టీచర్స్ వర్సస్ సెక్సువాలిటీ సమస్యలు

 సినీ సంచారం 

                                టీచర్స్  వర్సస్  సెక్సువాలిటీ సమస్యలు 

                                            -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



        నేటి విద్యావ్యవస్థలో సాంకేతికతతో  విద్యార్ధుల్లో  సెక్సువాలిటీ పట్ల పెరిగిన అవగాహన వల్ల వారితో వచ్చే సమస్యలను టీచర్స్ సక్రమంగా పరిష్కరించగలుగుతున్నారా ? దీనికి సమాధానం క్లిష్టమైనదే. బయాలజీ లాంటి సబ్జెక్టుల్లో రిప్రొడక్షన్ లాంటి  అంశాలు విద్యార్ధులకు ప్రాథమిక అవగాహన కలిగించడానికి ఉన్నప్పటికీ ,అంతర్జాలం ద్వారా ,సినిమాల ద్వారా వారికి వయసుతో పాటు తమలో వచ్చే మార్పులు ,ఆపోజిట్  జెండర్ పట్ల వారు ప్రవర్తించే తీరు కుర్రతనం  కొద్ది అయినా సరే క్రమశిక్షణను అతిక్రమించేలానే ఉంటున్నాయి అనడంలో సందేహం లేదు. అటువంటి  సమస్య ఓ విద్యార్ధితో ఓ టీచర్ కు ఎదురైతే ఆమె దాని వల్ల ఎలా చిక్కుల్లో ఇరుక్కుంది అన్న కథాంశాన్ని 2015 లో 'కుత్రమ్ కదితాల్' (పనిష్మెంట్ )సినిమా గా తమిళ్ లో బ్రమ్మా అనే దర్శకులు తీశారు. 

మెర్లిన్ ఓ స్కూల్ లో ప్రైమరీ క్లాసులకు లెక్కల టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. వివాహం కోసం మూడు రోజుల సెలవు పెట్టి ఆమె మణికందన్ అనే హిందూను తను క్రైస్తవురాలు అయినా సరే తల్లి అభిష్టానికి వ్యతిరేకంగా కులాంతర వివాహం చేసుకుంటుంది. పెళ్ళి అయిన తర్వాత సెలవు అయిపోయాక ఆ రోజు స్కూలుకు వెళ్తుంది. 

తనకున్న అన్నీ క్లాసులు చెప్పడం అయిపోయాక ,ఐశ్వర్య అనే టీచర్ తను ఆ రోజు సాయంత్రం భర్తతో కలిసి సినిమాకు వెళ్తున్నానని దానికి అనుమతి తీసుకున్నానని ,ఆ రోజు సెవెన్త్ పీరియడ్ ఫిఫ్త్ బి కి సబ్స్టిట్యూట్ టీచర్ గా తన బదులు వెళ్ళమని అడగడంతో ఆమె వెళ్తుంది. మెర్లిన్ కు ఆ క్లాస్ కొత్త. ఆమె  వెళ్ళేసరికి క్లాసులో ఓ పుట్టినరోజు అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఎందుకు ఏడుస్తుంది అని కారణం అడిగితే పక్కనున్న పాప ఆ క్లాస్ కు చెందిన చెజియన్ అనే పిల్లాడు ఆమె పుట్టిన రోజు అని చాక్లెట్ ఇస్తే ఆమెకు ముద్దు పెట్టాడు అని చెప్తుంది. 

ఈ విషయం తెలుసుకున్న మెర్లిన్ చెజియన్  ను ఆమెకు సారీ చెప్పమంటుంది. దానికి ఆ బాలుడు తాను ఎందుకు సారీ చెప్పాలని ఎదురు ప్రశ్నించి ,ఒకవేళ అదే ఆ టీచర్ పుట్టినరోజు అయినా సరే ఆమెకు కూడా అలానే ముద్దు పెడతానని చెప్పడంతో కోపం వచ్చి మెర్లిన్ చెంప మీద కొడుతుంది. దానితో చెజియన్ స్పృహ కోల్పోతాడు. 

