ఇన్ఫార్మర్ జీవితం

 సినీ సంచారం 

     ఇన్ఫార్మర్  జీవితం 

         -రచనశ్రీదత్త (శృంగవరపు  రచన) 



  ఇన్ఫార్మర్ల జీవితం కత్తి మీద సాములాంటిది. సమకాలీన స్వీడన్ లో ఉన్న నేరాల గురించి, నేరస్థుల  గురించి ,వారిని ప్రభుత్వం ఎలా  అండర్ కవర్ కాప్స్ ఆపరేటివ్స్ లేదా ఇన్ఫార్మార్ల గా  వాడుకుంటూనే వారి ద్వారా లబ్ది పొందుతూనే తేడా వస్తే వారిని ఎలా బలి చేస్తారో అన్న అంశాన్ని నవలగా త్రీ సెకండ్స్ పేరుతో రోస్లాండ్ ,హెల్ స్ట్రామ్ జంటగా నవలగా రాశారు. రోస్లాండ్ జర్నలిస్ట్ అయితే ,హెల్ స్ట్రమ్  పరివర్తన చెందిన క్రిమినల్. నేరాలను అరికడుతూ, పూర్వం నేరస్థులుగా ఉన్న వారికి సహకారం అందించే దిశలో ఏర్పడిన కె ఐ ఆర్ ఎస్ కు  ఫౌండర్ సభ్యుడిగా ఇతను ప్రసిద్ధుడు. ఆ త్రీ సెకండ్స్ నవలే 2019 లో 'The Informer ' పేరుతో ఇటాలియన్ దర్శకులు యాండ్రియా డి స్టీఫానో తీశారు. 

పీట్ కాస్లవ్  గతంలో క్రిమినల్ ,తర్వాత సోల్జర్ గా ఉన్నాడు. అతన్ని ఎఫ్. బి. ఐ  న్యూ యార్కు లోని అతి పెద్ద క్రిమినల్ బాస్ ను పట్టించడానికి    ఇన్ఫార్మార్ గా  నియమిస్తుంది. ఆ ఆపరేషన్ ను విల్ కాక్స్ అనే మహిళా ఎఫ్ బి ఐ ఆఫీసర్  నాయకత్వం వహిస్తుంది. దీనికి ఆమోదించిన ఆమె బాస్ మాంట్ .  అదే సమయంలో  ఆ బాస్ ను పట్టుకోవడానికి  పోలీస్ శాఖ నుండి  ఓ యువ పోలీస్ డ్రగ్స్  కావాల్సిన వ్యక్తిగా వెళ్తాడు. అదే సమయంలో క్రిమినల్ బాస్ ను పట్టుకోవడానికి పీట్ కూడా అదే  బృందంలో ఓ నాయకుడిగా ఉంటాడు . మొదటే అతని ప్రవర్తనను బట్టి అతను పోలీస్ అని గుర్తించి అతన్ని కాపాడటానికి పీట్ ప్రయత్నించినా సరే అతను మొండిగా వ్యవహరించడంతో ఆ క్రిమినల్ బాస్ కొడుకు చేతిలో మరణిస్తాడు.

  ఆ పోలీస్  మరణంతో  పోలీస్ శాఖ అప్రమత్తమవుతుంది. మాంట్  విల్ తో ఆ పోలీస్ మరణించడం వల్ల విషయం పెద్దది అవుతుంది అని అనవసరంగా తాము కూడా చిక్కుల్లో పడతాము కనుక ఇక పీట్ గురించి పట్టించుకోవద్దని చెప్తాడు. అప్పటికే విల్ పీట్ కు ఎన్నో ప్రామిస్లు చేస్తుంది ,అతనికి ఏ ఆపద రాకుండా చూసుకుంటామని. ఆ పోలీస్   మరణం        కేసును  డిటెక్టివ్   గ్రీన్   సీరియస్ గా  తీసుకుంటాడు . తమ ఉద్యోగాల కోసం  విల్  కూడా  పీట్  ను  పట్టించుకోకుండా   పట్టించుకున్నట్టు నటిస్తూ  ఉంటుంది. 

