ఏది బహుమతి ?

 సినీ సంచారం 

                          ఏది  బహుమతి ? 

                                   -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



       సినిమాల్లో చాలా చిన్న అంశాలతో సస్పెన్స్ ను నిర్మించడం చాలా కష్టమైన అంశం. చాలా మామూలుగా వెళ్తున్న సినిమా, అందులోనూ నాయకుడు ప్రతినాయకుడు అవ్వడం ,చివరకు ప్రతినాయకుడు నాయకుడిగా కనిపించేలా చేయడం చాలా సినిమాల్లో అంతర్లీన సూత్రం అయినప్పటికీ కూడా 2015 లో వచ్చిన ఆస్ట్రేలియన్ దర్శకుడు జోల్ ఎడ్గర్టన్ తీసిన 'ద గిఫ్ట్ ' మాత్రం స్క్రీన్ ప్లే ,పాత్రల చిత్రీకరణ, కథను దశల వారీగా నిర్మించిన తీరు  గురించి అయినా కచ్చితంగా చూడాల్సిన సినిమా. 

సినిమా ప్రారంభం చాలా సాధారణంగా ఉంటుంది. సైమన్ ,రాబిన్ దంపతులు సైమన్ కు లాస్ ఏంజెల్స్ లో ఉద్యోగం రావడంతో చికాగో నుండి అక్కడికి వస్తారు. అక్కడ ఓ షాపింగ్ మాల్ లో గోర్డన్ అనే అతను సైమన్ స్నేహితుడిగా పరిచయం చేసుకుంటాడు. అలా అతనికి , ఆ కుటుంబానికి మధ్య స్నేహం ఏర్పడుతుంది. గోర్డన్  వారికి ముందు ఓ వైన్ బాటిల్ ను , తర్వాత చేపలను బహుమతిగా పంపిస్తాడు. తర్వాత ఓ రోజు తన ఇంటికి పార్టీకీ ఆహ్వానిస్తాడు గోర్డన్ వారిని. వారు వచ్చాక తనకు ఏదో అతి ముఖ్యమైన పని ఉందని ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పి వెళ్తాడు. అతను బయటకు వెళ్ళాక సైమన్ కేవలం రాబిన్ మీద కోరికతోనే అతను తను ఇంట్లో లేనప్పుడే వచ్చేవాడని, అతని గురించి అసభ్యంగా మాట్లాడతాడు. ఆ తర్వాత కుతూహలం కొద్ది అతని ఇంటిని గమనించడానికి వెళ్ళిన ఆ దంపతులకు వార్డ్ రోబ్ లో స్త్రీల దుస్తులు కనిపిస్తాయి. తనకు వివాహం కాలేదని చెప్పిన గోర్డన్ ఇంట్లో అవి కనిపించడంతో సైమన్ అతన్ని అనుమానిస్తాడు. 

ఆ తర్వాత గోర్డన్ తిరిగి వచ్చాక తనకు పెళ్ళయిందని, ఇద్దరు పిల్లలని, డైవోర్స్ కూడా అయ్యిందని , ఆ పిల్లలను కూడా ఆమె తీసుకువెళ్ళిందని , ఆ ఇల్లు కూడా ఆమెదేనని ,ఆమె ఎప్పుడు వెళ్లిపోమంటే అప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోవాలని చెప్తాడు. సైమన్ ఇక ఎప్పుడు తమను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చెయ్యవద్దని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి భార్యతో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజుకి గోర్డన్ ఇచ్చిన చేపలు మరణిస్తాయి, సైమన్ కుటుంబం పెంచుకుంటున్న కుక్క కూడా కనిపించకుండా పోతుంది. గోర్డన్ ఇదంతా చేశాడని భావించిన సైమన్ అతని ఇంటికి వెళ్తే అది అతని ఇల్లు కాదని తెలుస్తుంది. ఆ తర్వాత కుక్క మిస్సింగ్ కంప్లెయింట్ ఇస్తారు. తర్వాతి రోజుకు కుక్క ఇంటికి తిరిగి వస్తుంది. కానీ గోర్డన్ ప్రతి రోజు తమ ఇంటి చుట్టూనే తచ్చాడుతున్న భావన రాబిన్ కు రోజు రోజుకు ఎక్కువవుతూ ఉంటుంది. ఓ రోజు ఆ భావంలో ఉండగానే ఆమె కళ్ళు తిరిగి  పడిపోతుంది. 

