నేను కూడా మారతా!
సినీ సంచారం
నేను కూడా మారతా!
-రచనశ్రీదత్త (శృంగవరపు
రచన)
ఏ వ్యక్తి
పూర్తిగా మంచివాడు కాదు, అలా అని చెడ్డవాడు కాదు. కానీ పరిస్థితులు,జీవితాన్ని చూసే దృక్కోణం మార్చుకునే ఆలోచనలు వారికి ఏ రూపంలో అయినా కలిగే
అవకాశం వస్తే మాత్రం వారు కచ్చితంగా మారతారు అని తెలిపే సినిమానే ‘As Good
As It Gets.’ ప్రతి ఒక్కరిని కదిలించే సినిమా ఇది. ఈ సినిమాలో
నటించిన జాక్ నికల్సన్ కు, హెలెన్ హంట్ కు కూడా ఆస్కార్లు
సాధించిన సినిమా ఇది. విలక్షణ నటుడు జాక్ నికల్సన్ నటనను పరిపూర్ణ స్థాయిలో
చూడాలంటే కచ్చితంగా చూడాల్సిన సినిమాలు ఒకటి ‘One Flew Over the Cuckoo's
Nest’ అయితే ,రెండోది ‘As Good As It
Gets.’ అలాగే ప్రొఫెషనల్ గా నటించే హెలెన్ హంట్ కు ఈ సినిమా గొప్ప
కీర్తిని తెచ్చిన సినిమా కూడా.
మెల్విన్
పాత్ర ఈ సినిమాలో కీలక పాత్ర. మెల్విన్ ఓ రచయిత. అతనికి అబ్సెసివ్ కంపల్సివ్
డిజార్డర్ తో పాటు, ఎవరిని ప్రేమించలేకపోవడం, ఎవరితోనూ కలవలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నాయి.ఎప్పుడూ ఒకటే రెస్టారెంట్ కు
వెళ్ళి ఒకే సీట్ లో కూర్చోవడం,అతన్ని భరించే ఒకే ఒక్క
వెయిట్రెస్ కరోల్ పట్ల ఆసక్తి కలిగి ఉండటం,ఆమె తప్ప ఎవరు
అతన్ని భరించలేకపోవడం,అతను కూడా ఆమెను తప్ప ఇంకెవరిని
భరించలేకపోవడం అతని జీవితంలో ఓ భాగంగా జరిగిపోతూ ఉంటుంది.
సినిమా
మొదట్లో మెల్విన్ తన అపార్టుమెంటుకు రాగానే అతని ఫ్లోర్ లోనే ఉండే సైమన్ అనే
పెయింటర్ కుక్క పిల్ల అయిన వర్డిల్ ను అతను తనకున్న శుభ్రత పిచ్చి వల్ల గార్బేజ్
లో వేస్తాడు. ఆ కుక్క పిల్ల గురించి సైమన్ కు, మెల్విన్ కు మధ్య గొడవ
కూడా అవుతుంది. ఈ విషయం వల్ల మెల్విన్ అంటేనే ఓ రకమైన ఏహ్య భావాన్ని సైమన్
పెంచుకుంటాడు. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్లో ఉండే వ్యక్తి సైమన్ కు ఆ కుక్క పిల్లను
తెచ్చి ఇస్తాడు. ఈ సంఘటనతోనే మెల్విన్ పాత్ర ఎటువంటిదో దర్శకుడు పరిచయం చేస్తాడు.
అపార్టుమెంట్
తర్వాత అతనికున్న ఒకే లోకం అతను భోజనం చేసే రెస్టారెంట్. అందులో ఉండే వెయిట్రెస్
కరోల్ సెర్వ్ చేస్తేనే అతను భోజనం చేస్తాడు. దానికి ఎంత సమయం పట్టినా వేచి ఉంటాడు.
కరోల్ భర్త నుండి విడిపోయింది. కొడుక్కి ఆస్మా. తల్లి,కొడుకుతో
కలిసి ఓ కుటుంబంగా జీవనం సాగిస్తూ. కొడుకు అనారోగ్యం గురించి బాధపడుతూ ఉంటుంది.
డబ్బు లేకపోవడం వల్ల సరిగ్గా వైద్యం చేయించలేకపోతున్నాననే చింతతో ఉంటుంది.