పీట్  ఏదో ఒక నేరం మీద జైలుకు వెళ్ళి అక్కడ డ్రగ్స్ వ్యాపారం చేయాలని  లేకపోతే అతని భార్యా ,కూతురు కు ప్రమాదం అని చెప్పడంతో అలాగే వెళ్తాడు పీట్. జైలుకు వెళ్ళాక ఎఫ్ బి ఐ తనను మోసం చేసిందని తెలుసుకుంటాడు.  భార్యకు ఫోన్ చేసి తను విల్ తో  మాట్లాడిన ప్రతి రికార్డింగ్  టేపు ఎక్కడ ఉందో చెప్తాడు . వాటిని  మీడియాకు ఇవ్వాలన్నది అతని ఆలోచన. కానీ ఆమె ఫోన్ ట్రాప్  చేసిన విల్ ఆ రికార్డులు  తీసేసుకుంటుంది. 

అప్పటికే  డిటెక్టివ్  గ్రీన్ జైలులో పీట్ ను ,తర్వాత అతని భార్యను కూడా కలుస్తాడు. పీట్  ఎలాగో జైలు నుండి తప్పించుకుంటాడు. అప్పటికి విల్ అతనితో మంచిగానే ఉన్నట్టు ఉంటుంది. ఆ తర్వాత   పీట్  ఇన్ఫా ర్మర్   అని తెలియడంతో  అతని భార్యా పిల్లలను చంపడానికి క్రిమినల్ బాస్ కొడుకు వారి దగ్గరకు వెళ్తాడు. అదే సమయంలో డిటెక్టివ్ గ్రీన్ వారిని కాపాడతాడు. అతని నుండి పోలీస్ ను చంపింది  పీట్  కాదని అతనే అని గ్రీన్ కు అర్ధమవుతుంది. తర్వాత విల్ జరిగిన  దానికి  బాధ్యుడు మాంట్ అని చెప్పి అతను అరెస్ట్ అయ్యేలా చేస్తుంది. 

పీట్ ను ఆ తర్వాత భార్యా పిల్లలతో కలిపించడానికి వారిని తీసుకువస్తుంది విల్. అదే సమయంలో డిటెక్టివ్ గ్రీన్ అక్కడికి వచ్చి అతనికి పాస్ పోర్ట్ ఇచ్చి ,అతన్ని మళ్ళీ విల్ మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ఆమె చుట్టూ ఉన్న అధికారులను కూడా చూపించి అతన్ని పాస్ పోర్ట్  ,  వీసా లతో విదేశానికి వెళ్ళి కొంతకాలం ఉండి పరిస్థితులు చక్కబడ్డాక రమ్మని చెప్తాడు. దూరం నుండే భార్యను  విల్ చూడకుండా   సంజ్ఞ  చేసి  వెళ్లిపోతాడు. ఆమె కూడా అర్ధం చేసుకున్నట్టు తల ఊపడంతో  సినిమా ముగుస్తుంది. 

ఇన్ఫా ర్మార్ల  జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమా  చూపిస్తుంది. ప్రతి వ్యక్తికి ,సంస్థకు దేనికైనా  సరే వ్యక్తిగత ప్రయోజనాల తర్వాతే  సామాజిక  ఉన్నతి  మనసులో ఉంటుందనే అంతర్లీన సందేశం కూడా ఈ కథాంశంలో ఉంది.  అన్ని రకాల వర్గాల వారికి   నచ్చే సినిమా కాకపోయినా , మనుషుల స్వార్ధాలు పరిస్థితులకు  తగ్గట్టు ఎలా మారతాయో తెలిపే సినిమా ఇది.సినిమా టేకింగ్ లో కాస్త కన్యూజన్ అయితే ఉంది . బహుశా అందువల్లే కథాంశం  బావున్నప్పటికీ కూడా ప్రేక్షకులు  అంతగా కనక్ట్  కాలేకపోయారు. 

                       *    *    *  

        *   *   * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!