పుస్తక లోకం

 పుస్తక లోకం

జనవరి -2021

                  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


     ప్రతి మనిషి తన జీవితంలో తనకు నచ్చే ఎన్నో వాటిని ఖాళీ సమయాల్లోనే లేక పూర్తిగా అవే చేసేలానో ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతూ ఉంటాడు. అలాంటి అలవాట్లలో ఓ మంచి అలవాటు పుస్తకపఠనం. సంవత్సరానికి 12 పుస్తకాలు ఓ మామూలు పాఠకుడు చదివితే,బాగా చదివేవాళ్లు 50, ఇంకా సూపర్ రీడర్స్ అయితే 80 పుస్తకాల దాకా చదువుతారు. కానీ ఇక్కడో సమస్య ఉంది. మాతృబాషలో పుస్తకాన్ని చదివినంత త్వరగా ఆంగ్ల బాషా పుస్తకాలు చదవలేకపోవడం. దానికి కారణం వైవిధ్య వాతావరణమే కాదు, పర బాష అవ్వడం కూడా.కానీ ప్రతి నెల ఎన్నో కొన్ని పుస్తకాలు చదవడం నిత్య అలవాటుగా చేసుకోవాలని నేను 2021 లో నాకు నేనే ఓ నిర్ణయం తీసుకున్నాను. అందులో భాగంగా ఈ జనవరిలో నేను 10 ఆంగ్ల పుస్తకాలు చదవగలిగాను. నాకు తెలియకుండానే ఆఖరి పుస్తకం వచ్చేసరికి చదివే స్పీడ్, కొన్ని తెలియని పదాల మీద అవగాహన కూడా పెరిగాయి.అలాగే కొన్ని దేశ పూర్వ పరిస్థితులు కూడా తెలిసాయి.

          కానీ నేను పర్ఫెక్ట్ రీడర్ ను కాదు. ఈ పుస్తకాలు పూర్తి చేసే మధ్యలో ఇంకొన్ని పుస్తకాలు చదవడం మొదలుపెట్టి 20,30 పేజీలు చదివి మధ్యలో వదిలిపెట్టి ఇంకో పుస్తకం చదవడం వంటివి కూడా చేశాను. నేను చదివిన పుస్తకాల్లో కొన్ని బోరింగ్ అయినా చదివాను. కొన్ని నవలల్లో కథ బోరింగ్ అయినా అంతకు మించి ఏదో చదివేలా చేస్తుంది.అలా  చదివిన పుస్తకాలు ఉన్నాయి. మీరు కూడా కొత్తగా (అంతకుముందు చదివే అలవాటు ఉన్న క్రమబద్ధీకరణ చేయకపోవడం వల్ల తక్కువ చదవడం లేదా అసలు చదవకపోవడం) చదివే స్థాయిలో ఉంటే బహుశా ఈ చదివే శైలి ఈ పుస్తకాల రికమండేషన్స్ ఏవైనా ఉపయోగపడితే నాకు సంతోషమే. ఇక నేను ఈ నెల చదివిన పుస్తకాల వివరాల్లోకి వెళితే ......

1)Heads You Win-Jeffrey Archer

 ఓ మనిషి ఎన్ని ప్రయత్నాలు  చేసినా సరే తన విధిని ఎలా తప్పించుకోలేడో స్పష్టం చేసే నవల ఇది. ఒకే మనిషి రెండు నిర్ణయాల్లోకి ఒకే సమయంలో పయనిస్తూ ఉన్న శైలి ఈ నవలలో ఉంది. ఇది కాస్త పెద్ద నవలే. కానీ ఓ నవలలో ఒకే సమయంలో ఒకే మనిషి రెండు చోట్ల తన ఉనికిని మర్చిపోకుండా ముఖ్య ఉదంతాలు వేరే రూపాల్లో పునరావృతం అవ్వడం వంటివి మనకు రచనలో ఉన్న వైవిధ్యతను పరిచయం చేస్తుంది.

2)A Prisoner Of Birth-Jeffrey Archer

      ఇది కూడా జెఫ్రీ ఆర్చర్ నవలే. జెఫ్రీ ఆర్చర్ శైలి మరింత స్పష్టం అవ్వడం కోసం ఇంకో నవలను కూడా చదివాను. జెఫ్రీ ఆర్చర్ ఏ నవలైనా సరే 450-650 పేజీల దాకా ఉంటుంది. నాకు తెలిసినంతవరకు పెద్ద నవలలు మొదలుపెడితే ముందు తర్వాత క్లాసిక్స్ చదవడానికి అది ఓ మార్గం అవుతుంది. ఈ నవలలో ఓ నిర్దోషి ఎలా దోషిగా మారాడో, ఆ పరిస్థితుల్లో అతను జెయిల్ శిక్ష అనుభవిస్తూనే ఆ జెయిల్ లో ఉన్న వ్యక్తి ఎలా అతను తప్పించుకోవడానికి కారణమై,తప్పించుకున్న విషయం కూడా నిర్ధారించబడలేని పరిస్థితులు ఎలా వచ్చాయో,ఎలా తాను నిర్దోషినని నిరూపించుకున్నాడో కథాంశంగా ఉన్న నవల ఇది.

