ఖైదు పక్షి

 సినీ సంచారం

ఖైదు పక్షి

            -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



            ఆంగ్ల సినిమాల్లో నవలల ఆధారంగా వచ్చిన సినిమాలను చూస్తే వాటిలో అధిక సినిమాలు స్టీఫెన్  కింగ్ సినిమాల ఆధారంగా వచ్చినవే. అలా వచ్చిన సినిమాల్లో ఒకటే 'The Shawahank Redemption.'  ప్రపంచం మొత్తం మీద న్యాయ వ్యవస్థ లో ఎక్కడో ఓ చోట లోపాలు ఉంటూనే ఉన్నాయి. తెలివైనవాడు అటువంటి న్యాయ వ్యవస్థకు బలైనా సరే, సందర్భానుసారం తనను తాను అదే న్యాయ వ్యవస్థలోని లోపాల ఆధారంగానే తన స్వేచ్చను తాను సాధించగలడు. ఈ అంశం ఇతివృత్తంగా వచ్చిన స్టీఫెన్ కింగ్ నవలే 'Rita Hayworth and Shawshank Redemption.' 1994 లో  విడుదలైన ఈ సినిమా నేటికీ  కూడా  హాలీవుడ్ టాప్ సినిమాల లిస్టులో ఒకటిగా నిలుస్తుంది.

            1947 లో తన భార్యని, ఆమె ప్రేమికుడిని హత్య చేశాడన్న నేరంపై పోర్ట్ లాండ్ బ్యాంక్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆండ్రీ డఫ్రెన్స్ కు రెండు లైఫ్ సెంటెన్సెస్ అంటే యాభై ఏళ్ళ కారాగార వాస శిక్ష పడుతుంది. అతను ఆ హత్యలు చేయకపోయినా సాక్ష్యాలు అతనికి వ్యతిరేకంగానే బలంగా ఉండటంతో అతనికి జైలు శిక్ష తప్పదు. అతన్ని షాష్యాంక్  జైలుకు తరలిస్తారు.

            ఆ జెయిలులో రెడ్ అనే నేరస్థుడు ఆండ్రీకి మిత్రుడవుతాడు. రెడ్ ఓ మర్డర్ నేరం పైనే జైలుకు వచ్చాడు. అతను జెయిల్ లోకి ఎన్నో వస్తువులు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. 1940 ల్లో ప్రేమ దేవతగా కీర్తించబడిన ప్రముఖ హాలీవుడ్ నటి రీటా హేవర్త్ బొమ్మ ఒకటి ,రాక్ హేమర్ ఒకటి  అడిగితే అవి తెచ్చి ఇస్తాడు రెడ్. ఒకవేళ  తప్పించుకోవాలనుకున్నా సరే ఆ రాక్ హేమర్ తో తవ్వి తప్పించుకోవడానికి వందల సంవత్సరాలు పడుతుందని భావిస్తాడు రెడ్. జెయిల్ లో సిస్టర్స్ గా వ్యవహరించే ఇద్దరు ప్రిజనర్స్  గేలు. వారు ఆండ్రీ పట్ల క్రూరంగా ప్రవర్తిస్తూ ఉండేవారు. దాదాపు రెండేళ్ళు లాండ్రీలో అప్పగించబడిన పనితో  అలానే జెయిల్ జీవితం ఆండ్రీకు గడచిపోతుంది.

            1949 లో ఓ సారి గార్డుల కెప్టెన్ అయిన బైరాన్ హాడ్లీ తనకు వచ్చే వారసత్వ సంపదకు టాక్స్ ఎలా కట్టకుండా ఉండాలో తెలియడం లేదని చెప్పడం విన్న దాని నుండి ఎలా బయట పడాలో  చెప్పడంతో అతని సామర్ధ్యం మీద జెయిల్ స్టాఫ్ కు గురి ఏర్పడుతుంది. ఆ తర్వాత అతన్ని లైబ్రరీకి బ్రూక్స్ అనే అతనికి  అసిస్టెంట్ గా మార్చి ఆ వర్గానికి మారుస్తారు. అతని చేత ఆ స్టాఫ్ మొత్తానికి ఆర్ధిక పరమైన విషయాలన్నింటిని ఆండ్రీ చూస్తూ ఉంటాడు. మళ్ళీ సిస్టర్స్ ఆండ్రీని బాధ పెట్టరు ఎందుకంటే తమకు ఉపయోగకరంగా ఉంటున్న ఆండ్రీ కు సమస్యగా తయారైన వారిని కెప్టెన్ బైరాన్ హ్యాడ్లీ బుద్ధి చెప్పటం వల్ల.

