ఉరి త్రాడు

 చదువరి 

ఉరి త్రాడు

      -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



     వాసిరెడ్డి  సీతాదేవిగారి నవలల్లో స్త్రీ జీవితంలో ఉన్న యధార్ధ పరిస్థితులను,కాలానుగుణంగా వచ్చిన మార్పులను, తమ మనస్తత్వాల వల్ల వారి జీవితాలను మలచుకున్న తీరులను, సమకాలీన యువత నడవడికలను ఇలా ఎన్నో సున్నిత అంశాలను వాస్తవికంగా చిత్రీకరించారు. నాటి పరిస్థితుల్లో స్త్రీ లౌక్యం లేకపోతే వివాహం తర్వాత అయినా, పుట్టింట్లో అయినా ఎదుర్కునే సమస్యలు ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, సర్దుకుపోవడం మంచితనం కాదని, వ్యక్తిగత జీవితాన్ని కొన్ని సార్లు అదే అధఃపాతాళానికి తోసేస్తుందని సీతాదేవి గారు స్పష్టం చేసిన నవలే ఉరి త్రాడు.

  కనకమ్మ  భర్త మరణిస్తే  ఇద్దరు కూతుళ్ళు కరుణ, కస్తూరిలను, కొడుకు విశ్వాన్ని ఎంతో దక్షతతో పెంచుతుంది. కరుణ పెద్దకూతురు. నల్లగా ఉన్న కళగా ఉంటుంది. కస్తూరి అందగత్తె. విశ్వం ఉద్యోగం చేస్తుంటాడు. కూతుళ్ళు అందంగా అలంకరించుకున్నా సరే వారెక్కడ ఆకర్షణలకు లోనై తప్పు చేస్తారోనని విపరీతమైన కట్టుదిట్టాల్లో పెడుతుంది ఆమె. కరుణ సర్దుకుపోయి ఉంటుంది. కస్తూరి అప్పుడప్పుడూ ఎదురు తిరిగిత్తు ఉంటుంది.

          తన అన్న అతని కొడుకులకు తన కూతుళ్ళను చేసుకుంటాడేమోనని అడగటానికి అన్న దగ్గరకు వెళ్తుంది కనకమ్మ. అప్పటివరకూ తన అన్న ధనవంతుడనుకున్నా, ఆ భవనాన్ని చూసేసరికి ఆశ్చర్యపోతుంది. తన కూతుర్లకు అడగాలనే ఆలోచనను అక్కడి వాతావరణం, పవర్తన అనుకూలంగా లేకపోవడంతో విరమించుకుంటుంది. తర్వాత కరుణకు ఓ సంబంధం తెస్తాడు విశ్వం. కానీ పెళ్ళికొడుకు కస్తూరిని ఇష్టపడటంతో వారి వివాహం జరుగుతుంది. తర్వాత కరుణకు కస్తూరి  భర్త తన స్నేహితుడి సంబంధాన్ని తెస్తాడు. అతనితో కరుణ వివాహమవుతుంది.

          తర్వాత విశ్వం తను ప్రేమించిన శారదను వివాహం చేసుకుంటాడు. కరుణను  శారీరకంగా ఎన్నో చిత్రహింసలు పెట్టి తాళి బొట్టు అమ్ముకోవడానికి లాక్కుని పోవడంతో, ఆ బాధలు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వచ్చేస్తుంది. కనకమ్మకు అది ఇష్టం లేకపోయినా, విశ్వం,శారద జరిగింది తెలుసుకుని బాధపడి,ఆమెకు అండగా నిలుస్తారు. ఆమెను చదువుకోవడానికి ప్రోత్సహిస్తారు. కానీ, కరుణ భర్త రాఘవరావు ఆమెను పంపించమని మూడు ఉత్తరాలు రాయిస్తాడు. విశ్వం వాటిని పట్టించుకోడు.

          చివరకు రాఘవరావు దగ్గరకు కరుణ వెళ్లకపోతే కస్తూరిని సుబ్బారావు వదిలేస్తానని పుట్టింట్లో వదిలేయడంతో కరుణ భర్త దగ్గరకు వెళ్తుంది. ఇదంతా కస్తూరి, సుబ్బారావుల నాటకమని శారద గ్రహించినా సరే ఏమి అనలేని పరిస్థితి. తర్వాత కొన్ని రోజుల తర్వాత భర్త తార్చడానికి ప్రయత్నిస్తే పుట్టింటికి వచ్చినా కనకమ్మ చనిపోతానని బెదిరించడంతో, శారదకు బయట నుంచే విషయం చెప్పి పెళ్ళి తన పాలిట ఉరిత్రాడు అయ్యిందని, తన బ్రతుకు తాను బ్రతకడానికి వెళ్లిపోతున్నానని చెప్పి వెళ్లిపోతుంది.

          ఈ నవలలో ఒక్కో పాత్రను గమనిస్తూ వారు మన చుట్టూ ఉండే అనేకమైన మనుషులకు నిదర్శనాలు కూడా. మొదటి నుండి ప్రతి విషయంలో సర్దుకుపోతూ ఉన్న కరుణ అలాగే జీవిస్తే అదే మంచి జీవితమని నమ్మి అలా తన జీవనాన్ని సాగించి ఉండవచ్చు. కస్తూరి మాత్రం అనుకున్నది సాధించడానికి ఏ మార్గమైనా ధైర్యంగా అవలంభించాలి అనే మనస్తత్వంతో తను అనుకున్న జీవితాన్ని సాధించింది. విశ్వం చదువుకుని కుటుంబ బాధ్యతలు స్వీకరించి, తన జీవితాన్ని మలచుకున్నాడు. కరుణ, విశ్వం,కస్తూరి ముగ్గురు ఒకే తల్లికి పుట్టినా మగపిల్లవాడు అవ్వడం వల్ల విశ్వం విద్య-ఉద్యోగాలకు ఆటంకం లేకపోవడం వల్ల అతని జీవితం అతనికి నమ్మకం పెంచింది.

          ఇకపోతే కరుణ,కస్తూరిలు ఇద్దరు ఆధారపడి బ్రతుకుతున్నవారే. కానీ ఒకే రకమైన నిస్సహాయ పరిస్థితులు కరుణలో సర్దుకుపోవడం నేర్పిస్తే, కస్తూరిలో దేనికి రాజీపడకుండా అనుకున్నది ఎలా అయినా సాధించే ధైర్యాన్ని పెంచింది,పద్ధతి ఏదైనా సరే నిస్సహాయ పరిస్థితుల్లో తన జీవితం లేకుండా చూసుకుంది. ఒకే వాతావరణం ఒకరిలో నిస్సహాయతను, ఇంకొకరిలో మొండితనాన్ని పెంచింది. స్త్రీ మంచితనం మాత్రం అటువంటి పరిస్థితుల్లో ఆమెకు ఏ మాత్రం సాయపడదు అనే సత్యాన్ని ఈ నవల స్పష్టం చేస్తుంది.

                   *      *      *

Comments

Popular posts from this blog

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ

గాజుబొమ్మ