స్వేచ్చ ఖరీదు

సినీ సంచారం

         స్వేచ్చ ఖరీదు

             -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          ప్లానేట్ ఆఫ్ ద ఏప్స్ వంటి సినిమాతో ప్రసిద్ధి పొందిన ఫ్రాంక్లిన్ .జె. స్కాఫ్నర్ 1973 లో  తీసిన బయోగ్రాఫికల్ ప్రిజన్ డ్రామా సినిమానే పాపిలాన్. హెన్రీ చారీ అనే ఫ్రెంచ్ రచయిత ఫ్రెంచ్ కోర్ట్ చే ఓ హత్యా అభియోగం పై యావజ్జీవ కారాగార శిక్షను ఫ్రెంచ్ గినియాలో అనుభవించేట్టు శిక్ష వేస్తారు. కానీ 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తూనే అతను తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు చివరకు ఎలా తప్పించుకున్నాడు అన్న విషయాన్ని హెన్రీ తన ఆత్మకథ గా పాపిలాన్ పేరుతో నవలగా రాసుకున్నాడు. ఆ నవల ఆధారంగా తీసిన సినిమానే ఇది. హెన్రీ చారియట్ కు ఉన్న బటర్ ఫ్లై ట్యాటూ వల్ల అతనికి పెట్టిన ముద్దు పేరే పాపిలాన్. స్టీవ్ మెక్ క్వీన్, డస్టిన్ హాఫ్ మెన్ నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది.

          ఓ పింపును హత్య చేశాడన్న నేరంపై పాపిలాన్ ను ఫ్రెంచ్ న్యాయ వ్యవస్థ ఫ్రెంచ్ గినియా లో యావజ్జీవ కారాగారవాసాన్ని అనుభవించే శిక్ష విధిస్తుంది. అక్కడే అతను లూయిస్ డేగా అనే ఇంకో నేరస్థుడిని కలుస్తాడు. అతను ఫోర్జరీ నేరం మీద శిక్ష అనుభవించడానికి వచ్చిన ఖైదీ. పాపిలాన్ డేగాను ఇతర ఖైదీల నుండి కాపాడతానని కానీ తనకు అక్కడి నుండి తప్పించుకోవడానికి అవసరమైన డబ్బు ఇవ్వమని అడుగుతాడు. మొదట అంగీకరించకపోయినా అక్కడ ఖైదీల మధ్య డబ్బు కోసం జరిగే హత్యలు, దాడులు చూశాక డేగ ఒప్పుకుంటాడు. తర్వాత అడవిలోని లేబర్ క్యాంప్ లో ఉన్న ఖైదీలుగా అనుభవిస్తున్న భయానక పరిస్థితుల్లో వారిద్దరు మంచి స్నేహితులవుతారు.

          ఓ సారి ఓ గార్డ్ డేగను హింసించబోతుంటే పాపిలాన్ కాపాడి అడవుల్లో తప్పించుకున్నా పట్టుకుని అతనికి రెండేళ్ళు ఒంటరి కారాగార వాసం విధిస్తారు. తన కోసమే పాపిలాన్ అలా అయ్యిందని భావించిన డేగ అతనికి ఆ సెల్ లోకి కొబ్బరి అందేలా చేస్తాడు. చివరకు అది తెలుసుకున్న అధికారులు అతన్ని ఆ కొబ్బరి ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పమని ఎంత బెదిరించి హింసించినా సరే చెప్పడు. దీనికి శిక్షగా అధికారులు అతనికిచ్చే తిండి సగానికి తగ్గించి, అతన్ని చీకటి కారాగారంలో వెలుగు లేకుండా చేస్తారు. చివరకు ఆకక్ద ఉన్న పురుగులు తిని బ్రతుకుతూ ఉంటాడు పాపిలాన్. ఆ శిక్ష అక్కడ పూర్తయ్యాక ఆరోగ్యం దెబ్బ తినడంతో పాపిలన్ ను ప్రిజన్ హాస్పటల్ లో చేర్పిస్తారు.

