వ్యాంపైర్స్ వర్సస్ మనుషులు

 సినీ సంచారం 

             వ్యాంపైర్స్  వర్సస్ మనుషులు 

                         -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



'డ్రాకులా' తో మొదలైన వాంపైర్ సినిమాలు రోజురోజుకి ఆదరణ పెంచుకుంటున్నాయి. షెర్లాక్ హోమ్స్ పాత్రతో వచ్చిన వందల సినిమాల రేసులో డ్రాకులా కూడా దాదాపు 170 వెర్షన్లతో నిలబడింది. 'వ్యాంపైర్ డైరీస్ ', 'ట్విలైట్  ', 'అండర్ వరల్డ్ ' ఇంకా ఎన్నెన్నో సినిమాలు వ్యాంపైర్ వర్గంతో తమకంటూ సినీ ప్రేక్షకుల్లో అభిమాన వర్గాన్ని తయారు చేసుకున్నాయి. తర్వాత ఇదే వ్యాంపైర్ అంశాన్ని సైన్స్ ఫిక్షన్ తో కలిపే వైవిధ్యం కూడా ప్రేక్షకాదరణ పొందింది. ఆ వ్యాంపైర్ సైన్స్ ఫిక్షన్ కోవకు చెందిన సినిమానే 'డే బ్రేకర్స్ .' 

2009 లో ఓ గబ్బిలం వల్ల వచ్చిన ప్లేగు వల్ల  చాలా మంది మనుషులు వ్యాంపైర్స్ గా మారిపోయారు. దీని వల్ల మనుషుల జనాభా తగ్గిపోయింది. వ్యాంపైర్స్ గా ఉన్న వారు అమరులు. అందులోనూ మనుషుల రక్తం మీద బ్రతకల్సిన వాళ్ళు. అలా జీవించకపోతే క్రమేపీ వారు కూడా క్షీణించి మరణిస్తారు. 

అమెరికాలో రక్తం సప్లై చేసే అతి పెద్ద ఫార్మాసూటికల్ కంపెనీ అయిన బ్రోమ్లీ మార్క్స్ లో ఎడ్వార్డ్ డాల్టన్ అనే హెమటాలజిస్ట్ పని చేస్తూ ఉంటాడు. ఆ కంపెనీ ఈ పరిస్థితిని  తన వ్యాపారానికి  అనుకూలంగా మార్చుకుంటుంది. మనుషుల ఫార్మ్ ఏర్పాటు చేసి అక్కడి మనుషుల రక్తం మీద వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆ రక్తాన్ని వ్యాంపైర్స్ కు అమ్మడం అన్నది ప్రభుత్వం కూడా ఆమోదించినదే . అదే సమయంలో అక్కడ రక్తానికి సబ్స్టిట్యూట్ గా 'బ్లడ్ సబ్స్టిట్యూట్ ' ను ఎడ్వార్డ్ డాల్టన్ తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను కూడా వ్యాంపైర్ అయినప్పటికి మనుషుల రక్తాన్ని తాగటానికి అతను వ్యతిరేకి. 

అదే సమయంలో వ్యాంపైర్స్ గా మారిన వ్యక్తులు మనుషులు ఎక్కడ కనపడితే వారిని అక్కడ రక్తం తాగి హతమారుస్తుంటారు .అందుకని మనుషుల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది. ఓ కారు యాక్సిడెంట్ లో కలిసిన  యాండ్రి అనే స్త్రీ డాల్టన్ సాయాన్ని కోరుతుంది. ఎల్విస్ అనే వ్యక్తితో మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఎల్విస్ ఒకప్పుడు వ్యాంపైర్ ,తర్వాత మనిషిగా మారాడు. 

