విజిలెన్స్ హోమ్ స్త్రీలు
చదువరి
విజిలెన్స్ హోమ్ స్త్రీలు
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
మాలతీ చందూర్ గారి నవలా సాహిత్యంలో స్త్రీ సమస్యలను
సమాజానికి కనబడని ఎన్నో కోణాల నుండి ఆవిష్కరించారు. ముఖ్యంగా స్త్రీలు అనుకోకుండా రొంపిలోకి
దిగి ఆ తర్వాత పట్టుబడితే వారి మజిలీగా చేరుకునే విజిలెన్స్ హోమ్ లో స్త్రీల జీవితాల
గురించి ఆవిడ రాసిన నవలే ‘జయ-లక్ష్మీ.’ ఈ నవలలో విజిలెన్స్
హోమ్ లో ఉండే స్త్రీల మనస్తత్వాలు ఎన్ని రకాలుగా ఉంటాయో, మారాలనే
ఆశ ఉన్నా ఎన్ని ప్రలోభాలకు లోనై చివరకు ఎలా జీవితాన్ని నాశనం చేసుకుంటారో స్పష్టం చేస్తూనే, నిర్దోషులుగా ఉన్న వారు కూడా అనుకోని పరిస్థితుల్లో ఇక్కడికి వస్తే వారి జీవితం
ఎటువంటి మార్పులకు లోనవుతుందో ఈ నవలలో స్పష్టం చేశారు.
పోలీస్
రెయిడ్ లో పట్టుబడిన వారిని విజిలెన్స్ హోమ్ లో ఉంచుతారు. కొందరు శిక్షగా అక్కడికి
వచ్చిన అక్కడి పనుల్లో పడి మారతారు. వర్కింగ్ వుమన్ వింగ్, ఆన్ మ్యారేజ్ మదర్స్
వింగ్స్ కూడా ఇందులో ఉన్నాయి.
జయ
అనే అనాథ చిన్ననాటి నుండే విజిలెన్స్ హోమ్ లో పెరిగింది. ఎంతో చలాకీగా, కలుపుగోలుగా
ఉండే జయకు చదువు మాత్రం అబ్బలేదు. టెన్త్ రెండుసార్లు ఫెయిలైంది. హోమ్ లోకి
విధివశాత్తూ రెయిడ్లలో వచ్చిన ఆడపిల్లలు కొందరైతే, ఆడపిల్లల్ని పెంచలేక
వదిలేయబడ్డవారు ఇంకొందరు. అటువంటివారికి అక్కడి జీవిత ఆలంబన కోసం ఎంబ్రాయిడరీ,
బ్యాడ్జిలు, యూనిఫాంలు కుట్టే పనులు
చేయిస్తారు. అందులో ఆదాయంలో సగం హోమ్ కు వెళ్తుంది, మిగిలింది
ఆ పని చేసిన వారికి చెందుతుంది.
మీనాక్షమ్మ
అనే ఆవిడ తనను చూసుకోవడానికి ఓ మనిషి కావాలని హోమ్ సూపర్నెంట్ ను కలుస్తుంది. అలా
జయ ఆవిడ ఇంటికి వెళ్తుంది. ఆమె కొడుకు డాక్టర్. అతను, ఆమె
కూతురు కూడా అమెరికాలోనే ఉంటారు. రెండేళ్ళు ఆవిడ జయను కూతురిలా, సర్వసౌఖ్యాలతో చూస్తుంది. తర్వాత కొడుకు అమెరికా నుండి వస్తాడు. కొడుక్కి
ఇండియాలో సంబంధాలు చూసినా, జయను ప్రేమించడం వల్ల ఒప్పుకోడు.
చివరకు జయను ఓ షాప్లో సేల్స్ గర్ల్ గా పెట్టి కొడుకుతో కలిసి అమెరికా
వెళ్ళిపోతుంది ఆవిడ.
అలా
మళ్ళీ హోంకు తిరిగి వస్తుంది జయ. కానీ అన్ని సుఖాలకు అలవాటు పడిన ఆమె అక్కడ ఇమడలేక, అక్కడి
నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆర్నెల్లకు ఆమె పని చేసే షాపులో అకౌంటెంట్ ను పెళ్ళి
చేసుకుంటున్నానని చెప్పి, షాప్ లో పని మానేసిందని
తెలుస్తుంది. ఈలోపు మీనాక్షమ్మ జయకు రాసిన ఉత్తరాలు హోంకు వస్తాయి. తన కొడుకు ఓ
అమెరికా అమ్మాయిని పెళ్ళి చేసుకున్నా ఆమెతో సరిగ్గా ఇమడలేకపోయాడని,కోడలు ఆ తర్వాత యాక్సిడెంట్ లో మరణించిందని, ఓ బిడ్డ
పుట్టాడని, తను కొడుకుతో కలిసి తిరిగి వస్తున్నానని, జయ కావాలని, ఇంకెప్పుడూ ఆమెను వదలనని ఆ ఉత్తరం
సారాంశం.
కొన్నాళ్ళకి
జయ అదే హోంకి ఓ రెయిడ్ లో పట్టుబడి తిరిగి వస్తుంది. పాత జీవితం మర్చిపొమ్మని, మీనాక్షమ్మ
గురించి చెప్తుంది హాస్టల్ సూపర్నెంట్. కానీ తాను చాలా చెడిపోయానని, అక్కడికి వెళ్ళలేనని భావించి జయ ఆ హోమ్ ముందున్న నూతిలో దూకి ఆత్మహత్య
చేసుకుంటుంది.
