మరణ సామ్రాజ్యం

 సినీ సంచారం 

                                      మరణ సామ్రాజ్యం 

                                               -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



               హాలీవుడ్  ఉత్తమ సినిమాల్లో ఒకటిగా నిలిచే సినిమా 'ద గ్రీన్ మైల్.' స్టీఫెన్ కింగ్ నవల 'ద గ్రీన్ మైల్ ' ఆధారంగా   వచ్చిన  ఈ సినిమా బాక్సాఫీసు వసూళ్లు సాధించింది. మూడు గంటల సినిమా అయినప్పటికీ ఎమోషనల్ కనక్షన్ తో ఎక్కడా బోర్ కొట్టించని సినిమా ఇది. టామ్ హ్యాంక్స్,మైఖేల్  క్లార్క్ డంకన్ నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది. మరణ  శిక్షలు అమలు చేసే  నేపథ్యమే  కథ అయినప్పటికీ, స్టీఫెన్ కింగ్ రచన కనుక సినిమా కూడా అంతే ఉత్కంఠ -మానవత్వం -మ్యాజికల్ రియలిజం ల సమన్వయంతో హాలీవుడ్ సినిమాల్లో ఓ కొత్త రకాపు సినిమాకు నాంది పలికింది. 

1999 లో ఓ సీనియర్ సిటిజెన్స్  హోమ్ లో ఉన్న పాల్ తన స్నేహితురాలికి తన గత జీవితం గురించి చెప్పడంతో సినిమా మొదలవుతుంది. 1935 లో అమెరికాలోని ఓ మరణ  శిక్షలు అమలు చేసే జైలులో   ఈ   బ్లాక్ లో  ఆఫీసరుగా ఉంటాడు పాల్. అప్పట్లో అమెరికాలో ఎలక్ట్రిక్ చేయిర్ లో మరణ శిక్షను అమలు చేసే వారు. అక్కడికి ఎంతో మంది నేరస్తులు వస్తూ ఉంటారు. వారి ఆఖరి కోరికలు తీర్చగలిగినవి అయితే తీర్చి, ఆ మరణ శిక్ష అమలయ్యేలా చూడడమే పాల్ పని. 

పాల్ కు యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంటుంది. పాల్ పై ఆఫీసర్ హాల్ మూర్స్ . పాల్ దగ్గర బ్రూటస్ , డీన్, హ్యారీ ,పెర్సి పని చేస్తూ ఉంటారు. వీరిలో పెర్సి లూసియానా గవర్నర్ మేనల్లుడు అవ్వడం వల్ల తనను ఎవరు ఏం చేయలేరు అన్న అహంకారంతో దురుసుగా, పొగరుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. 

జాన్ కొఫే అనే ఒక ఆఫ్రో అమెరికన్ నేరస్తుడు ఈ బ్లాక్ కు వస్తాడు. జాన్ కొఫే ఓ ఇద్దరు వైట్ బాలికలను అత్యాచారం చేసి ,హత్య చేశాడనే అభియోగంపై ఆ శిక్షకు అర్హుడవుతాడు. దాదాపు ఆరు అడుగులకు మించిన ఎత్తు ,ధృడమైన పర్సనాలిటితో ఉంటాడు జాన్ కొఫే. అక్కడే ఉండే ఇంకో నేరస్తుడి  పేరు డెల్. తర్వాత హత్యా నేరం పై వార్టన్ అనే సైకాటిక్ కిల్లర్ కూడా వస్తాడు అక్కడికి. వీరే ఈ సినిమాలో ముఖ్య పాత్రలు. 

జాన్  కొఫే  పాల్ కు ఉన్న యూరినరీ ఇన్ఫెక్షన్ ను  స్పర్శతో పోగొడతాడు. ఆ తర్వాత ఆ జైలులో ఓ ఎలుక కనిపిస్తుంది. దానిని డెల్  జింగిల్స్ అన్న పేరు పెట్టి పెంచుకుంటూ ఉంటాడు. దానితో డెల్ కు ఓ ప్రత్యేక అనుబంధం కూడా ఏర్పడుతుంది. పెర్సికి ,డెల్ కు మొదటి నుండి కూడా పడదు. డెల్ ను ఏడిపించడానికి జింగిల్స్ ను గట్టిగా తన కాలి బూటుతో తొక్కుతాడు. ప్రాణం పోయే స్థితిలో ఉన్న జింగిల్స్ ను జాన్ కొఫే కాపాడతాడు. జాన్ కొఫే కు ఉన్న ఈ హీలింగ్ పవర్స్ చూశాక అతను నిజంగా ఆ హత్యలు చేసి ఉండడనే నమ్మకం ఏర్పడుతుంది పాల్ కు . ఆ విషయంలో నిజానిజాలు తెలుసుకోవడానికి చనిపోయిన ఆ పాపల తండ్రి దగ్గరకు వెళ్తాడు. జాన్ కొఫే ఆ పిల్లలని హత్య స్వయంగా చూడకపోయినప్పటికీ ఆ పిల్లల మృతదేహాలతో ,రక్తంతో ఉన్న జాన్ కొఫే కచ్చితంగా తన కూతుళ్ళను మానభంగం చేసి ,హత్య చేశాడనే నమ్ముతున్నానని చెప్తాడు. 