ఇప్పటి వరకు మనకు గోర్డన్ అపరాధి అన్న భావన కలుగుతుంది. అంతే కాకుండా సైమన్ గోర్డన్ బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసినట్టు అతని ఫైల్ ద్వారా తెలుసుకుంటుంది  రాబిన్. అంతే కాకుండా అతను ఆ తర్వాత సారి చెప్తూ ఉత్తరం పంపించడం ,అందులో జరిగిపోయింది జరిగిపోయినట్టే అని రాయడంతో రాబిన్ కు అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు రాబిన్ గర్భవతి అవుతుంది. ఆ సందర్భంగా సైమన్ తల్లి ,చెల్లి ఆమెను  చూడటానికి వస్తారు. ఆ సందర్భంలో గోర్డన్ గురించి అతని చెల్లిని అడుగుతుంది రాబిన్. గోర్డన్ కారులో ఓ అబ్బాయితో ఉండటం చూసిన సైమన్ ,అతని గురించి రిపోర్ట్ చేశాడని చెప్తుంది. ఈ విషయంలో సైమన్ తో పాటు అతని స్నేహితుడు గ్రెగ్ కూడా ఉన్నాడని ఆమె చెప్తుంది. ఏదో  జరగడం వల్లే గోర్డన్ తమకు అపకారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, ఆ విషయం భర్తను అడిగిన ప్రయోజనం ఉండదని భావించిన రాబిన్ గ్రెగ్ ను అసలు విషయం తెలుసుకోవడానికి  కలవడానికి నిర్ణయించుకుంటుంది. 

సైమన్ స్కూల్ సమయంలో బులీ అని ,అతనికి ఏ విద్యార్ధులైతే బలహీనంగా ఉంటారో వారిని ఏడిపించడం సరదా అని, గోర్డన్ ను అలా ఏడిపించడానికి అతను గే అని సృష్టించాడని ,దాని వల్ల గోర్డన్ జీవితం నాశనం అయ్యిందని చెప్తాడు గ్రెగ్ . అంతే కాకుండా గోర్డన్ గే అనుకుని అతని తండ్రి అతన్ని హత్య  చేయడానికి ప్రయత్నిస్తే ,అతన్ని హత్య చేసే ప్రయత్నం చేసినందుకు అరెస్ట్ చేశారని ,ఆ తర్వాత గోర్డన్ మిలిటరీ స్కూలుకు వెళ్లాడని  తెలుసుకుంటుంది రాబిన్. సైమన్ ఎందుకలా చేశాడని రాబిన్ గ్రెగ్ ను ప్రశ్నిస్తే అతను చెయ్యగలడు కాబట్టి అని సమాధానమిస్తాడు  గ్రెగ్ . 

ఇంటికి  తిరిగి వచ్చాక జరిగింది సైమన్ కు తెలియడంతో అతన్ని గోర్డన్ కు క్షమాపణ చెప్పమంటుంది రాబిన్. అయిష్టంగానే చెప్పడానికి వెళ్తాడు సైమన్. కానీ అతను అయిష్టంగా చెప్తున్నాడని గ్రహించిన గోర్డన్ ఆ క్షమాపణ అంగీకరించడు. దానితో అతని మీద దాడి చేసి తన కుటుంబం జోలికి రావద్దని హెచ్చరించి వెళ్ళిపోతాడు సైమన్. తర్వాత సైమన్ కు ప్రమోషన్ వచ్చిన సందర్భంలో పార్టీ ఇస్తున్నప్పుడు డొనాల్డ్ అతని మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. దీనికి కారణం ప్రమోషన్ కు సైమన్ కు పోటీగా ఉన్న వ్యక్తి డొనాల్డ్ . అందుకని అతని అడ్డు తొలగించుకోవడం కోసం  అబధ్హాలు సృష్టించి మెయిల్ చేస్తాడు సైమన్. ఆ తర్వాత రాబిన్ బాబును ప్రసవిస్తుంది. కానీ ఆమె మనసులో మాత్రం సైమన్ పట్ల అసహ్యం కలుగుతుంది. 