ఈ విషయం  తెలిసిన ప్రిన్సిపాల్ ,అతని భార్య ఆమెను అక్కడి నుండి పంపేస్తారు. ఓ రెండు మూడు రోజులు ఆమెను భర్తతో కలిసి ఎక్కడైనా ఉండమని ,ఇంటికి వెళ్ళవద్దని ,తనకు తెలిసిన స్నేహితుడి చిరునామా కూడా ఇస్తాడు. ఆమె చాలా చిన్నగా కొట్టినా అది ఎందుకు అంత పెద్ద ప్రమాదంగా పరిణమించిందో మెర్లిన్ కు అర్ధం కాదు. భర్త ఆమెను ఊరి దాటించి తీసుకువెళ్లినా ఆమె మనసులో ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉంటుంది. 

  ఈ లోపు స్కూల్ యాజమాన్యం చెజియన్ తల్లిని హాస్పటల్ కు పిలుస్తారు. చెజియన్ కు తండ్రి లేడు. తల్లి ఆటో డ్రైవర్ .మేనమామ రిపోర్టర్ . ఆ బాలుడి తలలో బ్లడ్ క్లాట్ అయ్యిందని సర్జరీ చేయాలని వైద్యులు చెప్తారు. చెజియన్ తల్లి దుఃఖంలో మునిగిపోతుంది . చెజియన్ మేనమామ ఆ టీచర్ రావాల్సిందే అని పట్టుబడతాడు . ఆమె ఇంటికి ,ఆమె తల్లి ఇంటికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. 

  ఈ విషయాన్ని మీడియా తన పబ్లిసిటీ కోసం డిబేట్ లు పెట్టి మరీ పాపులర్ చేస్తుంది. పారిపోయిన మెర్లిన్ తను ఎట్టి పరిస్థితుల్లో చెజియన్ తల్లిని కలవాలని పట్టుబట్టి తిరిగి హాస్పటల్ కు భర్తతో వస్తుంది. ఆమెను క్షమాపణ అడుగుతుంది . తనకు తన కొడుకు దక్కితే చాలని అంతకు మించి ఏమి వద్దని ఆమె బదులిస్తుంది. చెజియన్ కు అంతకు ముందే బ్రెయిన్ లో సమస్య ఉందని అది చెంప దెబ్బ వల్ల వచ్చింది కాదని వైద్యులు రిపోర్ట్ ఇస్తారు . తర్వాత ప్రెస్ మీటింగ్ లో టీచర్ లు కార్పరేట్ పనిష్మెంట్ ఇవ్వడం తప్పని మెర్లిన్ చెప్తుంది. మెర్లిన్ మీద ముందు కోపం ఉన్నప్పటికీ కూడా ఆమె అలా తన తప్పును ఒప్పుకుని అలా ముందుకు రావడం చెజియన్ మేనమామ కు ఆమె పట్ల గౌరవాన్ని కలిగిస్తుంది . తర్వాత చెజియన్ సర్జరీ తర్వాత డిశ్చార్జ్ అవ్వడంతో సినిమా ముగుస్తుంది. 

టీచర్లకు విద్యార్ధులతో తలెత్తే మిగిలిన సమస్యలు వేరు. కానీ ముఖ్యంగా సెక్సువాలిటీ పరంగా టీజ్ చేసే విద్యార్ధులు , కొందరు హద్దులు దాటి ప్రవర్తించే విద్యార్ధులు ...ఇలా ఎన్నో రకాల సమస్యలను పరిష్కరించే పద్ధతుల  దిశగా మన విద్యా వ్యవస్థ ముందుకు సాగలేదనే చెప్పాలి . దానికి కారణం కార్పోరల్  పనిష్మెంట్ తో కాకుండా ఎలా ఇటువంటి వాటిని పరిష్కరించాలో శాస్త్రీయ పద్ధతులు లోపించడం వల్ల కూడా కావచ్చు . ఎందుకంటే ఇటువంటి అంశాల్లో విద్యార్ధుల్లో కౌన్సిలింగ్ వల్ల మారేవారు చాలా తక్కువ . విద్యా వ్యవస్థలో కౌమార దశలోకి అడుగుపెట్టిన  విద్యార్ధులతో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి శాస్త్రీయ పరిశోధన  పరిష్కార దిశగా కొనసాగాల్సిన అవసరం నేటి పరిస్థితుల్లో అయితే ఉంది. 

     *   *  *  

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!