జారుడుమెట్లు
చదువరి
జారుడుమెట్లు
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
ప్రముఖ రచయిత్రి ద్వివేదుల విశాలాక్షి గారి ‘ జారుడు
మెట్లు’ నవల స్త్రీ జీవితం ఎన్ని దశల్లో పయనిస్తుందో తెలిపే నవల. పుట్టినప్పటి నుండి వేదవతి వివాహమై బిడ్డ
పుట్టాక ఆ తర్వాత ఆమె జీవిత పయనమే ఈ నవల. నాటి కుటుంబ పరిస్థితులు, మనుషుల అవకాశవాదాలు ఈ నవలలో దర్శనమిస్తాయి.
కామేశ్వరి తండ్రి భోగపురుషుడు.తల్లి ఎన్నో
బాధలను భరిస్తుంది.అతడు ఎంత వదిలించుకుందామని ప్రయత్నించినా భర్తనే దైవంగా తలచి
అన్ని బాధలు భరిస్తూ ఉంటుంది.చివరికి ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది.అతనే హత్య చేశాడని
కొందరంటారు.కామేశ్వరిని మేనమామ తీసుకెళ్తాడు.అలా అమ్మమ్మ,తాతగారింట
మేనమామ,అత్తయ్యల దగ్గర పెరుగుతుంది.కొన్నాళ్ళకి ముసలి వయసులో
కామేశ్వరి వయసున్న అమ్మాయైన ఇందిరనే తండ్రి వివాహం చేసుకోవడంతో తండ్రి పట్ల ఎక్కడో
మనసులో ఉన్న ఆపేక్ష కూడా పోతుంది కామేశ్వరికి.కామేశ్వరికి రామస్వామితో
వివాహమౌతుంది.రామస్వామికి ముగ్గురు తమ్ముళ్ళు గోపాల్,హరి,ప్రసాద్. ఇద్దరు తోబుట్టువులు రాజేశ్వరి,రాజ్యలక్ష్మి.కామేశ్వరి
అత్త కాంతమ్మ.మామ మరణించాడు.
కొన్నాళ్ళకు
కామేశ్వరి తండ్రి మరణిస్తాడు.తర్వాత పినతల్లి అయిన ఇందిరకు సుస్తీగా ఉందంటే
బయల్దేరుతుంది కామేశ్వరి.అప్పటికే ఇందిర మరణిస్తుంది.దహన సంస్కారాలకు డబ్బిస్తుంది
కామేశ్వరి.ఇందిర పతిత అని ఎందరితోనో సంబంధాలు పెట్టుకుందని,ఎంతో
దర్జాగా బ్రతుకుతుందని ఊహించుకున్న కామేశ్వరికి అక్కడి దైన్య పరిస్థితి,పేదరికం ఆమెను షాక్ కు గురి చేస్తాయి.ఆ రాత్రి పక్కింటమ్మాయి సరోజ ఓ పాపను
అప్పగించి,ఆ పాప ఇందిర కూతురని చెప్పి వెళ్ళిపోతుంది.ఆమె
మాటల్లో ఇందిర మంచిదే అయినా సమాజం ఆ గ్రామంలోని మగవాళ్ళు ఆమెని ఆ స్థితికి దిగజార్చారని అర్థమవుతుంది.
వేదవతి(ఇందిర
కూతురు) తన తల్లి కామేశ్వరి అక్కకు ఓ ఉత్తరం ఇమ్మందని చెప్పి ఇస్తుంది.ఆ ఉత్తరంలో తనను
అసహ్యించుకోవద్దని,తన బిడ్డను తనలా పతీత కాకుండా గౌరవప్రదమైన
జీవితం గడిపేలా చేయమని కోరుతూ ఆ ఉత్తరంలో రాస్తుంది.తనని కనీసం ఒక్కసారైనా
చూడకుండా,కలవకుండా తన మీద ఆమె పెంచుకున్న మమకారానికి
ఆశ్చర్యపోతుంది కామేశ్వరి.అలా వేదవతిని తన ఇంటికి తీసుకువెళ్తుంది కామేశ్వరి.
ఆ ఇంట్లో వారు
కూడా వేదవతిని ఆదరిస్తారు.వారి కుటుంబంలో కాంతమ్మ ఆడపడుచు విధవైన సుందరమ్మ కూడా
ఉంటుంది.ఆమెకు పిల్లలూ లేకపోవడం వల్ల గోపాల్ -సత్యవతిల సంతానమైన రామకృష్ణనూ
పెంపుకు తీసుకుంటుంది.రామకృష్ణ బాల్యం నుండే వేదవతి వైపు ఆకర్షితుడౌతాడు.చిన్ననాటి
నుండే వారిద్దరూ భార్యాభర్తలని ఇంట్లో అందరూ కూడా అనుకుంటూ ఉంటారు.అతను ఇంజనీరింగ్
కు వస్తాడు.అతనితో హద్దులు దాటుతుంది వేదవతి.కామేశ్వరి మేనమామ,మేనత్తలతో
కలిసి తీర్థయాత్రలకు వెళ్తూ అనారోగ్యంగా ఉన్న భర్తను చూసుకోమని వేదవతికి
అప్పజెప్తుంది. ఆ సమయంలో ఓసారి కామోద్రేకంలో
రామస్వామి తప్పు చేస్తాడు.వేదవతి ఆ విషయాన్ని మర్చిపోతుంది.ఆమె రామకృష్ణ వల్ల
గర్భవతి అవుతుంది.
