మొదటి భార్యలు

 సినీ సంచారం

                         మొదటి భార్యలు

                                   -రచనశ్రీదత్త (శృంగవరపు రచన )



           పెళ్ళి ని సీరియస్ గా పాశ్చాత్య దేశాల్లో అందరూ తీసుకోకపోవచ్చు. కానీ మనుషుల మనసుల్లో ఉండే ప్రేమ కనుక పెళ్ళి మరణించకుండా ఉండేలా చేస్తే దానికి కట్టుబడే మనుషులు కూడా ఉంటారు. కానీ ఆ పెళ్ళి బంధం మోసంగా మారినప్పుడు దానికి తగిన శిక్ష వెయ్యాలి అని నిర్ణయించుకున్న  ముగ్గురు భార్యల కథే 'First Wives Club.' ఒలివా గోల్డ్ స్మిత్ కు పేరు తెచ్చిన  నవలను అదే పేరుతో సినిమాగా అమెరికన్ దర్శకులు హ్యూగ్ విల్సన్ తెరకెక్కించారు.

          1969 లో మిడిల్ బరీ కాలేజీలో  నలుగురు స్నేహితురాళ్ళు యానీ ,యెలిస్ బ్రెండా, ,సింతియా గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు. అదే రోజు సింతియా ఆ నలుగురు స్నేహితులకు ఓ జ్ఞాపకంగా అందరికే ఒకే  రకంగా ఉన్న ముత్యాల హారాలు ఇస్తుంది. తామేప్పుడూ అంతే సంతోషం గా  ఉండాలని నిర్ణయించుకుని విడిపోతారు నలుగురు.

          ప్రస్తుతం 1990 ల్లో ఈ స్నేహితులు ఎవరి జీవితాల్లో వారు మునిగిపోయి ఉన్నారు. సింతియా ముగ్గురు స్నేహితురాళ్ళకు ఉత్తరాలు రాసి, వాటిని పోస్ట్ చేయమని పనిమనిషికి ఇచ్చి ,తన మెడలోని హారాన్ని కూడా ఆమెకే ఇచ్చి ,తాను ఎవరినైతే ధనవంతుడిగా చేసిందో తన భర్త అయిన గిల్  ఇంకో యవ్వనంలో ఉన్న స్త్రీని వివాహం చేసుకోవడానికి  తనకు విడాకులు ఇచ్చి ఆ క్రితం రోజే వివాహం చేసుకున్న వార్తను పేపర్లలో చూసిన సింతియా నాలుగవ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది.

          ఆమె ఆత్మహత్య  తర్వాత జరిగిన సంతాప సభలో మిగిలిన ముగ్గురు స్నేహితురాళ్ళు కలుస్తారు. వారు తమ జీవితాల గురించి చెప్తున్న క్రమంలో తమ జీవితాల్లో కూడా సింతియా అనుభవించిన వ్యథే ఉందని అర్ధమవుతుంది. యానీ  భర్త నుండి విడిపోతుంది. ఆమెకు ఒక కూతురు.  విడిపోయిన భర్త తో కలిసి ఆమే ఓ థెరపిస్ట్ దగ్గర సెషన్స్ కు వెళ్తూ ఉంటుంది. ఆమెకు ఓ ఎదిగిన కూతురు ఉంటుంది. అయినప్పటికీ   భర్తతో ఏదో ఒక రోజు కలుస్తాననే  నమ్మకంతో ఉంటుంది.

          ఎలిస్ ఓ నటి. భర్త ఇంకో యవ్వనంలో ఉన్న స్త్రీ కోసం ఆమెకు విడాకులు ఇవ్వడమే కాకుండా ఆమె సంపాదిస్తూ ఉండటం వల్ల ఆమెను మనోవర్తి కూడా అడగటం జరుగుతుంది. ఎలిస్ తాను ఇంకా యవ్వనంగా ఉండటానికి  ప్లాస్టిక్ సర్జరీలు  చేయించుకుంటూ ఉంటుంది. బ్రెండా భర్త కూడా ఇంకో వయసులో ఉన్న అమ్మాయి కోసమే ఆమెకు విడాకులు ఇస్తాడు. మొదటి సారి కలిసినపుడు  తమ జీవితాల గురించి చెప్పుకుని మళ్ళీ కలుద్దామనే నిర్ణయంతో విడిపోతారు.

          యానీ భర్త ఆమెను డేట్ కు ఆహ్వానించి, ఆమెతో సరదాగా గడిపాక ఆమెను విడాకులు అడుగుతాడు. అదే సమయంలో ఆమె థెరపిస్ట్ అక్కడికి రావడంతో భర్తకు థెరపిస్ట్ కు మధ్య సంబంధం ఉందని అర్ధమవుతుంది యానికి. దానితో కోపంతో ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. బ్రెండా భర్తను ,అతనితో ఉంటున్న స్త్రీని యాక్సిడెంటల్ గా కలుస్తుంది. అదే సమయంలో ఆ అమ్మాయి బ్రెండా ను అవమానిస్తుంది. ఎలిస్ కు హీరోయిన్ తల్లి పాత్ర వస్తుంది. మనోవర్తి గురించి వత్తిడి కూడా పెరుగుతుంది.