డెల్ కు  మరణ శిక్ష విధించే రోజు వస్తుంది. సాధారణం గా ఎలక్ట్రిక్ చేయిర్ హత్యా పద్ధతిలో మొదట ఆ వ్యక్తికి ఎక్కడైతే విద్యుత్ ప్రవాహం వెళ్ళేలా చేస్తారో అక్కడ గుండు చేస్తారు మొదట. ఆ తర్వాత అతన్ని ఆ చెయిర్ లో కూర్చోపెట్టి , కట్టేసి ,అతని ముఖానికి  మాస్క్ వేసి , ఆ తర్వాత అతని తల పైన తడి చేసిన స్పాంజీ పెట్టి ఆ పైన ఎలక్ట్రిక్ పరికరాన్ని ఫిట్ చేస్తారు . ఆ తర్వాత అతను మరణించేవరకు విద్యుత్ ప్రవహింపజేస్తారు. డెల్ మీద కక్ష మనసులో పెట్టుకున్న పెర్సి  ఆ స్పాంజిని తడి చేయడు. దాని వల్ల అతి బాధాకరమైన మరణాన్ని అనుభవిస్తాడు డెల్. 

 ఆ యూనిట్ వార్డెన్ అయిన హాల్ మూర్స్ భార్యకు బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. దానిని కూడా జాన్ కొఫే తనలోకి తీసేసుకుంటాడు. ప్రతి సారి బయటకు వదిలేసే జాన్ కొఫే దానిని మాత్రం బయటకు వదలడు. జైలుకు తిరిగి వచ్చాక దానిని పెర్సి నోటిలోకి వదులుతాడు. ఆ తర్వాత పెర్సి  ముందుకు వెళ్ళి వార్టన్ ను పిస్టోల్ తో కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత అతను ఎవరు పిలిచినా మాట్లాడడు. అతన్ని మెంటల్ హాస్పటల్ లో చేరుస్తారు . 

జాన్ కొఫే తానే కావాలని ఆ ఇద్దరికీ శిక్ష విధించానని  చెప్తాడు. జాన్ కొఫే చెయ్యి తాకిన తర్వాత పాల్ కు జరిగింది కనిపిస్తుంది. ఏ నేరం అయితే జాన్ కొఫే మీద మోపబడిందో అది చేసింది వార్టన్ అని , అతను ఆ పిల్లల తండ్రి దగ్గర పని చేసేవాడని పాల్ కు అర్ధమవుతుంది. అలాగే డెల్ కు అంతా క్రూరమైన మరణం సంభవించేలా చేసినందుకు అతన్ని కూడా శిక్షించాడని పాల్ కు స్పష్టమవుతుంది. అక్కడ ఉన్న వారందరికి జాన్ కొఫే పట్ల సదభిప్రాయం ఉన్నప్పటికీ ,చట్ట ప్రకారం అతనికి మరణ శిక్ష విధించక తప్పదు. 

కానీ మరణించే ముందు స్పర్శ ద్వారా పాల్ కు అతను ఇచ్చిన శక్తి వల్ల అతను ప్రస్తుతం అంటే 1999 లో 106 సంవత్సరాల వయసుతో ఉంటాడు. అతని భార్య ,కొడుకు ,స్నేహితులు అందరూ మరణించినా అతను మాత్రం జీవించే ఉన్నానని ఆ స్నేహితురాలికి చెప్తాడు పాల్. అతను రోజు వాకింగ్ కు వెళ్ళి చూసేది జింగిల్స్ ను అని, డెల్ కు మరణ శిక్ష అమలవుతున్నప్పుడు జింగిల్స్ ను జాన్ కొఫే చూసుకుంటానని తీసుకున్నాడని ,ఆ సమయంలో అతని శక్తి కొంత దానికి స్పర్శ ద్వారా రావడంతో అది కూడా అన్నేళ్ళ నుండి బ్రతికే ఉందని చెప్తాడు పాల్. 

కొన్ని రోజులకు ఆ స్నేహితురాలు మరణిస్తుంది. అలా అందరి మరణాలు చూస్తూ తాను ఇంకెన్నాళ్ళు బ్రతకాలో అనుకుంటూ ఉంటాడు పాల్. దానితో సినిమా ముగుస్తుంది. 

బహుశా పాల్ పాత్రలో టామ్ హ్యాంక్స్ నటన కోసమైనా ఈ సినిమా చూడాల్సిందే. హాలీవుడ్ టాప్ లిస్ట్ సినిమాలలో ఉన్న ఈ సినిమా కథనంలో ఓ కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. మనకు తెలియని ఎన్నో జీవితాలు ,కోణాలు ఆ నాలుగు గోడల కూడలిలో ఉంటాయి. వాటిలో అన్నింటిని తెలుసుకోలేకపోయినా కొంతమేరకు ఆ లోకానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది ఈ సినిమా. 

            మరణ శిక్షలు విధించబడ్డ మనుషులతో ఉంటూ ,ఎటువంటి భావోద్వేగాలకు లోనూ కాకుండా ,సమన్వయంతో వ్యవహరించడం, మరణాలను సాధారణంగా చూడగలగడం వంటి అంశాలు అక్కడ ఆఫీసర్ల జీవితాలు అయితే ,మరణం ఎప్పుడు వస్తుందో తెలిసి అక్కడ జీవించే వారి కోణం ఇంకో వైపు ,రెండు కోణాలలోని జీవితాలు సాధారణమైనవి అయితే కాదు. ఈ సినిమాలో శిక్షలు విధించబడ్డ వారందరూ కూడా మరణ శిక్ష దగ్గరికి వచ్చేసరికి అంతే క్రూరంగా ఉండకపోవచ్చు ,మారి ఉండవచ్చు కూడా. అలాగే శిక్ష పడ్డ ప్రతి ఒక్కరూ నేరం కూడా చేసి ఉండక పోవచ్చు. ఇలా ఎన్నో ప్రశ్నలు జీవితం విలువ ను కట్టే సాక్ష్యాలపై నిర్మించబడిన ఆ మరణ సామ్రాజ్యం లో వెలుగులోకి రాని నిజాల వల్ల బలైన నిర్దోషులు ఎందరో! 

                           *      *      * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!