ఎంతెంత దూరం!

చదువరి

ఎంతెంత దూరం!

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          రతన్ ప్రసాద్ గారి తెర తొలిగింది నవలలో  బిడ్డను సహజంగా ప్రేమించగలిగే స్త్రీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డను ద్వేషిస్తూనే ఆ బాధ్యత తీసుకుంటుందో, ఆ తర్వాత ఆమె చూపించిన నిర్లక్ష్యం వల్ల ద్వేషం పెంచుకున్న ఆ కొడుక్కి, ఆ తల్లికి మధ్య ఎప్పుడు ఆ తెర తొలిగిందో అన్న అంశంతో కుటుంబ కథగా మలిచారు.

     సురమౌళి  రాజేశ్వరి అనే కోటీశ్వరురాలి కొడుకుగా పుట్టినా, పార్వతి అనే ఆయా సంరక్షణలో ఎనిమిదేళ్ళు పెరుగుతాడు. తల్లి తన పట్ల కఠినంగా ఉండటం, తనకు సౌకర్యాలు అందించినా, తనకు ఇష్టమైనవి ఇవ్వకపోవడం,తనతో ప్రేమగా ఉండకపోవడం వంటివి అతని మనసులో తల్లిపట్ల ద్వేషాన్ని పెంచుతాయి. తర్వాత అతని వినీలను ప్రేమిస్తే ఆమె కాదన్నదన్న కారణానికి అప్పటికే మనసులో ఉన్న ద్వేషం కూడా తోడవ్వడంతో ఆమెను వదిలి వెళ్ళిపోతాడు.

          రాజేశ్వరి చావుబతుకుల్లో ఉందని టెలిగ్రామ్ అందినా వెంటనే బయల్దేరడు. చివరికి మిత్రుడు మురలి బలవంతం మీద వెళ్ళినా ఆమె ఆపాటికే మరణిస్తుంది. బాల్యం నుండి ఆమె మీద ఉన్న ద్వేషం సురమౌలికి ఆమె మరణంతో కూడా పోదు.

          ఆమె చనిపోయేటప్పుడు  సురమౌళి తను చనిపోకముందు వస్తే చెప్పాలనుకున్న విషయాలు వినీలకు చెప్తుంది. రాజేశ్వరి తండ్రి కోటీశ్వరుడు,పేరు నర్సింగరావు. ఆయన దగ్గర చేరిన రామరాజనే ఇంజనీరును రాజేశ్వరి ఇష్టపడి తండ్రి అంగీకారంతో అతన్ని పెళ్లి చేసుకుంటుంది. రామరాజు ఇల్లరికం వస్తాడు. పెళ్ళయిన కొన్నాళ్ళకి  కూడా ఆమె గర్భవతి కాదు. ఈ లోపు నర్సింగరావు మరణిస్తాడు.

          దేశ్ ముఖ్  మాధవరావుకు మాణిక్యాంబ ఒక్కర్తే కూతురు.మగపిల్లలు లేరని శ్రీనివాసరావును దత్తత తీసుకున్నారు. మాణిక్యాంబకు శాంత , శ్రీనివాసరావుకు నర్సింగరావు పుట్టారు. కానీ శాంతమ్మ తల్లిదండ్రుల్ని ఎదిరించి ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకోవడం వల్ల కుటుంబానికి దూరమవుతుంది. ఆమెకు గాని, ఆమె తరపు వారికి గాని సాయం చేయాల్సి వస్తే తప్పక చేయమని రాజేశ్వరి దగ్గర మాట తీసుకుంటాడు నర్సింగరావు.

          రాజేశ్వరి ఆ మాటకు కట్టుబడి శాంత నుండి లేఖ రాగానే వెళ్తుంది. తన కూతురు పార్వతిని ఆమె చేతిలో పెట్టి మరణిస్తుంది శాంత. అలా వచ్చిన పార్వతిని సొంత చెల్లెలిలా చూసుకుంటుంది. పార్వతి విధవ. ఓసారి రాజేశ్వరి స్నేహితురాలి పెళ్ళికి వెళ్ళినపుడు  తాగి వచ్చిన రామరాజు పార్వతిని అనుభవిస్తాడు. తర్వాత ఈ విషయం రాజేశ్వరికి తెలిసినప్పటి నుండి రామరాజును క్షమించదు, శిలలా మారిపోతుంది.

          ఎవరికి తెలియకుండా పార్వతి గర్భవతి కాగానే ఊటీకి  తీసుకువెళ్ళి ఆమెకు పుట్టిన బిడ్డను తన బిడ్డగా, పార్వతిని ఆయాగా పరిచయం చేస్తుంది. అచ్చం రామరాజులానే ఉన్న సురమౌళికి  అంత దగ్గర కాలేకపోతుంది. దగ్గరవుతున్న కొద్దీ  దూరం, ద్వేషం పెరిగిపోయాయి అతనిలో. తర్వాత రామరాజు వేదనతో  అనారోగ్యంతో మరణించాడు. తన కొడుకుని ఇంజనీర్ని చేయమని మాట తీసుకుంటాడు మరణించేటప్పుడు  రామరాజు. అందుకే అతనికి ఇష్టం లేకపోయినా ఇంజనీర్ ను చేస్తుంది. అతని ఎనిమిదేళ్ళ వయసులో పార్వతి మరణించింది. చివరి ఉత్తరంలో వినీలతో వివాహం తనకు అంగీకారమని తెలుపుతుంది రాజేశ్వరి.ఆలా ఆమె మరణంతో ఆ తల్లీకొడుకుల మధ్య తెర తొలిగింది. సురమౌళి పశ్చాత్తాపపడతాడు.

          బాల్యంలో ఎవరి మనసులోనైనా నాటుకునే భావాలు ఎప్పటికీ స్థిరంగానే ఉండిపోతాయి. అది ప్రేమైనా, కోపమైనా సరే. అందుకే బాల్యంలో పిల్లలను ఎంత ప్రేమతో వారి మనసును అర్ధం చేసుకుని మెలిగితే వారు వారి వయసుతో పాటు మనకు దగ్గర అవుతుంటారు. ఒకవేళ ఆ బాల్యంలోనే దూరం ఏర్పడితే అది ఓ అగాధంలా ఎప్పటికీ నిలిచిపోతుంది.

          *     *     * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!