అమావాస్య తార

 చదువరి

అమావాస్య తార

                              -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          ప్రముఖ రచయిత్రి  అత్తలూరి విజయలక్ష్మి గారి తన  రచనల్తో  స్త్రీల జీవితంలో ఉండే అనేక కోణాలు వాస్తవికంగా రచించడంలో అందె వేసిన చేయి. ముఖ్యంగా  సినీ రంగంలో ఉండే స్త్రీల జీవితాలు, మనుషులు తమ స్వార్ధం కోసం ఎలా వారిని పావులుగా వాడుకుంటారో అమావాస్య తార నవలలో స్పష్టం చేశారు. సినీరంగంలో  తారల జీవితం వెనుక ఉండే చీకటి కోణం గురించి ఈ నవల స్పష్టం చేస్తుంది. ఓ వ్యక్తిలోని అసూయ, ద్వేషం,స్వార్ధం అనేవి ఇతరుల్ని నాశనం చేయడానికి ఎప్పుడూ ఓ అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటాయి.

          కృష్ణమోహన్, విశ్వమోహన్ స్నేహితుల పిల్లలు. ఓ యాక్సిడెంట్ లో విశ్వమోహన్ తల్లిదండ్రులు మరణించడంతో  కృష్ణమోహన్ తల్లిదండ్రులు అతన్ని కూడా తమ బిడ్డలానే పెంచుతారు. విశ్వమోహన్ కు కాస్త బుద్ధిమాంద్యం ఉండటం వల్ల అతను పై చదువులు చదవలేకపోతాడు. కృష్ణమోహన్ విదేశాల్లో చదువుకుని వ్యాపారాల బాధ్యత తీసుకుంటాడు. పెళ్ళి విషయంలో డిగ్రీ పూర్తి చేసిన యశోదని కృష్ణమోహన్ కు, పదవ తరగతి పూర్తి చేసిన ఇంద్రాణిని విశ్వమోహన్ కు ఇచ్చి చేస్తారు. యశోదను విశ్వమోహన్ ఇష్టపడినా ఆ విషయం మొదలుకుని వ్యాపారంలో యాజమాన్యం వరకు కృష్ణమోహన్ చేతుల్లో ఉండటంతో విశ్వమోహన్ కృష్ణమోహన్ పట్ల ద్వేషం పెంచుకుంటాడు.కానీ కృష్ణమోహన్ మాత్రం అతన్ని సోదరుడిలా భావిస్తాడు.

          కృష్ణమోహన్ తన కూతురు లాస్యకు బిజినెస్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకోవడంతో లాస్య లేకపోతే తన బిడ్డకు అడ్డు ఉండదని భావించి తన స్నేహితుడు, ప్రముఖ దర్శకుడు అయిన తిలక్ ను రంగంలోకి తీసుకువస్తాడు. లాస్య తల్లికి ముందే సినీతార అవ్వాలని  ఉన్నా అవ్వలేకపోవటం వల్ల కూతురిని ఒక్క సినిమాలో సరదాగా చేయనివ్వమన్న తిలక్ ప్రపోజల్ ను సపోర్ట్ చేస్తుంది. విశ్వమోహన్ కూడా దాన్ని బలపరచడం,కూతురు కూడా ఉత్సాహపడటంతో కృష్ణమోహన్ కూడా ఒప్పుకుంటాడు.

          అలా తిలక్ దర్శకత్వంలో సరదా పడి వచ్చిన లాస్య ఆ వలలో చిక్కుకుపోతుంది. ఆ సినిమా చేశాక వెళ్ళిపోదామనుకున్న  తిలక్ ఆమెను మభ్యపెట్టి అక్కడే ఉంచుతాడు. ఆమె టాప్ స్టార్ గా ఎదిగిపోతుంది. చెన్నైలో ఆమె డబ్బుతో ఇల్లు కొని ఆమె ప్రతికదలికపై  నిఘా వేసేందుకు పని వాళ్ళను, కాపలావాళ్ళను పెడతాడు. అది బాధ్యతతో అని లాస్య భావిస్తుంది.

