అసంతృప్తి వలయం
చదువరి
అసంతృప్తి వలయం
-రచనశ్రీదత్త
(శృంగవరపు రచన)
మధ్యతరగతి జీవితాన్ని గడిపే స్త్రీల మనసులో
ఉండే అసంతృప్తులను స్పష్టం చేస్తూ ఎంతో వాస్తవికంగా వారి జీవితాల్ని నవలలుగా సృష్టించిన
రచయిత్రి డి.కామేశ్వరి గారు. ఆవిడ నవలల్లో ‘ మనసున మనసై’ అనే నవలలో కూడా అటువంటి
మధ్యతరగతి అమ్మయైన జయంతి తన ఊహాలలో ఉండే జీవితం లేక, వాస్తవ జీవితాన్ని
అంగీకరించలేక ఆమె తన జీవితం అంతా ఎలా అసంతృప్తిగా గడిపిందో స్పష్టం చేశారు.
వెంకటేశ్వరరావు,శారదాంబలకు
వాసంతి, జయంతి, దమయంతి అనే ముగ్గురు
కూతుర్లు. వాసంతికి పెళ్లయిపోయింది. జయంతి బాగా చదువుకుంది, బ్యాంక్
ఉద్యోగం చేస్తుంది. నవలలు, ఊహల్లో జీవితం గడిపే ఆమె ప్రతి
పెళ్ళి కొడుక్కి వంక పెడుతుంది. అలా
గోపాలకృష్ణ అనే పెళ్ళికొడుకు
చూసుకోవడానికి వస్తాడు. అతనిలో
లోపాలు ఆమె చెప్పినవి అతను వింటాడు. ఆ రోజు బ్యాంక్ లో ఆమె వద్దకు వెళ్ళి ఓ
అద్దం బహుమతిగా ఇచ్చి, దానిలో ఆమె మొహం చూసుకోమని,పక్కవారిలో లోపాలు ఎంచేముందు మన లోపాలను తెలుసుకోవాలంటాడు. ఇంటికి వచ్చే
చెప్తే తమకు చెప్పే ఆమెకు బుద్ధి చెప్పడానికి వచ్చాడని అంటారు.అలా గోపాలకృష్ణ పట్ల
విముఖత పెంచుకుంటుంది. ఈ లోపు దమయంతి,గోపాలకృష్ణలకు వివాహం
చేయాలనుకోవడంతో, తనను అవమానించినవాడిని ఇంటికి అల్లుడిని
చేశారనే కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. తన స్నేహితురాలు ఉషారాణితో కలిసి
హాస్టల్లో ఉంటుంది. దమయంతి, గోపాలకృష్ణల వివాహం జరిగిపోతుంది.
తర్వాత ఉషారాణికి కూడా వివాహం జరిగిపోవడంతో ఆమె
వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె పని చేస్తున్న బ్యాంకుకి దివాకర్ మేనేజర్ గా వస్తాడు. అతనిలో జయంతి
కోరుకున్న అందం, స్మార్ట్ నెస్ ఉన్నాయి. ఉషారాణి ఆహ్వానించడంతో దివాకర్,
జయంతిని తన కారులో తీసుకువెళ్తాడు. దివాకర్, గోపాలకృష్ణ,
ఉషారాణి భర్త మిత్రులు. తర్వాత అక్కడ ఆ పెళ్ళికి వచ్చిన వారి
స్నేహితులు వారిలో ఇంకొకరు పెళ్ళికి ఆహ్వానించడంతో దానితో మళ్ళీ జయంతి, దివాకర్ కలిసి వెళ్తారు. గోపాలకృష్ణ,దమయంతి,ఉషారాణిలకు జయంతికి దివాకర్
నచ్చాడని అన్పిస్తుంది. జయంతి కూడా అదే ఊహల్లో అప్పటిదాకా ఉంటుంది. కానీ ఆ
పెళ్ళిలో ఆ పెళ్లికూతురు చెల్లెలు మనీషాను పరిచయం చేసుకుంటాడు దివాకర్. ఆమె జయంతి
కంటె అందగత్తె. వాళ్ళు కోటీశ్వరులు.అప్పటి నుండి జయంతితో ముభావంగా ఉంటాడు.
