పాతాళ లోకంలో

 చదువరి

పాతాళ లోకంలో

                  -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          సినీ రంగంలో ఉండే సాధకబాధకాల గురించి నేటికే సాహిత్యంలో ఎన్నో నవలలు వచ్చాయి. దాదాపుగా రచయితలందరూ ఈ అంశాన్ని స్పృశిస్తూ రాసినవారే. కానీ ఈ సినీ రంగంలో ఉండే స్త్రీల జీవన శైలిని గురించి ఎందరూ రాసినా ఆ అంశం లో కచ్చితంగా ఏదో ఒక కొత్తదనం, కొత్త మనుషులు మనకు తారసపడుతూనే ఉంటారు. సాహిత్యానికి ఉన్న గొప్పతనం అదే. రావూరి భరద్వాజ గారి 'పాకుడు రాళ్ళు' కు మాత్రం కొన్ని విశిష్టతలు ఉన్నాయి. మంగమ్మ నుండి మంజరిగా మారినా ఆమె వ్యక్తిత్వం లో ప్రతిభ ఉన్నప్పటికీ కూడా సామాన్య మనుషులకుండే బలహీనతలు అన్నీ కూడా ఆమెకు ఉన్నాయి. అసూయ, కక్ష కట్టడం, తన గొప్పతనం ఎల్లప్పుడూ నిరూపించుకోవాలనే తపన ఇవన్నీ ఆమెకున్న బలహీనతలే. కేవలం ఈ బలహీనతలే ఆమె శరీర పవిత్రత పట్ల నమ్మకం లేకపోయినప్పటికీ ,ఆ శరీరంతో ఎందరినో దాసుల్ని చేసుకుని నవ్వుకుని గొప్ప నటిగా ఎదిగినప్పటికీ చివరకు అదే శరీరం ఆమెను మరణించేలా చేసింది. ఈ నవలలో మంజరి పాత్రలో వాస్తవికత ఉట్టిపడుతుంది. గొప్ప స్థానం దక్కిన తర్వాత పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో ఆమె కూడా అలానే ప్రవర్తించింది. బహుశా అదే ఈ నవలా విజయానికి కారణమనుకుంటా.

          మొదట  మంగమ్మ నాటకాల్లో నటించేది. అప్పటి వరకు ఆ నాటక మండలిలో స్త్రీలు ప్రత్యేకంగా నటించింది లేదు కనుక ఆమె రాకతో ఆ నాటక సంస్థ వెలిగిపోయింది. మంగమ్మ వెంట నాగమణి అనే స్త్రీ కూడా ఉండేది. మంగమ్మ అందాన్ని ఎరగా వేసి డబ్బు సంపాదించాలనే కోరికతో ఆమెను ఓ పక్క నాటకాలడిస్తూనే ఇంకో పక్క డబ్బులిచ్చిన వారి దగ్గరికి పంపేది. మంగమ్మకు ప్రత్యేకంగా ఆ పనులు ఇష్టం లేకపోయినప్పటికీ నాగమణి కోసం ఆమెకు తప్పేది కాదు. ఆ తర్వాత ఆ నాటకాల సంస్థలో ముఖ్యులైన మాధవరావు, రామచంద్రరావులు నాగమణి కి కొంత పైకమిచ్చి ఆమె నుండి మంగమ్మను విడిపిస్తారు. కొంత కాలం తర్వాత నాటకాలకు వైభవం తగ్గిపోవడంతో ఆ సంస్థ మూతబడిపోవటంతో మంగమ్మ కూడా అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఓ హోటల్ లో ఉన్నప్పుడూ చలపతి వస్తాడు. తానో సినిమా తీయబోతున్నానని దానిలో హీరోయిన్ గా ఆమె సరిపోతుందని చెప్పి ఆమెను తీసుకువెళ్తానని చెప్తాడు. ఇక వేరే దిక్కు కూడా లేకపోవడం వల్ల ఆమె అతనితో కలిసి మద్రాసు వెళ్తుంది.

          అక్కడికి వెళ్ళాక చలపతి ఏ సినిమా తీయడం లేదని సినిమా వాళ్ళతో ఉన్న పరిచయాలతో తనను ఓ నటిని చేయదలచుకున్నాడని ఆమెకు అర్ధమవుతుంది. దాని వల్ల అతనికి వచ్చే లాభమేమిటో ఆమెకు మొదట్లో అర్ధం కాదు. ఆ తర్వాత ఆమె పేరు 'మంజరి' గా మార్పించి పత్రికలతో మంచి సంబంధం కోసం వారికి పార్టీలిచ్చి, డబ్బులిచ్చి ఆమె గురించి రాయిస్తాడు చలపతి.  కొరడా పత్రికకు సంపాదకుడిగా ఉన్న శర్మా తనకు డబ్బులిస్తే మంజరి గురించి మంచిగా రాస్తానని లేకపోతే వ్యతిరేకంగా రాస్తానని హెచ్చరించడంతో ఆ డబ్బులు అతనికి సమర్పించి మంచిగా వచ్చేలా చూస్తాడు చలపతి. అదే సమయంలో వెంకటేశ్వరరావు అనే అతను తన సోదరుడైన పరబ్రహ్మంతో కలిసి ఓ సినిమా తియ్యదల్చుకోవడం, మంజరికి అతన్ని చలపతి పరిచయం చేయడం, అతనితో సన్నిహిత సంబంధం పెట్టుకుని కేవలం ఆమె కోసమే సాంఘికం నుండి జానపదం గా ఆ సినిమాను మార్పించడం, ఆ తర్వాత పరబ్రహ్మం తన మాటకు విలువ లేదని గుర్తించి తప్పుకోవడం, చలపతి యాజమానిలా వ్యవహరించడం, విలాసాల వల్ల ఖర్చులు ఎక్కువ అవ్వడంతో చివరికి వెంకటేశ్వరరావు తిరిగి తన ఊరికి వెళ్లిపోవడంతో అతని కథ ముగుస్తుంది.