            బ్రూక్స్ ఓ నేరస్థుడు. అతను దాదాపు 50 ఏళ్ళ జీవితాన్ని అక్కడ జైలులో గడుపుతాడు. ఆ తర్వాత అతను విడుదల అవుతాడు. కానీ అప్పటి దాకా జెయిల్ తప్ప వేరే లోకం తెలియని బ్రూక్ మారినప్రపంచంలో ఇమడలేకపోతాడు. అమెరికన్ ప్రిజన్ వ్యవస్థలో జెయిలు నుండి విడుదలైన వారికి బ్రతకడానికి మార్గంగా వారికి ఉండటానికి ఓ వసతి గృహం, దానితో పాటు ఓ ఉద్యోగం కూడా ఇప్పిస్తారు. కానీ ఆ జీవితం గడపలేక బ్రూక్స్ కొంతకాలానికి ఆత్మహత్య చేసుకుని మరణిస్తాడు. ఇది జెయిలు బయటి జీవితం.

            ఆండీ లైబ్రరీలో పుస్తకాల కోసం ,లైబ్రరీ ఫండ్స్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రతి వారం పై అధికారులకు ఉత్తరాలు రాసి మరి సాధిస్తాడు. ఆ ప్రిజన్ వార్డన్ గా వ్యవహరిస్తున్న నార్టన్ పబ్లిక్ వర్క్స్ ప్రాజెక్ట్స్ అన్నీ జైలు లోని ప్రిజనర్స్ తో ఉచితంగా చేయించుకుంటూ వాటి ద్వారా లంచాలు తీసుకుంటూ ఉంటాడు. అతను స్కాములు చేసి సంపాదిస్తున్న డబ్బంతటినీ కూడా ‘రాండల్ స్టీఫెన్స్ ‘పేరుతో బినామిని పెట్టి ఆ బినామీ అకౌంట్లలో డబ్బులు జమ చేసి నార్టన్ కు మాని లాండరింగ్ లో సాయం చేస్తూ ఉంటాడు ఆండ్రీ.

            దాదాపు 20 ఆండ్రీ ఇరవేళ్లు శిక్ష అనుభవించిన తర్వాత అదే ప్రిజన్ కు ఓ దొంగతనం మీద వస్తాడు టోనీ విలియమ్స్. అతనికి ఆ జైలులోనే చదువు నేర్పిస్తాడు ఆండ్రీ. అతని ద్వారా తన భార్యను, ఆమె ప్రియుడిని హత్య చేసిన నేరస్తుడిని గురించి తెలుసుకున్న ఆండ్రీ తాను అప్పుడైనా ఆ జెయిల్ జీవితం నుండి బయట పడవచ్చు అన్న ఆశతో వార్డన్ కు చెప్పినా అది అసాధ్యం అని తేల్చేస్తాడు.

            ఒకవేళ ఆండ్రీ బయట పడితే తను చేసిన స్కాముల గురించి ఎక్కడ బయటపడుతుందోనని నార్టన్ ఆ కేసు మళ్ళీ ట్రయల్ కు వెళ్ళకుండా ఉండటానికి సాక్షిగా ఉన్న టోనీ విలియమ్స్ ను హత్య చేస్తాడు. దానిని అతను జెయిలు నుండి తప్పించుకునే ప్రయత్నం చేసినందుకు షూట్ చేసినట్టు చిత్రీకరిస్తాడు. ఈ విషయంతో తనను బయటకు వెళ్లనివ్వరని అర్ధం చేసుకున్న ఆండ్రీ అప్పటికే రాక్ హేమర్ తో రీటా హేవర్త్ చిత్రం వెనుక తవ్విన సొరంగం నుండి నార్టన్ స్కాములకు సాక్ష్యాలుగా నిలిచే కొన్ని ఆధారాలతో సహా తప్పించుకుంటాడు.