అదే సమయంలో ఆఫీసు నుండి సైమన్ కు ఫోన్ వస్తుంది. అతను డొనాల్డ్ పట్ల చేసిన కుట్ర తెలిసిపోయిందని ,అతని ఉద్యోగం పోయిందని తెలుస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళేసరికి ఓ గిఫ్ట్ వస్తుంది . అది గోర్డన్ పంపించింది . అందులో రెండు సీడీలు ఉంటాయి. ఒక దాంట్లో సైమన్ ,రాబిన్ గోర్డన్ ఇంటికి వెళ్లినప్పుడు అతని గురించి మాట్లాడిన మాటలు ఉంటాయి. ఇంకో సిడిలో   రాబిన్ స్పృహ తప్పిన రోజు గోర్డన్ అక్కడికి రావడం ఆమె స్పొర్ట్స్ డ్రింక్ లో స్లీపింగ్ పిల్స్ కలపడం , ఆ తర్వాత ఓ మంకీ మాస్క్ (సైమన్ కు మంకీ అంటే భయం ) ఉన్న గోర్డన్ ఆమెను సోఫా దగ్గరకు లాకెళ్ళడం ,ఆమెకు అతి సన్నిహితంగా వెళ్ళడంతో ఆ సీడీ ముగుస్తుంది. దానితో గోర్డన్ ఆమెను ఏమైనా చేశాడా లేదా అన్న దాని మీద ఏమి తెలియకుండా ఉంటుంది సైమన్ కు. అందులోనూ ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్న గర్భవతి కానీ రాబిన్ అప్పుడు గర్భవతి అవ్వడం కూడా అతనికి అనుమానాన్ని కలిగిస్తుంది. 

ఈ లోపు గోర్డన్ హాస్పటల్ కు వెళ్ళి పూల బొకేతో  బ్యాండేజీ తో  వెళ్ళి రాబిన్ కు క౦గ్రాచ్యూలేషన్స్  చెప్తాడు. దానికి కారణం సైమన్ అని చెప్తాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన గోర్డన్ బ్యాండెజ్ తీసేస్తాడు. ఆ తర్వాత అక్కడికి  వచ్చిన సైమన్ కు కాల్ చేస్తాడు.  ఆ రోజు తను నిజంగా ఏమైనా చేశాడా ? లేదా అన్నది చెప్పనని, అలాగే ఆ బిడ్డ ఎవరి బిడ్డో కూడా తెలియకుండానే ఉంటుందని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు గోర్డన్ . 

ఓ పక్క ఉద్యోగ భవిష్యత్తు నాశనమయ్యి , ఇంకో పక్క భార్యతో సత్సంబంధాన్ని కోల్పోయి, ఇంకో పక్క బిడ్డకు తండ్రి ఎవరో తెలియని  పరిస్థితి కల్పించి గోర్డన్ తన జీవితాన్ని నాశనం చేసిన  సైమన్ పట్ల కక్ష తీర్చుకున్నాడు. ఈ సినిమాలో నాయకులు -ప్రతినాయకుల అంశం కన్నా పరిస్థితులు -మనుషుల మనస్తత్వాలు ఎక్కువ దర్శనమిస్తాయి. సినిమాలో పాత్రలు అన్నీ చాలా నెమ్మదిగా సంఘటనలతో పయనిస్తునట్టు ఉంటాయి ఈ సినిమాలో. ఆ నెమ్మదితనం దశలవారిగా ఒక్కో విషయాన్ని కనక్ట్ చెయ్యగలగడం ఈ సినిమా విజయానికి కారణమైంది. 

తమ శక్తిని ,ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని ఉండే తపన వల్ల ఎలా జీవితాలు నాశనమవుతాయో , ఆ తప్పును ఒప్పుకోకుండా దానిని ఒప్పుగా భావించడం, ఇంకా అదే ధోరణితో కొనసాగడం మనిషి జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలిపే సినిమా ఇది. 

     *   *  * 

                                                                                                                                      



Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!