          వారు జీవితంలో ఎదుర్కుంటున్న పరిస్థితులు, అదే సమయంలో సింతియా నుండి అందుకున్న ఉత్తరాల వల్ల తాము ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుని 'First Wives Club' ను స్టాపిస్తారు. దీనిలో భాగంగా యానీ కూతురు తండ్రి దగ్గర ఉద్యోగానికి చేరుతుంది.అక్కడి సమాచారం తల్లికి అందించడానికి. బ్రెండా తన అంకుల్ ద్వారా తన నుంచి విడిపోయిన భర్త ఓ ఇన్కమ్ టాక్స్ ఫ్రాడ్ చేశాడని తెలుసుకుంటుంది. ఎలిస్ కూడా తన పెళ్లప్పుడు వచ్చిన వస్తువులను  ఓ పథకం ప్రకారం బ్రెండా భర్త మార్టిస్ కొత్తగా తెచ్చుకున్న స్త్రీ  జెస్సికా చేత వేలంపాటలో  ఎక్కువ మొత్తానికి తీసుకునేలా చేస్తారు.

          ఆ డబ్బుతో యానీ నష్టాల్లో ఉన్న భర్త అడ్వర్టైజింగ్ కంపెనీను ఆ పార్టనర్స్ నుండి కొనుక్కుంటుంది. అలా తన భర్తను అతని ఆఫీసులోనే ఉద్యోగిగా మారుస్తుంది. బ్రెండా ,యానీ భర్తల గురించి సమాచారం ఉన్నప్పటికీ ఎలిస్ భర్త గురించి ఏ సమాచారం ఉండదు. ఆ సమాచారం కోసం ఆమె భర్త తియ్యబోతున్న సినిమాలోని హీరోయిన్ తో మంచిగా ఉండి ఆమె ఇంకా మైనర్ అనే సమాచారం తెలుసుకుంటుంది.

          వారి దగ్గర ఉన్న సాక్ష్యాలతో ముగ్గురు భర్తలను బెదిరించి తమ 'First Wives Club 'కు కావల్సిన ఆఫీసు డబ్బులు సమకూర్చుకుని ఆఫీసు ఓపెన్ చేస్తారు. మొదట్లో భర్తల మీద కోపంతో మొదలుపెట్టినప్పటికీ  దానిని నిరాశ ,నిస్పృహల్లో ఉన్న స్త్రీల కోసం ఓ స్వచ్చంద సంస్థగా మరణించిన తమ స్నేహితురాలు సింతియా పేరు మీద తెరుస్తారు. ఓ పార్టీ కూడా ఇస్తారు. బ్రెండా భర్త  మాత్రం మారి మళ్ళీ భార్యతో కలుస్తాడు.

          గోల్డీ హాన్ ,డయానే కీటన్,ప్రముఖ  హాస్య నటి అయిన బెట్టి మిడ్లర్ ఈ సినిమాలో తమ నటనతో 30 మిలియన్ డాలర్ల బడ్జెట్ కు 180 మిల్లీయన్ డాలర్ల వసూళ్ళు సాధ్యమయ్యేలా చేశారు. నటనకు మాత్రమే ఆస్కారముండే సినిమాల వర్గంలోకి ఈ సినిమా కూడా చెందుతుంది. హాలీవుడ్ క్లాసిక్స్ లో ఒక ఉత్తమ సినిమా ఇది. ఇదే అంశానికి దగ్గరలో తెలుగు సినిమాలు కూడా వచ్చాయి. శ్రీరామచంద్రులు సినిమా కూడా కొంత మేరకు ఈ సినిమా కథ పోలికలను కలిగి ఉంటుంది.  ఈ సినిమాలో ఒకే అమ్మాయి కోసం ముగ్గురు భర్తలు  భార్యల్ని వదిలేయడం,చివరకు భార్యలు వారిని మార్చడం జరుగుతుంది. ప్రాంతీయ సినిమాల్లో ఆంగ్ల సినిమాల మూలాలు ఉన్నప్పటికీ ప్రాంతీయ  ప్రేక్షక ఆదరణను అనుసరించి మార్పులు చేయడం జరుగుతుంది. అందులోనూ భార్యాభర్తలు కలవడమే సుఖాంతంగా భావించి అదే మలుపు కోసం తెలుగు సినిమాల ముగింపులు ఉంటాయి.

        *     *    *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!