          మొదటి సినిమా అయిన తర్వాత ఆమె ఇంకా కొనసాగించడంతో  తిలక్ కి ఇచ్చి ఆమెను పెళ్ళి చేస్తే ఆమెకు సెక్యూరిటీ ఉంటుందని భావించి కృష్ణమోహన్ ఆ విషయం ప్రస్తావించినప్పుడు తిలక్ ఆమె తన చెల్లెలు వంటిదని చెప్తాడు. కానీ ఆమెతో హీరోగా నటించిన విహారితో ఆమె చనువుగా ఉండడం నచ్చని తిలక్ అప్పటినుండి ఆమెను కట్టుదిట్టం చేస్తాడు. విహారిని హీరోగా తప్పించి కొత్త హీరోని తీసుకుంటాడు. ఆమెను పెళ్ళి చేసుకోబోతున్నట్టు ఓ లోకల్ న్యూస్ పేపర్ కు వార్త ఇస్తాడు. ఆమెను బలవంతంగా పెళ్ళి చేసుకుందామనుకున్న సమయంలో ఆమ దగ్గర మేకప్ వుమన్ గా ఉన్న వందన సాయంతో, ఇద్దరూ ఒకేలా ఉండటంతో పోలికల్లో లేటెక్స్ మేకప్ సాయంతో వందన లాస్యాలా తయారై ఇంటికి వస్తుంది. లాస్య తప్పించుకుంటుంది. కానీ ఆ రాత్రి వందన హత్యకు గురవుతుంది. చివరకు తేలేదేమిటంటే  ఆ ఈ వంటమనిషి కమలమ్మ కొడుకు బైరాగి వందనను లాస్యగా భావించి అత్యాచారం చేస్తాడు, ఆమె అరవబోతే గుడ్డలు కుక్కడం వల్ల ఆమె మరణిస్తుంది. చనిపోయింది లాస్యే అని భావిస్తారు.

          ఉద్యోగం పోగొట్టుకున్న అల్లుడు డబ్బులిస్తే కానీ కూతురిని కాపురానికి తీసుకువెళ్ళననడంతో 50 వేలు మూటగట్టుకుని అతనికి ఇవ్వడానికి వెళ్తున్న గోపాల్రావు  మధ్యలో దారి తప్పడం వల్ల ఓ స్టేషన్ మాస్టర్ ఇంట్లో తల దాచుకుంటాడు. ఆ సమయంలో అతని దగ్గర డబ్బు ఉందని పసిగట్టిన రాజు దానిని దోచుకోవడానికి  అక్కడికి వెళ్ళి  స్టేషన్ మాస్టర్ కొడుకుని హత్య చేస్తాడు. కానీ ఆ డబ్బు ఆ ఇంట్లో పనిమనిషిగా ఉన్న అసిరి తన యజమాని కూతురికి కూడా అదే సమస్య ఉండటంతో ఉపయోగపడుతుందని దాస్తాడు. అలా ఆ ప్రక్రియలో స్టేషన్ మాస్టర్ కొడుకుని రాజు హత్య చేస్తాడు,అయినప్పటికీ అతనికి డబ్బు దొరకదు.ఆ హత్యాభియోగం గోపాల్రావుపై వేస్తారు.

          లాస్య గోపాల్రావును కలుస్తుంది తన పయనంలో. లాస్య గోపాల్రావు ఇంటికి, గోపాల్రావు లాస్య ఇంటికి వెళ్ళేలా ఏర్పాటు చేసుకుంటారు. అలా లాస్య తండ్రి గోపాల్రావుకు ఉద్యోగం ఇస్తాడు. అలాగే అసలు దొంగ రాజును కూడా పట్టుకుంటారు. అలాగే వందన హంతకుడు అయిన బైరాగి ఓ అమ్మాయిపై మానభంగ ప్రయత్నం చేయబోగా అతన్ని ఆమె హత్య చేస్తుంది. విహారి లాస్యను ఎంతగానో ప్రేమించి,ఆమెను తిలక్ బారినుండి తప్పిస్తానని మాట ఇచ్చి,ఆమె మరణించిందని తెలియగానే అతను తిలక్ తో కలిసి పని చేస్తాడు.

          ఇలా ఓ బిజినెస్ మాగ్నెట్ గా ఎదగాల్సిన లాస్య చిక్కుకుపోతుంది. చివరకు కథ సుఖాంతమైనా మనిషిని ఈ తెర జీవితం అన్నది ఓ మోజులా ఆకర్షిస్తూ ఉంటుంది. లాస్య సినిమాల్లో సంపాదించిన డబ్బు కూడా తిలక్ తీసుకుంటాడు. అది లెక్కల్లో తేలదు. ఈ కథలో ఆమె కోటీశ్వరుడి కూతురు కనుక ఆమెకు ఆ డబ్బు పెద్ద సమస్య కాదు. కానీ అన్నీ కథల్లో సుఖాంతం కావు కదా !

          సినీ రంగంలో కేవలం ఆకర్షణ కొద్దీ ఆ రంగంలో ప్రవేశించే అమ్మాయిలు కొందరైతే ఇంకొందరు తమ స్వార్ధం కోసం వారిని బలి చేస్తారు. అటువంటి కోణాన్ని పరిచయం చేసే ఈ నవలా శైలి కూడా చదివించేలా ఉంటుంది. స్త్రీ సాహిత్యాన్నిచదవడానికి ఇష్టపడేవారు తప్పకుండా చదవాల్సిన నవల.

             *      *      * 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