క్షమ

 సినీ సంచారం 

                                   క్షమ

                                -రచనశ్రీదత్త (శృంగవరపు  రచన)



                  క్షమించగలగడం అన్నది ఎటువంటి అంశాలకు వర్తిస్తుందో చెప్పడం కష్టం. కానీ కన్నబిడ్డల్ని  చంపిన హత్యల్ని కూడా క్షమించగల వారి మనసు జాతీయ వార్తలకు సైతం ప్రధాన వార్తగా మారింది. అక్టోబర్ 2,2206 లో వెస్ట్  నికిల్ మైన్స్  స్కూల్ లో అమిష్ జాతి పిల్లలను చంపడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం ఆధారంగా వచ్చిన సినిమానే 'అమిష్  గ్రేస్.' సినిమా కాబట్టి కాల్పనికత కూడా జోడించబడింది. 

అమెరికాలో నివసించే ఓ జాతి అమిష్ . వారు క్రైస్తవ మతానికి చెందినవారు. నిరాడంబరమైన జీవితం, సినిమా వంటి మాధ్యమాలకు దూరంగా ఉండటం, ప్రశాంతంగా జీవించడం వారి లక్షణాలు. ఇడా ,గిడెన్ భార్యాభర్తలు. ఇడా అక్క ఓ ఇంగ్లీష్ వ్యక్తిని ప్రేమించి అతనితో వెళ్ళిపోయినందుకు ఆమె బహిష్కరిస్తారు. కొంతకాలానికి ఆమె భర్త మరణిస్తాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె అప్పుడప్పుడు ఆమె చెల్లెలైన ఇడాకు తన గురించి తెలుపుతూ ఉత్తరాలు రాస్తూ ,ఫోటోలు పంపిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలిసిన  ఆమె భర్త ,ఆమె ఇరుగుపొరుగున ఉండేవాళ్లు ఆమె బహిష్కరించబడింది కనుక ఆమెతో ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దని చెప్తారు. 

సినిమా మొత్తం అమిష్ జాతి జీవనం ఎంత నిరాడంబరంగా ఉంటుందో తెలుపుతుంది. ఇడాకు ఇద్దరు కూతుళ్ళు . ఒకరు మేరీ బెత్ ,14 ఏళ్ళ పాప . ఇంకొకరు కేటీ, మేరీ బెత్ చెల్లెలు. రెబెకా ,రేచెల్  ఇడా కు ఇరుగుపొరుగున ఉండే స్నేహితురాళ్ళు . అందరూ పిల్లలు కలిసే ఆడుకునేవారు ,సరదాగా కాలం గడిపేవారు. మేరీ బెత్ కు టీచర్ అవ్వాలనే కోరిక ఉండేది. అందుకోసం  అమిష్ జాతి కోసం ఉన్న వెస్ట్  నికిల్ మైన్స్ స్కూల్ లో రూత్ అనే టీచర్ కు హెల్పర్ గా వెళ్ళాలని నిర్ణయించుకుని రూత్ అనుమతి తీసుకుంటుంది. 

వారితో పాటే అమిష్ జాతికి చెందని రాబర్ట్ అనే అతను కూడా భార్యాబిడ్డలతో అక్కడే  మిల్క్ ట్రక్ డ్రైవర్ గా జీవిస్తూ ఉండేవాడు. అతనికి భార్యా. ముగ్గురు పిల్లలు ఉన్నారు. తొమ్మిదేళ్ళ క్రితం అతనికి ఓ కూతురు పుట్టిన ఇరవై నిమిషాలకే మరణించింది. దానితో దేవుడి మీద ద్వేషం ,కోపం పెంచుకున్న అతను వెస్ట్ నికిల్ మైన్స్ స్కూల్ కు వెళ్ళి అక్కడి ఎనిమిది మంది ఆడపిల్లలని కాల్చి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అందులో ఐదుగురు బ్రతికారు. ముగ్గురు చనిపోయారు. వారిలో మేరీ బెత్ కూడా ఒకరు. 