సైమన్
ఇంట్లో జరిగిన దొంగతనంలో అతని మీద దాడి కూడా జరుగుతుంది. ఆ సమయంలో అతను హాస్పటల్లో
ఉన్నప్పుడూ అతని కుక్క పిల్లను తప్పనిసరి పరిస్థితుల్లో మెల్విన్ తన దగ్గర
ఉంచుకోవాల్సి వస్తుంది. అయిష్టంగానే ఒప్పుకున్నా, క్రమ క్రమంగా ఆ
కుక్క పిల్లతో అతని అనుబంధం బలపడుతుంది. అలా ఆ కుక్క పిల్ల కూడా అతన్ని విడిచి
పెట్టలేని స్థితికి వస్తుంది. సైమన్ కు హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అవుతాడు. కానీ ఈ
దొంగతనంలో జరిగిన దాడి వల్ల, అతని పెయింటింగ్స్ అమ్మకం
జరగకపోవడం వల్ల అతను ఆర్థికంగా చితికిపోతాడు. తిరిగి వచ్చాక కుక్క పిల్లను తిరిగి
తీసుకున్నా అది మెల్విన్ మీద బెంగ పెట్టుకుంటుంది.
ఓ రోజు
మెల్విన్ రెస్టారెంట్ కు వెళ్ళేసరికి కరోల్ ఆ రోజు రాదు. ఆమె లీవ్ లో ఉందని
తెలుసుకుని సరాసరి ఆమె ఇంటికి వెళ్తాడు. ఆమె కొడుక్కి ఆరోగ్యం బావుండకపోవటం వల్ల
ఆమె రాలేదని తెలుసుకుని అతని పుస్తకాన్ని పబ్లిష్ చేస్తున్న స్త్రీ భర్త డాక్టర్
అవ్వడంతో అతను పర్సనల్ గా ఆ బాబుకు వైద్యం చేసేలా ఆ బిల్లులు మెల్విన్ కట్టేలా
బాధ్యత తీసుకుంటాడు. అలా మెల్విన్ పట్ల కరోల్ కు సదాభిప్రాయం కలుగుతుంది.
సైమన్
బాల్యం నుండి ఓ పెయింటర్. అతని ప్రత్యేకత న్యూడ్ పెయింటింగ్. బాల్యం నుండి తల్లిని
కూడా నగ్నంగా చిత్రీకరించేవాడు. అతనికి అది కళలో భాగం మాత్రమే. కానీ అతను యుక్త
వయసుకు వచ్చాక ఆ విషయం అతని తండ్రికి తెలియడంతో అతని మీద ఆగ్రహించి కొంత డబ్బిచ్చి
అతన్ని ఎప్పటికీ తిరిగి రావద్దని పంపేస్తాడు.కానీ మళ్ళీ ఇప్పటి తప్పనిసరి
పరిస్థితుల్లో అతను వారి దగ్గరకు సాయం కోసం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
సైమన్ ను
తల్లిదండ్రుల దగ్గరకు తీసుకువెళ్ళడానికి ఎవరు లేకపోవడంతో ఆ బాధ్యత మెల్విన్
తీసుకుంటాడు. కరోల్ ను కూడా రమ్మని ఆహ్వానిస్తాడు. ఆ ప్రయాణం మధ్యలో వారు ఒక హోటల్
లో బస చేస్తారు. అక్కడి బసలో సైమన్ కరోల్ నుండి స్పూర్తి పొంది ఆ యాక్సిడెంట్
నుండి పెయింటింగ్ వేయడం మానేసినా ఆ హోటల్ లో ఎన్నో చిత్రాలు వేస్తాడు. దానితో
అతనికి జీవితం మీద నమ్మకం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల సాయం తీసుకోకూడదని
నిశ్చయించుకుని తిరిగి బయల్దేరడానికి నిర్ణయించుకుంటాడు.సైమన్ తన అపార్టుమెంట్
కూడా ఖాళీ చేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో మెల్విన్ తన అపార్టుమెంటులో అతనికి
ఆశ్రయం ఇస్తాడు. ఆ తర్వాత కరోల్, మెల్విన్ ఒకటవ్వడంతో సినిమా ముగుస్తుంది.
సినిమా
ప్రారంభంలో మెల్విన్, సినిమా మధ్యలో మెల్విన్, సినిమా చివరిలో మెల్విన్ అనే మూడు భాగాలుగా ఈ సినిమా చూస్తే మనిషి జీవితంలో మార్పు ఎంత చిన్న కారణాల నుండి
ఉద్భవిస్తుందో స్పష్టమవుతుంది. ఈ సినిమాలో మెల్విన్ గా జాక్ నికల్సన్, కరోల్ గా హెలెన్ హంట్ ల నటన కూడా ఆ పాత్రలను ప్రేక్షకులు ఎప్పటికీ
మరచిపోకుండా చేస్తుంది. మీరు కూడా ఓ మంచి సినిమా చూడాలనుకుంటే తప్పకుండా ఈ సినిమా
చూడండి.
*
* *

Comments
Post a Comment