          వాస్తవానికి జెఫ్రీ ఆర్చర్ కూడా నాలుగేళ్ళు జెయిల్ శిక్ష అనుభవించాడు.అందుకే ఆ జెయిల్ వాతావరణాన్ని వర్ణించడంలో ఎంతో స్పష్టత మనకు కనిపిస్తుంది.

3)Hand Maid’s Tale-Margaret Atwood

           ఈ నవల చదవాలంటే ఓ మూడ్ ఉండాలి. ఎందుకంటే ఈ నవల ప్రత్యక్ష శైలి కథ కాదు. ప్రస్తుతం ఓ హ్యాండ్ మెయిడ్ కథ చెప్తునే ఆమె కథ ద్వారా ఆ దేశంలో జరిగిన మార్పులు కూడా చెప్పడంతో ఏకాగ్రత సారించాల్సిన నవల ఇది.ఎక్కువ వర్ణనలు ఉన్న నవల.కానీ అవేవీ అతిగా ఉండవు. ఇది టెలివిజన్ సిరీస్ గా వచ్చినా సరే ఈ నవల చదువుతూ ఉంటే అదే లోకం ఇంకాస్త స్పష్టం అవుతున్న భావన కలుగుతుంది.

4) The Seventh Secret-Irving Wallace

          ఇర్వింగ్ వాలస్ ఓ విభిన్న రచయిత. ఆయన ఎన్నుకునే అంశాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. ఈ నవల మాత్రం హిట్లర్ మరణం కేంద్రంగా రాసినది. హిట్లర్ తాను ప్రేమించి చివరి రోజుల్లో వివాహం చేసుకున్నా ఇవా బ్రాన్ తో కలిసి ఓ బంకర్ లో ఆత్మహత్య చేసుకుని మరణించాడని చరిత్ర చెప్తుంది. దీనిని అందరూ వాస్తవంగా అంగీకరించలేదు.వారు కచ్చితంగా తప్పించుకుని ఇంకొన్నాళ్లు బ్రతికారనే వాదన కూడా ఉంది. దానికి పూర్తి సాక్ష్యాలు లేకపోయినా సాక్ష్యాలైతే ఉన్నాయి.ఈ వాదన ఆధారంగా హిట్లర్ జీవితం గురించి పూర్తి సత్యాలతో రాయలనుకున్న ఓ చారిత్రక రచయిత ఆకస్మాత్తుగా మరణిస్తే అతని కూతురు అదే బాధ్యతను నెరవేర్చడానికి ఎలా ప్రయత్నించిందో స్పష్టం చేసే నవల ఇది.

5)The Catcher In The Rye-J.D.Salinger

          నన్ను పూర్తిగా బోర్ కొట్టించిన నవల ఇది.కానీ నేటి సాహిత్యంలో దీనిని అపూర్వ పుస్తకంగా పేర్కొంటారు. కథ పరంగా ఈ నవల అంత ఆసక్తిని రేకెత్తించకపోయినా ఓ టీనేజర్ జీవితం ఎలా ఉంటుందో,అతను అన్నింట్లోను లోపాలు ఎలా వెతుకుతూ ఉంటాడో,మంచిగా ఉందామనుకున్న ప్రతి సంబంధాన్ని ఎలా పాడు చేసుకుంటాడో,అన్న మూల అంశంతో ఈ  నవల రాయబడింది. ఈ నవలలో ఉన్న బాష పూర్తిగా టీనేజర్ బాష. ఈ నవల నిషేధానికి కూడా గురైంది.కానీ పుస్తకాలు మనకు అన్నీ లోకాల్ని పరిచయం చేస్తాయి కనుక చదవాల్సిన నవలే.

ఇక మిగిలిన ఐదు పుస్తకాలు కూడా నేను సిడ్నీ షెల్డన్ వే చదివాను.దానికి కారణం సిడ్నీ షెల్డన్ నవలల్లో గొప్ప  వైవిధ్యం ఉండకపోయినా బాగా చదివింపజేసే శైలి ఉంటుంది. సిడ్నీ షెల్డన్ అన్నీ నవలల్లో మొదట్లో కథ మామూలుగా నడిచి చివర్లో మాత్రం సూపర్ ట్విస్టులతో పరిగెడుతూ ఉంటుంది.

6)A Stranger In The Mirror-Sidney Sheldon

          నాకు ఇది బాగా నచ్చిన నవల. మన తెలుగులో పాకుడురాళ్ళు వంటి నవల ద్వారా సినీ రంగంలో స్త్రీలు ఎదుర్కునే బాధలు స్పష్టం చేస్తే ఈ నవలలో ఓ పురుషుడు,స్త్రీ ఇద్దరు ఎలా నటులు అవ్వడానికి ఇబ్బందులు పడ్డారో స్పష్టం చేసే నవల ఇది. తాను ఎడగలేని క్రమంలో ఎదిగిన వ్యక్తి  ఆసరాతో తన జీవిత ఆశయాలు నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేసిన ఆ స్త్రీ,అలాగే జీవితం తిరగబడి కింద పడిన ఆ పురుషుడు ఇద్దరి జీవితాలు ఎలా ముగిశాయో స్పష్టం చేసే నవల ఇది.

