అమ్మాయి కథ

 చదువరి

అమ్మాయి కథ

     -రచనశ్రీదత్త  (శృంగవరపు రచన)



శారద అశోకవర్దన్ గారి నవలల్లో నా కథ వింటావా? నవలలో ఓ అమ్మాయి తన తోటి అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఇబ్బందుల్లో పడి, జీవితం నాశనమైతే తిరిగి తనదైన జీవితాన్ని ఎలా నిర్మించుకుందో తెలుపుతుంది.

    క్రాంతి,కావ్య అన్నచెల్లెల్లు.తండ్రి వారి బాల్యంలోనే మరణిస్తాడు.తల్లి సీతమ్మ వారిని పెంచుతుంది.కావ్య స్వతంత్ర భావాలు కల అమ్మాయి.కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఆడపిల్లల్ని ఎవరైనా ఏడిపించినా,వారి జోలికి వచ్చినా గట్టి సమాధానం ఇచ్చేది.అలా ఓ సారి బస్సులో స్నేహాతురాలి జడ ఓ ఆకతాయి లాగితే అతన్ని చెప్పుతో కొడుతుంది.ఆమె మీద కక్ష పెంచుకున్న అతను ఆమెను చెరిచే ప్రయత్నం చేయగా,అదే దారిలో వెళ్తున్న కారు రావడంతో అతను పారిపోతాడు.వారు ఆమెను ఇంట్లో దింపుతారు.కానీ ఆమె చెడిపోయింది అనే దుష్ప్రచారం జరుగుతుంది.

          హైదరాబాద్ నుండి మద్రాసుకి వెళ్ళి సంబంధం కుదుర్చుకున్నా అది కూడా కుదరదు.అలా ఏ సంబంధం రాకుండా పోతుంది.ఈలోపు క్రాంతి ఇంజనీరింగ్ అయిపోయి,ఉద్యోగం వస్తుంది.అతని పెద్ద మేనమామ కూతురు శోభనతో వివాహం జరుగుతుంది.ఆమె కూడా క్రాంతిని సూటీ పోటీ మాటల్తో ఏడిపిస్తుంది.తర్వాత సీతమ్మ మరణిస్తుంది.

          తనకు ఆ ఇంట్లో ఆదరణ లేదని తెలిసాక,అన్నను అడిగి తన పెళ్ళి కోసం ఉంచిన డబ్బును తీసుకొని  పాండిచ్చేరి ఆశ్రమంలో జీవితం గడుపుదామని వెళ్తుంది.ఆ రైలు ప్రయాణంలో ఓ పాపను గుడ్డలో చుట్టి ఆమె పక్కన ఉంటుంది.తమ బిడ్డ అని చెప్పిన మగవారిపై అనుమానం వచ్చి  తన బిడ్డ అని చెప్తుంది.

          ఆ పాప కోసం విధవగా మారి పాండిచ్చేరి వెళ్ళి అక్కడ టీచర్ ఉద్యోగంలో చేరి పెంచుతుంది.వినోద్ ఆమెను ఎప్పటినుండో ప్రేమించినా తండ్రి ఒప్పుకోకపోవడంతో ఫారిన్ వెళ్తాడు.తండ్రి చనిపోయాక తిరిగి వచ్చి కావ్యకు తన మనసులో మాట చెప్తాడు.ఆమెకు ఇష్టమున్నా  పాప అపార్థం చేసుకుంటుందని ఆ వివాహ ప్రతిపాదనను తోసిపుచ్చుతుంది.కానీ ఇద్దరూ స్నేహితుల్లా ఉంటారు.

          ఆ ఇద్దరి స్నేహం మీద అపవాదులు పెరుగుతాయి.క్రమేపీ ఆ పాప యుక్తవయసుకు వస్తుంది. తన తండ్రెవరో చెప్పని తల్లిపై ద్వేషం పెంచుకుంటుంది.తప్పనిసరి పరిస్థితుల్లో తన కథను కూతురితో చెప్తుంది. అనవసరంగా తల్లిని అపార్థం చేసుకున్నానని గ్రహించి, తల్లి -వినోద్ ల వివాహం జరిపిస్తుంది.తర్వాత తనకిష్టమైన రోహిత్ ని వారి అనుమతితో వివాహం చేసుకుంటుంది.

          జీవితంలో కొన్ని సంఘటనలు మన ప్రమేయం లేకుండా జరగవచ్చు. వాటి గురించి మనల్ని మనం దోషులుగా ఎప్పుడూ భావించుకోకూడదు. దాని వల్ల సమాజపు ధోరణిని మనం మార్చలేము సరికదా, మనమే ఆ సమాజాన్ని సమర్ధించినట్టు. మన విలువలు మనకు మాత్రమే సంబంధించినవి ,దానితో అందరూ ఏకీభవించాల్సిన అవసరం కూడా లేదు. మన జీవితం మనదే అన్న ముఖ్య విషయాన్ని మన జీవితంలోని ప్రతి పరిస్థితిలోనూ మనం గుర్తుంచుకోవాలి. అప్పుడే సమస్యలను చేధించే ధైర్యం అలవడుతుంది.

   *     *     *

                           

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!