సద్దాం ఆంటీ

 చదువరి

సద్దాం ఆంటీ

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


            ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలల్లో హాస్య నవలైన సద్దాం ఆంటీ ఇంటి కథ లో మనుషులు ఆస్తుల కోసం ఎటువంటి ఆలోచనలు చేస్తారో, అవి వారిని ఎలా పయనించేలా చేస్తాయో హాస్యంగా చెప్తూనే ఆలోచింపజేసేలా రాశారు.

        కంకాళమ్మ అనే బామ్మకు మనవరాలు అనన్య.కంకాళమ్మ తండ్రికి ఉన్న ఆస్తి ఓ ఇల్లు. ఆ ఇంటిని ఎవరి పేరా రాయకుండా మొదట కొడుక్కి,అతనికి సంతానం లేకపోతే రెండో కొడుక్కి, లేకపోతే పుత్రికల సంతానానికి  రాస్తూ దాన్ని ఎవరూ అమ్మకూడదని రాస్తాడు. కంకాళమ్మ సోదరి జాంబవతికి పాములు పెంపుడు జంతువులు. వాటిని ప్రేమించే వారినే పెళ్ళి చేసుకుంటానని  పట్టుబట్టడం వల్ల ఆమె అవివాహితగానే మిగిలిపోతుంది. మిగిలిన సోదరులకు కూడా పెళ్లయినప్పటికీ సంతానం ఉండదు. కంకాలామ్మకి ఆ ఇల్లు దక్కుతుంది. భర్త వెంగళప్ప ముందే మరణిస్తాడు.

        తర్వాత ఇల్లు అమ్మే బేరం వస్తుంది. బామ్మ ఎలాగూ చనిపోతుంది అనే ధైర్యంతో జి.గ్రామం అనే ఆయన ఓ ప్రతిపాదన తెస్తాడు. అది ఆమె మరణించేవరకు నెల ఖర్చులు ప్రతి నెలా జమ చేస్తూ ఉండటం, తర్వాత ఆమె మరణించాక అది తనకు చెందేలా విల్లు రాయిస్తాడు. దానివల్ల బామ్మ చనిపోయేవరకు ఇంటి యజమానిలానే బ్రతుకుతుంది.

        జి.గ్రామం మరణిస్తాడు. అతని ఇద్దరి కొడుకులు మరణిస్తారు. ఓ కొడుక్కి సంతానం లేదు. రెండో కొడుక్కి ఉన్న ముగ్గురు సంతానం లింగమయ్య,వెంకట రత్నం,నిరుపమ్. ఆమె మరణంతో ఇల్లు సంక్రమిస్తుంది కనుక ఆమె మరణం కోసం  ఎదురు చూస్తూ ఉంటారు. అనన్య బ్యాంకులో ఉద్యోగి. నిరుపమ్ కూడా అదే బ్యాంకులో పని చేస్తాడు. వారిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు.

        సుబ్బారావు అనే బిల్డర్ దాన్ని కొనుక్కోవాలనుకుంటాడు. లింగమయ్య అతని దగ్గర ఉద్యోగి. ఎన్నాళ్లయినా బామ్మ చనిపోవకపోవడంతో ఆమెను చంపి, తద్వారా తన ద్వారా కొనుక్కోవచ్చని ఉపాయం చెప్తాడు లింగమయ్య. హఠాకేశ౦ అనే అతను మూడు సార్లు పాము ద్వారా కంకాళమ్మను చంపాలని ప్రయత్నించి విఫలమవుతాడు.

        ఇదంతా నిరుపమ్ ద్వారా తెలుసుకున్న బామ్మ వెంకటరత్నం అమ్మేస్తుంది. నిరుపమ్, అనన్య వివాహం చేసుకుంటారు. తన వాటాగా వచ్చిన రెండు అపార్టుమెంటుల్లో  ఒకటి అద్దెకి ఇచ్చి రెండో దాంట్లో ఉంటాడు నిరుపమ్ భార్య,ఆమె బామ్మ అయిన కంకాళమ్మతో సహా కలిసి. అనన్య కొడుకుని కూడా ఇప్పుడు ఆమె స్కూల్లో దింపుతూ ఉంటుంది.

        సద్దాం హుస్సేన్ మీద అమెరికా ఎన్ని బాంబు దాడులు చేసినా శ్రే బ్రతికినట్టు, బామ్మ కూడా అలానే అన్నింటిని జయించిందని ఆమెకు సద్దాం ఆంటీ అని పేరు పెట్టాడు లింగమయ్య.

        హాస్యం ఈ నవలలో ముఖ్య పాత్ర పోషించినప్పటికీ ప్రతి పాత్రలోనూ మానవులకుండే బలహీనతలు ,ఆ బలహీనతలే కొన్ని సార్లు ఇంకొందరికీ ఎలా బలాలుగా మారతాయో కూడా అన్న అంశాలు కూడా ఈ నవలలో అంతర్లీనంగా ఉన్నాయి.

  *     *   *

             

Comments