ఈ సినిమాలోని ఇడా కుటుంబం కల్పనే. కానీ ముగ్గురు చనిపోవడం ,ఐదుగురు బ్రతకడం మాత్రం వాస్తవం. రాబర్ట్స్  ఈ సినిమాలో తన భార్యకు ఓ సూసైడ్ నోట్ రాస్తాడు . కానీ నిజానికి అతను నాలుగు సూసైడ్ నోట్లు రాస్తాడు ,మూడు పిల్లలకు ,ఒకటి భార్యకు . ఈ సినిమాలో కేవలం తన కూతురు చనిపోవడం వల్ల దెవుడి మీద ఏర్పడిన కోపం ,ద్వేషం వల్ల చేశానని పేర్కొన్నట్టు చూపించినప్పటికీ , వాస్తవానికి అతను 12 ఏళ్ళ వయసులో తన బంధువులైన ఇద్దరు ఆడ పిల్లలపై  అత్యాచారానికి  పాల్పడినట్టు , ఆ పీడ కలలు తనను ఇంకా వెంటాడుతున్నట్టు కూడా రాశాడు. కానీ ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు అటువంటిది ఏది జరిగినట్టు లేదని పేర్కొని ,ఈ ఉదంతం సమయంలో అతని మానసిక స్థితి కూడా అనుమానాస్పదంగానే ఉన్నట్టు పేర్కొన్నారు. 

ఈ సంఘటన జరిగిన తర్వాత అమిష్ కమ్యూనిటీ పెద్దలు రాబర్ట్స్ ఇంటికి వెళ్ళి తమకు రాబర్ట్స్ పట్ల కోపం లేదని ,అతన్ని క్షమించామని ,ఆమెకు ఎటువంటి సాయం కావాలన్నా సరే తాము ఉంటామని చెప్తారు. అందులో గిడెన్ కూడా ఉన్నాడు. ఈ విషయం తెలిసిన ఇడా మాత్రం రాబర్ట్స్ పట్ల ,ఆమె భార్య పట్ల ద్వేషం మానుకోలేకుండా ఉంది. భర్త చేసిన పని ఆమెకు నచ్చదు. మిగిలిన ఇద్దరు బిడ్డలను కోల్పోయిన తల్లులు కూడా క్షమించినప్పటికీ ఆమె మాత్రం వారిని క్షమించలేదు. ఆమె అడిగిన ఓ ప్రశ్న మాత్రం అందర్నీ ఆలోచింపజేస్తుంది. తమ కన్నబిడ్డల్ని చంపిన హంతకుడిని సైతం క్షమించే గుణం ఉన్నప్పటికీ ,ప్రేమించి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయిన తన అక్కను మాత్రం క్షమించి అంగీకరించే మనసు లేదా అన్న ఆమె ప్రశ్న అందర్నీ ఆలోచింపజేసే ప్రశ్నే. 

తన బిడ్డ చనిపోయిన చోటులో తాను ఉండనని, తన అక్క దగ్గరకు నగరానికి వెళ్లిపోదామని అనుకున్నప్పటికీ చివరకు ఆమె కూడా వారిని క్షమించి అక్కడే ఉండిపోవడంతో సినిమా ముగుస్తుంది. ప్రేమ -పెళ్ళి విషయాల్లో మనుషులకు లేని వ్యక్తిగత స్వేచ్చ  ఓ వైపైతే హంతకుల్ని సైతం క్షమించే క్షమా గుణం ఇంకో వైపు  అమిష్ జాతిలో ఉంది. వారు ఈ ఉదంతం పట్ల వ్యవహరించిన తీరు ప్రపంచ చరిత్రలో క్షమకు ఇంకో అర్ధాన్ని ఇచ్చినదన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. 

                *    *   *

Comments

  1. రచనా శ్రీ దత్తా!
    మీరు సమీక్షించిన సినిమా బాగుంది.
    ఆఖరున ఆమె ప్రశ్న కూడా బాగుంది.
    అయితే
    మానవ మనస్తత్వం ఎటువంటిది అంటే
    గుంపులో ఉంటే ఒకలా
    ఒంటరిగా ఉంటే ఒకలా
    అందుకే ఈ వివక్షలు.
    మీ రచనలు బాగుంటున్నాయి.
    అభినందనలు 👍

    ReplyDelete
    Replies
    1. శ్రీలక్ష్మి గారు ధన్యవాదాలు. మీరు చెప్పింది కరక్ట్ . మనిషి నలుగురిలో ఉన్నప్పుడూ మాత్రం ఉదాత్తత ప్రదర్శించడానికి వెనుకాడడు, కానీ వ్యక్తిగతమైన దృక్కోణానికి వచ్చేసరికి కచ్చితంగా అసలు ముసుగులోనే జీవించడానికి ఇష్టపడతాడు. బహుశా సమాజం కూడా దాన్ని ఆమోదిస్తుంది అనుకుంటా!

      Delete

Post a Comment

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!