ఖజురహో
చదువరి
ఖజురహో
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
బలభద్రపాత్రుని రమణి గారి నవలల్లో ‘ ఖజురహో
‘ స్త్రీ తన అందం పట్ల పెంచుకున్న వ్యామోహం ఆమె జీవితాన్ని ఏ
స్థితికి దిగజారుస్తుంది అనే భావనను వాస్తవికంగా స్పష్టం చేస్తుంది. అందంతో ఏదైనా సాధించవచ్చు
అనుకునే అమ్మాయిల జీవితం చివరకు ఏమవుతుంది అన్న ప్రశ్నకు సమాధానం కూడా ఈ నవలలో ఉంది.
అనాధగా పుట్టిన
ఛాయ గొప్ప అందగత్తె. అందం ఆమెలో అహాన్ని పెంచింది. అనాధశ్రమంలో ఉండి చదువుకుంటున్న
ఆమెకు పేదరికం అంటే అసహ్యం. ఆమె చదువుతున్న కాలేజీలో సంధ్య అనే అమ్మాయి చేరుతుంది.
గొప్ప కోటీశ్వరురాలైన సంధ్య సాదాసీదాగా ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు కాంచన,జయచంద్ర.
జేసీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు అధినేత జయచంద్ర.కాంచనకు కార్డియోమయోపతీ అనే గుండె జబ్బు
ఉండటం వల్ల ఆమెను చాలా సున్నితంగా చూసుకుంటారు భర్త, కూతురు.
కారులు,సోకులు,డబ్బు అంటే ఇష్టం ఉన్న ఛాయను కిరణ్ ప్రేమిస్తాడు. అతనితో కార్లో
తిరగడానికి,దర్పాలకు
అతన్ని వాడుకుంటుంది. పెళ్ళి విషయం వచ్చేసరికి సొంత ఫ్లాట్ ఉండేవరకు వద్దని
దాటవేస్తుంది.
కిరణ్
ఓ అనాథ. కానీ మేనమాకు అతనే వారసుడు. ఛాయ కోసం అతను డబ్బు అప్పు చేసి మరి ఆమెకు
డబ్బులిస్తాడు. ఆ అప్పు తీసుకున్న సేట్ తో గొడవ అయ్యి కిరణ్ కు గాయాలయినా సరే తన
స్నేహితులకు అతనిచ్చిన డబ్బులతో విలాసాలకు తీసుకువెళ్తుంది.
అనుకోకుండా
జయచంద్రను లిఫ్ట్ అడిగినప్పుడు అతని కారును బట్టి అతను కోటీశ్వరుడని గ్రహిస్తుంది.
జ్వరం ఉన్నట్టు నటిస్తుంది. హాస్పటల్లో జాయిన్ చేసి అతను వెళ్ళిపోతాడు. తరువాత
అతని చిరునామా కనుక్కుంటుంది. సంధ్య మెడలో లాకెట్ తానే దాచి, తిరిగి
తానే ఇచ్చి ఆ ఇంటికి ఆతిధ్యం
సంపాదిస్తుంది. అక్కడ జయచంద్ర సంధ్య తండ్రి అని తెలుసుకుని, కాంచన ఆరోగ్య పరిస్థితిని గమనించి ఆ ఇంటిలో పాగా వేసి జయచంద్రను సొంతం
చేసుకుని ఆస్తి దక్కించుకోవాలనుకుంటుంది.
సంధ్య
మంచితనాన్ని ఆసరా చేసుకుని హాస్టల్ నుండి మకాం సంధ్య ఇంటికి మార్చుకుంటుంది. చదువు
మానేసి ఆ ఇంటి బాధ్యతలు తీసుకుంటుంది. పాత పనివాళ్ళను దొంగతనం నెపం మీద
తప్పిస్తుంది. ఇంట్లో పెంపుడు కుక్క అయిన జూలిని కూడా చంపేస్తుంది. కాంచనకు
జయచంద్రకు తనకు మధ్య సంబంధం ఉన్నట్టు అపార్ధాలు కలిగిస్తుంది. చివరికి కాంచన
మరణించే స్థితిలో ఉన్నప్పుడూ ఏమి చేయకుండా ఆమె చనిపోయెవరకు చూస్తూ ఉంటుంది. కాంచన
డైరీ చదివిన సంధ్య తండ్రి ఛాయను ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడేమో
అనుకుంటుంది.
కిరణ్
జేసీ కంపెనీలో చేరతాడు. అనుకోని విధంగా లాభాలు వచ్చేలా చేసి ఓ ఇల్లు ఛాయ కోసం
తీసుకుంటాడు. కానీ అది పూర్తి సామానుతో
రాజసౌధంగా మారిన తర్వాతే వస్తానని అంటుంది ఛాయ. సంధ్య అప్పటికే కిరణ్ ను
ప్రేమిస్తూ ఉంటుంది.