7)The Sands Of Time-Sidney Sheldon

          ఇది కాస్త చారిత్రక నేపథ్యం కల నవల. ఇందులో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యాన్ని  కోరుకున్న బాస్క్ ప్రాంతపు తిరుగుబాటు సంఘం అయిన ETA నాయకుడిని స్పెయిన్ పట్టుకునే క్రమంలో నలుగురు నన్స్ జీవితాలు ఎలా చిక్కుబడ్డాయో తెలిపే నవల ఇది. ఇందులో ఓ దేశపు బాధలు ఉన్నాయి.అలాగే వ్యక్తిగత బాధల వల్ల నన్స్ గా మారిన వ్యక్తి జీవితాలు ఉన్నాయి.

8) Are you afraid of the dark?-Sidney Sheldon

            నవలలో ప్రపంచాధిపత్యం కోసం వాతావరణాన్ని నియంత్రించాలనే అత్యాసతో ఓ సంస్థ ఎలా తన ఆశయం కోసం తమకు అడ్డు వచ్చిన వారిని హతమారుస్తూ ఉందో  అన్న అంశాన్ని ఓ క్రైమ్ థ్రిల్లర్ గా మలచిన నవల ఇది.

9)The Sky is Falling -Sidney Sheldon

      ఓ వార్ కరస్పాండెంట్ అయిన ఇవా ఎలా ఓ రాయల్ కుటుంబంలో జరుగుతున్న హత్యల మిస్టరీని సాధించిందో అన్న అంశంగా మలచిన నవల ఇది. దీనికి కూడా మూలాలు దేశానికి దేశానికి మధ్య ఉన్న ఆధిపత్య పోరే.

10)The Stars Shine Down-Sidney Sheldon

          ఓ పేద కుటుంబంలో జన్మించిన అమ్మాయి గొప్ప రియల్ ఎస్టేట్ బిల్డర్ గా ఎలా మారిందో, ఆ పయనంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుందో స్పష్టం చేసే నవల ఇది. తాను ఎదిగే క్రమంలో ఎలా కొన్ని రిస్కులు తీసుకుందో,వాటికి ఎలా మూల్యం చెల్లించిందో చెప్తునే తన మీద తనకున్న నమ్మకాన్ని వదులుకొని ఓ స్త్రీ జీవితమే ఈ నవల.

          పైన చెప్పిన ప్రతి నవల గురించి స్పష్టమైన సమీక్షలు నేను రాశాను.అందుకే ఇక్కడ పరిమితంగా చెప్పడం జరిగింది. ఒకే రచయిత నవలలు వరుసగా చదవడం కొన్నిసార్లు బోరింగ్ గా ఉంటుంది,కానీ కొందరి రచనలు అంటే ఏవైతే లైట్ రీడింగ్ ఉంటాయో అవి మాత్రం వరుసగా ఒకే రచయితవి చదవచ్చు. ముందు చదవడం మొదలుపెడితే మనకు అది ఓ అలవాటుగా మారి,మన పఠన శక్తిని,మన ఆలోచనా పరిధిని కూడా విస్తృతం చేస్తుంది. సిడ్నీ షెల్డన్ నవలలు ఎన్నయినా వరుసగా చదువుకోవచ్చు. దానికి కారణం చాలా స్ట్రైట్ గా కథ నడుస్తూ ఉంటుంది.కానీ జెఫ్రీ ఆర్చర్, డాన్ బ్రౌన్ లేదా క్లాసిక్స్ మాత్రం ఒకే రచయితవి చదవలేము.

          ముఖ్యంగా చదివే మొదటి రోజుల్లో ఉన్నవారు మాత్రం క్లాసిక్స్ జోలికి పోకుండా ఉంటే మంచిది. జేన్ ఆస్టిన్ అయినా,థామస్ హర్డీ అయినా, సోమర్ సెట్ మామ్ అయినా సరే సీరియస్ రీడింగ్ శైలికి అలవాటు పడ్డాకే చదివింపజేసే స్థాయిలో ఉంటాయి కనుక. ఒక్కసారి ఓ 30 పుస్తకాల వరకు చదివే స్థాయికి వచ్చేవరకు 1-5 వరకే క్లాసిక్స్ చదివితే పుస్తక పఠనం విస్తృతం అవుతుంది. ఇది వ్యక్తిగత అభిరుచుల మీద కూడా ఆధారపడి ఉండవచ్చు.కానీ నా అనుభవానికి ఇది సరిపోతుంది. ఇవండీ ఈ నెల పుస్తకాల ముచ్చట్లు..మళ్ళీ ఫిబ్రవరి చివర్లో ఇంకొన్ని ముచ్చట్లతో కలుసుకుందాం.

                 *    *   *

           

 

 

 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!