కామేశ్వరి
ఇంటికి తిరిగివచ్చాక వేదవతి అని గర్భవతి అని తెలుస్తుంది.అది తనవల్లే అనుకొని తనే
ఆ పని చేసిందని అందరిముందు ఒప్పుకుంటాడు
రామస్వామి.ఈ లోపు రామకృష్ణ వస్తాడు.రామస్వామి ముందుకొచ్చి చెప్పకపోతే ఎలాగో
ఒప్పించి పెళ్ళి చేసుకుందామనుకున్న రామకృష్ణకు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.
సుందరమ్మ వేదవతిని కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకోదు.తల్లి దగ్గరున్న ఆస్థి రాదని
రామకృష్ణ కూడా మౌనంగా ఉండిపోతాడు.
కామేశ్వరి
తర్వాత రామస్వామికి,వేదవతికి వివాహం జరిపిస్తుంది. తన వల్ల
కలగని సంతానం ఇలాగైనా భర్తకు కలుగుతున్నందుకు సంతోషించినా,తర్వాత
అక్కడ ఉండలేక పుట్టిల్లైన మేనమామ ఇంటికి వెళ్ళిపోతుంది కామేశ్వరి.వేదవతి ప్రసన్నను
కంటుంది.కామేశ్వరి అనారోగ్యంతో చావుకు సమీపంలో ఉంటుంది.అప్పుడు అనుకోకుండా
రామకృష్ణ,వేదవతి మాటలు విన్న రామస్వామికి తాను ఆ బిడ్డ
తండ్రి కాదని తెలుస్తుంది.కామేశ్వరికి ఆఛరి క్షణాల్లో ఆ వార్త చెప్పి తృప్తి
కలిగిస్తాడు.ఆమె మరణిస్తుంది.
దీనితో
విరక్తి చెందిన రామస్వామి భార్య అస్థికలు గంగలో కలిపి వస్తానని చెప్పి వెళ్ళి
సన్యాసుల్లో కలిసిపోతాడు.తర్వాత కొన్నాళ్ళకు
కాంతమ్మ కూడా మరణిస్తుంది.పంపకాలు జరుగుతాయి.వేదవతికి చదువు చెప్పించి,ఆమెకో
ఉద్యో గం ఇప్పించి,ఆమెను అర్థం చేసుకునే వాడు వస్తే వివాహం
చేయమని రాజేశ్వరి భర్త,బావైన శివరావుకు ఉత్తరం రాస్తాడు
రామస్వామి.
శివరావు
టీచర్ ,ఆశయాలున్న వ్యక్తి. అలాగే ఆమెను ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధం చేస్తాడు.
అదే సమయంలో ఇన్విజిలేషన్ కు వేరే ఊరు వెళ్ళిన శివరావు కాపీ కొడుతూ పట్టుబడిన
విద్యార్థిని ప్రశ్నించిన ఉపాధ్యాయుడిపై ఆ విద్యార్థి దాడికి తలపడగా,అతనికి అండగా వెళ్ళిన శివరావు ప్రమాదకర
స్థితి అయిన కోమాలోకి వెళ్తాడు.వాతావరణ మార్పిడి కోసం వైజాగ్
తీసుకువెళ్తారు.దిక్కు లేని పరిస్థితుల్లో పరీక్షలు రాసి పాసైన వేదవతి మళ్ళీ
పంపకాలు జరిగి ఇంటికే చేరుకుంటుంది.రాజేశ్వరి,శివరావుల
దగ్గరే ప్రసాద్ పెరుగుతాడు.
మిగిలిన
వారు అద్దెలకు ఇచ్చిపోగా అక్కడ మిగిలింది గోపాలం,సత్యవతి మాత్రమే.
తల్లి అనారోగ్యం,మరణంతో సత్యవతి పుట్టింటికెళ్తే ,గోపాలం వేదవతిని లోబర్చుకునే ప్రయత్నం చేయబోతే వొదవతి,బిడ్డతో సహా బావిలోకి దూకుతుంది. అదే సమయంలో
ప్రసాద్ వస్తాడు.ఆమెను బయటకు తీయిస్తాడు.పాప అప్పటికే మరణిస్తుంది.అసలు విషయం
తెలుసుకున్న ప్రసాద్ వేదవతిని తనతో తీసుకువెళ్తాడు.
