ఒకే రోజు జీవితం

సినీ సంచారం

ఒకే రోజు జీవితం

                 -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


            ఒక మనిషి తన జీవితంలో ఒకే రోజులో మళ్ళీ మళ్ళీ జీవించే పరిస్థితి వస్తే అతని మనస్థితి ఎలా ఉంటుంది? దాని వల్ల అతని జీవితం ఇంకా భయంకరంగా తయారవుతుందా? లేక దీని వల్ల అతని జీవితంలో మెరుగైన కోణం ఉంటుందా? ఈ అంశాన్ని ఓ హాస్య సినిమాగా మలచారు హాస్య నటులైన హరోల్డ్ రామిస్ దర్శకులుగా మారి ‘ద గ్రౌండ్ హాగ్ డే’ సినిమాతో. హరోల్డ్ రామిస్ ,బిల్ మురే హాస్య నటుల కాంబినేషన్ లో వచ్చిన ఘోస్ట్ బస్టర్స్ -1,2 ఘన విజయం సాధించాయి. వారి కాంబినేషన్ లోనే కానే హరోల్డ్ దర్శకుడిగా మారి తీసిన సినిమాలో బిల్ మురే నటించిన సినిమానే ఈ గ్రౌండ్ హాగ్ డే.

          ఫిల్ కానరర్ ఓ టీవీలో వెదర్ మాన్ గా పని చేస్తూ ఉంటాడు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2 న పుంక్సతేని లో గ్రౌండ్ హాగ్ డే ను సెలబ్రేట్ చేస్తారు. ఆ రోజు గ్రౌండ్ హాగ్ (ఓ రకమైన జంతువు పెద్ద ఎలుకలా ఉంటుంది )ద్వారా వాతావరణం ఎలా ఉండబోతుందో చెప్తారు. ఫిల్ కానరార్ ఈ ఈవెంట్ కోసం ప్రొడ్యూసర్ అయిన రీటా హ్యాన్సన్,కెమెరా మాన్ లారీలతో కలిసి వెళ్తాడు. అతనికి అది చేయడం పట్ల ఉన్న విముఖతతో ఏదో చేశాననిపించినట్టు చేస్తాడు. ఆ రోజు తిరిగి రావడానికి అక్కడ మంచు వాన పడటం వల్ల ఆ రోజు రాత్రి హోటల్ లోనే ఉండిపోవాల్సి వస్తుంది.

          తర్వాతి రోజు లేచేసరికి అంతకు ముందు రోజు అతను లేచేసరికి ఏ పాట రేడియోలో వస్తూ ఉంటుందో అదే ఆ రోజు కూడా ప్లే అవుతుంది. అంతకు ముందు జరిగినవే మళ్ళీ అతని జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఆ రోజు కూడా ఫిబ్రవరి 2. అలా అదే రోజు తర్వాతి రోజు కూడా అతని జీవితంలో పునరావృతం అవుతుండటంతో అతను తన పరిస్థితిని రీటాకు చెప్తాడు. ఆమె అతన్ని న్యూరాలజిస్ట్ కు చూపిస్తే ,అతను ఓ సైక్రియాటిస్ట్ దగ్గరకు పంపుతాడు. కానీ ఎవరు అతని సంస్యను అర్ధం చేసుకోలేరు.

          ఓ రోజు రాత్రి అతను బాగా తాగి, లోకల్ పోలీస్ బండిని గుద్దుతాడు.అతన్ని పట్టుకోవడానికి రాత్రి వెంబడించిన పోలీసులు పొద్దున్నే అయ్యేసరికి మాయమవుతారు, మళ్ళీ అతను తన హోటల్ రూమ్ లో అదే పాటతో మేలుకుంటాడు. తన జీవితంలో ఎప్పుడూ అదే రోజు ఉంటుందని అర్ధమైన ఫిల్ అమ్మాయిలతో కలవడం, అంతకు ముందు రోజు తెలుసుకున్న విషయాలను తర్వాతి రోజు ప్రదర్శించి వారి మనసును దోచుకోవడం,వారితో గడపటం ,దొంగతనం వంటి ఎన్నో ప్రమాదకర పనులు చేస్తాడు. చివరకు విసుగొచ్చి ఎన్నోసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. అయినా మళ్ళీ మామూలే అతని జీవితం.

          ఈ టైమ్ లూప్ లోనే రీటాను ఇష్టపడి ఉన్న ఫిల్ ఆమె మనసులో స్థానం సంపాదిస్తాడు. మొదట ఆ ప్రోగ్రామ్ కు వచ్చినప్పుడు విముఖత ప్రదర్శించిన అతను రోజు అదే రోజుతో గడపటం వల్ల ఎంతో అద్భుతంగా ఆ ఈవెంట్ చేస్తాడు. ఎంతో మందికి సాయం చేస్తాడు. ఎన్నో పనులు నేర్చుకుంటాడు. మంచు బొమ్మలు తయారు చేయడం, ఫ్రెంచ్ మాట్లాడటం వంటివి ఎన్నో నేర్చుకుంటాడు. మంచి మనిషిగా మారతాడు. తాను ప్రేమించిన రీటా తో ఆ రాత్రి ఉంటాడు. ఉదయం లేచేసరికి అది ఫిబ్రవరి 3 అని తెలియడంతో సంతోషిస్తాడు.

          ఒక మనిషి జీవితం అంటేనే తనను తాను నిత్యం మెరుగుపరుచుకుంటూ జీవన పయనంలో ముందుకు సాగడం. అదే అంశాన్ని ఓ వైవిధ్య రీతిలో చెప్పే ప్రయత్నం చేశారు ఈ సినిమా దర్శకులు. ఒకే రకమైన పరిస్థితులు ఎప్పుడూ మన జీవితంలో చుట్టూ ముడుతూ ఉన్నా సరే వాటిని మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగితేనే జీవితంలో మనం ఎంతో ఉన్నత వ్యక్తులుగా వ్యక్తిత్వ రీత్యా కూడా ఎదుగుతామని ఈ సినిమా స్పష్టం చేస్తుంది. ఎప్పుడైతే మొదట నిరాశావాదిగా,జీవితం పట్ల ఆసక్తి లేని వ్యక్తిగా వచ్చిన ఫిల్ ఉన్నత వ్యక్తిగా మారాడో అప్పుడు అతని జీవితంలో ఆ ఒక్క రోజు లూప్ ఆగిపోయింది. మన జీవితం కూడా మనల్ని మనం అలా మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగడమే. వైవిధ్యభరితమైన అంశంతో వచ్చిన ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిన సినిమాల్లో ఒకటి.

             *     *     *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