              తర్వాత బయట పడిన ఆండ్రీ తను సృష్టించిన  రాండల్ స్టీఫెన్స్ గా తానే మారి ధనవంతుడిగా మారతాడు. దానితో పాటు వార్డన్ చేసిన స్కాములు పై అధికారులకు రిపోర్ట్ చేయడంతో ఆ అవమానం భరించలేక  నార్టన్ ఆత్మహత్య చేసుకుంటాడు. అతను జెయిలు నుండి వెళ్లిపోయే ముందు రెడ్ కు ఒకవేళ అతను జెయిలు నుండి బయటపడితే బక్స్టన్ లో ఓ హే ఫీల్డ్ లో ఆండ్రీ దాచి ఉంచిన ఓ ప్యాకెట్ ను తీసుకొమ్మని ,ఆ తర్వాత ఓసముద్ర తీర ప్రాంత పట్టణమైన జీహువాటానిజో  కు వెళ్ళమని చెప్తాడు.

 రెడ్ విడుదలైన తర్వాత కొంతకాలం గడిపాక ఆండీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ,ఆ హే ఫీల్డ్ కు వెళ్ళి ,ఆ ప్యాకెట్ తీసి చూస్తాడు. దానిలో ఆండ్రీ అతన్ని ఆహ్వానిస్తూ రాసిన ఉత్తరం ,డబ్బులు ఉంటాయి. అది తీసుకుని రెడ్ అతను సూచించిన ఆ సముద్ర తీరపు పట్టణానికి వెళ్తాడు. వారిద్దరు కలవడంతో సినిమా ముగుస్తుంది.

            జైలు లో ఉన్న జీవితం జీవితం మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేసినా సరే నమ్మకం కోల్పోకుండా జీవన సమరం కొనసాగించాలని ఆండ్రీ కథ స్పష్టం చేస్తుంది. జెయిలు జీవితంలో ప్రారంభ సంవత్సరాల్లో ఉన్న ఉత్సాహం వయసు మళ్లే కొద్ది జెయిలుకు అలవాటు పడిపోయేలా చేస్తుంది. ఆ జీవితానికి అలవాటు పడ్డాక, విడుదలైన ఇంకెలా బ్రతకాలో తెలియని పరిస్థితులు ఏర్పడతాయి. దానికి ఉదాహరణే బ్రూక్స్ పాత్ర.

            అదే యాభై ఏళ్ళు గడిచాక విడుదలైన రెడ్ ఆండ్రీ సాయంతో ఆ నమ్మకం మరణించకుండా చూసుకోగలిగాడు. ఈ మూడు పాత్రలు జెయిలు లోని ఖైదీల జీవితాల కోణాలు. అలాగే తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాల్సిన జెయిలు లో ఉండే అధికారులు కూడా చేసే తప్పులు ఎన్నో ఉన్నా వారి అధికారం వారికి అండగా ఉండటం వల్ల వారు రక్షించబడగలుగుతారు.

            నిజంగా మన కళ్ళకు జెయిలు జీవితాన్ని పరిచయం చేస్తూనే ఆ కోణంలో మనిషి కూడా ఎలా జీవించవచ్చో తెలిపే సినిమా ఇది. ప్రాంతీయ సినిమాల్లో అయితే కథా నాయకుడి వరకే ప్రాధాన్యత ఉండేలా సినిమాలు నిర్మించడం వల్ల కథ ఎప్పుడు ప్రేక్షకులకు ఆలోచించే  అవకాశం ఇవ్వడం లేదు. కానీ ఈ సినిమాల్లో మాత్రం పాత్రల చిత్రణ కథను అనుసరించి ఉండటం వల్ల మనకు నాయకులు కన్నా కూడా మన లాంటి మనుషులే కనిపిస్తారు సినిమాలో.

      *     *    *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!