          ఎలా అయినా అక్కడి నుండి తప్పించుకునే మార్గం చూడమని డేగను పాపిలాన్ అడగటంతో అక్కడి డాక్టర్ తో మాట్లాడి ఓ అధికారి ద్వారా తప్పించుకునే మార్గం ఏర్పాటు చేస్తాడు డేగ. పాపిలాన్ తో పాటు డేగ ,ఇంకో ఇద్దరు కూడా కలిసి పారిపోవడానికి ఆ లంచగొండి అధికారికి బోట్ కు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించి ఆ బోట్ దగగ్రకు వెళ్తే దానికి చిల్లులు ఉండటం చూసి షాక్ అవుతారు. తర్వాత అక్కడ ఉన్న ఓ వ్యక్తి ద్వారా అదంతా మోసమని తప్పించుకునేందుకు సాయం చేస్తున్నట్టు డబ్బులు తీసుకుని తర్వాత పాడైపోయిన బోట్ ఇచ్చి ,ఆ తర్వాత వారిని అధికారులకు పట్టిస్తారని చెప్తాడు. ఆ పరిసరాల్లో కుష్టు వ్యాధి గ్రస్థులు ఉంటారని వారు బోట్ విషయంలో సాయం చెయ్యవచ్చని చెప్తాడు అతను. అతని సలహాపై అక్కడికి వెళ్తే వారి సాయం మీద ఓ పడవ మీద అందరూ బయల్దేరతారు.

          అలా వారు సెంట్రల్ అమెరికాలో భాగమైన హొండురాస్ కు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సైనికులు డేగాను ,మిగిలిన వారిని పట్టుకుంటారు. పాపిలాన్ ఎలానో తప్పించుకుని ఓ దీవికి చేరుకుంటాడు. అక్కడ కొంతకాలం గడిపాక ఓ రోజు పాపిలాన్ లేచేసరికి అక్కడ ఆ తెగ ప్రజలు ఉండరు. అతనికి కొన్ని ముత్యాలు మిగిల్చి వెళ్ళిపోతారు. ఓ నన్ కు ఆ ముత్యాలు ఇచ్చి తనను కూడా కొన్ని రోజులు వారి ఆశ్రయంలో ఉంచమని అడుగుతాడు. కానీ వారు అతన్ని అధికారులకు పట్టిస్తారు. పాపిలాన్ కు ఇంకో ఐదేళ్లు ఏకాంత కారాగారవాసం విధిస్తారు అధికారులు.

          ఆ ఐదేళ్ల శిక్ష తర్వాత పాపిలాన్ ను డెవిల్స్ ఐలాండ్ కు తరలిస్తారు అధికారులు. అక్కడ డేగను కలుసుకుంటాడు పాపిలాన్. మొత్తానికి 14 ఏళ్ల తర్వాత అక్కడి నుండి తప్పించుకుని స్వేచ్చను పొందడంతో సినిమా ముగుస్తుంది.

          ఓ మనిషి స్వేచ్చ విలువ ఎంతో దానిని కోల్పోయినప్పుడే అర్ధమవుతుంది. అటువంటి ఏ స్వేచ్చ,హక్కులు లేకుండా నిర్బంధంలో కఠిన శిక్షలు అనుభవించడం ఎంత భయానక జీవితమో తెలిపే సినిమానే కాదు, ఇది పాపిలాన్ నిజ జీవితం కూడా.

          ఇక ఈ జెయిలు జీవితం తర్వాత అతను వెనిజులా కు వెళ్ళాక పూర్తి స్వేచ్చను పొంది అక్కడి పౌరుడిగా మారి, ఓ స్త్రీ వివాహమాడి కారకాస్ ,మారకైబో ల్లో రెస్టారెంట్లు కూడా ప్రారంభించాడు. ఆ తర్వాత అక్కడ ఓ చిన్న సెలబ్రిటీగా కూడా మారిపోయి టెలివిజన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు. అతను రాసిన పాపిలాన్ మిలియన్ల కాపీలు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించింది. చివరకు అతను ఫ్రాన్స్ తిరిగి వచ్చాడు. ఈ జీవితాన్ని అతను బాంకో పేరుతో ఇంకో నవలగా కూడా రాశాడు. ఇది సినిమాగా మాత్రం ఇంకా రాలేదు.  చివరకు గొంతు క్యాన్సర్ తో మరణించాడు పాపిలాన్.

          జీవితంలో ఉన్న విచిత్రం కథల్లో కూడా ఉండదేమో. తప్పు చేసినా, చేయకపోయినా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితిలో ఉన్న ఖైదికు ధైర్యం సన్నగిల్లడం ఖాయం. కానీ తన స్వేచ్చ కోసం 14 ఏళ్ళు నిరంతరం పొరాడి ఎన్నో బాధలు పడి గెలిచిన విజేత పాపిలాన్. ఇదే పేరుతో 2017 లో ఇంకో సినిమా వచ్చింది. సినిమాల్లో ఎన్నో వెర్షన్స్ ఉన్నా సరే పాపిలాన్ జీవితం మాత్రం విచిత్రానికి ,ధైర్యానికి ఎప్పటికీ ప్రతికే.

    *      *     *

 

 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