మనీషాతో రోజు ఫోన్ లో మాట్లాడి, స్నేహం
పెంచుకుంటాడు. ఆమె తల్లిదండ్రులతో కలిసిపోతాడు. వారి అనుమతితోనే లంచ్ లకు, డిన్నర్లకు ఆమెను తీసుకువెళ్తాడు. ఈ లోపు గోపాలకృష్ణ, దమయంతి ద్వారా జయంతికి అతనంటే ఇష్టమని తెలుసుకుని అతన్ని అడిగితే అప్పటికే
మనీషా మనసులో ఉండటం వల్ల తనకప్పుడే పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదని చెప్తాడు.
దానికి కారణం మనీషా అని జయంతి గ్రహిస్తుంది. తర్వాత మనీషాకు ప్రపోజ్ చేస్తే,
ఆమెకు ఇష్టం లేదని చెప్పడంతో అప్పుడు జయంతిని పెళ్ళి చేసుకుంటానని
చెప్తాడు. దానికి జయంతిని తిరస్కరిస్తుంది. మనీషా వదిలేస్తే తనను పెళ్ళి
చేసుకోవాలనుకోవడం ఆమెకు నచ్చదు.
తర్వాత జయంతి వివాహం వేరే అతనితో
జరుగుతుంది. అతనికి కుటుంబ బాధ్యతలు ఉండటం వల్ల డబ్బు పట్ల పొదుపుగా ఉండటం ఆమెకు
నచ్చదు. జల్సాగా, సరదాగా ఉండాలనుకున్న ఆమెకు అతను నచ్చడు.
ఆమె జీతం కూడా అడగటం, వంట చేయమనడం,ఇలా
గొడవలు పెరుగుతాయి. చివరికి వేరు కాపురానికి అతను రాననడంతో అతను రాననడంతో ఆ కాపురం
ముక్కలవుతుంది. తర్వాత గర్భవతి అయిన ఆమె అబార్షన్ చేయించుకుంటుంది.
జయంతి ఉద్యోగం చేసుకుంటూ జీవితం
గడుపుతూ ఉంటుంది. దమయంతి, వాసంతి పిల్లల్ని తన పిల్లల్లా చూసుకుంటూ ఉంటుంది.
ఒంటరితనం ఫీల్ అవుతుంది. తర్వాత ఓ యాక్సిడెంట్ లో దమయంతి చనిపోతుంది. అప్పుడు ఆ
పిల్లల కోసమైనా గోపాలకృష్ణకు జయంతినిచ్చి పెళ్ళి చేద్దామనుకున్న, దానికి జయంతి కూడా అంగీకరించినప్పటికీ, గోపాలకృష్ణ
ఒప్పుకోడు.
ఈ ఒంటరితనం నుండి బయటపడటానికి పిల్లల కోసం
క్రష్ పెడుతుంది. తను కోరుకున్న తోడుని ఊహల్లో ఊహించుకోవటం, అడ్జస్ట్
అవ్వలేకపోవటం ‘మనసున మనసై ..బ్రతుకున బ్రతుకై.....తోడొకరుండిన అదే భాగ్యము....’
అనే తోడును ఆమె పొందలేకపోయింది.
డి.కామేశ్వరి గారి నవలలు ‘మనసున మనసై’, ‘జీవితం చేజారనీయకు’, ‘కోరికలే గుర్రాలైతే’ లో
కథానాయికలు నవలల, సినిమాల ఊహా కాలంలో తేలిపోయేవారు. ఆ ఊహాకు,
వాస్తవానికి మధ్య ఉన్న ఆంతర్యంతో వారు రాజీ పడలేక జీవితంలో కొని
తెచ్చుకునే కష్టాలే ఈ కథలు ప్రతిఫలిస్తాయి.
*
* *

Comments
Post a Comment