వెంటాడే నీడలు

 చదువరి

వెంటాడే నీడలు

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



            విశిష్ట రచనాశైలితో పాఠకాదరణ పొందిన మన్నెం శారద గారి రచనల్లో  వెంటాడే  నీడలుఓ స్త్రీ తనదైన జీవిత బాధ్యతలు నెరవేరుస్తున్న సందర్భంలో ఆమె అనుకోకుండా ఓ ద్వంద మనస్తత్వం కలవాడి భార్య అయ్యి ఎలాంటి బాధలు పడిందో , చివరకు సమాజం ఆమె చర్యల్ని అపార్ధం చేసుకుని ఆమె చేసింది మాత్రమే తప్పుగా భావించి ,ఆమె భర్త చేసిన తప్పుల్ని ఎలా సమర్ధిస్తూ ఆమెను అనాధను ఎలా చేసిందో స్పష్టం చేస్తుంది.  

    రాధాదేవి బాల్యం నుండి అన్నీ అంశాల్లో స్కూల్లో ప్రథమంగా ఉండేది. ఆమె ఆసక్తిని గమనించి ఆమె తండ్రి ఆమెకు పెయింటింగ్ లో శిక్షణ ఇప్పిస్తూ ఉంటాడు. ఆయన స్కూల్లో లెక్కల టీచర్. అకస్మాత్తుగా ఆయన మరణించడంతో కుటుంబ బాధ్యత అంతా రాధాదేవి మీద పడుతుంది. ఉన్న ఇల్లు అమ్మి తండ్రి చేసిన అప్పులు తీర్చి తను బి.ఎడ్ చేస్తుంది. ఆ తర్వాత ఆమెకి రెండు జిల్లాలు దాటాక ఓ పల్లెటూరిలో సైన్స్ టీచర్ గా పోస్టింగ్ పడుతుంది. అలా అక్కడికి వెళ్తుంది ఆమె.

          అక్కడ సర్పంచి కొడుకు రాజు, అలాగే హిస్టరీ టీచర్ రవీంద్ర ఇద్దరూ ఆమెను ప్రేమిస్తారు. కానీ అంతకుముందే రవీంద్రను రాజు చెల్లెలు పార్వతికి ఇచ్చి పెళ్ళి చేద్దాం అనే నిర్ణయంతో ఉంటారు పెద్దలు కూడా. రవీంద్ర రాధ ముందు పార్వతి మీద ఆసక్తి లేనట్టు నటించి, రాజు గురించి చెడ్డగా చెప్పి అతను ఊళ్ళో లేని సమయంలో రాధాదేవిని పెళ్ళి చేసుకుని అక్కడినుంచి హడావుడిగా ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోతాడు. దానితో రాధాదేవి ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాల్సి వస్తుంది.

          తర్వాత వారికో కొడుకు దీపూ పుడతాడు. ఆమె తమ్ముడు మెడిసిన్ బాధ్యత  కూడా రవీంద్ర తీసుకుంటాడు. తర్వాత రవీంద్రకు హెడ్ మాస్టర్ గా రాజు వాళ్ళ ఊరుకు చంద్రవీడులో పోస్టింగ్ వస్తుంది. అతనికి ఆ చోటుకు వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఆ హెడ్ మాస్టర్ పోస్ట్ వదులుకోలేక వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక రాధాదేవి కూడా అక్కడ టీచర్ గా జాయిన్ అవుతుంది. అక్కడ ఓ సారి అందరూ పిక్నిక్ కు వెళ్ళినప్పుడు రాధ ఏటిలో పడిపోతూ ఉంటే చూసి రాజు కాపాడే  ప్రక్రియలో వారు అవతలి ఒడ్డునే ఉండిపోవాల్సి వస్తుంది ఆ రాత్రంతా. వారి నిజాయితినీ ఎవరూ నమ్మరు. రవీంద్ర అనుమానం కూడా తారాస్థాయిలో ఉంటుంది. ఆమె స్కూల్లో కూడా రాజీనామా చేస్తుంది. ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నప్పుడు  రాజు వచ్చి అడ్డుకుని  ఆమెను విడిగా ఓ ఇంట్లో ఉంచుతాడు.

          ఊరు ఊరంతా రాధాదేవిని రాజు ఉంపుడుకత్తెగా భావిస్తారు. ఈ సమయంలో రవీంద్ర ఇంటికి ఎవరో అమ్మాయిని తెచ్చుకుని, మందుకు కూడా అలవాటు పడ్డాడని కూడా రాధాదేవికి తెలుస్తుంది. కానీ ఊరంతా అతని మీదే సానుభూతి చూపుతుంది. తన కొడుకు దగ్గరకు కూడా రాధాను వెళ్లనివ్వరు. రాధ తమ్ముడు కూడా రవీంద్ర మాటలే నమ్మి అక్కనే నిందిస్తాడు.

          అదే సమయంలో పార్వతి ఉత్తరం ద్వారా కొన్ని నిజాలు తెలుస్తాయి రాధకు. పార్వతి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం రవీంద్ర వల్ల గర్భవతి అవ్వడం వల్ల అని, అందుకే హడావుడిగా అప్పుడు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడని రాధకు అర్ధమవుతుంది.దానితో రవీంద్ర మీద పూర్తి విరక్తి ఏర్పడుతుంది రాధకు.

          ఊరిలో అపనిందతో విసిగిపోయిన రాజు రాధతో కలిసి పారిపోవాలనే నిర్ణయానికి రాధను ఒప్పిస్తాడు. కానీ రాజు భార్య వసంత అక్క సావిత్రి రాధ దగ్గరకు వెళ్తుంది. ఆమెతో మాటల ద్వారా తన తప్పును గ్రహిస్తుంది రాధ. ఆమె కొడుకుని ఆమెకు ఇప్పించి, ఆమె బాధ్యతను తీసుకుంటుంది సోషల్ వర్కింగ్ ఫీల్డ్ లో ఉన్న సావిత్రి. అలా తన బిడ్డతో చంద్రవీడు నుండి సావిత్రితో బయలుదేరుతుంది రాధాదేవి.

          సమాజంలో ఎప్పటికీ కూడా ఎన్ని సంస్కరణలు జరిగినా సరే స్త్రీకు పురుషుడితో ఉండే సంబంధాల్లో కచ్చితంగా ఇలానే ఉండాలి అన్న అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోలేదు. స్త్రీ ఎంత పురోగతి సాధించినా ఆమె తమ ఆలోచనలకు తగ్గట్టుగా నడుచుకున్నంతవరకే ఆమెకు గౌరవం ఇవ్వడం జరుగుతుంది. ఇది కాలంతో సంబంధం లేని నిత్యసత్యం.

  *     *     *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