జ్ఞాపకాలు చెరిపేస్తే?

 

సినీ సంచారం

                  జ్ఞాపకాలు చెరిపేస్తే?

                                  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



     మనిషి జీవితంలో బంధాలు ,ఆ బంధాలకు సంబంధించిన జ్ఞాపకాలు ఉండటం చాలా సహజమైన విషయం. ముఖ్యం ప్రేమ -పెళ్ళి విషయాల్లో అవి చాలా సార్లు చేదు జ్ఞాపకాలుగా కూడా పరిణమించవచ్చు. ఎటువంటి జ్ఞాపకాలైనా సరే వాటితో సహజీవనం కొనసాగించక తప్పదు. కానీ దీనికి వ్యతిరేకంగా ఓ జంట ఒకరి జ్ఞాపకాలను ఇంకొకరు శాశ్వతంగా శాస్త్రీయ వైద్యంతో చెరిపెయ్యాలనుకున్నారు. అది వారి జీవితంలో ఎటువంటి మార్పులు తెచ్చింది? నిజంగా జ్ఞాపకాలు లేకుండా ఉంటే జీవితం బావుంటుందా ? ఈ నేపథ్యంతో వచ్చిన సినిమానే ' 'Eternal Sunshine Of The Spotless Mind.'

    టైటానిక్ సినిమాతో ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్న విన్ స్లీ కేట్, హాస్య నటుడిగా పేరు పొందిన జిమ్ కారీ జంటగా వచ్చిన ఈ సినిమా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. సైన్స్ ఫిక్షన్ -రొమాన్స్ -సైకాలజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఓ కొత్త తరహాలో తీయబడిన సినిమా. చూస్తున్నప్పుడు ప్రేక్షకుల మైండ్ కు కూడా కాస్త పని చెప్పే సినిమా ఇది.

          జోయల్ ఎవరితోనూ కలవలేడు, సిగ్గరి కూడా. తన జీవితాన్ని స్వేచ్చగా తనకు నచ్చినట్టు జీవించే వ్యక్తి క్లెమంటెన్. వీరిద్దరూ ఓ రైలు ప్రయాణంలో కలుసుకుంటారు. ప్రేమించుకుంటారు. తర్వాత హఠాత్తుగా  క్లెమెంటెన్ జోయల్ ఎవరో తెలియనట్టు వ్యవహరిస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఇంకో యువకుడితో సంబంధం కూడా పెట్టుకుంటుంది.

          ఆ తర్వాత జోయల్ కు ఓ లెటర్ వస్తుంది. అందులో క్లెమెంటెన్ అతన్ని తన జ్ఞాపకాల నుండి చెరిపివేసిందని, ఇక ఆమెను సంప్రదించే ప్రయత్నం చేయవద్దని ఉంటుంది. జోయల్ కూడా అదే హాస్పటల్ కు వెళ్ళి తన జ్ఞాపకాల నుండి కూడా క్లెమెంటెన్ జ్ఞాపకాలు చెరిపివేయమని అడుగుతాడు. ఆమెకు సంబంధించిన వస్తువులు ఏవైనా సరే తీసుకురమ్మని ,ఆమె జ్ఞాపకాలుగా ఉన్నవన్నీ ఇస్తే దాని ఆధారంగా అతని మైండ్ మ్యాప్ చేసి ,  రాత్రి అతని ఇంట్లో అతన్ని స్పృహ లేకుండా చేసి ఒక్కో జ్ఞాపకాన్ని చెరిపెయ్యడం జరుగుతుంది.

          ఆ హాస్పటల్ లో పని చేసే పాట్రిక్ అనే యువకుడే క్లెమెంటెన్ తో సంబంధం పెట్టుకుంది అన్న విషయం కూడా జోయల్ కు తన జ్ఞాపకాలు వారు చెరిపివేస్తున్న ప్రక్రియలో ఉన్నప్పుడూ అర్ధమవుతుంది. ఆ జ్ఞాపకాలు చెరిపివేస్తున్న ప్రక్రియలో జోయల్ -క్లెమెంటెన్ మధ్య ఉన్న అనుబంధాన్ని వెనుక నుండి ముందుకు చూపిస్తాడు దర్శకుడు. మొదట చెరిపివేయ్యాలనుకున్నా సరే  ఆ తర్వాత  ఆమెతో   ఉన్న  మధురమైన  స్మృతులు గుర్తుకు వచ్చి ఆ ప్రక్రియ ఆపేయ్యాలనుకుంటాడు.