          కానీ ఓ ప్రయత్నంలో దెబ్బ తిన్నామని ఆపేస్తే, సినీ రంగంలో ఆగిపోతే ఎప్పటికీ అలానే ఉండిపోతాము అని తెలిసి ఎంతో సహనంతో ఇంకేన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు చలపతి. అప్పుడు పరిశ్రమలో ఉన్న ఇద్దరు గొప్ప హీరోలు రావు, మూర్తిలు. వీరి వర్గాల దగ్గర మంజరి గురించి ప్రచారం చేయడం మొదలు పెడతాడు చలపతి. మూర్తికి,రావుకు ఒకరంటే ఒకరికి పడదు. అందుకే వారితో లౌక్యంగా వ్యవహరిస్తూ, రావు గారి ప్రాపకంతో ఆమెకో సినిమాలో చిన్న పాత్ర వచ్చేలా చేస్తాడు చలపతి. తర్వాత రావు చెప్పడంతో ఓ సినీ కంపెనీ వాళ్ళు ఆమెకో ఆఫర్ ఇస్తారు. నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇస్తామని, తాము ఇచ్చిన పాత్రలు నటించాలని, ఆ అగ్రిమెంట్ మూడేళ్ళు ఉంటుందని చెప్తారు. డబ్బులకు వెతుక్కునే పని ఉండదని ,అందులోనూ అంత డబ్బులిచ్చేవారు మరి చిన్న పాత్రలు కూడా ఇవ్వరనుకుని దానికి ఒప్పుకుంటుంది. కానీ మూర్తి మళ్ళీ ఆ కంపెనీ వారికి ఏదో చెప్పడంతో ఆమెకు మరి పనికిరాని రోల్ ఇస్తారు. కానీ మంజరి తన చాకచక్యంతో ఆ కంపెనీ పార్టనర్ ప్రసాద్ ను లొంగదీసుకుని మొత్తానికి నటిగా నిలబడుతుంది. తర్వాత ఎన్నో ఆఫర్లు ఆమెకు వస్తాయి. ఆమె వచ్చే సమయానికి అక్కడ స్టార్ గా ఉన్న నటి కళ్యాణి.

          కళ్యాణి మంజరితో సాన్నిహిత్యాన్ని పెంచుకుని, ఆమెను తనకు నచ్చిన వ్యక్తుల దగ్గరకు కూడా పంపిస్తూ ఉండేది. అలా స్టార్ అయిన తర్వాత కొత్త ఇల్లు తీసుకుంటుంది మంజరి. తన మిత్రురాలైన రాజమణి ,ఆమె దగ్గర ఉన్న వసంతలను కూడా రప్పిస్తుంది. వసంత గొంతు బావుండటంతో ఆమెను సింగర్ ను కూడా చేస్తుంది. కానీ మంజరి అహంకారాన్ని భరించలేని ఎందరో ఆమెను అణగదొక్కాలని ప్రయత్నించిన ప్రతి సారి వారి జుట్టు ఎవరి చేతిలో ఉందో తెలుసుకుని  వారి ద్వారా నాటకం నడిపించి తన స్థానం సుస్థిరం చేసుకుని గొప్ప నటి అవుతుంది మంజరి. సినిమా కథ బావుండకపోయినా ఆమె సెక్స్ అపీల్ ఉన్న పాటలతో సినిమాలు ఆడినవి కూడా చాలా ఉంటాయి.

