సంగమం

 చదువరి   

            సంగమం

                  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



            ప్రముఖ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి గారి నవలల్లో సంగమంలో ఓ అతి సుకుమారుడిగా,తల్లి కూచిగా పెరిగిన ఓ వ్యక్తి పరిస్థితుల వల్ల తనదైన వ్యక్తిత్వంతో ఎలా గొప్ప వ్యక్తిగా మారాదో స్పష్టం చేస్తుంది.  

          కృష్ణ తల్లి గారాబంలోనే అతి సుకుమారుడిగా, అమ్మ తప్ప వేరే ప్రపంచం లేని వాడుగా తయారవుతాడు. అతని పెళ్ళి లలిత అనే అమ్మాయితో నిశ్చయించాలనే నిర్ణయం కూడా అవుతుంది. కృష్ణ, లలిత  ఇద్దరికి ఒకరికొకరికి ఎప్పటినుండో పరిచయం ఉంది. ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నవారే. అదే సమయంలో కృష్ణ తండ్రి నారాయణరావు అన్న కోటీశ్వరరావు ఓ ఖూనీ కేసు మీద ఖైదు అనుభవించి విడుదలై వస్తాడు. అతడు నారాయణరావు దగ్గరకు వచ్చి కృష్ణ అతను పెంచుకున్న కొడుకు అవ్వడం వల్ల, ఆ ఆస్తి అతనికి డక్కడానికి వీల్లేదని, అంతగా అయితే తన ఆరుగురి కొడుకుల్లో ఒకరిని దత్తత తీసుకుని ఆ ఆస్తి తన కొడుకులకు దక్కేలా చేయకపోతే కృష్ణను, వారిని చంపడానికి కూడా వెనుకాడనని వారిని బెదిరిస్తాడు.

          కృష్ణను కూడా అలానే బెదిరిస్తాడు కోటీశ్వరరావు. కృష్ణ తమ పెంపుడు కొడుకని తెలిసేలోగా లలితతో అతనికి పెళ్ళయిపోవాలని హడావుడిగా పెళ్ళి నిశ్చయించినా, కోటీశ్వరరావు  అనంతలక్ష్మి, నారాయణరావులను యాక్సిడెంట్ చేసి హతమారుస్తాడు.అప్పటిదాకా ఉన్న రహస్య బట్టబయలవుతుంది. లలితతో కృష్ణ పెళ్ళి ఆగిపోతుంది. నారాయణరావు చావు బ్రతుకుల మధ్య చివరి క్షణంలో ఉన్నప్పుడూ  తనకు నమ్మకస్తుడైన పనివాడైన  కొండల్రావును పిలిపించి  అతన్ని కన్నతల్లిదండ్రులకు అప్పగించమని చెప్తాడు. పరీక్షలయ్యేవరకు లలిత ఇంట్లో ఉన్నా ఆ తర్వాత పల్లెటూరిలో ఉండే తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తాడు. నారాయణరావు వీలునామా  సంవత్సరం అయ్యేవరకు వెల్లడించవద్దని తన ప్లీడర్తో చెప్తాడు. ఈ సంవత్సరంలో కృష్ణ బయట ప్రపంచాన్ని తెలుసుకోవాలన్నదే ఆయన కోరిక.

          కన్నతల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్న  కృష్ణకు అక్కడి వాతావరణం పొసగదు. కృష్ణ కవలల్లో ఒకడు. అప్పటికే గంపెడు సంతానం. ఆ ఊరి పెద్దమనిషి తన కూతురినిచ్చి కృష్ణకు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. కానీ ఉద్యోగం వచ్చేవరకు తనకు ఆ ఆలోచన లేదని ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తాడు కృష్ణ.

          తర్వాత  ఎస్. ఐ అయిన  అతని స్నేహితుడు మనోహర్ నుండి ఉత్తరం రావడంతో అక్కడికి మకాం మారుస్తాడు కృష్ణ. స్నేహితుడు ఇచ్చిన ప్రోత్సాహంతో ఐ.ఏ.ఎస్ అవుతాడు. ఈ పయనంలో వారికి చంద్రకళ ఎదురవుతుంది. ఆమె పుట్టిన ఇంట్లో డబ్బుల కోసం, గొప్పతనం కోసం ఒళ్ళమ్ముకుంటే  తాను డాక్టర్ చదువుకోవడానికి ఆ పని చేస్తుంది. ఆమె మనసుకు ముగ్దుడై  మనోహర్ ఆమెను ప్రేమిస్తాడు.

          కృష్ణకు యాక్సిడెంట్ అయినప్పుడు మనోహర్ ప్రోద్బలంపై అతనికి సపర్యలు అందించిన చంద్రకళ అతనితో ప్రేమలో పడుతుంది. ఆమెకు చదువుకోవడానికి ఆర్థిక సహకారం అందిస్తానని, బాయ్ ఫ్రెండ్స్ తో తిరగొద్దని చెప్పిన మనోహర్ మాటకు కట్టుబడి ఉంటుంది.

          సంవత్సరం అయ్యేసరికి కృష్ణ ఐ.ఏ.ఎస్ అవ్వడం, వీలునామాలో ఆస్తి అతని పేర ఉండటం జరుగుతుంది.ఒకవేళ అతనికి పిల్లలు లేకపోయినా, చంపబడినా, ఆ ఆస్తి సేవాసదానానికి చెందేట్టు వీలునామా రాస్తాడు నారాయణరావు. అతను ఆ ఆస్తిని ఓ హాస్పటల్ కట్టడానికి వినియోగించి, అందులో డాక్టర్ గా చంద్రకళ ఉండేలా చూస్తాడు.

          అప్పటికీ లలిత కృష్ణను ప్రేమిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు అమ్మకూచి అనుకున్న కృష్ణ తనను తాను నిరూపించుకునేసరికి అతని మీద ఆమె ప్రేమ అధికమవుతుంది. మనోహర్ -చంద్రకళ, కృష్ణ-లలిత ఒకటవుతారు.

          మనిషి ఎలా మారినా దానికి సగం శాతం కారణాలు అతని పరిస్థితులు. కానీ పరిస్థితులు ఏవైనా సరే ఒక లక్ష్యంతో శ్రమిస్తే మనిషి తాను అనుకున్నది కచ్చితంగా సాధిస్తాడు.

                       *       *      *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