మిమ్మల్ని మీరు మర్చిపోవద్దు!


మిమ్మల్ని మీరు మర్చిపోవద్దు!

          -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)

            జీవితంలో ప్రతి ఒక్కరూ తమదైన ఆసక్తులు -అభిరుచులతో కూడిన జీవితం గడపాలి అనుకుంటారు. స్త్రీలు దీనికి మినహాయింపు ఏం కాదు. జీవితంలో ఓ దశ వచ్చాక జీవితం పట్ల స్త్రీలకు నిర్లక్ష్యం ఏర్పడటం సహజం. ఇక్కడ జీవితం అంటే ఆ స్త్రీకు మాత్రమే సంబంధించింది అని. బాధ్యతలు ఆమెను ఆ వలయంలో మాత్రమే ఉండటానికి అలవాటు పడేలా చేసినా సరే ఆమె తనకు ఇష్టమైన అభిరుచులను ఎన్నుకుని వాటిలో ఎంతో కొంత సంతృప్తి పొందే అలవాటు కచ్చితంగా చేసుకోవాలి.

            ప్రతి మనిషి జీవితంలో ఎన్నో ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా బాల్యంలో ఉండే పరిస్థితులు-వాతావరణం స్త్రీల జీవితాన్ని ఆ తర్వాత కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా బాల్యంలో తమ ఇష్టాయిష్టాలు కూడా ఏంటో తెలుసుకోలేని వాతావరణంలో పెరిగి, ప్రాథమిక విద్యను అభ్యసించి తర్వాత పెళ్ళితో పూర్తిగా ఇంకో ప్రపంచంలో మునిగిపోయి తమకు ఉన్న అభిరుచులు-ఆసక్తులు ఏంటో కూడా గుర్తించలేని స్థితిలో నేటికీ జీవిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు.

            బాల్య ప్రభావాల నుండి తప్పించుకోవడం ఎవరికి అంత తేలికగా సాధ్యమయ్యే పని కాదు. అలాగే కుటుంబ పరిస్థితులను అధిగమించి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచన కూడా చాలా మంది స్త్రీలకు ఓ అపరాధంగానే కనిపిస్తుంది. కానీ జీవితంలో ఆ బాధ్యతలు ఎన్ని ఉన్నా జీవితమంతా అవే నిండిపోతే జీవించే స్పృహలో ప్రతి వ్యక్తికి ఉండే ప్రత్యేకత అయితే ఉండకుండా పోతుంది.

            జీవితంలో ఏ దశలో ఉన్నా సరే కొన్ని అలవాట్లను అభిరుచులుగా మలచుకోవడం అన్నది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఎన్నో కొత్త ఆలోచనల లోకాన్ని మీలోనే అంతర్ముఖంగా ఆవిష్కరించుకునేలా చేస్తుంది. దానిలో మొదటి అలవాటు పుస్తకాలు చదవడం. ఈ అలవాటు గురించి అందరూ చెప్పేదే, కానీ మీరు ఓ పుస్తకం చదివాక దాని గురించి ఏదో ఒక విషయం, లేదా నవాలాంశం రాసుకుని, అలా చదివిన ప్రతి విషయం రాయడం వల్ల మీ కంటూ సమాజం పట్ల, కాల్పనిక పరిస్థితుల వాస్తవికత పట్ల, మన చుట్టూ ఉండే జీవితాల్లో ఉండే వైవిధ్యం పట్ల అవగాహన కలుగుతుంది. అలా కాకుండా చదివిన పుస్తకం చదివినట్టే వదిలేస్తే మీకంటూ అసలు ఏం చదివారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఎవరైనా తమ అలవాటు పుస్తక పఠనం అని చెప్పినప్పుడు వారు ఎన్ని పుస్తకాలు చదివారు అని అడిగితే దానికి సమాధానం చాలా అనే తప్ప సంఖ్య లేదా కథాంశాలు లేదా నెలకు లేదా సంవత్సరానికి ఎన్ని చదువుతున్నారు అనే  సమాధానం మాత్రం రాదు.