          ఆ ప్రక్రియను ఆపేయ్యడానికి జోయల్ ఆ జ్ఞాపకాల్లో ఉన్న క్లెమెంటెన్ ను తీసుకుని అక్కడి నుండి  తీసుకువెళ్ళి ఓ ప్రాంతంలో దాక్కుంటాడు. దాని వల్ల అతని మైండ్ మ్యాప్ లో కొన్ని జ్ఞాపకాలు లేకుండా పోతాయి.  లేచి ఆ ప్రక్రియ ఆపాలనుకున్నప్పటికీ కూడా అతను కళ్ళు మాత్రమే తెరవగలుగుతాడు కానీ ఇంకేం చేయలేడు.

          ఇంకో కథ జోయల్ ఇంట్లో జరుగుతూ ఉంటుంది. ఆ ప్రక్రియలో మేరీ ,లాన్ ,పాట్రిక్ ఉంటారు. జోయల్ ఇచ్చిన జ్ఞాపకాలను అనుసరించి పాట్రిక్ క్లెమెంటెన్ లవర్ జోయల్ అని అర్ధం చేసుకుని జోయల్ ఇచ్చిన బహుమతులు ,రాసిన కవితలు అన్నీ మళ్ళీ క్లెమెంటెన్ కు ఇచ్చి ,చెప్పి ఆమెతో డేట్ కు వెళ్తాడు.అక్కడ ఆ ఇంట్లో మేరీ ,లాన్ ఇద్దరు ప్రేమికులుగా వ్యవహరిస్తారు. లాన్ తో సంబంధం పెట్టుకున్నప్పటికీ కూడా మేరీ మనసులో ఆ హాస్పటల్ హెడ్ అయిన హోవర్డ్ మీద ప్రేమ కలిగి ఉంటుంది. ఆ ప్రక్రియలో ఆమెకు అంతకుముందే అతనితో ఆమెకు సంబంధం ఉందని కానీ హోవర్డ్ భార్యకు ఆ విషయం తెలియడం వల్ల ఆమె ఆ విషయాన్ని తన జ్ఞాపకాల నుండి చెరిపి వేసిందని తెలుసుకుంటుంది. ఆ విషయం తెలియడంతో ఎంతో బాధ పడుతుంది మేరీ .

          మేరీ అక్కడ ఉద్యోగం మానేస్తుంది. దానితో పాటు ఒకరి జ్ఞాపకాలు అలా తొలగించడం అనైతికం అని భావించిన ఆమె ఆ ప్రక్రియ చేసే ముందు రికార్డ్ చేసే టేపులన్నీ ఆ సంబంధించిన  వ్యక్తులకు మెయిల్ చేస్తుంది. అలా మళ్ళీ తమ జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో ఒకర్ని ఒకరు క్షమించుకుని జోయల్ ,క్లెమెంటెన్ మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించడంతో సినిమా ముగుస్తుంది.

          సినిమా కథలో ముఖ్యంగా నాన్ నరేటివ్ పద్ధతి ఉండటం వల్ల జోయల్ తన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్న ప్రక్రియలో సంఘటనలు అర్ధం చేసుకోవడం కాస్త మెదడుకు పదును పెట్టే విషయమే. ఈ స్క్రీన్ ప్లే కు ఒరిజినల్ స్క్రీన్ ప్లే వర్గం లో పీరి బిస్మత్ ,మైఖేల్ కాండ్రి ,చార్లీ కాఫ్మన్ లకు ఆస్కార్ దక్కింది. ఈ సినిమా లో కొత్తదనం అంతా ఆ స్క్రీన్ ప్లే లోనే ఉంటుంది.

          కొత్త తరహా సినిమాలు చూడటం మీకిష్టం అయితే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చే సినిమానే. జ్ఞాపకాలు  ఎప్పుడు జీవితంతో పెనవేసుకుని ఉండేవే. వాటి నుండి తప్పించుకోవడం ఎవరికి సాధ్యం కాదు.

 

                             *    *   *

Comments

  1. Nice. challenging script ..
    Tnq for narrating this non narrative script
    .

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!