స్పందించని తండ్రి

 సినీ సంచారం 

స్పందించని తండ్రి

        -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



       ఆంగ్ల సినిమాల్లో నవలల ఆధారంగా ఎన్నో వచ్చాయి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలే ఎక్కువగా ఈ విభాగంలో ఉంటాయి కూడా. అమెరికన్ రచయిత నెల్సన్ డి మిల్ నవల ద జనరల్స్ డాటర్ నవల ఆధారంగా అదే పేరుతో 1999 లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ సినిమానే ద జనరల్స్ డాటర్.’ జాన్ ట్రావోల్టా ,జేమ్స్ క్రోమ్ వెల్ వంటి నటుల నటన వల్ల సినిమా కాస్త ఆసక్తి కలిగించే విధంగా ఉంటుంది. అద్భుతమైన సినిమా కాకపోయినప్పటికీ కూడా ఆంగ్ల సినీ వైవిధ్యం దర్శించాలనుకునేవారు మాత్రం తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

          పాల్ బ్రెన్నర్ అమెరికన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో అండర్ కవర్ ఏజెంట్ గా పని చేస్తూ ఉంటాడు. అతను ఓ రోజు కారులో ప్రయాణిస్తూ ఉండగా కారు ట్రబుల్ ఇవ్వడంతో ఓ అమ్మాయి అతనికి సాయం చేస్తుంది. మాటల్లో ఆమె సైకలాజికల్ ఆపరేషన్స్ అనే సబ్జెక్ట్ ను మిలిటరిలో బోధిస్తుందని అతనికి తెలుస్తుంది. మర్నాడు ఉదయం కూడా ఆమెను వెళ్ళి కలిసి థ్యాంక్స్ చెప్పి వస్తాడు పాల్. ఆమె పేరు ఎలిజబెత్ క్యాంప్ బెల్. ఆ రోజు సాయంత్రానికే ఆమె హత్య చేయబడి నగ్నంగా పడి ఉంటుంది. ఈ కేసును పాల్ ,రేప్ థెరపిస్ట్ అయిన సన్ హిల్ అనే అమ్మాయి ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు.

          ఆ ప్రక్రియలో భాగంగా ఎలిజబెత్ ఇంటికి ఇద్దరూ వెళ్తారు. ఆమె అంతరంగ గదిలో వారికి బిడి ఎస్ ఏం పరికరాలు,ఆమె చేస్తున్న హింసాత్మక లైంగిక చర్యలు ఓ వీడియో ద్వారా వారికి దొరుకుతాయి. కానీ వాటిని పాల్ నుండి ఎవరో ఆగంతుకుడు కొట్టి తీసుకు వెళ్ళిపోతాడు. ఎలిజబెత్ తో పని చేసే ఆమె సుపీరియర్ ఆఫీసర్ అయిన కల్నల్ మూర్ ను ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలో అతను ఇచ్చిన తప్పుడు ఆధారాల ఆధారంగా అతన్ని అరెస్ట్ చేస్తాడు బ్రెన్నర్.

          ఈ లోపు సన్ హిల్ ను ఎవరో కొట్టి ,బెదిరించి వెళ్లిపోతారు.అందులో ముఖ్య వ్యక్తి చేతికి ఉన్న ఉంగరాన్ని చూస్తుంది ఆమె. దాని ఆధారంగా  అతను కెప్టెన్ ఎల్బీ అని తెలుస్తుంది. అతని ద్వారా పాల్ కెప్టెన్ కూతురు తన తండ్రి మీద నిరసన తెలియజేయడానికే మిలిటరీ బేస్ లో ఉన్న మగ ఆఫీసర్స్ తో లైంగిక సంబంధాలు కలిగి ఉండేదని తెలుసుకుంటారు.

