మాతృప్రేమ

 సినీ సంచారం 

                          మాతృప్రేమ 

                                   -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



తల్లికి  బిడ్డలందరూ ఒకటే. కానీ  తన అవసరమున్న బిడ్డల పట్ల ఆపేక్ష కాస్త ఎక్కువ ఉండటం కూడా సహజమే. కానీ ఒక బిడ్డ కోసమే అత్యధికంగా తపించిన ఓ తల్లి మిగిలిన బిడ్డల జీవితంలో, వారి జ్ఞాపకాలలో ఎక్కువ ఉండలేకపోయింది. ఆమె తపించిన బిడ్డను చివరకు అయిన స్వేచ్చగా వదలగలిగిందా ? తల్లికి బిడ్డ ఎటువంటి లోపాలతో ఉన్నా సరే ఆమె ప్రేమ అధికమవుతుందే తప్ప ఏమాత్రం తగ్గదు అన్న కథాంశంతో 2001 లో వచ్చిన సినిమానే 'జువెల్ .' 

1945 లో కథ మొదలవుతుంది. జువెల్ ,ఆమె భర్త లెస్టన్ మిసిసిప్పి  గ్రామీణ వాతావరణంలో జీవిస్తున్నారు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు ,ఇద్దరు మగపిల్లలు. మంత్రసాని అయిన కేతడ్రాల్  ఆమె ఇంట్లో పిల్లలను చూస్తూ ఉంటుంది. జువెల్  మరలా గర్భవతి అవుతుంది. ఈ సారి ఆమెకు ఓ పాప పుడుతుంది. ఆమెకు భర్త సోదరి ఎవరైతే బిడ్డకు జన్మనిస్తూ మరణిస్తుందో ఆమె పేరైన బ్రెండా కే అని పెడతారు. 

బ్రెండా పుట్టిన నాటి నుండి ఎక్కువ చలనం లేకుండా మందకొడిగా ఉంటుంది. అనుమానమొచ్చి వైద్యుడికి చూపిస్తే ఆమెకు డౌన్ సిండ్రోమ్ ఉందని చెప్తాడు.అంటే శారీరక, మానసిక ఎదుగుదల లేకపోవడం.23 జతలుగా ఉండే మానవ  క్రోమోజోమ్స్ లో 21 వ క్రోమోజోమ్ రెండు కాకుండా ఇంకొకటి ఎక్కువగా మూడు ఉంటే అది డౌన్ సిండ్రోమ్ కు దారి తీస్తుంది.   ఆమె రెండేళ్ళు దాటేవరకు బ్రతకడం కూడా అసాధ్యమే అని ,ఆ పాపను ఏదైనా ఇన్స్టిట్యూషన్ కు ఇవ్వమని సలహా కూడా ఇస్తాడు ఆ వైద్యుడు . కానీ జువెల్ మాత్రం తన బిడ్డను ఇవ్వడానికి ఒప్పుకోదు. 

ఆ  రోజు నుండి బ్రెండా జువెల్ లోకమైపోతుంది. ఆమెను వదిలి  క్షణం కూడా ఉండదు. ఏడేళ్ళకు బ్రెండా మెట్లు దిగగలుగుతుంది ,నడవగలుగుతుంది. ఓ పత్రికలో బ్రెండా లాంటి పిల్లల కోసం స్కూల్ కాలిఫోర్నియా లో ఉందని తెలుసుకున్న జువెల్ అక్కడ ఎలా అయినా  బ్రెండా మంచి భవిష్యత్తు కోసం చేర్చాలని నిర్ణయించుకుంటుంది. దాని కోసం భర్తకు చెప్పకుండా ఇంట్లో ఉన్న చిన్న చిన్న వస్తువులు కూడా అమ్మేస్తుంది. చివరకు ఎలాగో భర్తను ఒప్పించి అక్కడి ఇల్లు ,నేల అమ్మించి కాలిఫోర్నియాకు బయల్దేరదీస్తుంది. 

అదే సమయంలో ఆమె పెద్ద కూతురైన రేలిన్ ఒకతన్ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నానని తీసుకువస్తుంది. తనకెందుకు చెప్పలేదని జువెల్ అడిగితే ఆమెకు బ్రెండా పుట్టినప్పటి నుండి ఇంకే విషయాలు పట్టనంత తీరిక లేకుండా ఉండటం వల్ల చెప్పలేదని అంటుంది. దాని తర్వాత వారు   కాలిఫోర్నియా వెళ్తారు. అక్కడ స్కూల్ లో బ్రెండా ను చేర్పిస్తుంది జువెల్. 

    అక్కడ  టీచర్ గా కూడా పని చేస్తుంది జువెల్. బ్రెండా కు 16 ఏళ్ళు వస్తాయి. అయినా చిన్న పిల్ల లాంటి మనస్తత్వమే ఉంటుంది. ఇంతలో రేలిన్  భర్తతో పొసగక విడాకులు తీసుకుని తల్లిదండ్రుల దగ్గరకు ఇద్దరు పిల్లలతో వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆమె పిల్లలకు పెళ్లిళ్లు అవుతాయి. మనవళ్ళు, మనవరాళ్ళను   పట్టించుకోవాల్సిన సమయంలో కూడా బ్రెండా ను క్షణం వదలకుండా ఉండటం ఆమె మిగిలిన పిల్లలకు కోపం తెప్పిస్తుంది. జీవితంలో బ్రెండా పుట్టిన క్షణం నుండి తమకు తల్లి లేకుండా పోయిందని అనడంతో జువెల్ బాధపడుతుంది. 

ఎంత కాలం తను బ్రెండా తో ఉండగలదు ? ఆమెను ఆమె జీవితం గడిపే అవకాశం ఇవ్వాలని లెస్టన్ ,మిగిలిన వారు సూచించిన మేరకు ఆమె కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తుంది. బ్రెండా లాంటి వారి కోసం ఉన్న హోమ్ లో ఆమెను వదిలి రావడంతో సినిమా ముగుస్తుంది. బ్రెండా ను పెంచడం కన్నా అన్నేళ్లు అలవాటు పడ్డాక ఆమెను ఆమె జీవితం గడపడానికి వదిలెయ్యడమే కష్టమైన పని అని సినిమా చివర్లో జువెల్ అంటుంది. 

తల్లి  ప్రేమకు సాటైన ప్రేమ మరొకటి లేదు. కానీ అది ఓ ఆబ్సెషన్ లా తయారవ్వకూడదు. మనిషి ఎలా జన్మించినా సరే వారి  వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకునే స్వేచ్చ ఇచ్చి తీరాలి. లేకపోతే ఆ బిడ్డ ఈ సమాజం లో  మనుగడ సాగించలేదు. 

                         *     *   * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!