనడానికి అబగ్నేల్ జీవితమే ఓ ఉదాహరణ. 

మనిషి జీవితంలో ఎటువంటి పరిస్థితులు అతన్ని చెడ్డ వాడిని చేస్తాయో కూడా ఈ సినిమా చూపిస్తుంది. నిజ జీవితం నుండే సినిమాలు పుడతాయి, అటువంటి సినిమాలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి. అటువంటి సినిమానే ఇది. 

                *    * * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!