          అదే సమయంలో కళ్యాణి మరణిస్తుంది. ఆమెది హత్య అని ,అది చేసింది ఆమె భర్త ఫకీరయ్య అని,అంతకు ముందు సినీ రంగానికి రాక ముందే అతనితో ఆమె తెగతెంపులు చేసుకుని తన ఒళ్ళు అమ్ముకుంటూ జీవనాన్ని సాగించిందని,ఆమె కొడుకును తమ్ముడు అనే చెప్పేదని ,తర్వాత ఆ కొడుకును ఎక్కడో వదిలేసి వచ్చిందని ,కానీ ఆమె స్టార్ అయ్యాక ఫకీరయ్య డబ్బు కోసం ఆమెను వెధించేవాడని ,ఆ తర్వాత డబ్బుతో ఎలాగో వదిలించుకుందని చెప్తాడు చలపతి. అలా ఆమె మరణం కూడా మంజరి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని పత్రికలు కళ్యాణి తన ఆస్తి మంజరి పేరు మీద రాయడంతో ఆమె హత్య చేసిందనే పుకారును కూడా లేపుతాయి.కానీ అన్నీ తట్టుకుని ముంబై వెళ్ళి ఓ హింది సినిమాలో నటించి తన స్థానాన్ని మళ్ళీ నిరూపించుకుంటుంది మంజరి.  అదే సమయంలో ఆమె మీద అంతో ఇంతో కోపంగా ఉన్న రావు ,మూర్తి ,ఇంకొందరు కలిసి ఆమె మీద దుష్ప్రచారం చేయడం ప్రారంభిస్తారు. అంతే కాకుండా మూర్తి ,రావులు ఆమె ఉంటే తాము సినిమాల్లో నటించమని చెప్తారు.

          అదును కోసం ఎదురుచూస్తున్న పాత నటుల్లో ఒకడైన చంద్రం మంజరి బలహీనతల మీద కొట్టి ఆమె పక్కన హీరోగా పది చిత్రాలు చేసి స్టార్ అవుతాడు. దీనికి సమాధానంగా చంద్రం మార్గాన్నే అనుసరించిన నాయికను చేస్తారు మూర్తి ,రావులు.అలా వారి మధ్య గొడవల వల్ల వారికే పోటీగా ఉన్న నటులు పుట్టుకొస్తారు. కానీ తన వల్ల స్టార్ అయిన చంద్రం తనకే ఎదురు తిరగడం మంజరి తట్టుకోలేకపోతుంది.

          మళ్ళీ మంజరి ,మూర్తి ,రావులు ఒకటవుతారు. కానీ అప్పటికే తనకు పోటీ ఉంటుందని గ్రహించిన మంజరి పత్రికలను ,పదవుల్లో ఉన్న వారిని తన మార్గంలో ఒప్పించి మొత్తానికి విదేశాల ఆహ్వానం మీద అక్కడికి వెళ్తుంది. తెలుగు నటుల్లో మొదటిసారిగా విదేశాలు ఆహ్వానించినా నటిగా ఆమె పేరు ప్రసిద్ధి పొందుతుంది. అక్కడ ఆమె మర్లిన్ మన్రోను కూడా కలుస్తుంది. సినీ నటీమణుల జీవితాల్లో కష్టాలు సాధారణం ,మోసాలు సాధారణం అని ఆమె నుండి తెలుసుకుంటుంది. ఆ తర్వాత భారత దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె డిమాండ్ ఇంకా పెరిగిపోతుంది.

          తనకు పోటీగా ఉన్న నటీమణులు ఇల్లు కట్టుకున్నారని తెలిసి తను అక్కడే ఇల్లు కట్టుకోవాలని కిషన్ లాల్ అనే అతని చేత డబ్బు పెట్టించి కట్టడం మొదలు పెట్టించాక ,అవి దొంగనోట్లని తెలియడంతో కిషన్ లాల్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. తర్వాత తన దగ్గరకు ఎక్కడ వస్తారో అని భయపడి సక్సేనా తనను తప్పిస్తాడని నమ్మి అతను చెప్పినట్టు బ్లూ ఫిల్మ్ లో నటిస్తుంది. పోలీసుల సమస్య నుండి బయటపడినా డబ్బు ఇవ్వకపోతే సక్సేనా ఆ ఫిల్మ్ విడుదల చేస్తానని బెదిరించడంతో ఆమె ఆత్మ హత్య చేసుకుని మరణించడంతో నవల ముగుస్తుంది.

          మంజరి లో బలహీనతలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తాను ఎదిగే క్రమంలో ఉన్నప్పుడూ తనను బాధ పెట్టిన వారిని మళ్ళీ బాధ పెట్టే అవకాశం తనకు వచ్చినప్పుడు ఆమె అది చేసి తీరింది. అలాగే అవకాశం ఉన్నప్పుడూ దానిని ఏ రకంగానైనా సరే వినియోగించుకుని ఎదిగింది. కానీ ఆ క్రమంలో తాను కిందికే పయనిస్తున్నానని ఆమె ఎప్పుడు అనుకోలేదు. లౌక్యం ,తనకు అవసరం ఉన్నవారిని ఎలా అయినా సరే తన పనులు జరిపించేలా చేయడం ఆమెను సినీ తారను చేసినా ఆమెను మనోక్షోభ -వ్యథల నుండి మాత్రం కాపాడలేకపోయాయి. అలాగే సినీ రంగం లో ఉండే కుట్రలు ఈ నవలలో కనిపిస్తాయి.పోటీని తట్టుకోలేక కొందరు అవలంభించే ఎన్నో మార్గాలు కూడా ఈ నవలలో కనిపిస్తాయి. కచ్చితంగా చదవాల్సిన నవల ఎందుకంటే దీనిలో మనుషుల్లో ఉండే ప్రతి బలహీనత ఏదో ఒక రూపంలో ఆవిష్కరించబడింది.

          *    *   *

 

         

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!