సంధ్య
ఉత్తరం ద్వారా కాంచన, సంధ్య తనని ఎలా అపార్ధం చేసుకున్నారో
తెలుసుకున్న జయచంద్ర దీనికి ఓ పరిష్కారం ఆలోచిస్తాడు.ఛాయతో ఆమెను తాను పెళ్ళి
చేసుకుంటానని,కానీ ఆస్తి మొత్తం సంధ్య పేరున రాసానని,
కిరణ్ -సంధ్యల పెళ్ళి కూడా జరుగుతుందని చెప్తాడు. దానితో కిరణ్ ను
కలిసిన ఛాయ ఆ ఆస్తి తమకు దక్కాలంటే ఆ రెండు పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత యాక్సిడెంట్
చేసి సంధ్య,జయచంద్ర మరణించేలా చేయాలని చెప్తుంది.
ఆమె
వికృత మనస్తత్వాన్ని చూసిన కిరణ్ ఆమెతో తాను కలిసి వెళ్తున్న కారు బ్రేకులు ఫెయిల్
అయ్యేలా చేస్తాడు. దానితో ఆమె తీవ్రంగా గాయపడి చివరకు మతిస్థిమితం కోల్పోతుంది.
కిరణ్ చిన్న దెబ్బలతో బయటపడతాడు. తర్వాత కిరణ్, సంధ్యల వివాహం
జరుగుతుంది. వారికి పుట్టిన పాపకు కాంచన ఛాయ అని పేరు పెడతారు.
ఛాయ
లాంటి వారి ప్రవర్తనకు కారణం తీరని కోరికలు. అవి తీరే మార్గం వెదుక్కోవడంలో వారు
వేసే తప్పటడుగులు. తల్లిదండ్రుల ఆదరణకు, ప్రేమకు దూరమైన అనాధల్లో ఓ వర్గం సమాజం మీద కసి పెంచుకుని,
ప్రపంచంలోని ప్రతి ఆనందాన్ని సొంతం చేసుకోవాలన్న అత్యాశతో ,తీరా ఆనందాలన్నీ డబ్బుతోనే కాదు...మనిషికి మనిషికీ మధ్యన పెనవేసుకున్న ఆప్యాయతల వల్ల కలుగుతాయని
తెలుసుకున్నాక, వాటి మీద కసి పెంచుకుని, అసంతృప్తితో రగిలిపోతూ,చుట్టు పక్కల ఉన్నవారిని
హింసిస్తూ,ఏదో పొందామనుకుని ,చివరికి
ఏమీ పొందలేక నిరర్ధకంగా జీవితాన్ని నాశనం చేసుకుంటారు!
ఛాయది
అత్యాశ కూడా కాదు దురాశ. తనకి చెందని దాన్ని బలవంతంగా పొందాలని వ్యూహాలు పన్నింది.
ఫలితంగా వీధి చేతిలో ఘోరమైన శిక్షకు గురైంది. తను పోగొట్టుకున్న వరం ఏమిటో
పోగొట్టుకున్నాకే తెలుసుకుని పరితపించింది.జీవితాంతం పరితపిస్తూనే ఉంది.
దీనికి ఎవరు బాధ్యులు?
ఆమెను
పుట్టగానే చెత్తకుండీలో వదిలేసిన ఆమె తల్లా?
అటువంటి
పరిస్థితులు ఆ తల్లికి కల్పించిన ఈ సమాజానిదా?
అందుకోలేని వారిని ఆశలు పెట్టి ప్రలోభపరుస్తున్న ఈ రంగు రంగుల శాటిలైట్ ప్రభంజానిదా?
ఈ
ప్రశ్నలకు జవాబులు ఎవరు చెప్పలేరు.
ఎందుకంటే సరైన పెంపకం, విచక్షణ లేకపోతే జీవితం వేదనా మందిరం,
అసంతృప్తికి స్థావరం,ఆజ్ఞానానికి నిలయం,కోరికల శిఖరం విషాధానికి కేంద్రం అని ఛాయ చివరిలో అంటుంది. అలాగే గోరంత
వివేకం, ఆత్మవివేచనా ఉంటే జీవితం ఓ రసరమ్య గీతం! ఆనందశిఖరం,
అనురాగ గోపురం,ఆశల పుష్పక విమానం, సంతోషానికి నిలయం అని సంధ్య అభిప్రాయపడుతుంది. బహుశా ఈ రెండు ఆ ప్రశ్నలకు
మూలాలు మాత్రం చూపగలుగుతాయి. ఇది ఆంధ్రభూమి వారపత్రికలో సీరియల్ గా
ప్రచురించబడింది.
*
*

Comments
Post a Comment