టైప్
పాసవుపతుంది వేదవతి. ప్రసాద్
తన సహోద్యోగి అయిన శారదను ప్రేమిస్తాడు.వేదవల్లి వల్ల వారిద్దరి మధ్య అపార్థాలు రావడంతో
వేదవతి బాధ్యత తీసుకుని వారిద్దరి పెళ్ళి చేయిస్తుంది.తర్వాత వేదవతికి కనీస గౌరవం
కూడా ఇవ్వకుండి ఆమె అంటే గిట్టకుండా ఉంటుంది శారద. వేదవతికి ఉద్యోగం
వస్తుంది.ఆ ఇల్లు వదిలా,ఆ కాపురం నిలబెట్టడానికి వేదవతి
వెళ్ళాపోతుంది.ఓ గది అద్దెకు తీసుకుంటుంది. రామకృష్ణకు అప్పటికే ధనవంతుల అమ్మాయితో
వివాహమౌతుంది. ఓసారి ఆకస్మికంగా కలిసిన రామకృష్ణ వేదవతిని తన ఇంటికి
తీసుకువెళ్తాడు.తర్వాతర్వాత ఆ భార్య ప్రవర్తన బాధపెట్టేలా ఉండటంతో అక్కడికి
వెళ్ళడం వేదవతి మానుకుంటుంది.
అదే సమయంలో
శివరావు మరణిస్తాడు. కొన్నాళ్ళకి శివరావు కూతురు వనజ ప్రేమించిన భానుమూర్తిని పెళ్ళి చేసుకునేందుకు, భానుమూర్తితో
కలిసి ఉండేందుకు ఓ వారం ఆమె దగ్గర ఉండి వెళ్ళిపోతుంది.తర్వాత వేదవతి మంగాపురం
వెళ్తుంది.అక్కడ ఫాదర్ తో కలిసి సేవలు చేస్తున్న సమయంలో ఓ స్వామీజీ వస్తాడు.ఎంతో
మంది సన్యాసులు ఆయన్ని కలవడానికి వస్తారు.ఆ తొక్కిసలాటలో గాయపడి,కళ్ళు పొగొట్టుకున్న వ్యక్తిని
రామస్వామి అని గూర్తించి వేదవతి అతనికి సేవలు చేస్తుంది.
హఠాత్తుగా
రామకృష్ణ వస్తాడు. తన భార్య
ఆత్మహత్య చేసుకుందని చెప్తాడు.ఆమె స్వామీజీ,పూజల పేరుతో ఆరు నెలలు
ఆశ్రమంలో గడపటానికి వెళ్ళేదని,కానీ అక్కడ తన ప్రియుడితో
ఉండేదని,ఇది పెళ్ళికాక ముందు నుండి ఉన్న ఒప్పందమేనని,అందుకే డబ్బు లేకపోయినా తనని పెళ్ళి చేసుకుందని చెప్తాడు.అలాగే
పట్టించుకోకుండా కూతురి మరణానికి కారణమైందని చెప్తాడు. ఆ కూతురు పుట్టాక
తాను ఆపరేషన్ చేయించుకున్నానని,కానీ మళ్ళీ ఆమె ఇప్పుడు గర్భవతి
అయ్యిందని,తనకు ఆపరేషన్ అయిన విషయం డాక్టర్ ద్వారా తెలిసేలా చేయడంతో ఆత్మహత్య చేసుకుందని
చెప్తాడు.ఇప్పుడు వేదవతితో జీవితం పంచుకోవడానికి వచ్చానని చెప్తాడు.అప్పుడే ఆమె
రామస్వామి గురించి చెప్తుంది.తర్వాత రోజు ఏ నిర్ణయం చెప్పమని వెళ్ళిపోతాడు
రామకృష్ణ.
రామస్వామి
అంతా వింటాడు.తను సన్యాసినని,తనకు ఇది పునర్జన్మ అని ,ఇప్పుడు భర్త కాదని చెప్పి వేదవతిని రామకృష్ణతో వివాహానికి
ఒప్పిస్తాడు.అలా వేదవతి,రామకృష్ణ ఒకటవుతారు.
కామేశ్వరి, వేదవతిల
జీవితాల ద్వారా నాటి స్త్రీ త్యాగమూర్తిగా ఉన్నా ఆమెలోపలి కోణాల్లో ఉండే స్వార్ధం, ఆ తర్వాత ఆ త్యాగాన్ని నిలుపుకోలేని మనస్తత్వం వల్ల ఇంకో స్త్రీ పడే వ్యథ
,ఇటువంటి అంశాల వల్ల బలయ్యే ఆ స్త్రీ బలహీనతలను అవకాశంగా తీసుకునే
మగవారి ధోరణి, ఆమెను కాపాడాలనుకున్నా సరే ఆమెను వెంటాడే నీడలు,ఇవన్నీ ఒకే స్త్రీ జీవితంలో ఉండకపోయినా స్త్రీల జీవితగమనాన్ని గమనిస్తే మనకు
కనబడే వివిధ కోణాలే.
*
* *

Comments
Post a Comment