వ్యాంపైర్స్ సహజంగా సూర్యకాంతిలో జీవించలేవు. అలా తన జీవితాన్ని ముగించుకుందామనుకున్న ఎల్విస్ అలా కార్ ఎండలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ యాక్సిడెంట్ చేసుకున్నాక నీళ్ళలో దూకితే ఆ తర్వాత మనిషిగా మారడం గమనిస్తాడు. ఈ ప్రయోగం చేసి శాశ్వతంగా వ్యాంపైర్స్ ను మనుషులుగా మారిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఎల్విస్ డాల్టన్ కు చెప్తాడు. 

అదే సమయంలో డాల్టన్ సోదరుడు ఫ్రాంకి వ్యాంపైర్ గా ఉండటానికే ఇష్టపడ్తాడు. డాల్టన్ పని చేస్తున్న కంపెనీ వ్యవస్థకుడైన చార్లెస్ కూడా వ్యాంపైర్ గా ఉంటూ తన వ్యాపారాన్ని పెంచుకోవడం పట్లే ఆసక్తి  చూపిస్తాడు. ఫ్రాంకి చార్లెస్ దగ్గర పని చేస్తూ ఉంటాడు .ఆఖరికి చార్లెస్ తన కూతుర్ని కూడా వ్యాంపైర్ గా మారుస్తాడు. అప్పటికి ఉన్న పరిస్థితుల్లో కొందరు వ్యాంపైర్స్ కు రక్తం లభించకపోవడం వల్ల అవి క్షీణించిపోతూ ఉండటం వల్ల వాటిని కాల్చేయ్యమని ప్రభుత్వం ఆదేశాలివ్వ్డంతో వాటిని కాల్చేస్తారు. వాటిలో చార్లెస్ కూతురు కూడా ఉంటుంది. ఆమె మనిషిగా ఉండాలనుకున్న చార్లెస్ బలవంతంగా మార్చడం వల్ల ఆమె అలా మరణిస్తుంది. 

   చివరకు యాండ్రి ,ఎల్విస్ లతో ప్రయోగాలు చేసిన డాల్టన్ వ్యాంపైర్ నుండి మనిషిగా మారిన వ్యక్తి వ్యాంపైర్ రక్తం పిలిస్తే అతను మనిషిగా మారతాడనే పరిష్కారం కనుక్కుంటాడు. ఆ పరిష్కారం దేశ వ్యాప్తం చేయడానికి తన కొలీగ్ సాయం కోసం వెళ్తే అతను చార్లెస్ కు పట్టిస్తాడు. అప్పుడు చార్లెస్ ను బలవంతంగా మనిషిగా మార్చి వదిలేస్తాడు. అతను మనిషిగా మారడంతో కింద అతనికి సెక్యూరిటీగా ఉన్న వ్యాంపైర్స్ అందరూ కలిసి అతని రక్తం పీల్చి మనుషులుగా మారడం ,మళ్ళీ వ్యాంపైర్స్ మనుషుల రక్తం పీల్చడం ...అలా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది.చివరకు ఫ్రాంకి మారి ,డాల్టన్ ను కాపాడే ప్రయత్నంలో మనిషిగా మారిన అతను వ్యాంపైర్స్ రక్త దాహనికి బలైపోతాడు. ఇలా సినిమా ముగుస్తుంది. 

హారర్ ,సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీస్తున్న స్పీరిగ్ బ్రదర్స్ (పీటర్ స్పీరిగ్ ,మిఖేల్ స్పీరిగ్ )'Big Picture ' అనే షార్ట్ ఫిల్మ్ తో 2000 లో నిర్మాతలుగా ,దర్శకులుగా ,స్క్రీన్ రైటర్స్ గా మారిన వీరు తర్వాత 'Undead', 'Day Breakers ', 'Predestination','Jigsaw','Winchester' అనే సినిమాలు తీశారు. 'డే బ్రేకర్స్ ' కు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా పురస్కారం పొందారు. 

ఈ సినిమా ఘన విజయాన్ని సాధించకపోయినా ,చూడగలిగే సినిమా . వ్యాంపైర్స్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. 

                  *   *   * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!