లక్ష్మీ
రెయిడ్ లో పట్టుబడి ఆ హోమ్ కు వచ్చిన అమ్మాయి. బాల్యం నుండి నాట్యం మీద ఆసక్తి
ఉంది. తండ్రికి ఆమె అంటే ప్రేమ,గారాబం కూడా ఎక్కువ. ఆమె కోసం బెజవాడకి
మకాం మారుస్తాడు. అక్కడ డ్యాన్స్ మాస్టర్ ఆమెను ప్రలోభపెట్టి మద్రాస్
లేపుకుపోతాడు. అలా ఆమె ఆ కూపంలో పడుతుంది. హోమ్ కి వచ్చాక ఆమె ఆరోగ్యం
మెరుగుపరిచేవరకు ఉంచి తర్వాత ఆమెను తల్లిదండ్రులతో పంపిస్తుంది సూపర్నెంట్.
విజిలెన్స్
హోమ్ కి వచ్చి మెరుగుపడేవారు కొంతమంది అయితే, డైట్ అమ్ముకుని
దొంగచాటుగా డబ్బు సంపాదించుకుని, తర్వాత స్వేచ్చ పేరుతో
మళ్ళీ అదే కూపంలో పాడేవారు ఇంకొంతమంది. సరస్వతి ఎన్నిసార్లు పట్టుబడిన
తప్పించుకుంటుంది. ప్రతిసారీ పేరు మార్చుకుంటుంది,ఎవరో
ఒకరిని ఆమె మొగుడని సాక్ష్యం చెప్పించుకుని, అలా అక్కడికి
వచ్చిన ప్రతిసారీ ఎవరో ఒక అమ్మాయిని ఆకర్షించి వారిని మళ్ళీ అదే కూపంలోకి
లాగుతుంది.ఇదే కాక అక్కడే ఉండే పనిచేసే సిబ్బందిలో కొందరు ఎప్పుడు
దోచుకుందామా అని చూస్తూ ఉంటారు.
సుశీల
రెయిడ్ లో పట్టుబడ్డవాళ్ళలో వచ్చిన
అమ్మాయి అయినప్పటికీ ఆమె అలాంటిది కాదు. ఆమెకు భర్తతో మొదట్లో సంసారం బాగానే
ఉండేది. తర్వాత ఇద్దరాడపిల్లలు పుట్టాక ఆమె భర్త తాగుడికి బానిసై తిండి పెట్టలేని
పరిస్థితిలో ఉంటే పుట్టింటికి వస్తుంది ఆమె. పెళ్ళికి పూర్వం పని చేసిన చోటుకు
వెళ్ళి ఉద్యోగం కోసం అడుగుతుంది. వీలైతే తప్పక చూస్తానని చెప్తాడు యజమాని. అక్కడి
ఆడపిల్లలు సినిమాకు వెళ్తూ సుశీలను తీసుకువెళ్తారు. సినిమా అయ్యేసరికి
రాత్రైపోతుంది. బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో ఒకతను బ్యాగ్ కొట్టేస్తే అతని
వెంటబడినప్పుడు పోలీస్ వచ్చి ఆమెదే తప్పు అని తీసుకువెళ్ళి రెయిడ్ చేసి పట్టుకున్న
అమ్మాయిలతో సహా తెస్తారు.
అలా
ఆ హోంకు వస్తుంది సుశీల. తర్వాత తండ్రి
వచ్చినా కోర్టులో సాక్ష్యం చెప్పమంటే అల్లుడు ఆమెను వదిలేస్తాడని చెప్పడు. అటువంటి
పరిస్థితుల్లో నిరాశలో మునిగిపోయిన ఆమెకు
ఆర్థికంగా తనను తాను బలపర్చుకోవాలంటే బ్యాడ్జిలు ఎక్కువ కుట్టి సంపాదించుకుంటే
పిల్లలని పోషించుకోవచ్చని సూపర్నెంట్ ధైర్యం చెప్తుంది. ఆ ఆశతో ఆమె కష్టపడి పని
చేస్తుంది.
ఇక్కడితో
‘జయ-లక్ష్మీ’ నవల ముగుస్తుంది. దీనికి కొనసాగింపుగా కృష్ణవేణి నవల రాశారు మాలతీ
చందూర్ గారు.
జయ
మొదట జీవితంలో బాగానే ఉన్నా, ఆమె సౌఖ్యాల ప్రలోభానికి లోనై మళ్ళీ అదే
ఉచ్చులో చిక్కుకుపోయింది. లక్ష్మీ అనుకోని పరిస్థితుల్లో వచ్చినా సరే ఆమె తిరిగి కోలుకుని
తన జీవితానికి వెళ్ళగలిగింది. స్త్రీలలో ఉండే అనేక రకాల మనస్తత్వాలు వారి చర్యల ద్వారా
ఈ నవలలో చూపించారు మాలతీ చందూర్ గారు. మాలతీ చందూర్ గారి సాహిత్యాన్ని ఇష్టపడే వారు
తప్పకుండా చదవాల్సిన నవల ఇది.
* *
*
వారి జీవితాలు నిజంగా ఎంత దయనీయం. చక్కటి సందేశనాత్మక నవల
ReplyDeleteధన్యవాదాలండి.నిజానికి మనం చూడని ఎన్నో జీవితాలు మన ముందే నడుస్తూ వెళ్ళిపోతున్నా మనకు దూరంలోనే ఉంటాయి. బహుశా సాహిత్యం అలా వాటిని కూడా మనకు కనిపించేలా చేస్తుంది అనుకుంటా!
Deleteబాగుంది... రచనగారు...ఖాళీగా ఉన్నప్పుడు
ReplyDeleteమీ చదువరి మొత్తాన్ని చదవాలి... ధన్యవాదాలు... మీ తెలుగోడు...
HTTPS://sskchaithanya.blogspot.com
నమస్తే చైతన్య గారు ...ధన్యవాదాలు! నేను కూడా మీ బ్లాగ్ చదువుతాను.
Delete