          వారు కల్నల్ మూర్ దగ్గరకు వచ్చేసరికి అతన్ని విడుదల చేసినట్టు చెప్తారు. ఇంటికి వెళ్ళి చూస్తే అతను గన్ తో కాల్చుకుని చనిపోయినట్టు ఉంటాడు. అది హత్య అని అనుమానం వస్తుంది పాల్ కి. అసలు ఎలిజబెత్ ప్రవర్తనకు కారణం తెలుసుకోవడానికి ఆమె చదివిన మిలిటరీ ఏకాడమీ సైకియాట్రిస్ట్ అయిన కల్నల్ సెస్లింగర్ ను కలుస్తారు. అతని ద్వారా ఆమె వెస్ట్ పాయింట్ లో చదువుకుంటూ ఉన్నప్పుడూ ఆమెను దారుణంగా ఆ మిలిటరిలోని విద్యార్ధులే ఓ అమ్మాయి అయ్యి ఉండి అంత చురుగ్గా .అంత ధైర్యంగా ఉండటంతో ఆమె మీద కోపం కొద్ది గ్యాంగ్ రేప్ చేశారని, ఆ తర్వాత ఆమె హాస్పటల్ లో ఉన్నప్పుడూ మిలిటరీ జనరల్ అయిన ఆమె తండ్రి అమెరికన్ మిలిటరీ ఏకాడమి కి చెడ్డ పేరు రాకూడదని ఆ విషయం ఎవరికి తెలియకుండా ఉంచాడని చెప్తాడు. ఆ కేస్ ఫైల్ ద్వారా అందులో ఉన్న ఓ వ్యక్తిని కనుక్కుంటుంది సన్ హిల్. ఎలిజబెత్ ను రేప్ చేసినప్పుడు ఉన్న ఆమె లోదుస్తుల్లో డి ఎన్  ఏ ఉంటుందని ,అది తన దగ్గర ఉందని ఆ వ్యక్తికి  చూపిస్తుంది. అది నిజమని నమ్మిన అతను తాను ఆ పని చేయలేదని చేసిన వారి వివరాలు ఇస్తాడు. తాను అప్పుడే కొన్న లోదుస్తులను చూపించి అలా నిజాలు రాబడుతుంది సన్ హిల్. ఆ పని చేసిన వారికి 20 ఏళ్ల శిక్ష పడుతుంది.

          ఎలిజబెత్ తనకు జరిగిన అన్యాయానికి తండ్రి అసలు స్పందించకపోవడంతో ఆమె మనసులో తండ్రి మీద కోపం అధికమవుతూ ఉంటుంది. తండ్రికి నిరసనగానే ఆమె బేస్ లో ఎంతో మంది మగ ఆఫీసర్స్ తో సంబంధాలు పెట్టుకుంటూ ఉండేది. తండ్రి అసలు అప్పుడు కూడా స్పందించకపోవడంతో తాను రేప్ కు గురైనప్పుడు ఎలా బాధ పడిందో చూపించడానికి  తనను ఎలా నగ్నంగా చేసి కట్టేశారో అలానే ఉండి తండ్రికి రమ్మని ఫోన్ చేస్తుంది. వచ్చి చూసిన తండ్రి మనసు కరగదు. చూసి వెళ్ళిపోతాడు తండ్రి. ఆ తర్వాత అక్కడే ఉన్న కల్నల్ కెంట్ కు ఎప్పటినుండో ఎలిజబెత్ అంటే విపరీతమైన ఇష్టం   ఉంది. ఆమె కోసం తన భార్యాపిల్లలని కూడా వదిలేసే పరిస్థితుల్లో ఉంటాడు.ఆమె అప్పుడు కూడా  నిరాకరించడంతో  ఆమె గొంతు నులిమి చంపేస్తాడు.ఆ తర్వాత మూర్ ను కూడా అతనే హత్య చేసినట్టు ఒప్పుకుంటాడు.

          జరిగింది అంతా జనరల్ కు తెలిసినా కేవలం తన భవిష్యత్తు కోసం మౌనంగా ఉన్నాడని గ్రహించిన పాల్,కూతురికి జరిగిన అన్యాయాన్ని పట్టించుకొనప్పుడే ఆమె మరణించిందని కెంట్ కేవలం ఆమె బాధను తప్పించాడని అంటాడు.    విషయాలు ఎవరికీ చెప్పవద్దని జనరల్ హెచ్చరించినా సరే ఓ నేరాన్ని కప్పి పుచ్చి అతను చేసిన నేరాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తాడు పాల్.

          తన భవిష్యత్తు కోసం కన్న కూతురు జీవితాన్ని పట్టించుకొని తండ్రి అయిన జనరల్ నిజంగా దేశానికి మాత్రం ఏ మాత్రం అంకితభావం ప్రదర్శించగలడు? రక్తపు మరకలతో నిండిన చరిత్రను కాల రాయడానికి ప్రయత్నించినా సరే అవి ఏదో ఒక మాధ్యమ ఆధారంగా తప్పకుండా బయటపడతాయి. ఇది ఊహ ఆధారంగా రాసిన నవల అయినప్పటికీ ఇలాంటి ఉదంతాలు ఎన్నో అని దేశాల చరిత్రపుటల్లో.

   *     *    *

 

 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!