            కాలక్షేపానికి చదివినా, ఇష్టంతో చదివినా దాని పట్ల అవగాహన ఉంచుకోగలిగితే మెదడుకు కూడా తనదైన విశ్లేషించే ధోరణి అలవడుతుంది. అలా చదివిన పుస్తకాలను గురించి రాసుకుంటూ ,నెలకు ఎన్ని పుస్తకాలు చదవగలుగుతున్నారు ,ఎంత సమయం పడుతుంది ,వంటి అంశాల పట్ల అవగాహన పెంచుకుంటే మీలో పుస్తక పఠనంతో వచ్చే మార్పులు మీరే గమనించుకోవచ్చు. దీని వల్ల మీలో గుర్తు పెట్టుకునే శక్తి, కథా శైలి ,ముందు ఏం జరగబోతుందో ఊహించే శక్తి వంటి నైపుణ్యాలు అలవడతాయి.

            ఒకేసారి మనసులో ఎప్పుడో ఉన్న పెద్ద పెద్ద అభిరుచులను అమల్లో పెట్టలేకపోవచ్చు కానీ ఏ అభిరుచిని ఎన్నుకున్నా సరే దానిని పుస్తక పఠనంలో పైన పేర్కొన్న శైలిలో కొనసాగిస్తే అది మీలో ఓ కొత్త శక్తిని నింపుతూనే ,మీ మానసిక ఆరోగ్యంలో కొత్త జీవాన్ని కూడా నింపుతుంది. మీకు ఏ అభిరుచి గురించి తట్టకపోతే మాత్రం కచ్చితంగా పుస్తక పఠనంతో మొదలుపెట్టండి.

            తర్వాత ఇంకో మంచి అభిరుచి ఇతర భాషల సినిమాలు చూడటం. దీని వల్ల అప్పటికే మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే దానికి దీనికి ఉన్న కథా శైలి వ్యత్యాసాలతో పాటు ,వివిధ దేశాల కథాంశాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో కూడా ఓ అవగాహన వస్తుంది. పుస్తకాలు -సినిమాలు ప్రపంచంలోని మనుషుల జీవితాలు. ఈ రెండు అభిరుచులను సక్రమ పద్ధతిలో ఆచరించగలిగితే అవి మీలో మీకే కొత్త లోకాన్ని పరిచయం చేస్తాయి.

            ఇంకేదైనా మీ అభిరుచి కావచ్చు కానీ ఇంట్లో ఉండి ఇంకేదైనా మొదలు పెట్టడానికి ఇంకా సంసిద్ధం కానీ వారు అయినా సరే ఈ రెండు అభిరుచులను సులభంగా ఆచరించవచ్చు. ఒక్కసారి ఈ  మీదైన ప్రపంచంలో మీరు గడుపుతున్న సమయం మీకు సంతృప్తిని ఇస్తున్న కొద్ది మీరే మీదైన ప్రపంచాన్ని ఏ రంగంలోనైనా సృష్టించుకోగలుగుతారు.

            మిమ్మల్ని మీరు మర్చిపోతూ దానికి కుటుంబ బాధ్యతలు అనే పేరు పెట్టినా జీవితంలో ఎప్పుడో ఓ సారి నాకంటూ ఓ జీవితం ,అభిరుచి లేకుండా పోయింది అనే భావం కలిగితే దానికి మీరే మళ్ళీ ఇంకో కప్పి పుచ్చుకునే సమాధానం చెప్పుకుంటే ఇక అదే మీ జీవితం అయిపోతుంది. ఒకవేళ మీకు కుట్టుడు పని ,సంగీతం ఇంకేదైనా ఇతర అభిరుచులు ఉన్నా సరే వాటిని ఏదో రకంగా మీ జీవితంలో భాగం చేసుకోండి.

            జీవితంలో మనకు ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ మనల్ని మనం ఏ పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఇక మీదైనా లోకం మీ కోసం మీరు నిర్మించుకుంటారు కదూ!

  *     *     *

 

 

 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!