దేశం- కుటుంబం

 సినీ సంచారం

దేశం- కుటుంబం

                        -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          యుద్ధంలో పాల్గొనడానికి వీరత్వం,దేశభక్తి ఉంటే సరిపోతుందా? దేశం పట్ల భక్తి యుద్ధంలో పాల్గొనడం ద్వారా ప్రదర్శించాలనుకునే వారు ఆ దేశభక్తి కోసం కుటుంబాన్ని వదిలెయ్యవచ్చా?భార్యను కోల్పోయి, ఏడుగురు పిల్లల తండ్రిగా బాధ్యతను నిరవర్తించడానికి 1776 లో జరిగిన అమెరికన్ రివల్యూషన్ యుద్ధంలో పాల్గొనడానికి సందిగ్డంలో పడిన ఓ యోధుడి కాల్పనిక కథే 2000 లో వచ్చిన ‘The Patriot.’ సినిమా. ఎపోకలిప్స్ సినిమాతో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న మెల్ గిల్బర్ట్స్ ఈ సినిమాలో నాయకుడిగా నటించారు. గాడ్జిల్లా, స్టార్ గేట్, ఇండిపెండెన్స్ డే వంటి సినిమాల దర్శకులైన  జర్మన్ దర్శకులు రోలాండ్ ఎమరిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

          అమెరికన్ రివల్యూషనరీ యుద్ధం జరుగుతున్న సమయంలో కెప్టెన్ బెంజామిన్ మార్టిన్ ను సౌత్ కరోలినా జనరల్ అసెంబ్లీ లో కాంటినెంటల్ ఆర్మీని సపోర్ట్ చేస్తూ వోట్ వెయ్యడానికి ఆహ్వానిస్తారు. కానీ బ్రిటన్ తో యుద్ధానికి భయపడి ఆ వోట్ వెయ్యడు మార్టిన్. తండ్రి ఎంతో ధీరుడిగా ప్రవర్తిస్తాడని ఊహించిన అతని పెద్ద కొడుకు గాబ్రియల్ ఎంతో నిరుత్సాహపడతాడు. తండ్రికి వ్యతిరేకంగాకాంటినెంటల్ ఆర్మీలో జాయిన్ అవుతాడు. తన కుటుంబం గురించి ఆలోచించి యుద్ధంలో పాల్గొనడు మార్టిన్.

          మార్టిన్ కు నలుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు. రెండేళ్ల తర్వాత కాంటినెంటల్ బ్రిటన్ తో ఓడిపోవడం, గాయపడిన గాబ్రియల్ ఇంటికి రావడం జరుగుతుంది. అతనితో పాటు గాయపడిన అమెరికన్ మరియు బ్రిటిష్ సైనికులు ఇద్దరు అక్కడికి వస్తారు. మనిషిగా రెండు దేశాల సైనికులకు సేవ చేస్తాడు మార్టిన్. బ్రిటిష్ కల్నల్ విలియం ట్రావింగ్టన్ తన సైనుకులతో వచ్చి అమెరికన్ సైనికులను హత్య చేసి, గాబ్రియల్ ను గూఢచారిగా భావించి అతన్ని ,మార్టిన్ ఇంట్లో పని చేసే పనివాళ్లను బానిసలుగా తీసుకువెళ్తాడు. మార్టిన్ రెండో కొడుకైన థామస్ అన్నను కాపాడుకునే ప్రయత్నం చేయగా అతన్ని చంపడంతో పాటు మార్టిన్ ఇంటిని కాల్చేయ్యమని ఆజ్ఞ ఇస్తాడు తన సైనికులకు ట్రావింగ్టన్.

          తన పెద్ద కొడుకును కాపాడుకోవటానికి మిగిలిన ఇద్దరు కొడుకులతో కలిసి చాటుగా చెట్ల నుండి తుపాకిలతో పేల్చి ఎంతో మంది బ్రిటిష్ సైనికులను చంపి గాబ్రియల్ ను కాపాడతాడు మార్టిన్. మార్టిన్ కు ఘోస్ట్ అని ట్రావింగ్టన్ పేరు పెడతాడు. తన పిల్లలను తన భార్య చెల్లెలి ఇంట్లో ఉంచుతాడు మార్టిన్. యుద్ధంలో పాల్గొనడానికి నిర్ణయించుకుంటాడు.

          మార్టిన్ తన గతంలోని కమాండర్ ఆఫీసర్ ను కలుస్తాడు. లోకల్ మిలిషియాకు అతన్ని కల్నల్ చేస్తాడు ఆ ఆఫీసర్. తన టీం ను గొరిల్లా వార్ ఫేర్ వ్యూహంహో ఎంతో మంది బ్రిటిష్ సైనికుల మీద విజయాలు సాధిస్తూ ఉంటాడు. ఫ్రెంచ్ మేజర్ జీన్ కూడా తన సాయాన్ని అందిస్తూ ఉంటాడు, త్వరలోనే ఫ్రెంచ్ సైన్యం కూడా ఈ యుద్ధంలో అమెరికాకు తోడుగా వస్తుందని మాట ఇస్తాడు.

          ఇలా యుద్ధం జరుగుతున్న సమయంలో మార్టిన్ టీం ను బ్రిటిష్ బంధిస్తుంది. వారిని ఎంతో తెలివితో తప్పిస్తాడు మార్టిన్. గాబ్రియల్ కు పెళ్లి  అవుతుంది.మార్టిన్ బృందానికి సాయం అందిస్తున్న గ్రామాన్ని సజీవ దహనం చేయిస్తాడు ట్రావింగ్టన్. వారిలోనే గాబ్రియల్ భార్య కుటుంబం కూడా ఉంటుంది. దానితో కోపంతో మార్టిన్ కు తెలియకుండా వెళ్ళిన గాబ్రియల్ ట్రావింగ్టన్ ను చంపే ప్రయత్నంలో మరణిస్తాడు.ట్రావింగ్టన్  మార్టిన్ కుటుంబాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తే వారిని  కాపాడతాడు మార్టిన్.తర్వాత జరిగిన యుద్ధంలో మార్టిన్ నేతృత్వంలో పోరాడిన కాంటినెంటల్స్ విజయం సాధించడం కార్న్ వార్లిస్ లొంగిపోవడం, ఫ్రెంచ్ సైన్యం కూడా అండగా నిలవడంతో అమెరికా విజయం సాధించడం, మార్టిన్ తన పిల్లల దగ్గరకు వెళ్ళడంతో సినిమా ముగుస్తుంది.

          యుద్ధం సినిమాలు ఎన్ని చూసినా అది ఏ దేశానికి సంబంధించింది అయినా సరే ఆ యుద్ధంలో జరిగే మారణకాండ సహజమైన మనుషుల్లో అంతర్గతంగా ఉండే సందిగ్డాలను అన్నింటిని పక్కన పెట్టేసి కేవలం యుద్ధం చేయడానికే తమ జీవితాన్ని అంకితం చేసే సైనికుల జీవితాలు కొందరి జీవితాలు ఎందుకు అతి విలువైనవో అర్ధమయ్యేలా చేస్తాయి.

           *        *         *

     

 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